ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.
1962లో అహ్మదాబాద్‌లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.
ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
1998లో కిడ్నాప్
గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్‌ను 1998లో అహ్మదాబాద్‌లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్‌లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.
ఉగ్రవాదుల దాడి
1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.
ఇదీ చదవండి: గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?
జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్.
Comments
Please login to add a commentAdd a comment