చాట్జీపీటీ! టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీనిపేరే వినబడుతుంది. అంతకు మించి జాబ్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకోవడంతో.. అత్యంత కీలక రంగమైన టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలన్నీ చాట్‌జీపీటీని వినియోగిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో చాట్జీపీటీ పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే, ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనను పక్కన పెట్టేసి..దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటుంది ఓ యువతి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే?
అకుటగావా అవార్డు ప్రధానం
జపాన్‌కు చెందిన రీ కుడాన్ 33 ఏళ్ల సాహితి వేత్త (Literary scholar). ఇటీవల ఆమె సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన జపాన్ సాహిత్య పురస్కారం ‘అకుటగావా’ అవార్డును సొంతం చేసుకున్నారు. అకుటగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరిచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రధానం చేస్తుంది. తాజాగా, అకుటగావాను టోక్యో-టు డోజో-టు (టోక్యో సానుభూతి టవర్) పేరుతో నవల రాసిన రచయిత్రి కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.
చాట్‌జీపీటీతో అద్భుతాలు
ఈ నేపథ్యంలో కుడాన్ తాను రాసిన నవలకు అవార్డును సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఏఐ టూల్ చాట్ జీపీటీతో ఇది సాధ్యమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాట్‌జీపీటీ ఉపయోగించి రాసిన నవల. ఇందులో మొత్తం 5 శాతం మాత్రమే నేరుగా రాసింది. వర్క్ ప్రొడక్టివిటీ విషయంలో, నాలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు చాట్‌జీపీటీని మరింతగా వినియోగించాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రశంసలు.. విమర్శలు
కుడాన్ నవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఏఐని ఉపయోగించి తాను ఈ నవల రాసినట్లు బహిర్గతం చేయడం వివాదాస్పదంగా మారింది. సాహిత్యంతో పాటు ఇతర అత్యున్నత పురస్కాల కోసం ఏఐని ఉపయోగించేందుకు రచయితలు పోటీపడతారేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పుడు జపాన్ రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీని ఉపయోగించే రాసే రచనలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ అంశంపై జపాన్ ప్రభుత్వంతో పాటు కుడాన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment