చైనాలో భారీ వేతన మోసం బట్టబయలైంది. ఒక యువతి వివిధ కంపెనీలను మోసం చేస్తూ ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తూ పట్టుబడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. మారుపేరుతో మరొక ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన గ్వాన్ యూ అనే యువతిని అధికారులు అరెస్టు చేశారు.
వివిధ కంపెనీల్లో పలు పేర్లతో ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తున్న ఆ యువతి.. ఎప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు క్లయింట్లను కలుస్తున్నట్లు ఫొటోలు సృష్టించి వాటిని వర్క్ గ్రూప్ చాట్‌లలో షేర్ చేసేది. జాబ్ టైటిల్స్, బ్యాంక్ ఖాతా నంబర్‌లు, జాయినింగ్ డేట్స్ ఇలా ప్రతి సమాచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వచ్చింది.
ఇలా ప్రతి జాబ్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని చేజిక్కించుకుని ఇతరులకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే జీతంపై కమీషన్ తీసుకుంటోందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తాపత్రిక Xinminని ఉటంకిస్తూ బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది.
గ్వాన్, ఆమె భర్త చెన్ కియాంగ్ ఇద్దరూ ఇలా జాబ్ మోసాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి 13 కేసుల్లో ఇరుక్కున్న చెన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని వాటన్నింటినీ గెలిచాడు. ఇలా కంపెనీలను మోసం చేస్తూ జాబ్‌ల ద్వారా వారు గణనీయమైన సంపాదించారు. ఎంతలా అంటే ఈ జంట షాంఘైలోని బౌషన్ జిల్లాలో ఒక విల్లాను కొన్నారు.
యువతి సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలను గుర్తించిన ఓ టెక్ కంపెనీ యజమాని లియు జియాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి నేరపూరిత కుట్ర బట్టబయలైంది. గ్వాన్ గ్యాంగ్‌లోని 53 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో నేరస్తులు 7 మిలియన్ డాలర్లకు (రూ.58 కోట్లు) పైగా సంపాదించినట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment