చూస్తూ ఉండగానే పరిస్థితులు చకచకా మారడం, రోజురోజుకూ దిగజారడమంటే ఇదే. తాలిబన్లు ఒప్పుకోకపోయినా, అఫ్గానిస్తాన్ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో ఈ మాటే అంటుంది. ఊహించని వేగంతో తాలిబన్లు కాబూల్‌ను కైవసం చేసుకున్నాక... విమానాశ్రయం వద్ద భీతావహ పరిస్థితులు చూశాక... ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు అక్కడి తమ పౌరుల భద్రత ప్రధానమైంది. తమ వారందరినీ అఫ్గాన్ నుంచి సురక్షితంగా వెనక్కు తీసుకురావడం పెను సవాలైంది. గురువారం కాబూల్‌లో వరుస పేలుళ్ళు జరిగినట్టు తొలి వార్తలు. ప్రపంచం నివ్వెరపోయేలా పలువురు మరణించారు. అమెరికా నిర్ణయ వైఫల్యానికీ, అఫ్గాన్ సంక్షోభానికీ తాజా ఘటనలు దర్పణం.
అమెరికన్ సైన్యం అఫ్గాన్‌కు ఇచ్చిన అపారమైన ఆయుధసంపత్తి తాలిబన్ల చేతిలోకి వెళ్ళింది. పదుల కొద్దీ తీవ్రవాద తండాలు జోరందుకున్నాయి. అదే ఇప్పుడు అందరిలో ఆందోళన. కాబూల్ విమానాశ్రయం వద్ద గందరగోళం కొనసాగుతోంది. వేలమంది అఫ్గాన్లు దేశం నుంచి ఎలాగైనా బయటపడాలని చూస్తున్నారు. విమానాశ్రయం గేటు బయట వందల మంది తిండీ తిప్పలకు కష్టపడుతూ, భరించలేని వాసన మధ్య రోజుల కొద్దీ వేచి ఉన్నారు. కానీ, తాలిబన్లు మాత్రం విమానాశ్రయానికి వెళ్ళే దోవల్లో నిర్బంధం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ విదేశీ శరణార్థులకూ భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. అదే సమయంలో మన దేశ అంతర్గత భద్రత సైతం కీలకమని గుర్తించింది. ఇక్కడ తాత్కాలిక ఆశ్రయం పొందాలనుకుంటున్న శరణార్థులు పాత వీసాల బదులు కొత్త ఇ–వీసాలు తీసుకోవాలని కేంద్రం జాగ్రత్తపడింది. ఇప్పటికే, కాబూల్ విమానాశ్రయం వద్ద ‘ఐఎస్‌ఐఎస్’ తీవ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని 4 దేశాలు హెచ్చరించాయి. వ్యక్తిగతంగా చెబితే తప్ప విమానాశ్రయానికి రావద్దంటూ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలు అక్కడి తమ పౌరులను అప్రమత్తం చేశాయి. అందుకు తగ్గట్టే, ఎయిర్‌పోర్ట్ వెలుపల తాజా పేలుళ్ళు జరగడం గమనార్హం.
పొరుగు దేశంలోని ఈ పరిస్థితులు, అంతర్జాతీయంగా మారుతున్న సంబంధాల నేపథ్యంలో భారత ప్రభుత్వం గురువారం జరిపిన అఖిలపక్ష సమావేశం కీలకమైంది. అఖిలపక్షంలో మొత్తం 31 రాజకీయ పార్టీల నుంచి 37 మంది రాజకీయ నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తాజా పరిస్థితినీ, దేశం తీసుకుంటున్న చర్యలనూ ప్రతినిధులకు వివరించింది. వారి సందేహాలు తీర్చే ప్రయత్నమూ చేసింది. అయితే, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండడంతో, వేచిచూస్తూ ఆచితూచి అడుగేయాలన్న ప్రభుత్వ వైఖరినే అధికార, విపక్షాలన్నీ సమర్థించాయి.
దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కొత్తగా బయటకొచ్చిన సంగతేమీ లేకపోవచ్చు. కానీ, దేశ రక్షణ, అఫ్గాన్‌లోని మన పౌరుల భద్రత, మన విదేశాంగ విధానంపై పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరాన్నీ, సందర్భాన్నీ ఈ సమావేశం మళ్ళీ నిరూపించింది. వీలైనంత వేగంగా భారతీయులందరినీ కాబూల్ నుంచి వెనక్కి తీసుకురావడమే ఇప్పుడు మన ముందున్న మొదటి ప్రాధాన్యం. విదేశాంగ మంత్రి ఆ మాటే స్పష్టం చేశారు. నిజానికి, ‘ఆపరేషన్ దేవీశక్తి’ కింద కేంద్రం ఇప్పటికి 6 విమానాలను నడిపింది. చాలామంది భారతీయుల్ని వెనక్కి తేగలిగాం. కానీ తాలిబన్లు అనుమతించకపోవడంతో, భారత్‌కు రాలేక ఆగిపోయిన 140 మంది అఫ్గాన్ సిక్కుల లాంటి చాలామంది ఇంకా అఫ్గాన్‌లోనే ఉండిపోయారు.
ముందు చెప్పినట్టే ఆగస్టు 31 కల్లా సైన్య ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా మాట. తాజా పేలుళ్ళతో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేం. ప్రస్తుతం అఫ్గాన్‌లో స్థిరమైన కొత్త ప్రభుత్వమంటూ ఏదీ లేదు. తాలిబన్ల సర్కారు ఏర్పాటుకు సైతం పంజ్‌షీర్ లోయ లాంటి ప్రాంతాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో వాటా కోరుతున్నవారూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరితో, ఎలా చర్చలు జరపాలనే గందరగోళం నెలకొంది. అందుకే, అఖిలపక్షంలోనూ తాలిబన్లతో చర్చలపై వేచిచూసే వైఖరినే కేంద్రం పునరుద్ఘాటించింది. తెర వెనుక చర్చలు, మాటలెలా ఉన్నా అమెరికాతో పాటు రష్యా, బ్రిటన్ తదితర అనేక దేశాలు అఫ్గాన్‌పై ఇప్పటికైతే వేచిచూసే విధానాన్నే అనుసరిస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ లాంటివి తాలిబన్లతో చర్చలకు తలుపులు తెరిచాయి.
ఇది మనకు ఇబ్బందే. నిన్నటి దాకా మనకు సన్నిహితులైన రష్యా, ఇరాన్ లాంటివి కూడా మన అమెరికన్ స్నేహంతో పెడముఖం పెడుతున్నాయి. తాలిబన్ల జోరుతో, చైనా అండతో పాక్ బలం పుంజుకుంటోంది. ఇప్పుడిక భారత్ జాగ్రత్తగా దౌత్యవిధానాన్ని తీర్చిదిద్దుకోవాలి. పొరుగుతో సఖ్యత పెంచుకొనే మార్గం చూడాలి. అగ్రరాజ్యాల చెలిమితో పాటు ఇదీ కీలకమని గ్రహించాలి.
మరోపక్క తాలిబన్లు భారత్ సహా వివిధ దేశాల నుంచి సాయం కోరుతున్నారు. హక్కుల ఉల్లంఘనలేవీ జరగట్లేదంటూ పెద్దమనిషిలా కనిపించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. పేలుళ్ళ పాపం తీవ్రవాదుల పని అంటున్నారు. వాస్తవానికి, అఫ్గాన్‌లో మొత్తంగా మానవ హక్కులకే భంగం కలుగుతోందని ప్రత్యక్షసాక్షుల కథనం. దానికి తోడు ఇప్పుడీ పేలుళ్ళ బీభత్సం. ఇలాంటి చర్యలను భారత్ సహా ప్రపంచం ఖండించాలి. తక్షణ చర్యలపై దృష్టీ పెట్టాలి. అమెరికా సైన్యాన్ని ఉపసంహరించాలని అనుకున్నప్పుడే, దోహాలో చర్చలు జరుగుతున్నప్పుడే ఐరాస శాంతి పరిరక్షక మిషన్‌ను ఆ ప్రక్రియలో భాగం చేసి ఉండాల్సింది. ఐరాస సహా అంతర్జాతీయ సమాజమంతా ఇలాంటి ఎన్నో జాగ్రత్తల్లో విఫలమైంది. ఆ తప్పుల ఫలితం ఇప్పుడు పేలుళ్ళ రూపంలో ప్రపంచాన్ని వెక్కిరిస్తోంది.
పడగ నీడలో... పౌర భద్రత
Published Fri, Aug 27 2021 12:29 AM | Last Updated on Fri, Aug 27 2021 12:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment