e-visa
-
Japan eVisa: జపాన్ టూర్ ఇక ఈజీ!
జపాన్ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్ట్‌లపై భౌతిక వీసా స్టిక్కర్లను పొందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుండి, జపాన్ భారతీయ పర్యాటకుల కోసం ఈ-వీసాల జారీని ప్రారంభించింది. పర్యాటకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జపాన్ ఈ-వీసా ప్రోగ్రామ్.. వీఎఫ్ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ వీసా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పర్యాటక ప్రయోజనాల కోసం సింగిల్-ఎంట్రీ స్వల్పకాలిక వీసాను అందిస్తుంది. జపాన్‌లో గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులు ఈ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు కొత్త విధానం ప్రకారం.. పర్యాటకులు తమ దరఖాస్తులను మునుపటి ప్రక్రియ మాదిరిగానే వీఎఫ్ఎస్ గ్లోబల్ నిర్వహించే వీసా దరఖాస్తు కేంద్రాలకు సమర్పించాలి. అయితే తమ పాస్‌పోర్ట్‌లకు సాంప్రదాయ వీసా స్టిక్కర్‌ను అతికించుకునేందుకు వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. విజయవంతమైన దరఖాస్తుదారులకు నేరుగా వారి ఫోన్‌కే ఎలక్ట్రానిక్ వీసా వస్తుంది. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ ఫోన్లలో "వీసా జారీ నోటీసు"ని చూపించాలి. ఈ దశకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమని గమనించడం ముఖ్యం. డిజిటల్ వీసా జారీ నోటీసు కాకుండా పీడీఎఫ్, ఫోటో, స్క్రీన్‌షాట్ లేదా ప్రింటెడ్ కాపీలను అనుతించరు. 🚨 Japan begins issuing e-visas for Indian tourists, offering a 90 day stay for tourism purposes. 🇯🇵🇮🇳 pic.twitter.com/rhwml8dvF3 — Indian Tech & Infra (@IndianTechGuide) April 3, 2024 -
ఇక అంతా తాలిబన్ల సహకారంతోనే..
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 31లోగా ఉపసంహరిస్తామని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆ తర్వాత బలగాలను ఆ దేశంలో ఉంచే ప్రణాళికేదీ లేదన్నారు. వైట్‌హౌస్‌లో మంగళవారం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ డెడ్‌లైన్‌లోగా బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నామని, అయితే ఇందుకు తాలిబన్ల సహకారం ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్: ప్రస్తుతం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆగస్టు 31 లోగా బలగాలను ఉపసంహరించేలా కార్యక్రమం కొనసాగుతోంది. కానీ ఎంత త్వరగా అమెరికా సైనికులు వెనక్కి వచ్చేస్తే అంత మంచిదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ వారికి ముప్పు పెరుగుతూ ఉంటుంది. తాలిబన్లు తమ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకి కల్పించకుండా, విమానాశ్రయాలోకి అన్నీ అనుమతిస్తే పని తొందరగా అవుతుంద’’ని బైడెన్ అన్నారు. ఆగస్టు 31 తర్వాత అమెరికా బలగాలను అఫ్గనిస్తాన్‌లో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతినివ్వబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. వాళ్ల సహకారంతోనే బలగాల ఉపసంహరణ కొనసాగాలంటూ బైడెన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు గడువు కంటే ముందే బలగాల ఉపసంహరణకు తమ ప్రభుత్వం ఎంతో పట్టుదలగా ఉందని బైడెన్ అన్నారు. లేదంటే ఉగ్రవాద సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్‌లో ఐసిస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్–కె అమెరికా బలగాలను టార్గెట్ చేసిందని వెల్లడించారు. వాళ్లు ఎప్పుడైనా విమానాశ్రయంపై దాడి చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్–కె సంస్థ సామాన్య పౌరులపై ఆత్మాహుతి దాడులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని బైడెన్ పేర్కొన్నారు. తాలిబన్ల పాజిటివ్ రియాక్షన్ ఆగష్టు 31 తర్వాత కమర్షియల్ విమానాల ద్వారా అఫ్గన్ల ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని తాలిబన్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జర్మన్ దౌత్యవేత్త మర్కుస్ పోట్జెల్ ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. తాలిబన్ డిప్యూటీ చీఫ్ షెర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ హామీ ఇచ్చాడని, లీగల్ డాక్యుమెంట్లు ఉన్న అఫ్గన్లకు విదేశాలకు వెళ్లే వెసులుబాటు కల్పించేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నట్లు మర్కుస్ తెలిపారు. ఈ–వీసాలతోనే భారత్‌లోకి అనుమతి న్యూఢిల్లీ: ఇకపై భారత్‌కు విమాన మార్గంలో వచ్చే అఫ్గన్ పౌరులను ఈ–వీసాలతోనే అనుమతిస్తామని బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వచ్చి అఫ్గనీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ఎంబసీలను మూసేశారు. దాంతో ఆన్లైన్లో ఈ–వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ–వీసా ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. సాధారణ వీసాలు పొంది భారత్‌కు చేరుకోని వీసాలు ఇకపై చెల్లుబాటు కావని, ఈ–వీసాలపైనే భారత్‌లోకి అనుమతిస్తామని హోం శాఖ స్పష్టంచేసింది. చదవండి: అఫ్గన్ మునిగిన నావ.. తాలిబన్ల ప్రయాణం!! -
Afghanistan: ఎమర్జెన్సీ వీసాలు జారీ చేసిన కేంద్రం!
తాలిబాన్లు అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ ఉన్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితిల వల్ల భారతదేశంలోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి భారతదేశం కొత్త కేటగిరీ ఈ-వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు కేవలం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో భారతదేశం"ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" అనే కొత్త కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్రింద తెలుసుకోండి. ఈ-వీసా దరఖాస్తు విధానం indianvisaonline.gov.in/evisa/Registration మీద క్లిక్ చేయండి ఇప్పుడు Apply here for e-visa క్లిక్ చేసిన తర్వాత, తప్పకుండా నేషనాలిటీ అఫ్గనిస్తాన్ ఎంచుకోండి. ఆ తర్వాత Passport Type, Port Of Arrival, Date of Birth, Email ID, Expected Date of Arrival వివరాలు సమర్పించండి. ఇప్పుడు వీసా కేటగిరీలో "ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" ఎంచుకోండి. ఆ తర్వాత క్యాప్చా నమోదు చేసి రిఫరెన్స్ కొరకు స్క్రీన్ షాట్ తీసుకోని continue మీద క్లిక్ చేయండి. ప్రాథమిక వివరాలను పూర్తి చేసిన తర్వాత పేజీలో దరఖాస్తుదారుల వివరాల కొరకు ఫారం ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కోసం భారతదేశంలో ఉన్న రిఫరెన్స్ వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా మరియు అఫ్గనిస్తాన్‌లో ఉన్న ఒక రిఫరెన్స్ వ్యక్తి అవసరం అవుతుంది. ఈ వీసాకు దరఖాస్తు ఫీజు లేదు. #India has just started an e-visa for #Afghanistan. URL: https://t.co/L15UzDIsjC Visa category is "Emergency X-Misc Visa" Upon selecting "Afghanistan" in the drop down, the "e-Emergency X-Misc Visa" category checkbox automatically shows pic.twitter.com/NbhvpwAAPl — Rajeshwari (@rajeshwarie) August 17, 2021 ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారి కోసం ఎంఈఏ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఇతర అభ్యర్థనల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ సెల్ ఏర్పాటు చేసి౦ది. ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి హెల్ప్ లైన్ నంబర్-919717785379, ఈ-మెయిల్- MEAHelpdeskIndia@gmail.com ట్విట్టర్ లో ప్రకటించారు. #MEA has set up a Special Afghanistan Cell to coordinate repatriation and other requests from Afghanistan. Pls contact : Phone number: +919717785379 Email: MEAHelpdeskIndia@gmail.com@IndianEmbKabul — Arindam Bagchi (@MEAIndia) August 16, 2021 -
కరోనా ఎఫెక్ట్ : భారత్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : చైనాలో ప్రాణంతక కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే. అలాగే భారత్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్లైన్ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈ-వీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేశాం. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వసాయి’ అని పేర్కొంది. ఒకవేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ వెళ్లాలనుకునేవారు.. బీజింగ్‌లోని భారత ఎంబసీ కార్యాలయాన్ని కానీ లేదా షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్లను గానీ, భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదించవచ్చునని సూచించింది. మరోవైపు కరోనా వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 300 మందికి పైగా మృతిచెందారు. అలాగే 14,562 మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ఇప్పటివరకు 25 దేశాలకు విస్తరించింది. అందులో భారత్ కూడా ఉంది. భారత్‌లో రెండు కరోనా వైరస్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. చదవండి : వుహాన్‌లో చిక్కుకున్న కర్నూలు యువతి -
ఏడు దేశాలు.. ఏడు స్వర్గాలు
వీసా అవసరం లేకుండా ఏడు సర్వాంగ సుందరమైన ఆగ్నేయాసియా దేశాల పర్యటన. ఆహా... నిజంగా వింటుంటేనే ఇప్పుడే విమానం ఎక్కేయాలనిపిస్తోంది కదా! నిజంగా ఈ ఏడు దేశాలు ఏడు స్వర్గాలు.. ఆ మాదిరి అనుభూతిని అందిస్తానంటోంది ఎయిర్ ఏసియా. ఆసియాలోని ఈ ఏడు మహా అద్భుతమైన ప్రాంతాలను చుట్టి రావడానికి డిస్కౌంట్ ధరల్లో టిక్కెట్లను అందిస్తోంది ఎయిర్ఏసియా. చక్కని చలికాలంలో మధురమైన టూర్‌ను ఆహ్వానించడానికి, బ్యాగులన్నీ సర్దేసుకుని ఆసియా టూర్‌కు వెళ్లిరండి. ఈ సందర్భంగా మీకోసం అందిస్తున్న టూర్ వివరాలు... మలేషియా.. ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు, ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం మెనరా టవర్స్, మలేషియా రాజుల ప్యాలెస్, బటు గుహలు, బీచ్‌లు, ద్వీపకల్పాలు ఈ దేశ ప్రత్యేకతలు. రాజధానిగా ఉన్న కౌలాలంపూర్‌కు ఆగ్నేయాసియా ప్రాంతాల్లో విశిష్ట స్థానముంది. ఎంతో అద్భుతమైన, విభిన్న దేశంగా మలేషియాకు ఎంతో పేరుంది. ప్రతి ఒక్కరికీ ఈ దేశం ఆతిథ్యమిస్తోంది. సౌకర్యవంతమైన జోన్లో మీరు నివసించాలనుకుంటే, బెస్ట్ ప్లేస్‌గా మలేషియానే చెప్పుకోవచ్చు. మనోహరమైన చరిత్ర, సంస్కృతికి ఇది ప్రతీక. వివిధ రకాలైన రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు మలేషియా. సింగపూర్... మరో విలక్షణమైన దేశం సింగపూర్. చక్కటి పర్యాటక కేంద్రం అయిన ఈ దేశంలో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. పర్యాటకంగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశం సింగపూర్. ఆకాశాన్నంటే భవంతులు, మాల్స్, జంతు ప్రదర్శనశాల, భూగర్భంలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్, రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నోరూరించే వంటకాలు, లగ్జరీ హోటల్స్, పురాతన నిర్మాణాలు కూడా ఇక్కడ ప్రత్యేకతే. సింగపూర్‌నే లయన్ సిటీ, ది రెడ్ పోర్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఆగ్నేయాసియాలో దేశాల్లో కల్లా అత్యంత పాపులర్, ఖరీదైన టూరిస్ట్ ప్లేస్ గార్డెన్ సిటీ ఇక్కడే ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ-వీసా సర్వీసుతో ఈ అపూర్వమైన ప్రాంతాలను చుట్టి వచ్చేయండి. థాయ్‌లాండ్... థాయ్ శోభ గురించి ఎవరికి తెలియదు చెప్పండి? బీచ్ రిసార్టులు, అమేజింగ్ ఫుడ్, బడ్జెట్లో ధరలతోనే థాయ్‌లాండ్ ఆగ్నేయాసియా దేశాల్లో ట్రావెల్ హబ్‌గా నిలుస్తోంది. ప్రతి రిసార్ట్, హోటల్ కూడా పర్యాటకుల వినోదాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ఒక్కసారి థాయ్‌లాండ్‌ను సందర్శిస్తే, ఇక జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. కంబోడియా... అద్భుతం, ఆశ్చర్యం కలగలుపుగా ఉండేదే కంబోడియా. ఈ దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కర్నీ ఇది ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ప్రాచీన, ఆధునిక ప్రపంచాల సమ్మేళనంగా ఉంటుంది. దీంతోనే కంబోడియా ప్రారంభమైంది. సంప్రదాయంగా, భాషాపరంగా వైవిధ్యం కొనసాగుతున్న ప్రపంచదేశాలలో కంబోడియా ఒకటి. ఎంతో బాధాకరమైన చరిత్రను ఈ దేశం కలిగి ఉన్నప్పటికీ, తన ప్రజలతో ఇది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. అతిథులకు మాత్రం ఈ దేశం ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన మనోహరమైన ప్రదేశంగానే నిలుస్తోంది. లావోస్... ఆగ్నేయాసియా దేశాల్లో మరో ప్రత్యేకమైన ప్రదేశం లావోస్. దీన్ని గురించి చెప్పుకోకుండా ఎలా మర్చిపోతాం. పర్యాటకులు తరుచు థాయ్‌లాండ్‌ను సందర్శించకపోయినప్పటికీ, లావోస్ సందర్శిస్తే చాలు ఆ మధురానుభవాన్ని అందించగలదు. ప్రత్యేకమైన బీచ్‌లు, వన్యప్రాణులతో ఎల్లప్పుడూ అలరించే అరణ్యాలు లావోస్ స్పెషల్. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది చాలా చిన్నది, కానీ మహా అద్భుతమైన ప్రదేశం. పర్వతాలు, నదులు, వాటర్‌ఫాల్స్, గుహలు ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఎంతో రమ్యమైన ప్రదేశం లావోసే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మనోహరమైన ప్రదేశాన్ని తిలకించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఎయిర్ఏసియాలో పర్యటించడానికి సిద్ధం అవండి. హాంకాంగ్.... ఆహారం, షాపింగ్, సంప్రదాయాల పరంగా తూర్పు, పడమర సంస్కృతుల కలయికనే హాంకాంగ్. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలంలో పశ్చిమ దేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో ప్రతి మూలన వినోదం దొరుకుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో ద్వీపకల్పాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఫుడ్‌కు ఈ సిటీ ఎంతో ప్రాచుర్యం. హాంకాంగ్‌కి మీ జర్నీ ఎంతో సౌకర్యవంతంగా ఉండటానికి ఈ-రిజిస్ట్రేషన్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. ఇండోనేషియా... వైవిధ్యతే ఇండోనేషియాకు మూలం. చల్లని తెల్లని ఇసుక నుంచి బాలి అగ్నిపర్వతాల వరకు విభిన్నకరమైన వాతావరణ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండోనేషియాలో జాకర్త ఎంతో శక్తివంతమైన అందమైన నగరం. ఈ దేశంలో ప్రతి ప్రదేశం ఓ ప్రత్యేకమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. ఆగ్నేసియాలో 17వేలకు పైగా ద్వీపకల్పాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరణ్యాలు, బీచ్‌లు, గుహలు, అగ్నిపర్వతాలు అన్నీ కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. -
విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు. తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది. 24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది. -
మెడికల్ టూరిస్టులకు త్వరలో ఈ-వీసా!
న్యూఢిల్లీ: విదేశీయులు భారత్‌లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం సులభతరం కానున్నది. కేంద్ర ప్రభుత్వం భారత్‌కు వైద్య చికిత్సల కోసం వచ్చే పర్యాటకుల కోసం త్వరలో ఈ-వీసాలను జారీ చేయనున్నది. దేశంలో మెడికల్ టూరిజం మార్కెట్ 3 బిలియన్ డాలర్లు ఉంటుందని అం చనా. ఇది 2020 నాటికి 7-8 బిలియన్ డాలర్లకి చేరే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ-వీసాల జారీ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌కు వైద్యం కోసం వచ్చే విదేశీయులకు త్వరలో ఈ-వీసాల జారీ ఉంటుందని హోం శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. విదేశాల నుంచి వైద్యం కోసం ఇండియాకు వచ్చిన వారు 2012, 2013, 2014లో వరుసగా 1.71 లక్షలు, 2.36 లక్షలు, 1.84 లక్షలుగా ఉంది. -
ఈ-వీసాతో వస్తే సిమ్ కార్డు కానుక
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యటనకు ఈ-టూరిస్ట్ వీసాతో వచ్చే విదేశీయులకు మొబైల్ సిమ్ కార్డులు కానుకగా ఇవ్వాలన్న పర్యాటకశాఖ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ-వీసాతో వచ్చే విదేశీ పర్యాటకులకు సిమ్ కార్డు, దేశంలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన మ్యాపు, సీడీలతో గిఫ్ట్ కిట్‌ను అందించాలని ప్రతిపాదించింది. -
చైనా పర్యాటకులకు ఈ-వీసా
చైనా నుంచి భారతదేశానికి వచ్చే పర్యాటకులకు ఈ-వీసాలు మంజూరు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విషయంపై నిఘావర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైనా ఆయన లెక్కచేయలేదు. భారతదేశం నుంచి ఈ-వీసాలు పొందే సదుపాయం ఇప్పటికి 76 దేశాలకు ఉండగా, చైనా 77వ దేశం కానుంది. 2014 సంవత్సరంలో ఈ అవకాశం కేవలం 11 దేశాలకు మాత్రమే ఉండేది. మోదీ ప్రధాని అయిన తర్వాత పలు దేశాలకు దీన్ని విస్తరించారు. సింఘువా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయనీ ప్రకటన చేశారు. అయితే.. వీసాలు ఇచ్చే విషయంలో తగిన తనిఖీలు తప్పనిసరిగా ఉంటాయని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వీసాలు ఇప్పించే విషయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించడానికే ఇలా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి చైనా లాంటి కొన్ని దేశాలకు ఈ-వీసాలు మంజూరుచేయడంపై నిఘా వర్గాలు గత కొంత కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ గూఢచారులు కూడా వీటిద్వారా వచ్చే ప్రమాదం ఉందన్నది వీళ్ల అనుమానం. -
43 దేశాల వారికి భారత్ ఈ-వీసాలు
న్యూఢిల్లీ: 43 దేశాల వారికి భారత్ ఈ-వీసాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అమెరికా, ఇజ్రాయిల్, జర్మనీ తదితర దేశాల వారితో పాటు మొత్తం 43 దేశాల పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసాలిచ్చే ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ ప్రారంభించారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టూరిస్ట్ ఆపరేటర్లు చెబుతున్నారు. మూడు నుంచి ఐదు రోజుల్లోనే ఈ-వీసా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రాల్లో వీటిని జారీ చేస్తారు. ** -
విదేశీ సందర్శకులకు వీసాలు సులభతరం!
న్యూఢిల్లీ: విదేశీ సందర్శకులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రానిక్ వీసా (ఈ-వీసా) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్, పాలస్తీనా సహా 43 దేశాల నుంచి వచ్చే వారికి ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ శర్మతో కలసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 27న ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, గోవాలలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ-వీసా పొందాలనుకునే వారు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 96 గంటల వ్యవధిలో వారికి ఈ-వీసాను జారీ చేస్తారు. రష్యా, బ్రెజిల్, జర్మనీ, థాయ్‌లాండ్, యూఏఈ, ఉక్రెయిన్, జోర్డాన్, నార్వే, మారిషస్‌తోపాటు మరికొన్ని దేశాలకు తొలి దశలో ఈ-వీసా సదుపాయాన్ని కల్పించనున్నామని పర్యాటకశాఖ అధికారి ఒకరు తెలిపారు. మెక్సికో, కెన్యా, ఫిజీలకు కూడా దీన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్, సూడాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, నైజీరియా, శ్రీలంక, సొమాలియా వంటి దేశాలు మినహా ఇతర దేశాలన్నింటినీ దశల వారీగా రెండేళ్లలో ఈ-వీసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దక్షిణ కొరియా, జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, ఇండోనేసియా, మయన్మార్, వియత్నాం, లావోస్ వంటి 13 దేశాల నుంచి వచ్చే వారికి 'వీసా-ఆన్-ఎరైవల్' సదుపాయం అందుబాటులో ఉంది. ఈ-వీసాల జారీ విధానం వల్ల దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అలవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ దేశాన్ని 51.79 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. ప్రభుత్వ నిర్ణయంపై అఖిల భారత టూర్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాలకు ఈ-వీసాల విధానాన్ని ప్రవేశపెట్టడం పర్యాటక రంగానికి ఊతమిస్తుందన్నారు. **