
చాబహర్ పోర్ట్ నిర్వహణకు భారత్ ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2016లో జరిగిన ఒప్పందాన్ని తిరిగి కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు చేసేందుకు షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఇరాన్‌కు వెళ్లనున్నారు. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.
మీడియా సంస్థల కథనం ప్రకారం..2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌లో పర్యటించినపుడు చాబహర్ ఓడరేవుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజాగా ఈమేరకు తిరిగి ఒప్పందాన్ని కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు జరుపనున్నారు. విదేశాల్లో ఓడరేవు నిర్వహణ చేపట్టడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ ఒప్పందం రానున్న పదేళ్లకాలానికి వర్తిస్తుందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది.
చాబహర్ పోర్ట్ ప్రాముఖ్యత
కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాలను చేరుకోవడానికి ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)లో చాబహర్ పోర్ట్‌ను కేంద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఎన్‌ఎస్‌టీసీ వల్ల భారత్-మధ్య ఆసియా కార్గో రవాణాకు ఎంతోమేలు జరుగుతుంది. చాబహర్ పోర్ట్ భారత్‌కు వాణిజ్య రవాణా కేంద్రంగా పని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో 10 ఏళ్లు కొనసాగించేలా తాజాగా పత్రాలపై సంతకాలు చేయనున్నారు.