మన దేశాన్ని పశ్చిమాసియా, మధ్య ఆసియా, యూరప్‌లతో అనుసంధానించడం తోపాటు మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని కొత్త పుంతలు తొక్కించే ఇరాన్‌లోని కీలకమైన ఛాబహార్ ఓడరేవు కొత్త సొబగులు అద్దుకుని ఆదివారం ప్రారంభమైంది. మన భాగస్వామ్యంతో అభివృద్ధి అయిన ఈ ఓడరేవు వల్ల వాణిజ్యపరంగా మాత్రమే కాదు... వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి ఎంతో ఉపయోగం. వాజ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2003లో అంకురార్పణ పడిన ఈ ఆలోచన సాకారం కావడానికి 14 ఏళ్ల సమయం పట్టింది. చెప్పాలంటే ఈ ఓడరేవు ప్రాధాన్యతను ఇరాన్ గుర్తించేసరికే ఎంతో ఆలస్యమైంది.
80వ దశకంలో ఇరాక్‌తో ఘర్షణలు ఏర్పడినప్పుడు ఈ ఓడరేవు అభివృద్ధి తప్పనిసరని ఆ దేశం తెలుసుకుంది. అయితే అందుకు ఆర్ధికంగాగానీ, సాంకేతికంగా గానీ అవసరమైన వనరులు ఇరాన్ దగ్గర లేవు. మన దేశం ఆ రెండూ అందించేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది. తీరా అది ఒప్పందంగా రూపుదాల్చే తరుణంలో ఇరాన్‌పై అమెరికా, యూరప్ యూని యన్(ఈయూ) దేశాలు ఆంక్షలు విధించాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా మరిన్ని నిషేధాలను అమల్లోకి తెచ్చాయి. నిజానికి ఈ అడ్డంకులు లేనట్టయితే యూపీఏ హయాంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరేది. చాన్నాళ్ల క్రితమే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు నాలుగేళ్లక్రితం ఇరాన్‌తో పశ్చిమ దేశాలకు అణు ఒప్పందం కుదిరాక పరిస్థితులు మారాయి. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక మారిన ఈ పరిస్థితులను మనకనుకూలంగా మలుచుకోవడంపై దృష్టి సారించారు. ఛాబహార్ ఓడరేవు అభి వృద్ధి ప్రతిపాదన దుమ్ముదులిపి దాన్ని పట్టాలెక్కించారు. నిరుడు మే నెలలో ఆయన ఇరాన్ పర్యటించినప్పుడు దీనిపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. మన దేశం ఈ ఒప్పందం కింద ఇరాన్‌కు దాదాపు రూ. 3,500 కోట్ల ఆర్ధిక సాయం సమ కూర్చింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందజేసింది.
అఫ్ఘానిస్తాన్‌తో మనకెంత సాన్నిహిత్యమున్నా, ఆ దేశంతో వర్తక వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే ఇన్నాళ్లూ పాకిస్తాన్‌పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువుల కోసం కూడా పాక్ ఆసరా అవసరమయ్యేది. అక్కడి కరాచీ ఓడరేవు ద్వారా మనం ఎగుమతి, దిగుమతులు చేసుకోవాల్సివచ్చేది. అనేక అడ్డంకులు కల్పించి, ఎంతో జాప్యం తర్వాత మాత్రమే ఆ విషయంలో పాకిస్తాన్ అంగీకరించేది. కానీ ఛాబహార్ ఓడరేవు ఇప్పుడా ఇబ్బందిని పూర్తిగా తొలగించినట్టే. మనం నేరుగా అఫ్ఘానిస్తాన్‌తో మాత్రమే కాదు...యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఛాబహార్ మీదుగా ఎగుమతి, దిగుమతులను సాగించవచ్చు. నిజా నికి ఛాబహార్ మనకెంతో సమీపంలో ఉన్నదే. ఢిల్లీ–ముంబైల మధ్య దూరం కన్నా గుజరాత్‌లోని కాండ్లా రేవు పట్టణం, ఛాబహార్‌ల మధ్య దూరం చాలా తక్కువ. ఈ ఓడరేవు వల్ల సరుకు రవాణా చార్జీలు గణనీయంగా తగ్గుతాయి. సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది. మన దేశంతోపాటు ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు సైతం మధ్య ఆసియా, యూరప్ దేశాలతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునే సువర్ణావకాశం ఈ ఛాబహార్ కల్పిస్తోంది. ఛాబహార్‌ను ముందూ మునుపూ వాణిజ్య కారిడార్‌గా అభివృద్ధి చేయాలని భారత్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లు ఒక అంగీకారానికొచ్చాయి. అది సాకారమైతే రూపుదిద్దుకునే స్వేచ్ఛా వాణిజ్య మండలిలో వాణిజ్య కార్య కలాపాలు ముమ్మరమవుతాయి. అక్కడ పెట్రో కెమికల్స్, ఎరువులు, ఉక్కు పరి శ్రమల్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకవసరమైన రైల్వే లైన్లు, రహదారులు ఏర్పడతాయి. ఫలితంగా వర్తక వాణిజ్యాలతోపాటు ఉపాధి అవకాశాలు కూడా దండిగా పెరుగుతాయి. ఓడరేవును ప్రారంభిస్తూ ఇరాన్ అధ్య క్షుడు హసన్ రౌహానీ అన్నట్టు ఒక్క సముద్ర మార్గం మాత్రమే కాదు...దీన్ని ఉపరి తల, వైమానిక రంగాలకు సైతం అనుసంధానించి వినియోగించుకోవచ్చు. ఇప్ప టికి పూర్తయింది ఛాబహార్ తొలి దశ మాత్రమే. దీని ద్వారా 25 లక్షల టన్నుల ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే అది 8 కోట్ల టన్నులకు చేరుకుంటుంది.
వర్తక, వాణిజ్య రంగాల రీత్యా మాత్రమే కాదు...ఛాబహార్ వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైనది. ఇప్పటికే మన ఇరుగు పొరుగు దేశాలతో వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ ప్రాంతంలో మన పలుకుబడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్న చైనా ఛాబహార్‌లో కూడా భారత్ ప్రయత్నాలకు గండికొట్టాలని చూసింది. నిరుడు ప్రధాని మోదీ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇరాన్ వెళ్లి ఛాబహార్ ఓడరేవునూ, దానికి సమీపంలో పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతి పాదించారు. అయితే ఇరాన్ మాత్రం అందుకు తిరస్కరించి మనతో ఒప్పందం కుదుర్చుకోవడానికే ఆసక్తి కనబరిచింది. అటు పాకిస్తాన్ కూడా ఛాబహార్‌పై దుమారం రేపింది. వీటన్నిటినీ తోసిరాజని భారత్‌తో మైత్రికే ఇరాన్ మొగ్గు చూపింది. అయితే ఛాబహార్ అభివృద్ధి చెందిన వేళ మరోసారి అమెరికా ఇరాన్‌పై కత్తులు నూరుతోంది. ఒబామా నిష్క్రమించి డోనాల్డ్ ట్రంప్ వచ్చాక ఏదో ఒక నెపంతో ఇరాన్‌పై బురద జల్లుతున్నారు. మరోసారి ఇరాన్–అమెరికాల మధ్య ఒడిదుడుకులు ఏర్పడే ప్రమాదం కనబడుతోంది. ఇలాంటి సమయంలో మన దేశం దృఢంగా నిలబడవలసి ఉంటుంది. మన ప్రయోజనాలనూ, వ్యూహాత్మక అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని వ్యవహరించి ఆ విషయంలో అవసరమైతే అమెరికా ఒత్తిళ్లను కూడా అధిగమించవలసి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక చమురు, సహజవాయు నిల్వలున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. నాలుగేళ్లక్రితం పాక్షికంగా తొలగిన ఆంక్షల పర్యవసానంగా అది ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఇలాంటి సమయంలో ఇరు దేశాల సంబంధాలూ మరింత విస్తృతమవుతాయని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment