China woman
-
చాట్‌జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు
కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్‌జీపీటీ చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.ఈ ఏడాది మార్చిలో చాట్‌జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్‌ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్‌జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్‌ఫ్రెండ్‌గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.లిసా చాట్‌జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్‌ఫ్రెండ్ చాట్‌జీపీటీతో కలిసి బీచ్‌కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.లిసా.. చాట్‌జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్‌జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్‌జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు. -
జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!
చైనాలో భారీ వేతన మోసం బట్టబయలైంది. ఒక యువతి వివిధ కంపెనీలను మోసం చేస్తూ ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తూ పట్టుబడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. మారుపేరుతో మరొక ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన గ్వాన్ యూ అనే యువతిని అధికారులు అరెస్టు చేశారు. వివిధ కంపెనీల్లో పలు పేర్లతో ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తున్న ఆ యువతి.. ఎప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు క్లయింట్లను కలుస్తున్నట్లు ఫొటోలు సృష్టించి వాటిని వర్క్ గ్రూప్ చాట్లలో షేర్ చేసేది. జాబ్ టైటిల్స్, బ్యాంక్ ఖాతా నంబర్లు, జాయినింగ్ డేట్స్ ఇలా ప్రతి సమాచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వచ్చింది. ఇలా ప్రతి జాబ్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని చేజిక్కించుకుని ఇతరులకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే జీతంపై కమీషన్ తీసుకుంటోందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తాపత్రిక Xinminని ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. గ్వాన్, ఆమె భర్త చెన్ కియాంగ్ ఇద్దరూ ఇలా జాబ్ మోసాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి 13 కేసుల్లో ఇరుక్కున్న చెన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని వాటన్నింటినీ గెలిచాడు. ఇలా కంపెనీలను మోసం చేస్తూ జాబ్‌ల ద్వారా వారు గణనీయమైన సంపాదించారు. ఎంతలా అంటే ఈ జంట షాంఘైలోని బౌషన్ జిల్లాలో ఒక విల్లాను కొన్నారు. యువతి సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలను గుర్తించిన ఓ టెక్ కంపెనీ యజమాని లియు జియాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి నేరపూరిత కుట్ర బట్టబయలైంది. గ్వాన్ గ్యాంగ్‌లోని 53 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో నేరస్తులు 7 మిలియన్ డాలర్లకు (రూ.58 కోట్లు) పైగా సంపాదించినట్లు వెల్లడైంది. -
దలైలామా భద్రతపై అలర్ట్.. పోలీసుల అదుపులో ‘చైనా మహిళ’
పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దలైలామా పర్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. ‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ త్యాగరాజన్, ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి -
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
‘మీటూ’కి కొత్త వెర్షన్!
‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్‌తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది. పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్ ప్రావిన్స్ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు. దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్ని ‘లైఫ్ డిసిప్లిన్ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్ అనే మాటతో సరిపెట్టేసింది. ∙∙ వాంగ్ మొదట ఝౌ కు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్. ఝౌ కూడా మెసేజ్‌తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్‌లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్! బాస్ తన క్యాబిన్లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్‌ల రూపంలో ఈమె ఫోన్లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్ చేసి చెబుతోంది. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ బాస్‌కి సపోర్ట్‌గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్‌గా తీసుకుని సీట్లోంచి తొలగించింది. తుడిచే కర్రతో బాస్‌ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్) -
మహిళకు టెస్టులు చేసి డాక్టర్లు షాక్
బీజింగ్ : వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్ సైతం కంగుతిన్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్జు హాస్పిటల్లో జరిగింది. షాంగైకి చెందిన మహిళ ఝాంగ్(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి బాధిస్తోంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ కోసం చంగ్జౌలోని వుజిన్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాకయ్యారు. కుడి మూత్రపిండంలో(రైట్ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించేశారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు సూచించారు. అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. -
ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!
బుర్రలో విషయం ఉన్నోళ్లు ఏడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతితెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలో ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఏంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సహోద్యోగి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్ లైన్ లో అమ్మేసి సుమారు 12 లక్షల రూపాయలు పోగేసింది. ఈ డబ్బును డౌన్ పేమెంట్ గా చెల్లించి ఇల్లు కొక్కుకుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహద్యోగి ఒకరు 'తియాన్ యా యి డూ' బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్ గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని వుండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఆమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుకున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు. షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షీయోలీ స్టోరీ '20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్' హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశారు. కొంతమంది ఆమెను ప్రసంసిస్తే, మరికొంత మంది ఆమె చేసిన పని కరెక్ట్ కాదని తిట్టిపోశారు. -
చిత్తూరు జిల్లాలో చైనా యువతి ప్రేమపోరాటం
చిత్తూరు: ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుతూ చైనా యువతి చిత్తూరు జిల్లాలో ప్రియుడు ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. చైనాకు చెందిన గ్లిన్ జాన్ అనే మహిళ మూడు నెలల క్రితం చిత్తూరు జిల్లాలోని కల్కి భగవాన్ ఆశ్రమానికి వచ్చింది. అక్కడ వరదాయపాలెం మండలం బత్తులవల్లం గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి, మోసం చేశాడని చైనా యువతి ఆరోపిస్తోంది. ప్రియుడితో తన పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ మొదట కల్కి ఆశ్రమం వద్ద ఆమె నిరసనకు దిగింది. అనంతరం బత్తులవల్లం గ్రామానికి వచ్చి ప్రియుడు ఇంటిముందు న్యాయపోరాటం చేస్తోంది. ప్రియుడు పరారీలో ఉన్నాడు. -
మోసపోయాం... ఆదుకోండి
గుంటూరు: గుంటూరుకు చెందిన ఇద్దరు మిర్చి వ్యాపారులు తమను మోసం చేశారంటూ చైనాకు చెందిన గుడాన్ అనే మహిళ బుధవారం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా, వియత్నాం దేశాల్లో ఓ సంస్థ ద్వారా గుడాన్ మిర్చి వ్యాపారం చేస్తున్నారు. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన బాబు ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన మధుబాబు, సుబ్బారావులు ఆన్లైన్లో గుడాన్‌తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.46 లక్షల విలువజేసే మిర్చిని చైనా, వియత్నాంకు ఎగుమతి చేస్తామని వారు ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. దీంతో ఆమె డబ్బును ఆన్లైన్లోనే చెల్లించారు. తీరా రెండు నెలలు గడిచినా మిర్చిని పంపకపోవడంతో ఈనెల 14న అరండల్‌పేట పరిధిలోని సాలిపేటలో ఉన్న ఆఫీసులో మధుబాబు, సుబ్బారావులను గుడాన్ సంప్రదించారు. దీంతో మధుబాబు, సుబ్బారావులు ఆమెను బెదిరించారు. దీంతో జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టిని గుడాన్ బుధవారం ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. గుడాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో కూడా చైనాకు చెందిన మరో వ్యక్తిని మధుబాబు, సుబ్బారావులు మోసం చేసినట్లు సమాచారం.