అఫ్గన్ పౌరులకు మంచిరోజులు మొదలయ్యాయి!. చరిత్రలో మునుపెన్నడూ చూడలేనంత దీనస్థితిని ఒక దేశం ఎదుర్కొనుందన్న విశ్లేషణలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్ నేలకు సాయం అందించేందుకు అగ్ర రాజ్యంతో పాటు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆహార, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేసేందుకు భారీ విరాళాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రణాళిక రచించింది.
తాజాగా అమెరికా 308 మిలియన్ డాలర్ల (రెండువేల కోట్ల రూపాయలకు పైనే) తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్రయం, ఆరోగ్య భద్రత, చలికాల పరిస్థితుల నేపథ్యంలో సాయం, అత్యవసర ఆహార సాయం, మంచి నీరు, శానిటేషన్, శుభ్రత సర్వీసులు తదితరాల కోసం ఈ భారీ సాయం వినియోగించనున్నట్లు, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మానవతా ధృక్పథంతో అమెరికా అందించిన సాయం(గత అక్టోబర్ నుంచి) ఇప్పటిదాకా 782 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 27 దేశాలు అఫ్గన్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి కూడా.
గతంలో అఫ్గన్ బడ్జెట్ 80 శాతం విదేశీ నిధుల ద్వారానే సమకూరేది. అయితే తాలిబన్ల రాకతో ఎక్కడిక్కడే నిధులు ఆగిపోయాయి. పైగా అఫ్గన్‌కు చెందిన అకౌంట్లు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల తాలిబన్ల పాలనలో అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పి సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి. ఒకానొక టైంలో కరెన్సీ కొరత కారణంగా వస్తు మార్పిడి విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఒకవైపు ఆహార కొతర, మరోవైపు ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాలంటూ అమెరికాతో సహా అన్ని దేశాలకు తాలిబన్ ప్రభుత్వం పిలుపు ఇవ్వగా.. అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
యూఎన్ భారీ ప్రణాళిక
సాయం కోసం చూస్తున్న కోట్ల మంది అఫ్గన్ పౌరుల ముఖం తలుపులు వేయొద్దంటూ యూఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిథ్స్ ప్రపంచానికి పిలుపు ఇచ్చారు. అఫ్గనిస్థాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే 2022 ఒక్క ఏడాదిలోనే 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో ఉన్న పౌరుల కోసం 4.4 బిలియన్ డాలర్లు, సరిహద్దుల అవతల ఆశ్రయం పొందుతున్న పౌరుల కోసం 623 మిలియన్ డాలర్లు అవసరం పడొచ్చని యూఎన్ భావిస్తోంది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఒక దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున్న సాయం కోసం ప్రపంచానికి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి.
పాక్ సహకరించకున్నా..
ఇదిలా ఉంటే అఫ్గనిస్థాన్‌కు సాయం అందించే విషయంలో భారత్ ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గత ఆగష్టు నుంచి ఆహార ఉత్పత్తులతో పాటు మందులను సైతం పంపించింది. కిందటి నెలలో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్‌లను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాబూల్‌లోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి మందుల్ని సరఫరా చేసింది. మరోవైపు ఆహార కొరత నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం యాభై వేల టన్నుల గోధుమల్ని పంపించింది భారత్. ముందుగా పాక్ మార్గం గుండా వెళ్లాల్సి ఉండగా.. అఫ్గన్‌తో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
పాక్‌తో భారత్ ప్రభుత్వం సంప్రదింపులు సైతం జరపగా.. లాభం లేకుండా పోయింది. అ తరుణంలో అనూహ్యంగా ఇరాన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తమ గుండా సరుకుల్ని,మందుల్ని అఫ్గన్‌ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చదవండి: అఫ్గన్‌పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment