వ్యక్తుల మధ్య వుండే సాధారణ స్నేహ సంబంధాలనే నిత్యం ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నప్పుడు దేశాలమధ్య దౌత్యసంబంధాలు ఎల్లకాలం ఒకేలా వుంటాయని, వుండాలని కోరుకోవడం అత్యాశ. ఇరాన్ ఏడాది వ్యవధిలో రెండోసారి ఈ సంగతి రుజువు చేసింది. నిరుడు కీలకమైన రైల్వే ప్రాజె క్టునుంచి మన దేశాన్ని తప్పించిన ఆ దేశం... ఇప్పుడు తాజాగా పర్షియన్ జలసంధిలోని ఫర్జాద్–బీ సహజవాయు క్షేత్రం కాంట్రాక్టునుంచి పక్కనబెట్టింది. గతంలోలాగే ఇప్పుడు కూడా అది కారణా లేమీ చెప్పలేదు. వాస్తవానికి పర్షియన్ జలసంధిలో చమురు, సహజవాయు నిక్షేపాల గురిం చిన అన్వేషణ ప్రతిపాదన మన దేశానిది.
ఓఎన్‌జీసీ విదేశాల్లో వాణిజ్యకార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్న ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్) ద్వారా తనకున్న అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో 2008లో ఈ నిక్షేపాలను కనుగొన్నది. అందుకోసం భారీ మొత్తం వ్యయం చేసింది. ఫర్జాద్–బీలో 2 కోట్ల 30లక్షల ఘనపుటడుగుల పరిమాణంలో సహజవాయు నిక్షేపాలున్నాయని నిర్ధారించింది. ఇందులో 60 శాతం వరకూ వెలికితీయొచ్చునని లెక్కేసింది. ముందనుకున్న ప్రకారమైతే ఈ నిక్షేపాలను వెలికితీసే కాంట్రాక్టు సైతం ఓవీఎల్‌కు రావాల్సివుంది. ఈ ప్రాజెక్టులో తాము 40 శాతం వాటా తీసుకుని, 1,100 కోట్ల డాలర్ల మేర పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా వున్నట్టు ఓవీఎల్ ఇరాన్‌కు తెలియజేసింది.
తదుపరి చర్యల కోసం చర్చలు కూడా మొదలయ్యాయి. 2012లో ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుందనగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు మనకు శాపంలా మారాయి. అను కోకుండా ఇరాన్‌తో అమెరికా, పాశ్చాత్య దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందంతో ఆంక్షల సడ లింపు ప్రారంభమై 2015లో ఈ ప్రాజెక్టుపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈలోగా అమెరి కాలో డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి ప్రారంభం కావడం, 2018లో ఆయన ఇరాన్‌పై ఆగ్రహించి ఆంక్షలు విధించడంతో మరోసారి ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది.
అమెరికాకు క్రమేపీ సన్నిహితం కావడంవల్ల మనకు కలిగిన ప్రయోజనాలేమోకానీ నష్టాలు చాలానే వున్నాయి. అవి రోజులు గడిచేకొద్దీ పెరుగుతున్నాయి. గతంలో ఇరాన్‌లోని చాబహార్ ఓడ రేవు కాంట్రాక్టు కోసం ఏళ్ల తరబడి చేసిన కృషి ఫలించి, 2003లో వాజ్‌పేయి హయాంలో ఒప్పందం సాకారమైంది. అప్పుడూ అమెరికా అడ్డుపుల్లలేస్తూ వచ్చింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించాం గనుక దానితో వాణిజ్య కార్యకలాపాలు నడపడానికి వీల్లేదని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది.
ఇరాన్ మొదటి నుంచీ మనకు మిత్రదేశం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముస్లిం దేశాలు మనకు మొహం చాటేసినప్పుడు భారత్ వెనక దృఢంగా నిలబడింది ఇరానే. 1995లో అప్పటి ఇరాన్ అధి నేత రఫ్సంజానీ మన దేశంలో పర్యటించారు. అమెరికా ఆ సమయంలో ఇస్లామిక్ దేశాల సంస్థ (ఓఐసీ)ని ప్రోత్సహించి కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘంలో తీర్మానం ప్రతిపాదించేలా చేసినప్పుడు సైతం ఇరాన్ మన పక్షానే వుంది. ఓటింగ్‌కు గైర్హాజరైంది. అంతకుముందూ, తర్వాత కూడా సమితి వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ సమస్య లేవనెత్తినప్పుడల్లా అడ్డుపడింది. అది పూర్తిగా భారత్ ఆంతరంగిక వ్యవహారమంటూ వాదించేది. అలాంటి దేశం క్రమేపీ మనకు దూరం జరుగుతుండటం ఆందోళనకర విషయమే.
ఏ దేశమైనా తన స్వీయ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని దౌత్యసంబంధాల నడతను నిర్దేశించుకుంటుంది. తనతో మిత్రత్వం నెరపుతున్న దేశం ఇతరత్రా వున్న తన సన్నిహిత దేశాలతో ఎలావుంటున్నది... తన శత్రువులతో ఎలా వ్యవహరిస్తున్నదన్న విషయంలో నిశిత పరిశీలన చేస్తుం టుంది. మనమైనా అంతే. మనతో సన్నిహితంగా వుంటూ, మనవల్ల ప్రయోజనాలు పొందుతూ ఏ దేశమైనా పాక్‌తో అంటకాగుతుంటే... పరోక్షంగానైనా అందువల్ల పాక్‌కు మేలు కలుగుతుంటే మన దేశం చూస్తూ ఊరుకోదు. రకరకాల రూపాల్లో అది సరికాదన్న సంకేతాలు పంపుతుంది. ఇరాన్ కూడా ఈ పనే చేసింది. 2003లో కుదిరిన చాబహార్ ఓడరేవు నిర్మాణం ఒప్పందం పనులు వెను వెంటనే మొదలైతే రెండు మూడేళ్లలో పూర్తయ్యేది. కానీ అమెరికా అడుగడుగునా మనల్ని అడ్డుకుంది.
పర్యవసానంగా ఆ ఓడరేవు పదిహేనేళ్ల తర్వాత 2018లో తుదిరూపు సంతరించుకుంది. ఈలోగా దానికి కావలసిన 620 కిలోమీటర్ల రైల్వే లైను కాంట్రాక్టు పనులు ఆంక్షల పరిధిలో వుండ టంతో అవికాస్తా నిలిచిపోయాయి. ఈ విషయంలో ఇరాన్ మనదేశాన్ని ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. దాంతో నిరుడు ఆ కాంట్రాక్టును కాస్తా రద్దుచేసింది. 2019లో ఇరాన్ ముడి చమురు దిగుమతిపై కొత్తగా కుదరవలసిన కాంట్రాక్టును మన దేశం పునరుద్ధరించకపోవ డంతో అలిగి ఇరాన్ ఆ చర్య తీసుకుంది. కొనే సరుకు నాణ్యమైనదా కాదా... చౌకగా వుందా లేదా అని చూడటం ఏ కొనుగోలుదారైనా చేసే పని.
అలా చూస్తే ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి, అమె రికా నుంచి మనం కొంటున్న ముడి చమురు ధర అధికం. పైగా ఇరాన్‌నుంచి రవాణా చార్జీలు కూడా తక్కువ. చెల్లింపు నిబంధనలు సైతం సరళమైనవి. అంతర్జాతీయంగా మనం క్రమేపీ అమె రికాకు సన్నిహితం కావడంవల్ల ముడి చమురు దిగుమతులు తడిసి మోపెడు కావడం ఒక నష్ట మైతే... భారీ కాంట్రాక్టులు చేజారడం మరో నష్టం. అమెరికా కోసం ఇన్ని త్యాగాలెందుకు చేయాలో మన పాలకులు పునరాలోచించాలి. దౌత్యసంబంధాల్లో ఏదీ అసాధ్యం కాదు గనుక అలిగిన ఇరాన్‌ను బుజ్జగించే దారులు వెతకాలి.
Comments
Please login to add a commentAdd a comment