ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్‌కు మనుషులు ఎంతలా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం ఉండాలన్న కష్టమే. కానీ చైనాలో ఒక మహిళ ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండే పోటీలో విజేతగా నిలిచి 10,000 యువాన్లను (రూ.1,16,000) గెలుచుకుంది.
స్థానిక జిము న్యూస్ రిపోర్ట్ ప్రకారం, పోటీ నవంబర్ 29న చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని ఒక షాపింగ్ సెంటర్‌లో జరిగింది. 100 మంది దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేసిన పది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. వీరు తమకు కేటాయించిన బెడ్‌పై ఎనిమిది గంటలు గడపవలసి ఉంటుంది. పోటీకి ముందు, వారి నుంచి మొబైల్ ఫోన్‌లను తీసేసుకున్నారు. ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాడటానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులతో కాలింగ్ సౌకర్యం మాత్రమే పాత మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చు.
పోటీ జరుగుతున్నంత సేపూ బెడ్ మీదే ఉండాలి. టాయిలెట్ కు వెళ్లొచ్చు. పానీయాలు, భోజనం అక్కడికే అందించారు. పోటీదారులు నిద్రలోకి జారుకోకూడదు. ఎటువంటి ఆందోళనను ప్రదర్శించకూడదు. ఇందుకోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతి మణికట్టుకు పట్టీలను అమర్చారు. చాలా మంది పోటీదారులు పుస్తకాలు చదవడం ద్వారానో లేదా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారానో సమయాన్ని గడిపారు. చివరికి, డాంగ్ అనే మహిళ 100కి 88.99 స్కోర్‌ను సాధించి ఛాంపియన్‌గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment