దౌత్య సంబంధాలు తాడు మీద నడకలాంటివి. ప్రతి అడుగూ ఎంతో జాగరూకతతో వేస్తే తప్ప సురక్షితంగా గమ్యం చేరడం అసాధ్యం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సమస్య ఎదురుకావడం ఖాయం. దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్లీ చాలాకాలం పడుతుంది. ఇరాన్ ఉన్నట్టుండి బుధవారం కీలకమైన రైల్వే ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని తప్పించడాన్ని చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. భారత్–ఇరాన్‌ల మధ్య నిజానికి తీవ్రమైన విభేదాలు లేవు. ద్వైపాక్షిక అంశాల్లో పరస్పరం ఘర్షించిన సందర్భాలు లేవు. అయినా ముందుగా ఒక్క మాట చెప్పకుండానే, తన అసంతృప్తి వెనకున్న కారణాలేమిటో వివరించకుండానే అది ఒప్పందం నుంచి నిష్క్రమించింది. మధ్య ఆసియా, పశ్చి మాసియా, యూరప్ దేశాలకు ‘బంగారు వాకిలి’గా భావించే ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు మన సహాయసహకారాలతోనే ఏడాదిన్నర క్రితం పూర్తయింది.
2003లో వాజపేయి హయాంలో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా చాబహార్ ఓడరేవు నిర్మాణం మన చేతికొచ్చింది. ఆ తర్వాత అమెరికా నుంచి ఎన్నోవిధాల అవాంతరాలు ఏర్పడుతూనే వున్నాయి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న ప్పుడు ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం పర్యవసానంగా ఓడరేవు పనులు మొదలై 2018 డిసెంబ ర్‌కల్లా పూర్తయ్యాయి. అయితే అది పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి కావలసిన ఉపకరణాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. మన దేశం ఎంతగానో నచ్చచెప్పిన తర్వాత చాబహార్ ఓడరేవును ఆ ఆంక్షల నుంచి ట్రంప్ మొన్న జనవరిలో మినహాయించారు. ఉపకరణాల కోసం రెండేళ్లనాడు మన దేశం ఇచ్చిన ఆర్డర్లకు నిధులు సమకూర్చడానికి తటపటాయించిన అంత ర్జాతీయ బ్యాంకులు చివరకు ఒప్పుకున్నాయి.
అవి కోరిన విధంగా ఆంక్షలనుంచి చాబహార్‌ను మిన హాయించే అధికారిక పత్రాన్ని అమెరికా జారీ చేయడంతో ఇది సాధ్యమైంది. అయినా అక్కడి పను లకు అడ్డంకులు ఎదురవుతూనే వున్నాయి. రైల్వే ప్రాజెక్టయితే పూర్తి అనిశ్చితిలో పడింది. దానికి ఆంక్షల నుంచి మినహాయింపు లభించకపోవడమే ఇందుకు కారణం. అందువల్లే దాని నిర్మాణం అనుకున్నట్టుగా మొదలుకాలేదు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌లో పర్యటించినప్పుడు చాబహార్ ఓడరేవు నుంచి ఇరాన్–అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని జహేదన్ వరకూ రైల్వే లైన్ నిర్మించేం దుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అఫ్ఘానిస్తాన్ కూడా భాగస్వామి. భార తీయ రైల్వే నిర్మాణ సంస్థ(ఐఆర్‌సీఓఎన్) నిధులు సమకూర్చుకుని ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవగాహన ఒప్పందంలో అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు 40 కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది.
ఇరాన్–భారత్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం అమలు అమెరికా కటాక్షవీక్షణాలపై ఆధారపడటం విచారించదగ్గ విషయం. 2003లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందం కింద ఒకటి రెండేళ్లలో పూర్తికావాల్సిన చాబహార్ ఓడరేవుకు 15 ఏళ్లు పట్టడం, ఆ తర్వాతైనా ఓడరేవుకు అవ సరమైన రైల్వే నిర్మాణం పనులు మన దేశం మొదలుపెట్టలేకపోవడం చివుక్కుమనిపిస్తుంది. దేశాల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడాలంటే ఏళ్లూ పూళ్లూ పడుతుంది. అందుకు ఎంతో సహనం, ఓపిక అవసరమవుతాయి. కానీ అవి ఛిద్రం కావడానికి రోజుల వ్యవధి చాలు. అమెరికాతో మనకుంటున్న సంబంధాలపై తనకున్న అసంతృప్తి కారణంగానే ఇరాన్ ఈ చర్య తీసుకుందని అందరికీ అర్థమ వుతుంది. అనేక పరీక్షా సమయాల్లో ఇరాన్ మన దేశానికి అండగా నిలిచింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముస్లిం దేశాలు మన పట్ల విముఖంగా ఉన్నప్పుడు ఇరాన్ చొరవ తీసుకుంది.
1995లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీ మన దేశంలో పర్యటించారు. అదే సంవ త్సరంలో ఇప్పుడు ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)గా ఉన్న ముస్లిం దేశాలన్నీ అమెరికా తదితర దేశాల ప్రోద్బలంతో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో తీర్మానం తీసుకొచ్చినప్పుడు ఆ ఓటింగ్‌కు గైర్హాజరై ఇరాన్ మనకు మద్దతుగా నిల బడింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు తీర్మానం తీసుకురావడానికి ప్రయత్నించినా దానికి అడ్డుపడింది. కానీ ఇటీవలి కాలంలో దాని స్వరం మారింది. మొన్న మార్చిలో ఢిల్లీలో ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఇరాన్ విదేశాంగమంత్రి దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మతి మాలిన దాడులను అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అది తమ ఆంతరంగిక అంశమని మన దేశం చెప్పాక కూడా ఆ దేశ మత నాయకుడు అయతుల్లా ఖమేనీ, ఇటువంటి ఉదంతాలు ఆగకపోతే ఇస్లాం దేశాల నుంచి భారత్ ఏకాకి అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రైల్వే ప్రాజెక్టునుంచి భారత్‌ను తప్పించడం దానికి కొనసాగింపే. అమెరికాతో మన సంబంధాలపై అది కొంతకాలం నుంచి గుర్రుగా ఉంది. ఒకప్పుడు తమ నుంచి భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేసిన భారత్, అమెరికా ఆంక్షలకు తలొగ్గి పూర్తిగా ఆపేయడం దానికి రుచించలేదు. అంతక్రితం ఆంక్షలు విధించినప్పుడు చమురు కొనడం ఎప్పుడూ ఆపని భారత్ ఇలా చేయడం దానికి ఆగ్రహం కలిగించడంలో వింతలేదు.
ఏతావాతా అమెరికాతో మన సంబంధాలు ఇరాన్‌లాంటి మిత్ర దేశానికి ఆగ్రహం కలిగించాయి.
ఒకపక్క అమెరికా మన భద్రతను బేఖాతరు చేసి అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌లకు అధికారం అప్పగించి అక్కడినుంచి నిష్క్రమించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మరోపక్క దానివల్ల మనకు ఇరా న్‌తో వున్న సంబంధాల్లో పొరపొచ్చాలు వచ్చాయి. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టునుంచి మన దేశాన్ని తప్పించడమే కాదు.. అది చైనాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఈ ఒప్పందం కింద వచ్చే 25 ఏళ్లలో ఇరాన్‌లో చైనా 40,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతుంది. ఈ దశలో ఇరాన్‌తో దౌత్య సంబంధాలను తిరిగి పట్టాలెక్కించడానికి మన దేశం శాయశక్తులా కృషి చేయడం అవసరం. చైనా మన మిత్ర దేశాలనే మనకు దూరం చేస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలి.
Comments
Please login to add a commentAdd a comment