అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉపసంహరిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆ తర్వాత బలగాలను ఆ దేశంలో ఉంచే ప్రణాళికేదీ లేదన్నారు. వైట్‌హౌస్‌లో మంగళవారం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ డెడ్‌లైన్‌లోగా బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నామని, అయితే ఇందుకు తాలిబన్ల సహకారం ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాషింగ్టన్: ప్రస్తుతం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించేలా కార్యక్రమం కొనసాగుతోంది. కానీ ఎంత త్వరగా అమెరికా సైనికులు వెనక్కి వచ్చేస్తే అంత మంచిదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వారికి ముప్పు పెరుగుతూ ఉంటుంది. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కల్పించకుండా, విమానాశ్రయాలోకి అన్నీ అనుమతిస్తే పని తొందరగా అవుతుంద’’ని బైడెన్ అన్నారు. ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్‌లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వాళ్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు
గడువు కంటే ముందే బలగాల ఉపసంహరణకు తమ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉందని బైడెన్ అన్నారు. లేదంటే ఉగ్రవాద సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్‌లో ఐసిస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్–కె అమెరికా బలగాలను టార్గెట్ చేసిందని వెల్లడించారు. వాళ్లు ఎప్పుడైనా విమానాశ్రయంపై దాడి చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్–కె సంస్థ సామాన్య పౌరులపై ఆత్మాహుతి దాడులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని బైడెన్ పేర్కొన్నారు.
తాలిబన్ల పాజిటివ్ రియాక్షన్
ఆగష్టు 31 తర్వాత కమర్షియల్ విమానాల ద్వారా అఫ్గన్‌ల ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని తాలిబన్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జర్మన్ దౌత్యవేత్త మర్కుస్ పోట్జెల్ ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. తాలిబన్ డిప్యూటీ చీఫ్ షెర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ హామీ ఇచ్చాడని, లీగల్ డాక్యుమెంట్లు ఉన్న అఫ్గన్‌లకు విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నట్లు మర్కుస్ తెలిపారు.
ఈ–వీసాలతోనే భారత్‌లోకి అనుమతి
న్యూఢిల్లీ: ఇకపై భారత్‌కు విమాన మార్గంలో వచ్చే అఫ్గన్ పౌరులను ఈ–వీసాలతోనే అనుమతిస్తామని బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వచ్చి అఫ్గనీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ఎంబసీలను మూసేశారు. దాంతో ఆన్‌లైన్‌లో ఈ–వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ–వీసా ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. సాధారణ వీసాలు పొంది భారత్‌కు చేరుకోని వీసాలు ఇకపై చెల్లుబాటు కావని, ఈ–వీసాలపైనే భారత్‌లోకి అనుమతిస్తామని హోం శాఖ స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment