చైనా పర్యాటకులకు ఈ-వీసా
చైనా నుంచి భారతదేశానికి వచ్చే పర్యాటకులకు ఈ-వీసాలు మంజూరు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విషయంపై నిఘావర్గాల నుంచి ఆందోళన వ్యక్తమైనా ఆయన లెక్కచేయలేదు. భారతదేశం నుంచి ఈ-వీసాలు పొందే సదుపాయం ఇప్పటికి 76 దేశాలకు ఉండగా, చైనా 77వ దేశం కానుంది. 2014 సంవత్సరంలో ఈ అవకాశం కేవలం 11 దేశాలకు మాత్రమే ఉండేది. మోదీ ప్రధాని అయిన తర్వాత పలు దేశాలకు దీన్ని విస్తరించారు.
సింఘువా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయనీ ప్రకటన చేశారు. అయితే.. వీసాలు ఇచ్చే విషయంలో తగిన తనిఖీలు తప్పనిసరిగా ఉంటాయని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వీసాలు ఇప్పించే విషయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించడానికే ఇలా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి చైనా లాంటి కొన్ని దేశాలకు ఈ-వీసాలు మంజూరుచేయడంపై నిఘా వర్గాలు గత కొంత కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విదేశీ గూఢచారులు కూడా వీటిద్వారా వచ్చే ప్రమాదం ఉందన్నది వీళ్ల అనుమానం.