భారతీయులకు థాయిలాండ్ ఆఫర్
న్యూఢిల్లీ: భారతీయ పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసాలేకున్నా థాయిలాండ్‌లో గరిష్టంగా 60 రోజులపాటు ఉండేందుకు అనుమతి మంజూరుచేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్‌ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది.
ఇందుకోసం 2025 జనవరి ఒకటో తేదీ నుంచి భారత్‌లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)(ఈ–వీసా) విధానం అమల్లోకి తెస్తామని పేర్కొంది. థాయిలాండ్‌యేతర జాతీయులు https:// www. thaievisa. go. th వెబ్‌సైట్‌లో సంబంధిత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని థాయిలాండ్ ఎంబసీ బుధవారం ప్రకటించింది. ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది.
ఈ విషయంలో ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహయసహకారాలు అందుతాయని వెల్లడించింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైనా వీసా దరఖాస్తు ఫీజు అనేది తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ–వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దౌత్య, అధికారిక వీసా కోసం డిసెంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈటీఏలో పలు ప్రయోజనాలున్నాయి. ఒకసారి ఈ–వీసా తీసుకుంటే గరిష్టంగా 60 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. అత్యయిక, అవసరమైన సందర్భాల్లో సందర్శకులు మరో 30 రోజులు అక్కడే ఉండొచ్చు. ఈటీఏ అనుమతులు సాధించిన ప్రయాణికులు చెక్‌పాయిట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీ తదితర సోదా తంతు అత్యంత వేగంగా పూర్తవుతుంది.
ఈటీఏపై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు పూర్తి వివరాలు అక్కడే అధికారులకు త్వరగా అందుబాటులోకి వచ్చి ప్రయాణికుడికీ సమయం చాలా కలసి వస్తుంది. వీసా మినహాయింపు పొందిన విదేశీయులు తమ దేశంలో ఎన్నాళ్ల నుంచి సక్రమంగా, అక్రమంగా ఉంటున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు థాయ్ ప్రభుత్వానికి అందుతాయి. గడువు దాటి అక్కడే ఉంటే రోజుల లెక్కన జరిమానా విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment