ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.
భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.
భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.
గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..
అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment