Chabahar port deal
-
భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ఇరాన్‌తో ఏ దేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్‌తో సోమవారం ఒప్పదం కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘చాబహార్ పోర్టుకు సంబంధించి.. భారత్-ఇరాన్ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసు. భారత్ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్ పోర్టు విషయంలో ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై ఆలోచించుకోవాలి. కానీ, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్ అన్నారు.‘ఇప్పటికే చాలా సార్లు మేము ఆంక్షాల విషయాన్ని ప్రస్తావించాం. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం. అలా కాదని ఇరత దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది’అని ఇరాన్‌తో ఒప్పదం చేసుకున్న భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇక.. సోమవారం ఇరాన్‌లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు భారత్ నిర్వహించేదుకు ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది. -
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
చాబహర్ పోర్ట్ నిర్వహణకు భారత్ ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2016లో జరిగిన ఒప్పందాన్ని తిరిగి కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు చేసేందుకు షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఇరాన్‌కు వెళ్లనున్నారు. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.మీడియా సంస్థల కథనం ప్రకారం..2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్లో పర్యటించినపుడు చాబహర్ ఓడరేవుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజాగా ఈమేరకు తిరిగి ఒప్పందాన్ని కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు జరుపనున్నారు. విదేశాల్లో ఓడరేవు నిర్వహణ చేపట్టడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ ఒప్పందం రానున్న పదేళ్లకాలానికి వర్తిస్తుందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది.చాబహర్ పోర్ట్ ప్రాముఖ్యతకామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాలను చేరుకోవడానికి ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్‌ను కేంద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఎన్ఎస్టీసీ వల్ల భారత్-మధ్య ఆసియా కార్గో రవాణాకు ఎంతోమేలు జరుగుతుంది. చాబహర్ పోర్ట్ భారత్‌కు వాణిజ్య రవాణా కేంద్రంగా పని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో 10 ఏళ్లు కొనసాగించేలా తాజాగా పత్రాలపై సంతకాలు చేయనున్నారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
Afghanistan: అటు తాలిబాన్.. ఇటు ఇరాన్.. మధ్యలో ఇండియా
సాక్షి, వెబ్‌డెస్క్: అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది. అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా, యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇండియా ముందుకు వచ్చింది. ఈ పోర్టుకి అనుసంధానంగా రైలు, రోడ్డు ప్రాజెక్టును నిర్మించడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఇండియా ప్రణాళిక రూపొందించింది. అమెరికా సైతం ఈ ప్రాజెక్టుకు సానుకూలంగానే స్పందించింది. హైవే నిర్మాణం అఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం పేరుతో 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ - దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. రైలు మార్గానికి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. ఇక చబహార్ పోర్టు ప్రస్తుత సామర్థ్యం 8 మిలియన్ టన్నులు ఉండగా దాన్ని 80 మిలియన్ టన్నులకు పెంచేలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఇండియా తీసుకుంది. తద్వారా భవిష్యత్తులో పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఇరాన్ - ఇండియాలు షేర్ చేసుకోవాలనే ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై ఆంక్షలు ప్రపంప పెద్దన్న హోదాలో న్యూక్లియర్ డీల్ విషయంలో ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో ఇరాన్లో ఇండియా చేపట్టిన చబహార్ పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కనీసం క్రేన్లు సరఫరా చేసేందుకు సైతం ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఇరవై సార్లకు పైగా టెండర్లు పిలిచినా నిరాశే మిగిలింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో హైవే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చబహార్ పోర్టు నిర్మాణం పూర్తయి ఉంటే ఈ హైవే వల్ల ఇండియాకు ప్రయోజనం చేకూరి ఉండేది. కానీ అమెరికా ఏకపక్ష ఆంక్షల కారణంగా ప్రత్యక్షంగా ఇరాన్, పరోక్షంగా ఇండియా నష్టపోయాయి. మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగమైన రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పుడు చైనా ఆసక్తి చూపిస్తోంది. పెట్టుబడి వృధాయేనా చబహార్ పోర్టు పేరుతో దాదాపు వన్ బిలియన్ డాలర్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది. తాజాగా అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోవడంతో గతంలో జరిగిన ఒప్పందాలు ఎంత మేరకు ఫలితాలను ఇస్తాయంటే సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఇండియా అమెరికా ట్రాప్‌లో పడి చబహార్ పోర్డు పనుల్లో చాలా జాప్యం చేసిందనే వాదన ఇరానీయుల నుంచి వినిపిస్తోంది. పూర్తి చేయండి అఫ్ఘనిస్తాన్ పునర్మిణం కోసం ఇండియా చేపట్టిన పనులు పూర్తి చేస్తే మాకేమీ అభ్యంతరం లేదని, సహకారం అందిస్తామంటూ తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ పాక్ మీడియాకు వెల్లడించారు. అదే సమయంలో విదేశీ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఆఫ్ఘన్ నేలను ఉపయోగించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. దీంతో గాంధర నేలపై ఇండియా పెట్టిన పెట్టుబడులు నిష్ఫలం అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
Afghanistan: అమెరికా నిర్ణయం.. భారత్‌కు భారీ నష్టం
సాక్షి, వెబ్‌డెస్క్: క్షేత్రస్థాయిలో పరిస్థితులు సరిగా అంచనా వేయకుండా హడావుడిగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఇటు అఫ్ఘన్‌తో పాటు భారత్‌కి శాపంగా మారింది. ఇంటిలిజెన్స్‌లో తమకు తిరుగులేదని చెప్పుకునే అమెరికా తాను పప్పులో కాలేయడమే కాకుండా తనని నమ్మిన అఫ్ఘన్లకు, వారికి అండగా నిలిచిన ఇండియాకు నష్టాన్ని తెచ్చింది. బిన్‌లాడెన్‌తో మొదలు ఓసామా బిన్‌లాడెన్ పీచమణిచే లక్ష్యంతో 2001లో వైమానికదాడులతో అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా అడుగు పెట్టింది. ఆ తర్వాత తాలిబన్లను గద్దె నుంచి తోసి తమకు అనుకూలంగా ఉండే హమీద్ కర్జాయ్‌ని దేశ అధ్యక్షుడిని చేసింది. ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామంటూ చెప్పింది. దీంతో అఫ్ఘనిస్తాన్ పునర్మిణం పేరుతో ప్రపంచ దేశాలు సాయం అందించాయి. ఈ క్రమంలో గడిచిన 20 ఏళ్లలో అఫ్ఘన్‌లో పలు ప్రాజెక్టులపై ఇండియా 3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం 2019-20లో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కుదిరిన ఒప్పందాలు అమలయ్యేది లేదని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇండియా సాయం - ఇరవై ఏళ్ల కాలంలో అఫ్ఘనిస్తాన్ పునర్ నిర్మాణం కోసం 3 బిలియన్ డాలర్లు ఇండియా ఖర్చు చేసింది. వీటితో ఆ దేశంలోని 34 ప్రావిన్సుల్లో మొత్తం 400 పనులు చేపట్టింది. ఇందులో చాలా వరకు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. - నీటి వనరులు పరిమితంగా ఉండే అఫ్ఘనిస్తాన్‌లో 42 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యంతో సాల్మా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యామ్ వాటర్‌తో కాబుల్ జిల్లాలో రెండు వేల గ్రామాలకు మంచినీటిని అందించే వీలుంది. - 90 మిలియన్ డాలర్ల వ్యయంతో అఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనాన్ని ఇండియా నిర్మించింది. 2015లో ప్రధానీ మోదీ దీన్ని ప్రారంభించారు. - 19వ శతాబ్ధంలో నిర్మించిన స్టార్ ప్యాలెస్ పునరుద్ధరణ పనులు ఇండియాకు చెందిన ఆగాఖాన్ ట్రస్ట్ చేపట్టింది. 2013లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేసింది. - 80 మిలియన డాలర్ల వ్యయంతో కాబూల్ జిల్లాలో శతూత్ డామ్ నిర్మాణానికి ఇండియా అంగీకరించింది. ఈ డామ్ నిర్మాణం పూర్తయితే ఇరవై లక్షల కుటుంబాలకు తాగునీటి సమస్య తీరిపోయి ఉండేది. - అఫ్ఘనిస్తాన్, ఇండియాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య వన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని 2019-20లో అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఎంత మేరకు అమలవుతుందనేది సందేహంలో పడింది. - ద్వైపాక్షిక ఒప్పందలో భాగంగా అఫ్ఘనిస్తాన్ వస్తువులకు ఇండియాలో పన్ను రాయితీలు కల్పించారు. ఏం జరుగుతుందో - 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ - దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఈ హైవే నిర్మాణం వల్ల ఇరాన్లో ఉన్న చాహబార్ పోర్టుతో రోడ్ కనెక్టివిటీ ఉంటుందని, గల్ఫ్ దేశాలతో పాటు యూరప్‌కి వాణిజ్య మార్గం అవుతుందని ఇండియా అంచనా - పాకిస్తాన్‌తో ఉన్న వైరం కారణంగా అఫ్ఘనిస్తాన్ మీదుగా చబహార్ పోర్టు ఉండే కనెక్టివిటీ ఇండియాకు ఎంతో ఉపయోకరంగా ఉండేది. ఇప్పుడు ఈ హైవే వాడకంపై ఆంక్షలు ఉండవచ్చు. - రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా అఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనాన్ని ఇండియా నిర్మించించింది. ప్రస్తుతం ఈ భవనం తాలిబన్లు ఆక్రమించుకున్నారు. - పాకిస్తాన్ దేశం తరచుగా తన గగనతలంపై ఆంక్షలు విధిస్తోంది. దీని వల్ల విమానయానరంగంపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ సైతం ఇలాంటి నిర్ణాయాలు అమలు చేస్తే విమాన ప్రయాణం మరింత దూరభారం, ఆర్థిక భారంగా మారుతుంది. -
ఆ వార్తలు పూర్తిగా అబద్ధం: ఇరాన్
టెహ్రాన్: చాబహర్ పోర్టు నుంచి జహెదాన్ వరకు చేపట్టిన రైల్వే లైన్ నిర్మాణం నుంచి భారత్‌ను తొలగించినట్లు గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఈ మేరకు ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సహాయకులలో ఒకరైన ఫర్హాద్ మోంటాజర్ ఒక ప్రకటిన విడుదల చేశారు. ‘ఈ వార్తలు పూర్తిగా అబద్ధం. ఎందుకంటే చాబహర్-జహెదాన్ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి ఇరాన్, భారతదేశంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. చాబహర్కు సంబంధించి ఇరాన్, భారతదేశంతో కేవలం రెండు ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకుంది. ఒకటి ఓడరేవు యంత్రాలు, ఇతర పరికరాలకు సంబంధించినది. రెండవది భారతదేశం ఈ ప్రాజెక్ట్‌లో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించినది మాత్రమే’ అని ప్రకటనలో తెలిపింది. చాబహర్లో ఇరాన్-ఇండియా సహకారానికి, అమెరికా ఆంక్షలకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. 2012లో ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్-ప్రొలిఫరేషన్ యాక్ట్ (ఐఎఫ్సిఎ) కింద చాబహర్ ఓడరేవు ప్రాజెక్టులపై మాఫీకి అమెరికా 2018లో అంగీకరించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఈ ప్రాజెక్టుకు అన్ని సేవలు, నిధులను అందిస్తామని హామీ ఇచ్చింది. ఇది సుమారు 1.6 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచాన. ఈ ప్రాజెక్ట్ ‘ఇరాన్ ఆర్ధిక భవిష్యత్తును నిర్మించడంలో కీలకమైన భాగం’ అని అధ్యక్షుడు హసన్ రౌహానీ అభివర్ణించారు. -
ఆ వార్తను ఖండించిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: చాబహార్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి భారత్ జౌట్ అయ్యింది అనే వాదనను సీనియర్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. భారత్ చాబహార్ పోర్టు ప్రాజెక్ట్‌లో భాగమైన రైల్వే లైన్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసి మాట్లాడుతూ, ‘చాబహార్- జహేదన్ రైల్వే లైన్ నిర్మించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ఇరాన్ ఉన్నతాధికారులతో టచ్‌లోనే ఉంది . ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు కొనసాగిస్తాం’ అని తెలిపారు. చదవండి: చైనా ఆఫర్.. ఇండియా ఔట్..! ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వారు మాట్లాడుతూ, చాబహార్ పోర్టుకు నిధులు సమకూర్చడంతో పాటు ఎంతో ముఖ్యమైన చాబహార్- జహీదన్ రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ, అదే విధంగా జహేదన్ నుంచి టర్కిమినిస్తాన్ బోర్డర్ సరక్స్ వరకు నిర్మించే రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లోనూ భారత్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ఇండియా నిధులు చేకూర్చడం లేదు. దీని కోసం ఇరాన్ ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది’ అని తెలిపారు. ఇండియా దీని కోసం త్వరలోనే నిధులు సమకూరుస్తుంది అని భావిస్తున్నామన్నారు. రైల్వే లైన్ నిర్మించడానికి అవసరమైన సామాగ్రిని తరలించడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, రైల్వే లైన్ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నాయని తెలుస్తోంది. చదవండి: ఇరాన్ అలక -
ఇరాన్ అలక
దౌత్య సంబంధాలు తాడు మీద నడకలాంటివి. ప్రతి అడుగూ ఎంతో జాగరూకతతో వేస్తే తప్ప సురక్షితంగా గమ్యం చేరడం అసాధ్యం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సమస్య ఎదురుకావడం ఖాయం. దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్లీ చాలాకాలం పడుతుంది. ఇరాన్ ఉన్నట్టుండి బుధవారం కీలకమైన రైల్వే ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని తప్పించడాన్ని చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య నిజానికి తీవ్రమైన విభేదాలు లేవు. ద్వైపాక్షిక అంశాల్లో పరస్పరం ఘర్షించిన సందర్భాలు లేవు. అయినా ముందుగా ఒక్క మాట చెప్పకుండానే, తన అసంతృప్తి వెనకున్న కారణాలేమిటో వివరించకుండానే అది ఒప్పందం నుంచి నిష్క్రమించింది. మధ్య ఆసియా, పశ్చి మాసియా, యూరప్ దేశాలకు ‘బంగారు వాకిలి’గా భావించే ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు మన సహాయసహకారాలతోనే ఏడాదిన్నర క్రితం పూర్తయింది. 2003లో వాజపేయి హయాంలో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా చాబహార్ ఓడరేవు నిర్మాణం మన చేతికొచ్చింది. ఆ తర్వాత అమెరికా నుంచి ఎన్నోవిధాల అవాంతరాలు ఏర్పడుతూనే వున్నాయి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న ప్పుడు ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం పర్యవసానంగా ఓడరేవు పనులు మొదలై 2018 డిసెంబ ర్‌కల్లా పూర్తయ్యాయి. అయితే అది పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి కావలసిన ఉపకరణాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. మన దేశం ఎంతగానో నచ్చచెప్పిన తర్వాత చాబహార్ ఓడరేవును ఆ ఆంక్షల నుంచి ట్రంప్ మొన్న జనవరిలో మినహాయించారు. ఉపకరణాల కోసం రెండేళ్లనాడు మన దేశం ఇచ్చిన ఆర్డర్లకు నిధులు సమకూర్చడానికి తటపటాయించిన అంత ర్జాతీయ బ్యాంకులు చివరకు ఒప్పుకున్నాయి. అవి కోరిన విధంగా ఆంక్షలనుంచి చాబహార్‌ను మిన హాయించే అధికారిక పత్రాన్ని అమెరికా జారీ చేయడంతో ఇది సాధ్యమైంది. అయినా అక్కడి పను లకు అడ్డంకులు ఎదురవుతూనే వున్నాయి. రైల్వే ప్రాజెక్టయితే పూర్తి అనిశ్చితిలో పడింది. దానికి ఆంక్షల నుంచి మినహాయింపు లభించకపోవడమే ఇందుకు కారణం. అందువల్లే దాని నిర్మాణం అనుకున్నట్టుగా మొదలుకాలేదు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్లో పర్యటించినప్పుడు చాబహార్ ఓడరేవు నుంచి ఇరాన్–అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని జహేదన్ వరకూ రైల్వే లైన్ నిర్మించేం దుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అఫ్ఘానిస్తాన్ కూడా భాగస్వామి. భార తీయ రైల్వే నిర్మాణ సంస్థ(ఐఆర్సీఓఎన్) నిధులు సమకూర్చుకుని ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవగాహన ఒప్పందంలో అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు 40 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. ఇరాన్–భారత్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం అమలు అమెరికా కటాక్షవీక్షణాలపై ఆధారపడటం విచారించదగ్గ విషయం. 2003లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందం కింద ఒకటి రెండేళ్లలో పూర్తికావాల్సిన చాబహార్ ఓడరేవుకు 15 ఏళ్లు పట్టడం, ఆ తర్వాతైనా ఓడరేవుకు అవ సరమైన రైల్వే నిర్మాణం పనులు మన దేశం మొదలుపెట్టలేకపోవడం చివుక్కుమనిపిస్తుంది. దేశాల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడాలంటే ఏళ్లూ పూళ్లూ పడుతుంది. అందుకు ఎంతో సహనం, ఓపిక అవసరమవుతాయి. కానీ అవి ఛిద్రం కావడానికి రోజుల వ్యవధి చాలు. అమెరికాతో మనకుంటున్న సంబంధాలపై తనకున్న అసంతృప్తి కారణంగానే ఇరాన్ ఈ చర్య తీసుకుందని అందరికీ అర్థమ వుతుంది. అనేక పరీక్షా సమయాల్లో ఇరాన్ మన దేశానికి అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముస్లిం దేశాలు మన పట్ల విముఖంగా ఉన్నప్పుడు ఇరాన్ చొరవ తీసుకుంది. 1995లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీ మన దేశంలో పర్యటించారు. అదే సంవ త్సరంలో ఇప్పుడు ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)గా ఉన్న ముస్లిం దేశాలన్నీ అమెరికా తదితర దేశాల ప్రోద్బలంతో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో తీర్మానం తీసుకొచ్చినప్పుడు ఆ ఓటింగ్‌కు గైర్హాజరై ఇరాన్ మనకు మద్దతుగా నిల బడింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు తీర్మానం తీసుకురావడానికి ప్రయత్నించినా దానికి అడ్డుపడింది. కానీ ఇటీవలి కాలంలో దాని స్వరం మారింది. మొన్న మార్చిలో ఢిల్లీలో ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఇరాన్ విదేశాంగమంత్రి దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మతి మాలిన దాడులను అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అది తమ ఆంతరంగిక అంశమని మన దేశం చెప్పాక కూడా ఆ దేశ మత నాయకుడు అయతుల్లా ఖమేనీ, ఇటువంటి ఉదంతాలు ఆగకపోతే ఇస్లాం దేశాల నుంచి భారత్ ఏకాకి అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రైల్వే ప్రాజెక్టునుంచి భారత్‌ను తప్పించడం దానికి కొనసాగింపే. అమెరికాతో మన సంబంధాలపై అది కొంతకాలం నుంచి గుర్రుగా ఉంది. ఒకప్పుడు తమ నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేసిన భారత్, అమెరికా ఆంక్షలకు తలొగ్గి పూర్తిగా ఆపేయడం దానికి రుచించలేదు. అంతక్రితం ఆంక్షలు విధించినప్పుడు చమురు కొనడం ఎప్పుడూ ఆపని భారత్ ఇలా చేయడం దానికి ఆగ్రహం కలిగించడంలో వింతలేదు. ఏతావాతా అమెరికాతో మన సంబంధాలు ఇరాన్‌లాంటి మిత్ర దేశానికి ఆగ్రహం కలిగించాయి. ఒకపక్క అమెరికా మన భద్రతను బేఖాతరు చేసి అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లకు అధికారం అప్పగించి అక్కడినుంచి నిష్క్రమించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క దానివల్ల మనకు ఇరా న్‌తో వున్న సంబంధాల్లో పొరపొచ్చాలు వచ్చాయి. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టునుంచి మన దేశాన్ని తప్పించడమే కాదు.. అది చైనాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఈ ఒప్పందం కింద వచ్చే 25 ఏళ్లలో ఇరాన్లో చైనా 40,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతుంది. ఈ దశలో ఇరాన్‌తో దౌత్య సంబంధాలను తిరిగి పట్టాలెక్కించడానికి మన దేశం శాయశక్తులా కృషి చేయడం అవసరం. చైనా మన మిత్ర దేశాలనే మనకు దూరం చేస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలి. -
చైనా ఆఫర్.. ఇండియా ఔట్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చాబహార్ పోర్టు నుంచి జహేదాన్ వరకూ భారత్ నిర్మించాల్సిన రైలు మార్గాన్ని తమ సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ పేర్కొంది. నిధులివ్వడంలో భారత్ జాప్యం చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. (చూస్తుండగానే నదిలోకి జారిన స్కూల్ బిల్డింగ్) దాదాపు నాలుగేళ్ల క్రితం చాబహార్–జహేదాన్ మధ్య రైలు మార్గం వేయడానికి ఇరాన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 3,015 కోట్ల రూపాయల వ్యయంతో 2022 నాటికి భారత్ ఈ మార్గాన్ని నిర్మించాలి. ఆసాంతం అప్ఘానిస్థాన్ బోర్డర్‌ను ఆనుకుంటూ వెళ్లే 628 కిలోమీటర్ల ఈ రైలు మార్గం అత్యంత కీలకమైనది.(అది పూర్తిగా అసత్యపు వార్త : ప్రియాంక గాంధీ) భవిష్యత్‌లో ఈ మార్గాన్ని జరంజ్కు విస్తరిస్తామని ఇరాన్ రవాణా మంత్రి రైలు మార్గ శంకుస్థాపన సందర్భంగా మహమ్మద్ ఇస్లామీ పేర్కొన్నారు. చైనాతో భారీ ఒప్పందం ఇరాన్, చైనా మధ్య 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రకారం వచ్చే 25 ఏళ్లలో ఈ మొత్తాన్ని ఇరాన్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు చైనా ఖర్చు చేస్తుంది. చైనా రాకతోనే ఇరాన్, ఇండియాను పక్కనబెట్టిందనే రిపోర్టులూ వస్తున్నాయి. ఇరాన్, చైనా ఒప్పందం కుదిరితే డ్రాగన్ దేశం చాబహార్ పోర్టును ఎలాంటి పన్నులు కట్టకుండా వాడుకోవచ్చు. పోర్టుకు దగ్గర్లోని ఓ ఆయిల్ రిఫైనరీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన తదితరాలకు చైనా సహకరిస్తుంది. చాబహార్ పోర్టు నిర్మాణంలోనూ చైనా కీలకపాత్ర పోషించనుందని సమాచారం. అంతేకాకుండా ఈ పాతికేళ్లలో చైనాకు ఇరాన్ క్రమం తప్పకుండా ఆయిల్, గ్యాస్‌ను సరఫరా చేయాలి. చాబహార్ పోర్టు అభివృద్ధి బాధ్యతలను ఇరాన్ చాలా రోజుల క్రితమే ఇండియాకు అప్పజెప్పింది. చైనా చాబహార్‌ను అభివృద్ధి చేస్తుందని వస్తున్న రిపోర్టులను ఇరాన్ అధికారులు ఖండించారు. ఇండియాకు పెద్ద నష్టం చాబహార్ రైల్వే ప్రాజెక్టును కోల్పోవడం భారత్‌కు దౌత్యపరంగా పెద్ద దెబ్బని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌత్యం పరంగా ఒక్క పనీ సరిగా చేయలేదని విమర్శించింది. ఇంత చేసిన వాళ్లను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అంటూ కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. -
చాబహార్ సాకారం
మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు ‘బంగారువాకిలి’గా భావించే ఇరాన్‌లోని చాబహార్లో మన దేశం ఆధ్వర్యంలో నిర్మాణమైన షహీద్ బెహెస్తీ ఓడరేవు లాంఛనంగా సోమవారం ప్రారంభమైంది. పదిహేనేళ్లక్రితం...అంటే 2003లో వాజపేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వహయాంలో అనుకున్న ఈ ప్రాజెక్టుకు అడుగడుగునా అమెరికా రూపంలో అవాంతరాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఇరాన్‌తో కయ్యానికి దిగిన అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించి దానితో ఎవరూ వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెరపకూడదని ఫర్మానా జారీచేయడంతో దీనికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ రెండో దశ పాలన మొదలయ్యేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి. అమెరికా, రష్యా, యూరప్ యూనియన్(ఈయూ) దేశాలు ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం పర్యవసా నంగా ఆ దేశంపై ఆంక్షల సడలింపు మొదలైంది. కనుకనే ఆ మరుసటి ఏడాదికే మన దేశం మళ్లీ చాబహార్ ఓడరేవు అభివృద్ధిపై దృష్టి సారించగలిగింది. 2015లో నరేంద్ర మోదీ ఇరాన్లో పర్యటించినప్పుడు ఈ అంశంపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అనంతరం ఇందుకు అవసరమైన రుణం రూ. 1,600 కోట్లను ఎగ్జిమ్ బ్యాంకు సమకూర్చింది. అప్పటినుంచి సాగుతున్న నిర్మాణం గత ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తయింది. ప్రస్తుతం ఆ ఓడరేవు నుంచి సాగించే ఎగుమతి దిగుమతులకు అవసరమైన కారిడార్లకు మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవుకు వినియోగిం చుకునే మార్గాలు, విధించాల్సిన సుంకాలు తదితరాలపై కూడా అవగాహన కుదిరింది. జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పోర్టుట్రస్ట్ల భాగస్వామ్యంతో ఆవిర్భవించిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్(ఐపీజీఎల్) సంస్థ ఆధ్వర్యంలో చాబహార్ ఓడరేవు కార్యకలా పాలు మొదలయ్యాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చాక ఆయన ఇరాన్‌పై కత్తులు నూరడం మొదలె ట్టారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా కుదుర్చుకోవాలని డిమాండ్ చేశారు. దానికి ఇరాన్ ససేమిరా అనడంతో మళ్లీ ఆ దేశంపై గత నెల 5 నుంచి ఆంక్షలు ప్రారంభించారు. కానీ అఫ్ఘానిస్తాన్ ఆర్థికాభివృద్ధిని, ఆ దేశానికి అందాల్సిన మానవీయ సాయాన్ని దృష్టిలో ఉంచుకుని చాబహార్ ఓడరేవుకు ఆంక్షల నుంచి మినహాయింపులిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గత నెల ప్రకటించడంతో అనిశ్చితి తొలగిపోయింది. రెండు సార్వభౌమాధికార దేశాల మధ్య కుదిరే ఒప్పందాలకు వేరే దేశం ఆమోదం అవసరమయ్యే దుస్థితి ఏర్పడటం విచారించదగ్గది. కానీ అంతర్జాతీయ స్థితిగతులు ఇలాగే ఉన్నాయి. చిత్రమేమంటే ఈ ఆంక్షల విషయంలో ట్రంప్‌కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. అణు ఒప్పందంలోని ఇతర భాగస్వామ్యపక్షాలన్నీ అమెరికా వైఖరిని గట్టిగా ఖండించాయి. తాము ఒప్పందానికే కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. అయినా ఆంక్షలు అమల్లోకి రావడం మొదలైంది. అవి మనకు ఇబ్బం దికరంగానూ మారాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో మనది మూడో స్థానం. ఈ దిగుమతుల్ని ఆరు నెలల్లో గణనీయంగా తగ్గించుకుంటామని హామీ ఇచ్చాకే భారత్‌కు తాత్కాలిక వెసులుబాటు ఇచ్చామని పాంపియో చెబుతున్నారు. రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతుల్ని ఇప్పటికే మన దేశం నాలుగు లక్షల బ్యారెళ్లకు తగ్గించుకుంది. దీన్ని మూడు లక్షలకు కుదించుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. తాము మొదటినుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నా, అమెరికా విధించిన ఆంక్షల విషయంలో తమకు ఆ స్థాయిలో భారత్ నుంచి మద్దతు లభించడంలేదన్న భావన ఇరాన్‌కు లేకపోలేదు. నిజానికి చాబహార్ ఓడరేవును ఆధారంగా ఇరాన్ అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించే ఆస్కారం ఉంది. ఆ దేశంలో పెట్రో కెమి కల్స్, ఎరువులు, ఉక్కు పరిశ్రమలు వర్థిల్లడానికి వీలుంది. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, మున్ముందు ఈ ఓడరేవు ఆధారంగా మధ్య ఆసియా, యూరప్ దేశాలన్నీ వాణిజ్య కార్యకలాపాల్ని సాగించి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. అఫ్ఘానిస్తాన్‌కు మనతో సాన్నిహిత్యం ఉన్నా రెండు దేశాలకూ ఉమ్మడి సరిహద్దులు లేవు. అక్కడ మన దేశం చేపట్టే ఎలాంటి ప్రాజెక్టులకైనా పాక్ భూభాగం వాడుకోవాలి. అలాగే పశ్చి మాసియా దేశాలనుంచి మనకొచ్చే చమురు, సహజవాయు దిగుమతులకు కూడా దాని అనుమతులు తప్పనిసరి. అయితే పాకిస్తాన్ ఇందుకు ససేమిరా అంగీకరించకపోవడం వల్ల ఇతర రవాణా మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చు తడిసి మోపెడవుతున్నది. చాబహార్ ఓడరేవు కార్యకలాపాలు మొదలయ్యాయి గనుక అటువంటి సమస్యలన్నీ తీరినట్టే. పాకిస్తాన్లో చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవుకు చాబహార్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాబహార్ ఓడరేవు ఉన్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్ పుష్కలమైన ఇంధన వనరులున్న ప్రాంతం. మన పశ్చిమ తీరంలోని కాండ్లా రేవు పట్టణానికి ఢిల్లీ–ముంబైల మధ్య దూరం కన్నా చాలా తక్కువ దూరం. ఈ కారణాలన్నిటిరీత్యా అటు ఇరాన్ సత్వరాభివృద్ధికి మాత్రమే కాదు... ఇటు మన దేశ వాణిజ్య అభివృద్ధికి కూడా చాబహార్ ఓడరేవు ఎంతో దోహదం చేస్తుంది. అయితే అమెరికా ఈ ఆంక్షల సడ లింపును ఎన్నాళ్లు కొనసాగిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇది యధావిధిగా ఉంటే ఒకటి రెండేళ్లు గడిచేసరికి ముమ్మరమైన వాణిజ్య కార్యకలాపాలతో గ్వాదర్ ఓడరేవుకు చాబహార్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అంతేకాదు, మొత్తం ప్రాజెక్టు పూర్తయితే అక్కడినుంచి సాగే ఎగుమతి, దిగుమ తులు 8 కోట్ల టన్నులకు చేరుకుంటాయి. మున్ముందు నిర్మాణం కాబోయే 7,200 కిలోమీటర్ల పొడ వైన ఉత్తర దక్షిణ రవాణా కారిడార్(ఎన్‌ఎస్‌టీసీ)లో చాబహార్ కీలకపాత్ర పోషిస్తుంది. అవరోధా లన్నిటినీ అధిగమించి సాకారమైన చాబహార్ భారత్–ఇరాన్ మైత్రికి ప్రతీక. -
చైనా-పాక్ భాయీభాయీ
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్‌తో పాకిస్తాన్ నెమ్మదిగా చైనావైపుకు అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడం, సీపీఈసీ ప్రాజెక్ట్ వల్ల దగ్గరయ్యాయి. పాకిస్తాన్‌ను అగ్రరాజ్యం దూరం పెట్టడంతో.. ఆ దేశం చైనాకు సన్నిహితమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్ మిలటరీ బేస్‌ను చైనా తన అధీనంలోకి తీసుకున్నట్లు గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. ట్రంప్ ట్వీట్‌తో పాకిస్తాన్-చైనా సంబంధాల్లో కొత్త శకం మొదలైందంటూ కమ్యూనిస్ట్ కంట్రీ అధికార పత్రిక స్పష్టం చేసింది. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల్లో చైనా కరెన్సీ యువాన్ వినియోగానికి పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ ఆమోదం తెలపడం బంధాన్ని మరింత ధృఢతరం చేయడమేనని గ్లోబెల్ టైమ్స్ అభిప్రాయపడింది. దీంతో పాకిస్తాన్, చైనాలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాల కోసం యువాన్‌ను వినియోగించడానికి అనుమతి లభించింది. ఈ కారణంతోనే చైనా తాజా మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పాకిస్తాన్లో పెడుతున్నట్లు ప్రకటించింది. చైనా-పాకిస్తాన్ మధ్య సంబధాలు బలోపేతం కావడంపై వాషింగ్టన్ టైమ్స్ ఆందోళనలు వ్యక్తం చేసిది. పాక్‌లోని జివానీ ప్రాంతంలో చైనా ఓడరేపును, మిలటరీ బేస్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది భవిష్యత్‌లో ప్రమాదకర పరిస్థితులును తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు. జివానీ ఓడరేవు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు దగ్గరగా ఉంటుంది. అంతేకాక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సరిహద్దుకూడా, ఇక గ్వాదర్ నౌకాశ్రయానికి కూడా సమీపంలో ఉంటుంది. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని అమెరికన్ మేధావులు అంటున్నారు. ఆప్ఘనిస్తాన్‌కు ఎగుమతుల కోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును భారత్ అభివృద్ధి చేసింది. ఇది భారత్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టేదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సరికొత్త అధ్యాయం
మన దేశాన్ని పశ్చిమాసియా, మధ్య ఆసియా, యూరప్‌లతో అనుసంధానించడం తోపాటు మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని కొత్త పుంతలు తొక్కించే ఇరాన్‌లోని కీలకమైన ఛాబహార్ ఓడరేవు కొత్త సొబగులు అద్దుకుని ఆదివారం ప్రారంభమైంది. మన భాగస్వామ్యంతో అభివృద్ధి అయిన ఈ ఓడరేవు వల్ల వాణిజ్యపరంగా మాత్రమే కాదు... వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి ఎంతో ఉపయోగం. వాజ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2003లో అంకురార్పణ పడిన ఈ ఆలోచన సాకారం కావడానికి 14 ఏళ్ల సమయం పట్టింది. చెప్పాలంటే ఈ ఓడరేవు ప్రాధాన్యతను ఇరాన్ గుర్తించేసరికే ఎంతో ఆలస్యమైంది. 80వ దశకంలో ఇరాక్‌తో ఘర్షణలు ఏర్పడినప్పుడు ఈ ఓడరేవు అభివృద్ధి తప్పనిసరని ఆ దేశం తెలుసుకుంది. అయితే అందుకు ఆర్ధికంగాగానీ, సాంకేతికంగా గానీ అవసరమైన వనరులు ఇరాన్ దగ్గర లేవు. మన దేశం ఆ రెండూ అందించేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. తీరా అది ఒప్పందంగా రూపుదాల్చే తరుణంలో ఇరాన్‌పై అమెరికా, యూరప్ యూని యన్(ఈయూ) దేశాలు ఆంక్షలు విధించాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా మరిన్ని నిషేధాలను అమల్లోకి తెచ్చాయి. నిజానికి ఈ అడ్డంకులు లేనట్టయితే యూపీఏ హయాంలో మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరేది. చాన్నాళ్ల క్రితమే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు నాలుగేళ్లక్రితం ఇరాన్‌తో పశ్చిమ దేశాలకు అణు ఒప్పందం కుదిరాక పరిస్థితులు మారాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక మారిన ఈ పరిస్థితులను మనకనుకూలంగా మలుచుకోవడంపై దృష్టి సారించారు. ఛాబహార్ ఓడరేవు అభి వృద్ధి ప్రతిపాదన దుమ్ముదులిపి దాన్ని పట్టాలెక్కించారు. నిరుడు మే నెలలో ఆయన ఇరాన్ పర్యటించినప్పుడు దీనిపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. మన దేశం ఈ ఒప్పందం కింద ఇరాన్‌కు దాదాపు రూ. 3,500 కోట్ల ఆర్ధిక సాయం సమ కూర్చింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసింది. అఫ్ఘానిస్తాన్‌తో మనకెంత సాన్నిహిత్యమున్నా, ఆ దేశంతో వర్తక వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే ఇన్నాళ్లూ పాకిస్తాన్‌పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువుల కోసం కూడా పాక్ ఆసరా అవసరమయ్యేది. అక్కడి కరాచీ ఓడరేవు ద్వారా మనం ఎగుమతి, దిగుమతులు చేసుకోవాల్సివచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి, ఎంతో జాప్యం తర్వాత మాత్రమే ఆ విషయంలో పాకిస్తాన్ అంగీకరించేది. కానీ ఛాబహార్ ఓడరేవు ఇప్పుడా ఇబ్బందిని పూర్తిగా తొలగించినట్టే. మనం నేరుగా అఫ్ఘానిస్తాన్‌తో మాత్రమే కాదు...యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఛాబహార్ మీదుగా ఎగుమతి, దిగుమతులను సాగించవచ్చు. నిజా నికి ఛాబహార్ మనకెంతో సమీపంలో ఉన్నదే. ఢిల్లీ–ముంబైల మధ్య దూరం కన్నా గుజరాత్‌లోని కాండ్లా రేవు పట్టణం, ఛాబహార్ల మధ్య దూరం చాలా తక్కువ. ఈ ఓడరేవు వల్ల సరుకు రవాణా చార్జీలు గణనీయంగా తగ్గుతాయి. సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది. మన దేశంతోపాటు ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు సైతం మధ్య ఆసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణావకాశం ఈ ఛాబహార్ కల్పిస్తోంది. ఛాబహార్ను ముందూ మునుపూ వాణిజ్య కారిడార్‌గా అభివృద్ధి చేయాలని భారత్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు ఒక అంగీకారానికొచ్చాయి. అది సాకారమైతే రూపుదిద్దుకునే స్వేచ్ఛా వాణిజ్య మండలిలో వాణిజ్య కార్య కలాపాలు ముమ్మరమవుతాయి. అక్కడ పెట్రో కెమికల్స్, ఎరువులు, ఉక్కు పరి శ్రమల్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకవసరమైన రైల్వే లైన్లు, రహదారులు ఏర్పడతాయి. ఫలితంగా వర్తక వాణిజ్యాలతోపాటు ఉపాధి అవకాశాలు కూడా దండిగా పెరుగుతాయి. ఓడరేవును ప్రారంభిస్తూ ఇరాన్ అధ్య క్షుడు హసన్ రౌహానీ అన్నట్టు ఒక్క సముద్ర మార్గం మాత్రమే కాదు...దీన్ని ఉపరి తల, వైమానిక రంగాలకు సైతం అనుసంధానించి వినియోగించుకోవచ్చు. ఇప్ప టికి పూర్తయింది ఛాబహార్ తొలి దశ మాత్రమే. దీని ద్వారా 25 లక్షల టన్నుల ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే అది 8 కోట్ల టన్నులకు చేరుకుంటుంది. వర్తక, వాణిజ్య రంగాల రీత్యా మాత్రమే కాదు...ఛాబహార్ వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైనది. ఇప్పటికే మన ఇరుగు పొరుగు దేశాలతో వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ ప్రాంతంలో మన పలుకుబడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న చైనా ఛాబహార్లో కూడా భారత్ ప్రయత్నాలకు గండికొట్టాలని చూసింది. నిరుడు ప్రధాని మోదీ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరాన్ వెళ్లి ఛాబహార్ ఓడరేవునూ, దానికి సమీపంలో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతి పాదించారు. అయితే ఇరాన్ మాత్రం అందుకు తిరస్కరించి మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికే ఆసక్తి కనబరిచింది. అటు పాకిస్తాన్ కూడా ఛాబహార్పై దుమారం రేపింది. వీటన్నిటినీ తోసిరాజని భారత్‌తో మైత్రికే ఇరాన్ మొగ్గు చూపింది. అయితే ఛాబహార్ అభివృద్ధి చెందిన వేళ మరోసారి అమెరికా ఇరాన్‌పై కత్తులు నూరుతోంది. ఒబామా నిష్క్రమించి డోనాల్డ్ ట్రంప్ వచ్చాక ఏదో ఒక నెపంతో ఇరాన్‌పై బురద జల్లుతున్నారు. మరోసారి ఇరాన్–అమెరికాల మధ్య ఒడిదుడుకులు ఏర్పడే ప్రమాదం కనబడుతోంది. ఇలాంటి సమయంలో మన దేశం దృఢంగా నిలబడవలసి ఉంటుంది. మన ప్రయోజనాలనూ, వ్యూహాత్మక అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని వ్యవహరించి ఆ విషయంలో అవసరమైతే అమెరికా ఒత్తిళ్లను కూడా అధిగమించవలసి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక చమురు, సహజవాయు నిల్వలున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. నాలుగేళ్లక్రితం పాక్షికంగా తొలగిన ఆంక్షల పర్యవసానంగా అది ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో ఇరు దేశాల సంబంధాలూ మరింత విస్తృతమవుతాయని ఆశిద్దాం. -
ఆఫ్ఘన్ షాక్‌తో పాక్ గిలగిల
వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు అందుబాటులోకి రావడంతో పాకిస్తాన్‌పై వాణిజ్య రవాణా విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆఫ్ఘన్ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని చాబహార్ పోర్టును వ్యూహాత్మకంగా భారత్, ఇరాన్, ఆఫ్ఘన్ దేశాలు అభివృద్ధి చేసుకోవడంతో.. ఇక పాకిస్తాన్‌తో అవసరమేముందని ఆఫ్ఘన్ అధికారులు స్పష్టం చేశారు. ఇకపై భారత్‌తో జరిపే వాణిజ్యం అంతా చాబహార్ పోర్టునుంచే నిర్వహిస్తామని ఆఫ్ఘన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అబ్దుల్లా అబ్దుల్లా స్పష్టం చేశారు. పాకిస్తాన్ కన్నా నమ్మకమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చాక.. ఇక ఆ దేశం గురించి ఆలోచాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య వాణిజ్య రవాణా అంతా పాకిస్తాన్ మీదే సాగుతోంది. ఈ క్రమంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్లు భారీగా పాకిస్తాన్‌కు పన్నులు చెల్లిస్తున్నాయి. చాబహార్ పోర్టు నుంచి రవాణా జరిగితే.. పాకిస్తాన్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. -
భారత్-ఇరాన్ ప్రతిష్టాత్మక డీల్‌పై అమెరికా గుస్సా!
వాణిజ్య సహకారం కోసం దక్షిణ ఇరాన్లో చాబహర్ ఓడరేవు నిర్మాణం కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా సెనేటర్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి మరీ భారత్ ఈ ఒప్పందం చేసుకుందా? అంటూ సెనేటర్లు ప్రశ్నించారు. దీంతో స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఈ ఒప్పందాన్ని నిశిత దృష్టితో పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇరాన్‌పై ఆంక్షలకు అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుందని తాము భావిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ (మధ్య, దక్షిణాసియా వ్యవహారాలు) నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇరాన్లో చాబాహర్ ఓడరేవు అభివృద్ధికి ఆ దేశ ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చైనాను అధిగమించి ఈ ఓడరేవు నిర్మాణాన్ని భారత్ చేజిక్కించుకోవడం ద్వైపాక్షికంగా భారత్-ఇరాన్‌కు ఎంతో కలిసిరానుంది. ఈ ఓడరేవు వల్ల పాకిస్థాన్, చైనాతో నిమిత్తం లేకుండానే భారత్ దక్షిణాసియా దేశాలతో వాణిజ్యం కొనసాగించగలదు. వ్యూహాత్మకంగా కీలకమైన చాబాహర్ పోర్టు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోవడం భారత్ దౌత్య విజయంగా భావిస్తున్నారు.