
జపాన్‌ను సందర్శించాలనుకునే భారతీయులు ఇకపై తమ పాస్‌పోర్ట్‌లపై భౌతిక వీసా స్టిక్కర్లను పొందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుండి, జపాన్ భారతీయ పర్యాటకుల కోసం ఈ-వీసాల జారీని ప్రారంభించింది. పర్యాటకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ జపాన్ ఈ-వీసా ప్రోగ్రామ్.. వీఎఫ్‌ఎస్ గ్లోబల్ ద్వారా నిర్వహిస్తున్న జపాన్ వీసా దరఖాస్తు కేంద్రాల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఈ వీసా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పర్యాటక ప్రయోజనాల కోసం సింగిల్-ఎంట్రీ స్వల్పకాలిక వీసాను అందిస్తుంది. జపాన్‌లో గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులు ఈ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు
కొత్త విధానం ప్రకారం.. పర్యాటకులు తమ దరఖాస్తులను మునుపటి ప్రక్రియ మాదిరిగానే వీఎఫ్‌ఎస్ గ్లోబల్ నిర్వహించే వీసా దరఖాస్తు కేంద్రాలకు సమర్పించాలి. అయితే తమ పాస్‌పోర్ట్‌లకు సాంప్రదాయ వీసా స్టిక్కర్‌ను అతికించుకునేందుకు వీసా కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. విజయవంతమైన దరఖాస్తుదారులకు నేరుగా వారి ఫోన్‌కే ఎలక్ట్రానిక్ వీసా వస్తుంది.
ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ ఫోన్‌లలో "వీసా జారీ నోటీసు"ని చూపించాలి. ఈ దశకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమని గమనించడం ముఖ్యం. డిజిటల్ వీసా జారీ నోటీసు కాకుండా పీడీఎఫ్, ఫోటో, స్క్రీన్‌షాట్ లేదా ప్రింటెడ్ కాపీలను అనుతించరు.
🚨 Japan begins issuing e-visas for Indian tourists, offering a 90 day stay for tourism purposes. 🇯🇵🇮🇳 pic.twitter.com/rhwml8dvF3
— Indian Tech & Infra (@IndianTechGuide) April 3, 2024