మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు ‘బంగారువాకిలి’గా భావించే ఇరాన్‌లోని చాబహార్‌లో మన దేశం ఆధ్వర్యంలో నిర్మాణమైన షహీద్ బెహెస్తీ ఓడరేవు లాంఛనంగా సోమవారం ప్రారంభమైంది. పదిహేనేళ్లక్రితం...అంటే 2003లో వాజపేయి ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వహయాంలో అనుకున్న ఈ ప్రాజెక్టుకు అడుగడుగునా అమెరికా రూపంలో అవాంతరాలు వచ్చిపడుతూనే ఉన్నాయి. ఇరాన్‌తో కయ్యానికి దిగిన అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించి దానితో ఎవరూ వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెరపకూడదని ఫర్మానా జారీచేయడంతో దీనికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ రెండో దశ పాలన మొదలయ్యేనాటికి అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడ్డాయి.
అమెరికా, రష్యా, యూరప్ యూనియన్(ఈయూ) దేశాలు ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం పర్యవసా నంగా ఆ దేశంపై ఆంక్షల సడలింపు మొదలైంది. కనుకనే ఆ మరుసటి ఏడాదికే మన దేశం మళ్లీ చాబహార్ ఓడరేవు అభివృద్ధిపై దృష్టి సారించగలిగింది. 2015లో నరేంద్ర మోదీ ఇరాన్‌లో పర్యటించినప్పుడు ఈ అంశంపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అనంతరం ఇందుకు అవసరమైన రుణం రూ. 1,600 కోట్లను ఎగ్జిమ్ బ్యాంకు సమకూర్చింది. అప్పటినుంచి సాగుతున్న నిర్మాణం గత ఏడాది డిసెంబర్‌కల్లా పూర్తయింది. ప్రస్తుతం ఆ ఓడరేవు నుంచి సాగించే ఎగుమతి దిగుమతులకు అవసరమైన కారిడార్లకు మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవుకు వినియోగిం చుకునే మార్గాలు, విధించాల్సిన సుంకాలు తదితరాలపై కూడా అవగాహన కుదిరింది. జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పోర్టుట్రస్ట్‌ల భాగస్వామ్యంతో ఆవిర్భవించిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్(ఐపీజీఎల్) సంస్థ ఆధ్వర్యంలో చాబహార్ ఓడరేవు కార్యకలా పాలు మొదలయ్యాయి.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వచ్చాక ఆయన ఇరాన్‌పై కత్తులు నూరడం మొదలె ట్టారు. ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా కుదుర్చుకోవాలని డిమాండ్ చేశారు. దానికి ఇరాన్ ససేమిరా అనడంతో మళ్లీ ఆ దేశంపై గత నెల 5 నుంచి ఆంక్షలు ప్రారంభించారు. కానీ అఫ్ఘానిస్తాన్ ఆర్థికాభివృద్ధిని, ఆ దేశానికి అందాల్సిన మానవీయ సాయాన్ని దృష్టిలో ఉంచుకుని చాబహార్ ఓడరేవుకు ఆంక్షల నుంచి మినహాయింపులిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గత నెల ప్రకటించడంతో అనిశ్చితి తొలగిపోయింది. రెండు సార్వభౌమాధికార దేశాల మధ్య కుదిరే ఒప్పందాలకు వేరే దేశం ఆమోదం అవసరమయ్యే దుస్థితి ఏర్పడటం విచారించదగ్గది. కానీ అంతర్జాతీయ స్థితిగతులు ఇలాగే ఉన్నాయి. చిత్రమేమంటే ఈ ఆంక్షల విషయంలో ట్రంప్‌కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది.
అణు ఒప్పందంలోని ఇతర భాగస్వామ్యపక్షాలన్నీ అమెరికా వైఖరిని గట్టిగా ఖండించాయి. తాము ఒప్పందానికే కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. అయినా ఆంక్షలు అమల్లోకి రావడం మొదలైంది. అవి మనకు ఇబ్బం దికరంగానూ మారాయి. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో మనది మూడో స్థానం. ఈ దిగుమతుల్ని ఆరు నెలల్లో గణనీయంగా తగ్గించుకుంటామని హామీ ఇచ్చాకే భారత్‌కు తాత్కాలిక వెసులుబాటు ఇచ్చామని పాంపియో చెబుతున్నారు. రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతుల్ని ఇప్పటికే మన దేశం నాలుగు లక్షల బ్యారెళ్లకు తగ్గించుకుంది. దీన్ని మూడు లక్షలకు కుదించుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. తాము మొదటినుంచీ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నా, అమెరికా విధించిన ఆంక్షల విషయంలో తమకు ఆ స్థాయిలో భారత్ నుంచి మద్దతు లభించడంలేదన్న భావన ఇరాన్‌కు లేకపోలేదు. నిజానికి చాబహార్ ఓడరేవును ఆధారంగా ఇరాన్ అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించే ఆస్కారం ఉంది. ఆ దేశంలో పెట్రో కెమి కల్స్, ఎరువులు, ఉక్కు పరిశ్రమలు వర్థిల్లడానికి వీలుంది. ఒక్క ఇరాన్ మాత్రమే కాదు, మున్ముందు ఈ ఓడరేవు ఆధారంగా మధ్య ఆసియా, యూరప్ దేశాలన్నీ వాణిజ్య కార్యకలాపాల్ని సాగించి ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది.
అఫ్ఘానిస్తాన్‌కు మనతో సాన్నిహిత్యం ఉన్నా రెండు దేశాలకూ ఉమ్మడి సరిహద్దులు లేవు. అక్కడ మన దేశం చేపట్టే ఎలాంటి ప్రాజెక్టులకైనా పాక్ భూభాగం వాడుకోవాలి. అలాగే పశ్చి మాసియా దేశాలనుంచి మనకొచ్చే చమురు, సహజవాయు దిగుమతులకు కూడా దాని అనుమతులు తప్పనిసరి. అయితే పాకిస్తాన్ ఇందుకు ససేమిరా అంగీకరించకపోవడం వల్ల ఇతర రవాణా మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చు తడిసి మోపెడవుతున్నది. చాబహార్ ఓడరేవు కార్యకలాపాలు మొదలయ్యాయి గనుక అటువంటి సమస్యలన్నీ తీరినట్టే. పాకిస్తాన్‌లో చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవుకు చాబహార్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాబహార్ ఓడరేవు ఉన్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్ పుష్కలమైన ఇంధన వనరులున్న ప్రాంతం. మన పశ్చిమ తీరంలోని కాండ్లా రేవు పట్టణానికి ఢిల్లీ–ముంబైల మధ్య దూరం కన్నా చాలా తక్కువ దూరం.
ఈ కారణాలన్నిటిరీత్యా అటు ఇరాన్ సత్వరాభివృద్ధికి మాత్రమే కాదు... ఇటు మన దేశ వాణిజ్య అభివృద్ధికి కూడా చాబహార్ ఓడరేవు ఎంతో దోహదం చేస్తుంది. అయితే అమెరికా ఈ ఆంక్షల సడ లింపును ఎన్నాళ్లు కొనసాగిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇది యధావిధిగా ఉంటే ఒకటి రెండేళ్లు గడిచేసరికి ముమ్మరమైన వాణిజ్య కార్యకలాపాలతో గ్వాదర్ ఓడరేవుకు చాబహార్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. అంతేకాదు, మొత్తం ప్రాజెక్టు పూర్తయితే అక్కడినుంచి సాగే ఎగుమతి, దిగుమ తులు 8 కోట్ల టన్నులకు చేరుకుంటాయి. మున్ముందు నిర్మాణం కాబోయే 7,200 కిలోమీటర్ల పొడ వైన ఉత్తర దక్షిణ రవాణా కారిడార్(ఎన్‌ఎస్‌టీసీ)లో చాబహార్ కీలకపాత్ర పోషిస్తుంది. అవరోధా లన్నిటినీ అధిగమించి సాకారమైన చాబహార్ భారత్–ఇరాన్ మైత్రికి ప్రతీక.
Comments
Please login to add a commentAdd a comment