పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే! | Immigration Inspections At Port of Entry In USA: Dos And Donts | Sakshi
Sakshi News home page

US: పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!

Published Fri, May 31 2024 2:17 PM | Last Updated on Fri, May 31 2024 3:22 PM

Immigration Inspections At Port of Entry In USA: Dos And Donts

హైదరాబాద్ నుంచి బదిలీ అయి మహబూబ్ నగర్‌లో పని చేస్తున్నప్పుడు మా పిల్లల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆరు మాసాల సెలవు పెట్టి బయలుదేరాను. కుటుంబ సభ్యుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడమే తప్ప నేను వెళ్లడం మొదటి సారి కావడంతో కంగారు పడ్డాను. మా ఇంట్లోనేమో ‘ మీరు పోతున్నది అమెరికా మాత్రమే... చంద్రమండలానికి కాదు కదా ! ఇక్కడేదన్నా మరిచినా యూఎస్‌లో అన్నీ దొరుకుతాయి, మీకు కావలసిన పుస్తకాలు కూడా పుష్కలంగా ‘ అని జోక్ చేశారు. 

రాత్రి ఒంటి గంటకు ఎగిరే విమానం కోసం ఎందుకైనా మంచిదని మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరి, అన్ని చెకింగ్ లు పూర్తి చేసుకొని మొత్తం మీద ఫ్లైట్ ఎక్కేశా. నా పక్క సీట్లోనే కూర్చున్న ఓ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకొని అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడడం చూసి నేనూ మాట కలిపా, ఆమెది వరంగల్, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తున్నట్లు చెప్పింది. అమ్మా నాకిది మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ, ప్రయాణంలో కాస్త గైడ్ చేస్తుండు అన్నాను మాట వరసకి , మధ్యలో ఫ్లైట్ మారడం గురించే నా వర్రీ అంతా. 

‘అయ్యో అంకుల్ నేను విమానం ఎక్కడమే ఇది ఫస్ట్ టైమ్, మీరే నాకు చెప్పాలి ! ‘ అన్నది నవ్వుతూ ఆమె. వేళాపాల లేకుండా ఏదో ఒకటి ఇస్తున్నారు తినడానికి, తాగడానికి రుచిపచి లేని ఆహారం. ఏక దాటిగా దాదాపు 10 గంటలు సీట్లో కూర్చోలేక, హ్యాండ్ లగేజీ తీసుకోడానికో, కాలకృత్యాలు తీర్చుకోడానికో, నేను మధ్యమధ్య లేస్తుంటే, మరో పక్కనున్న శ్వేతమహిళ తాను కదలలేక విసుక్కోవడం నాకు నచ్చలేదు. ఎలాగైతేనేం ఫ్రాంక్ ఫర్ట్‌లో అడుగు పెట్టాక, అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌లోని మరో టర్మినల్‌కు వెళ్ళడానికి బస్సు రెడీగా ఉండడం బాగుంది. బస్సు దిగగానే హ్యూస్టన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టెర్మినల్‌కి ఎలా వెళ్లాలో ఒకటికి రెండుసార్లు చెప్పింది అక్కడున్న జర్మనీ అమ్మాయి. వాళ్ల మర్యాద బాగుందనిపించింది. 

అదే పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ ..
మా ఫ్లైట్ జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి ఓ అరగంట ముందే మాకు కస్టమ్ ఫార్మ్స్ ఇచ్చారు పూర్తి చేయడానికి. దిగిన తర్వాత నేరుగా బయటకు వెళ్లొచ్చన్న మూడ్‌లో ఉన్నాను. అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. మనం విమానం దిగగానే.. అమెరికాలో అడుగుపెట్టినట్టు కాదన్న విషయం తెలిసింది. ఫ్లైట్‌ నుంచి లాండ్‌ అయిన ప్రతీ ఒక్కరు అక్కడి సెక్యూరిటీ నిఘాలోకి వెళ్తారు. వాళ్లు సూచించిన మార్గంలోనే /దారిలోనే నడవాలి. అది కాస్తా.. తీరిగ్గా చెక్‌ పాయింట్‌కు దారి తీస్తుంది. దాన్నే పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ అంటారు. ఈ పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీని అమెరికాలో కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహిస్తోంది. అమెరికా దేశంలో ఈ పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ వ్యవస్థను 1789లో ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్‌ విషయంలో మరిన్ని జాగ్రత్తలను పొందుపరిచారు. 

వీసా అక్కడ వరకే..
యూఎస్‌ కాన్సులేట్‌ వాళ్లు వీసా ఇవ్వగానే.. అమెరికాలో వాలిపోవచ్చని అనుకుంటారు. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఏ దేశం నుంచి ఏ నగరంలోని కాన్సులేట్‌ వాళ్లు వీసా ఇచ్చినా.. దాని పరిధి పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ వరకే. ఇక్కడి అధికారులు వచ్చే వ్యక్తులను, వారి దగ్గరున్న డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంటే హైదరాబాద్‌లో వీసా అధికారికి ఏ విషయమయితే చెప్పినామో.. దానికి మద్ధతుగా వెంట తెచ్చుకున్న ధృవపత్రాలను పరిశీలిస్తారు. అలాగే అనుబంధ ప్రశ్నలు అడుగుతారు. అనుమానం వస్తే అమెరికాలోకి అడుగుపెట్టకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు. 

నాకు ఎదురయిన అనుభవం ఏంటంటే.. 
నేను విమానంలో ఇచ్చిన కస్టమ్‌ ఫాంలో ఒక ప్రశ్న ఉంది. యూఎస్‌లో ఎంత కాలం ఉంటారు అని అడిగినప్పుడు అనాలోచితంగా 4 నెలలు అని రాశా, అది తప్పయింది. నిజానికి మా వాళ్లు నాకు 6 నెలల తర్వాతకు రిటర్న్‌ టికెట్‌ తీసుకున్నారు. దీన్ని పసిగట్టారు అక్కడి పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ అధికారులు. ‘ మీ రిటర్న్ టికెట్ 6 నెలలకు ఉంది కదా ’ అని క్లియర్ చేయకుండా పై అధికారి దగ్గరకు పంపారు. నేనేదో అమెరికాలోనే ఉండిపోడానికి వచ్చినట్లు ఆయనగారు పదే పదే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నేను ఆనాటి ప్రభుత్వ సర్వీస్‌లోనే ఉన్న అధికారినని తెలుసుకున్నాక మాత్రం వదిలిపెట్టేశారు. 

మన వాళ్లు ఎదుర్కునే పరీక్ష ఏంటంటే.? 
పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ గురించి అవగాహన లేకుండా.. చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు తొలిసారి అమెరికా వెళ్లాల్సిన వారు, కాలిఫోర్నియాలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లాలని వీసా అధికారికి చెబుతారు. తీరా వెళ్లేప్పుడు మాత్రం న్యూయార్క్‌ సిటీ చూసి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. న్యూయార్క్‌ పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీలో ఇక్కడికెందుకు వచ్చారని అడిగితే ఖంగు తింటారు. అమెరికాకు ఏ పని మీద వెళ్తున్నాం.? ఆ పనికి సరిపోయేలా దగ్గరున్న నగరానికే వస్తున్నామా? లేక తింగరి వేషాలు వేస్తున్నామా అన్నది పసిగట్టేస్తారు ఇక్కడి అధికారులు. పైగా మన పాస్‌పోర్ట్‌లో వీరు వేసే స్టాంపింగ్‌ డేట్‌ మనకు కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీకి మించి మనం అమెరికాలో ఉండడానికి వీల్లేదు. 

ఉదాహరణకు మీరు B1/B2 వీసా ఉండి అమెరికాలో జరగబోయే ఓ తెలుగు మహాసభలకు వస్తున్నారు. అదే పని మీద వీసా తీసుకున్నారు. కానీ మీ మనసులో దేశమంతా తిరిగితే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అది దాచిపెట్టి సభల కోసం వచ్చామని చెబితే స్టాంపింగ్‌ కేవలం నెల మాత్రమే వేస్తాడు. పద్ధతిగా వివరిస్తే మాత్రం ఆరు నెలల స్టాంపింగ్‌ వేస్తాడు. 

విద్యార్థులు.. జాగ్రత్త పడాలి 
ఇక్కడికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీలో ఇబ్బందులు పడతారు. అమెరికాకు సిద్ధం కాగానే.. మన స్టూడెంట్స్‌ చేసే పొరపాటు ఏంటంటే.. సీనియర్లు, అమెరికాలో అప్పటికే ఉంటోన్న స్టూడెంట్స్‌తో వాట్సాప్‌/ఫేస్‌బుక్‌ చాటింగ్‌ మొదలు పెడతారు. ఎక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయి? డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చన్న ప్రశ్నలు వేస్తారు. ఆ చాట్‌ అలాగే ఫోన్లలో ఉంటుంది. పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ అధికారికి మీ మీద డౌట్‌ వస్తే.. మీ ఫోన్‌ తీసుకుంటారు. మొత్తం చెక్‌ చేస్తారు. విద్యార్థులు చదువుకోవడానికి రావాలి గానీ.. డబ్బుల కోసం వస్తారా? అని వెనక్కి పంపిస్తారు. మనం ఎంతగా వాదించినా వృధా ప్రయాసే. ఏ దేశానికి వెళ్తే అక్కడి నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలా కోరుకుంటారు కూడా. వేముల ప్రభాకర్‌

(చదవండి: ఆనందమే జీవిత మకరందం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement