సాక్షి, వెబ్‌డెస్క్: అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది. అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆల్టర్‌నేట్
మిడిల్ ఈస్ట్ ఏషియా, యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్‌లో చబహార్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇండియా ముందుకు వచ్చింది. ఈ పోర్టుకి అనుసంధానంగా రైలు, రోడ్డు ప్రాజెక్టును నిర్మించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఇండియా ప్రణాళిక రూపొందించింది. అమెరికా సైతం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగానే స్పందించింది.
హైవే నిర్మాణం
అఫ్ఘనిస్తాన్ పునర్‌నిర్మాణం పేరుతో 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ - దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. రైలు మార్గానికి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. ఇక చబహార్ పోర్టు ప్రస్తుత సామర్థ్యం 8 మిలియన్ టన్నులు ఉండగా దాన్ని 80 మిలియన్ టన్నులకు పెంచేలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఇండియా తీసుకుంది. తద్వారా భవిష్యత్తులో పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్ - ఇండియాలు షేర్ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది.
ఇరాన్‌పై ఆంక్షలు
ప్రపంప పెద్దన్న హోదాలో న్యూక్లియర్ డీల్ విషయంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో ఇరాన్‌లో ఇండియా చేపట్టిన చబహార్ పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కనీసం క్రేన్లు సరఫరా చేసేందుకు సైతం ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఇరవై సార్లకు పైగా టెండర్లు పిలిచినా నిరాశే మిగిలింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చబహార్ పోర్టు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ హైవే వల్ల ఇండియాకు ప్రయోజనం చేకూరి ఉండేది. కానీ అమెరికా ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రత్యక్షంగా ఇరాన్, పరోక్షంగా ఇండియా నష్టపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమైన రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పుడు చైనా ఆసక్తి చూపిస్తోంది.
పెట్టుబడి వృధాయేనా
చబహార్ పోర్టు పేరుతో దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది. తాజాగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్‌ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో గతంలో జరిగిన ఒప్పందాలు ఎంత మేరకు ఫలితాలను ఇస్తాయంటే సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఇండియా అమెరికా ట్రాప్‌లో పడి చబహార్ పోర్డు పనుల్లో చాలా జాప్యం చేసిందనే వాదన ఇరానీయుల నుంచి వినిపిస్తోంది.
పూర్తి చేయండి
అఫ్ఘనిస్తాన్ పునర్మిణం కోసం ఇండియా చేపట్టిన పనులు పూర్తి చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని, సహకారం అందిస్తామంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ పాక్ మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో విదేశీ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ నేలను ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. దీంతో గాంధర నేలపై ఇండియా పెట్టిన పెట్టుబడులు నిష్ఫలం అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment