Job Interview
-
జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!
చైనాలో భారీ వేతన మోసం బట్టబయలైంది. ఒక యువతి వివిధ కంపెనీలను మోసం చేస్తూ ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తూ పట్టుబడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. మారుపేరుతో మరొక ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన గ్వాన్ యూ అనే యువతిని అధికారులు అరెస్టు చేశారు. వివిధ కంపెనీల్లో పలు పేర్లతో ఏకకాలంలో 16 ఉద్యోగాలు చేస్తున్న ఆ యువతి.. ఎప్పుడూ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆయా కంపెనీల యాజమాన్యాలను నమ్మించేందుకు ఎప్పటికప్పుడు క్లయింట్లను కలుస్తున్నట్లు ఫొటోలు సృష్టించి వాటిని వర్క్ గ్రూప్ చాట్లలో షేర్ చేసేది. జాబ్ టైటిల్స్, బ్యాంక్ ఖాతా నంబర్లు, జాయినింగ్ డేట్స్ ఇలా ప్రతి సమాచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వచ్చింది. ఇలా ప్రతి జాబ్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని చేజిక్కించుకుని ఇతరులకు ఇచ్చి వాటి ద్వారా వచ్చే జీతంపై కమీషన్ తీసుకుంటోందని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తాపత్రిక Xinminని ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. గ్వాన్, ఆమె భర్త చెన్ కియాంగ్ ఇద్దరూ ఇలా జాబ్ మోసాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి 13 కేసుల్లో ఇరుక్కున్న చెన్ చట్టాల్లో లొసుగులను వాడుకుని వాటన్నింటినీ గెలిచాడు. ఇలా కంపెనీలను మోసం చేస్తూ జాబ్‌ల ద్వారా వారు గణనీయమైన సంపాదించారు. ఎంతలా అంటే ఈ జంట షాంఘైలోని బౌషన్ జిల్లాలో ఒక విల్లాను కొన్నారు. యువతి సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలను గుర్తించిన ఓ టెక్ కంపెనీ యజమాని లియు జియాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి నేరపూరిత కుట్ర బట్టబయలైంది. గ్వాన్ గ్యాంగ్‌లోని 53 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో నేరస్తులు 7 మిలియన్ డాలర్లకు (రూ.58 కోట్లు) పైగా సంపాదించినట్లు వెల్లడైంది. -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
అన్ని రాష్ట్రాల్లో మోడల్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. గోవాలో గురు, శుక్రవారాల్లో జరిగిన కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సును ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభించారు. గత ఏడాది కమిటీ చేపట్టిన కార్యక్రమాలను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. అనంతరం వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్లలో అమలు చేస్తున్న విధానాలు, సమస్యలు, కొత్త చర్యలపై చర్చించారు. అన్ని పీఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండోసారి చక్రపాణి ఎన్నిక: యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు ఆయన కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం. చక్రపాణి మాట్లాడుతూ అందరి నమ్మకాన్ని కాపాడుతూ కమిటీ మరింత బాగా పనిచేసేలా కృషి చేస్తానని అన్నారు. యూపీఎస్సీ చైర్మన్ సహా అన్ని రాష్ట్రాల చైర్మన్లకు గురువారం రాత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ విందు ఇచ్చారు. -
టెకీలకు గుడ్ న్యూస్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
-
టెకీలకు గుడ్‌న్యూస్..న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
వెల్లింగ్టన్: ఐటీ నిపుణులను ఆకర్షించేందుకు న్యూ జిలాండ్ ఓ వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెకీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా తన టెక్ హబ్‌కు బూస్ట్ ఇచ్చేలా భలే ప్రచారానికి తెరతీసింది. ప్రపంచంలో ఎక్కడైనా నుండి న్యూజిలాండ్‌కు ఉచిత ట్రిప్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ వేదికగా ’లుక్ సీ’ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది.ఇందులో భాగంగా సుమారు 100మంది టెక్ నిపుణులను ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. ఇలావచ్చే వారికి ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేనా.. అక్కడ సైట్ సీయింగ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. 2017, మే 8 -11మధ్య ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. టెక్ ఇన్నోవేషన్ పరిశ్రమకోసం ఎవరైనా కాదు...తమకు మరింతమంది ఉత్తమ నిపుణులు అవసరమని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు.అయితే ఈ పథకం ద్వారా ముందుగా టెకీలు రిజస్టర్ చేసుకొని, సీవీని అప్లోడ్ చేయాలని. దీన్ని పరిశీలించిన అనతరం వీడియో ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో పాల్గొన్న ఆయా సంస్థల యజమానులు (ఎంప్లాయిర్) అభ్యర్థుల ప్రొఫైల్ వీక్షించడానికి వీలుగా ఉండాలి. తద్వారా వారు నేరుగా సంప్రదించి ఒక అంచనాకు వస్తారు. ఇలా యజమానులు తమకు నచ్చిన వారిని 'నామినేట్' చేస్తారు. ఇలా ఎక్కువ లైకులు, నామినేషన్లతో 100మందిలో చోటు సంపాదించుకున్నవారు వెల్లింగ్టన్ ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ఆహ్వానం గెలుచుకుంటారు. అయితే ఉద్యోగుల నియామకం ఆయా యజమానుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
పైసా ఖర్చు లేకుండా ఆ దేశానికి ప్రయాణం
అమెరికాలో విదేశీయులకు ఆంక్షలు పెరిగిపోతున్న నేపథ్యంలో మిగతా దేశాల్లో నిబంధనలు సరళతరమవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇక న్యూజిలాండ్ కు ఉచితంగా ప్రయాణించవచ్చట. ఉచితంగా విమానంలో ప్రయాణించడం దగ్గర్నుంచి... అక్కడ ఫ్రీగా ఉండటం వరకు న్యూజిలాండ్ ఆఫర్ చేస్తోంది. న్యూజిలాండ్ రాజధాని నగరం వెల్లింగ్టన్ 100 టెక్ వర్కర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది. తమ టెక్ హబ్ ను పెంచుకునే నేపథ్యంలో జాబ్ ఇంటర్వ్యూకు వచ్చిన వారికి ఈ ఆఫర్ ను అందించబోతున్నట్టు ప్రకటించింది. లుక్సీ పేరుతో వెల్లింగ్టన్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. 2017 మే 8 నుంచి మే 11 వరకు నాలుగు రోజుల పాటు జాబ్ ఇంటర్వ్యూలకు, టెక్ లీడర్లలతో మీట్-అప్స్ కు ఈ అరెంజ్మెంట్స్ చేస్తోంది. తమ టెక్ ఆవిష్కరణలు సదూర ప్రదేశాలకు ప్రయాణించాలని తాము భావిస్తున్నాం.. అందుకు అనుగుణంగా తమకు ఎక్కువమంది ప్రతిభావంతులైన ప్రజలు కావాలని వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ చెప్పారు. వెల్లింగ్టన్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాలనుకునే వారు మొదట తమ అభ్యర్థిత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని, తమ సీవీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వీడియో ఇంటర్వ్యూకు అభ్యర్థులను వెల్లింగ్టన్ ఆహ్వానిస్తోంది. అనంతరం ఎంప్లాయిర్స్ అభ్యర్థులను నామినేట్ చేస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రక్రియలో అందుబాటులో ఉన్న వంద స్పాట్స్ లో అవకాశం దక్కించుకుని ఈ ఆఫర్ ను పొందవలసి ఉంటుంది. అనంతరం వెల్లింగ్టన్ లో జాబ్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. -
ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!
జాబ్ ఇంటర్వ్యూ అనగానే అభ్యర్థుల్లో ఏదో తెలియని బెరుకు మొదలవుతుంది. అదో భయపెట్టే భూతంలాగా భావిస్తుంటారు. కానీ, ముందుగా సన్నద్ధమై, ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం సులభమే. ఇంటర్వ్యూలో ఉభయపక్షాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పరీక్ష మీకే కాదు కంపెనీకీ కూడా అవసరమే. మీకు ఉద్యోగం కావాలి, సంస్థకు మంచి ఉద్యోగి కావాలి. కాబట్టి మీరు భయపడడం అన వసరం. ముందస్తు సన్నద్ధత, ఆత్మవిశ్వాసం.. ఈ రెండింటితో ఎలాంటి ఇంటర్వ్యూలోనైనా జయకేతనం ఎగరేయొచ్చు. కామన్ ప్రశ్నలు: ఇంటర్వ్యూలో అడగబోయే అన్ని ప్రశ్నలను ఎవరూ ఊహించలేరు. కానీ, సాధారణంగా అన్ని మౌఖిక పరీక్షల్లో అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధా నాలను సిద్ధం చేసుకుంటే యుద్ధంలో సగం గెలుపు ఖాయమైనట్లే. తెలిసిన విషయాలను ఇంటర్వ్యూ లో పూర్తిఆత్మవిశ్వాసంతో చెబితే సానుకూలమైన ఫలితం కచ్చితంగా ఉంటుంది. కరిక్యులమ్ విటే (సీవీ)లో రాసిన అన్ని అంశాలపై మీకు పట్టు ఉండాలి. సీవీని ఎక్కువసార్లు చదువుకోవాలి. అందులో ప్రస్తావించిన అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలను సంధిస్తారు. విద్యాభ్యాసం, పాత యాజ మాన్యం గురించి అడుగుతారు. సీవీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా బదులిచ్చేలా ఉండాలి. కనీసం నటించండి: మీలో ఆత్మవిశ్వాసం తగుపాళ్లలో లేకపోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఇంటర్వ్యూలో నటించండి. మీ శరీరభాష దానికి తగ్గట్లుగా ఉండాలి. దీనివల్ల రిక్రూటర్పై సానుకూల ప్రభావం కలిగించొచ్చు. వంగిపోయినట్లుగా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోండి. రిక్రూటర్ కళ్లలోకి నేరుగా చూస్తూ ధైర్యంగా మాట్లాడండి. ‘ఈ ఇంటర్వ్యూలో విఫలమైతే నాకు నష్టమేం లేదు’ అనే మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కంటినిండా నిద్ర: ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉండాలంటే రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఇంటర్వ్యూ కోసం ఆఖరి క్షణంలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కంగారు తప్పదు. విశ్రాంతి కూడా దొరకదు. కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకొని ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి హాయిగా నిద్రించండి. ఆలస్యంగా భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలో ధరించాల్సిన దుస్తులు, బూట్లను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. మహిళలైతే తమ గోళ్ల రంగు(నెయిల్ పెయింట్)ను, ఎబ్బెట్టుగా ఉండే అలంకరణను తొలగించుకోవాలి. సమయానికి చేరుకొనేలా: కారణాలు ఏవైనా కానివ్వండి.. మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరుకావడం ఎంతమాత్రం సరికాదు. ఇంటి నుంచి ఇంటర్వ్యూ కార్యాలయం వరకు ప్రయాణించడం ప్రయాసతో కూడుకున్నదే. దూర ప్రయాణమైతే అలసిపోతారు. ఇంటి నుంచి కార్యాలయం ఎంత దూరంలో ఉంది? అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయల్దేరాలి? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లిరావడం మంచిది. దాని ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో హడావుడిగా పరుగులు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉదయం వేళ మేలు:ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీ వంతు కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్లాస్ నీరు తాగండి. బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. విశ్రాంతి స్థితిలోకి రండి. గొంతులో గరగర లేకుండా చూసుకోండి. ఇంటర్వ్యూలో చెప్పబోయే సమాధానాలను మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీ గురించి మీరు మనసులో చెప్పుకోండి. దీనివల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇంటర్వ్యూ ఏ సమయంలో నిర్వహించాలనేది కంపెనీ నిర్ణయమే. ఒక్కోసారి ఈ అవకాశం అభ్యర్థికే ఇస్తుంటారు. అలాంటప్పుడు ఉదయం వేళనే ఎంచుకోండి. ఎందుకంటే అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది. శరీరం, మనసు రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ సమయంలో విజయావకాశాలు అధికం. ఒకవేళ మధ్యాహ్నం లేదా సాయంత్రమైతే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. -
ఇంటర్వ్యూలో అభ్యర్థి అడగకూడని అంశాలు
జాబ్ స్కిల్స్: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ స్థాయిల్లో నెగ్గి మౌఖిక పరీక్షకు పిలుపు అందుకుంటే కొలువు కల సగం నెరవేరినట్లే. అయితే ఇంటర్వ్యూ అంత సులువేమీ కాదు. ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా అవకాశం చేజారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి సంస్థ/ఉద్యోగం గురించి అభ్యర్థులు అడిగే ప్రశ్నలే కొత్త చిక్కులు తెచ్చిపెడతాయి. అలా అని అడగకుండా ఉంటే సంస్థ గురించి కనీస అవగాహన లేదనుకునే అవకాశం ఉంది. కాబట్టి జాబ్ ఇంటర్వ్యూలో అడగకూడని ప్రశ్నలు... ఇంటర్వ్యూల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి అభ్యర్థులు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందే. అందులో భాగంగా ఇంటర్వ్యూ యర్లు అడిగే ప్రశ్నలకు ఏ సమాధానాలు చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే అంశాలే ప్రధానం. వాటి ఆధారంగానే అభ్యర్థుల పరిజ్ఞానం, వ్యక్తిత్వం, అంకితభావాన్ని అంచనా వేస్తారు. అయితే ఒక్కోసారి ఇంటర్వ్యూ చేసే వారే.. ‘ఏమైనా అడగాలనుకుంటున్నారా?’ అని అభ్యర్థులను ప్రశ్నిస్తారు. ఆ సమయంలో అడగకూడని అంశాలను ప్రస్తావిస్తే కొలువు చేజారే ఆస్కారం ఉంది. కంపెనీ ఏం చేస్తుంది? ఉద్యోగంలో చేరాలనుకుంటున్న కంపెనీ కార్యకలాపాలు, ఉత్పాదకత గురించి ప్రాథమిక అవగాహన లేని వారు అడిగే ప్రశ్న ఇది. ఒక వేళ ఈ ప్రశ్నను అభ్యర్థి ఇంటర్వ్యూ సమయంలో అడిగితే నూటికి 90 శాతం అవకాశం చేజారినట్టే. ఎందుకంటే తమ కంపెనీలో చేరాలనుకునే అభ్యర్థులకు సంస్థ గురించి కనీస సమాచారం, దాని లక్ష్యాలు తెలుసుకుని ఉండాలని ఇంటర్వ్యూయర్ భావిస్తారు. కాబట్టి మౌఖిక పరీక్షకు ముందుగానే సంస్థ గురించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. చేరాలనుకుంటున్న ఉద్యోగ విధులపై అవగాహన ఏర్పరచుకోవాలి. వేతనం ఎంత చెల్లిస్తారు? ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు ఎంత వేతనం ఆశిస్తున్నారనే దాన్ని ఇంటర్వ్యూ మేనేజర్లే అడుగుతారు. అభ్యర్థుల ప్రతిభ, నిజాయతీకి ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయం తెలియక చాలా మంది అభ్యర్థులు ఎంతవేతనం చెల్లిస్తారని ప్రశ్నించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఇంటర్వ్యూ చేసే వారే వేతన విషయాన్ని ప్రస్తావించే వరకు ఓపిగ్గా ఉండాలి. ఎన్ని రోజులు సెలవులు లభిస్తాయి? ఇంటర్వ్యూలో అడగకూడని ముఖ్యమైన ప్రశ్న ఇది. అభ్యర్థులు ఉద్యోగం కంటే సెలవులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే భావనను ఈ ప్రశ్న ఏర్పరుస్తుంది. అంతే కాకుండా అభ్యర్థులను పనిపై శ్రద్ధ లేనివారిగా, సోమరులుగా భావిస్తారు. అయితే కొలువు ఖరారైన తర్వాత లేదా ఆఫర్ లెటర్ చేతికి అందిన తర్వాత అడగొచ్చు. ప్రశంసలొద్దు.. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇంటర్వ్యూయర్‌తో ‘యు ఆర్ గ్రేట్’, ‘మీ చొక్కా చాలా బాగుంది’ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇంటర్వ్యూ చేసే వారిని మొదటిసారి కలిసినప్పుడే పొగ డటం సరైన విధానం కాదు. సొంత ప్రయోజనాలను ఆశించి ప్రశంసిస్తున్నారని భావించే అవకాశం ఉంది. నిజంగా ఏదైనా చెప్పాలనుకుంటే ఇటీవల కాలంలో సంస్థ సాధించిన విజయాలను ప్రస్తావించి ఇంటర్వ్యూయర్‌ను ఆకట్టుకోవచ్చు. ప్రశ్నించడానికి ఏం లేదు. ఇంటర్వ్యూలో ‘ఏమైనా అడగాలనుందా?’ అని అభ్యర్థులనే ప్రశ్నించినప్పుడు చాలా మంది ‘ఐ డోంట్ హావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ యు’ అని చెబుతుంటారు. ఇలా చెప్పడం వల్ల అభ్యర్థులకు ఉద్యోగంపై అంతగా ఆసక్తి లేదని, కంపెనీ గురించి ఏమాత్రం పరిశోధించలేదని అనుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అడగడానికి కొన్ని ప్రశ్నల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏం లేవనుకుంటే ‘మీ కంపెనీలో పనిచేయడానికి ఏ విభాగం ఉత్తమమైంది?’ అని ప్రశ్నించొచ్చు. -
ప్యానెల్ ఇంటర్వ్యూలో నెగ్గండిలా..
జాబ్ స్కిల్స్: జాబ్ ఇంటర్వ్యూను ఎదుర్కోవడం అనగానే.. కొంత సంశయం, బెరుకు సహజమే. ముందుగా సన్నద్ధమైతే ఇందులో విజయం సాధించడం సులువే. గతంలో సంస్థలు నియమిం చే ఇంటర్వ్యూ బోర్డులో ఒక్క సభ్యుడే ఉండేవారు. అయితే, ఇటీవలి కాలంలో ప్యానెల్ ఇంటర్వ్యూల సంఖ్య పెరుగుతోంది. అభ్యర్థిని రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేసే పద్ధతికి కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. సమయాభావం వల్ల ఈ నిర్ణయానికొచ్చాయి. ప్యానెల్ ఇంటర్వ్యూ బోర్డులో సాధారణంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. వీరు తమతమ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. ప్యానెల్ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభ్యర్థులు భయపడుతుంటారు. వారంతా కలిసికట్టుగా తమపై దాడి చేయబోతున్నట్లు భీతిచెందుతుంటారు. కానీ, కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్యానెల్ ఇంటర్వ్యూ పూర్తిచేయొచ్చు. ప్యానెల్లో ఉండేదెవరు? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోయే ప్యానెల్లో సభ్యులుగా ఎవరెవరు ఉంటారో ముందుగానే తెలుసుకోవాలి. అవసరమైతే కంపెనీ మానవ వనరుల విభాగాన్ని సంప్రదించాలి. ఫేస్బుక్, లింక్డ్ ఇన్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వారి వివరాలను పరిశీలించాలి. కంపెనీలో వారి హోదాలు, ప్రాముఖ్యత తెలుసుకోవాలి. దీనివల్ల మౌఖిక పరీక్షలో ప్యానెల్ సభ్యులతో వారి స్థాయి, హోదాను బట్టి మాట్లాడేందుకు ముందుగానే సిద్ధమవ్వొచ్చు. అందరినీ సమంగా.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టిన తర్వాత ప్యానెల్ సభ్యులందరినీ వరుసగా విష్ చేయాలి. నేరుగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. కేవలం ఒకే వ్యక్తిని చూస్తూ ఉండిపోవద్దు. ఒకరు ప్రశ్న వేసినా.. అందరి వైపు చూస్తూ సమాధానం చెప్పాలి. దీంతో మీపై సానుకూల ప్రభావం పడుతుంది. ప్యానె ల్తో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. సమాధానాలు మరోసారి వివరంగా... ప్యానెల్ సభ్యుల నేపథ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణులై ఉంటారు. వారు తమ రంగానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటారు. అభ్యర్థులు ఒకే సమాధానాన్ని మరోసారి విడమర్చి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రంగానికి సంబంధించిన సమాధానం ప్యానెల్లో మరొకరికి అర్థం కాకపోవచ్చు. పూర్తిగా వివరించమని వారు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముందుగానే ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ ప్యానెల్ అప్పుడప్పుడు సరదా ప్రశ్నలు వేసే అవకాశం కూడా ఉంటుంది. వాటికి అలాగే సరదాగానే సమాధానాలు చెప్పాలి. కృతజ్ఞతలు... మర్చిపోవద్దు ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ప్యానెల్ సభ్యులందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపాలి. వారి బిజినెస్ కార్డులను అడిగి తీసుకోవాలి. ఒక కాగితంపై ఇంటర్వ్యూ బోర్డు సభ్యులను ఉద్దేశించి ‘థాంక్యూ’ అని రాసి రిసెప్షన్లో ఇచ్చి వెళ్లాలి. అది వారికి చేరుతుంది. దీనివల్ల మీరు వారికి గుర్తుండిపోతారు. ఉద్యోగ సాధనలో ఇతరుల కంటే ముందంజలో నిలుస్తారు. కొలువులో చేరిన తర్వాత ప్యానెల్ సభ్యులే అక్కడ మీ సహచరులుగా, బాస్‌లుగా కనిపించొచ్చు. కనుక ప్యానెల్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని భయపెట్టే భూతం కాదని తెలుసుకోవాలి. -
శరీర భాష నేర్చుకున్నారా?
జాబ్ స్కిల్స్: నోరు కంటే శరీరమే ఎక్కువ మాట్లాడుతుందని మీకు తెలుసా? శరీరం మాట్లాడటమేంటని ఆశ్చర్యపోకండి, ఇది నిజమే. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో ఈ భాషకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మౌఖిక పరీక్షల్లో జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వగానే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా రిక్రూటర్ మెచ్చేలా ఉండాలి. అప్పుడే కొలువు దక్కే అవకాశాలు మెరుగువుతాయి. మౌఖిక పరీక్ష అనగానే ఎవరికైనా ఆందోళన, కంగారు సహజమే. దీనివల్ల శరీరంలో స్వల్పంగా వణుకు ప్రారంభమవుతుంది. కొందరికి చెమటలు పడుతుంటాయి. గొంతు తడారిపోతుంది. శరీరం కంపిస్తుంది. అభ్యర్థి తడబాటుకు లోనవుతున్నాడన్న విషయం అతడిని చూడగానే తెలిసిపోతుంది. ఇలాంటి వారిని ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా! జాబ్ దక్కాలంటే ఘనమైన రెజ్యుమె, తెలివైన సమాధానాలతోపాటు మంచి శరీర భాష కూడా అవసరమే. కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాలి. చక్కనైన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో బోర్డు సభ్యులను ఆకట్టుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే... సున్నితమైన కరచాలనం ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే నిల్చొని, అక్కడి రిక్రూటర్‌తో కుడిచేత్తో సున్నితంగా కర చాలనం చేయాలి. ఫైళ్లు, ఇతర వస్తువులను ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఫోన్, తాళాలను కుడిచేత్తో ప ట్టుకొని అలాగే షేక్‌హ్యాండ్ ఇస్తే ఎవరికైనా నచ్చు తుందా? కొందరు కరచాలనం చేసేటప్పుడు ఎదుటివారి చేతిని పట్టుకొని గట్టిగా ఊపేస్తుం టారు. చూసేవాళ్లకి ఆ చేతిని విరిచేస్తాడేమో అని పిస్తుంది. అది అభ్యర్థిపై తప్పుడు అభిప్రాయాన్ని కచ్చితంగా కలిగిస్తుంది. కనుక సున్నితంగా చేతిని ముందుకు చాచి, రిక్రూటర్‌తో నెమ్మదిగా కరచా లనం చేయాలి. చేతులు స్వేచ్ఛగా.. ఇంటర్వ్యూలో ఎక్కువ మంది ఎదుర్కొనే ఇబ్బంది.. చేతులు ఎక్కడ ఉంచాలో తెలియకపోవడం. వేళ్లను ముక్కులో, నోట్లో, చెవుల్లో పెట్టుకుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. చేతులను మడిస్తే మీరు ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఒడిలో పెట్టుకోవడం ఉత్తమం. అలాగే కుర్చీ పక్కలకు స్వేచ్ఛగా వదిలేయడం మంచిది. శరీరం కుంచించుకుపోయినట్లుగా కూర్చోకూడదు. దాచడానికి మీ దగ్గరేం లేదు అని చెప్పడానికి శరీరం నిటారుగా ఉండాలి. కంటిచూపుతో జాగ్రత్త ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు పక్క చూపులు చూడకుండా రిక్రూటర్ కంటిలోకి నేరుగా చూడాలి. తాము చెప్పేదానిపై మీరు ఆసక్తి చూపుతున్నారని, శ్రద్ధగా వింటున్నారని రిక్రూటర్ భావిస్తారు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి సానుకూల శక్తి ప్రసారమవుతుంది. అలాకాకుండా పైకి, కిందికి, పక్కలకు చూస్తే మీలో ఆత్మవిశ్వాసం లేదని నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంది. ఐ కాంటాక్ట్‌ను మెయింటైన్ చేయాలంటే.. రిక్రూటర్ కంటి రంగును పరిశీలిస్తూ ఉండండి. అరుపులొద్దు.. మాటలు చాలు కొందరు మాట్లాడుతుంటే బిగ్గరగా అరిచినట్లే ఉంటుంది. ఆందోళన, కంగారులో ఉన్నవారే ఇలా మాట్లాడుతుంటారు. ఇంటర్వ్యూలో స్వరస్థాయి సాధారణంగా ఉండేలా జాగ్రత్తపడండి. ఒకవేళ గొంతు తడారిపోతే మంచినీరు తాగండి. మీరు చెప్పేది రిక్రూటర్‌కు స్పష్టంగా వినిపించాలి. ఆకట్టుకొనే వస్త్రధారణ మీరు ఇంటర్వ్యూకు హాజరవుతున్న కంపెనీ, అక్కడి ఉద్యోగాన్ని బట్టి వస్త్రధారణ ఉండాలి. స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లు, కార్పొరేట్ కంపెనీలు, ఆసుపత్రులు.. ఇలా వేర్వేరు రంగాలకు వేర్వేరు వస్త్రధారణ ఉంటుంది. కొన్ని సంస్థల్లో డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తుంటారు. దానిగురించి ముందుగానే తెలుసుకోవాలి. మీ డ్రెస్సెన్స ప్రొఫెషనల్‌గా, ఇంటర్వ్యూ బోర్డును ఆకట్టుకొనేలా ఉండాలి. గాఢమైన రంగులున్న దుస్తులు, బరువైన ఆభరణాలు ధరించొద్దు. -
మీ బలహీనతలేంటి?
జాబ్ స్కిల్స్ మీకున్న బలహీనతలు ఏమిటో వివరంగా చెప్పండి?... వినడానికి ఇది చాలా మామూలు ప్రశ్నగానే అనిపిస్తుంది. కానీ, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూల్లో రిక్రూటర్లు దీన్ని తరచుగా సంధిస్తుంటారు. అభ్యర్థి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి అతడికి ఉద్యోగం ఇవ్వాలో వద్దో తేల్చేస్తుంటారు. బలహీనతలు లేని మనుషులంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ఈ నిజాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. మరి, ఇంటర్వ్యూల్లో బలహీనతల గురించి పూసగుచ్చినట్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయొచ్చా? దీనివల్ల అభ్యర్థి నిజాయతీని మెచ్చుకొని, ఉద్యోగం ఇచ్చేస్తారా? అలా ఇచ్చేయరని నిపుణులు చెబుతున్నారు. బలహీనతల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. హాని కలిగించేవి, కలిగించనవి. కాబట్టి, ఇంటర్వ్యూలో ఇలాంటి వాటిపై ప్రశ్న ఎదురైనప్పుడు చాకచక్యంగా రిక్రూటర్‌కు నచ్చే సమాధానం ఇవ్వాలని సూచిస్తున్నారు. అతిశయోక్తులను ఆశ్రయించొద్దు. మౌఖిక పరీక్షలో వీక్నెస్పై ప్రశ్న వేయగానే అభ్యర్థులు కంగారుకు లోనవుతుంటారు. వెంటనే ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుంటారు. వెనుకాముందు ఆలోచించకుండా మనసులో ఉన్నది బయటపెడితే ఉద్యోగం దక్కే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగనీ అతిశయోక్తులు కూడా చెప్పొద్దు. నేను చాలా పర్ఫెక్షనిస్టుని, నాలో ఎలాంటి లోపాలు లేవు అని చెబితే మీరు అహంకారులని, గర్వం ఉందని ఇంటర్వ్యూ బోర్డు భావించే ప్రమాదం ఉంటుంది. కొందరైతే ఇతరుల వైఖరి వల్లే తాము బలహీనతలకు లోనవుతుంటామని, అందులో తమ తప్పు లేదని చెబుతుంటారు. నా బృందంలోని సభ్యులు, సహచరులు సరిగ్గా పనిచేయకపోతే నేను సహనం కోల్పోతుంటాను, అదే నా వీక్నెస్ అని సమాధానం ఇస్తుంటారు. కానీ, అది సరైంది కాదు. మీలో సహనం, ఓర్పు లేవని రిక్రూటర్ భావిస్తారు. అందరూ పరిపూర్ణులు కారు నిజానికి బలాలు, బలహీనతలు అనేవి సందర్భానుసారంగా బయటపడుతుంటాయి. ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేందుకు మీలోని నైపుణ్యాలను ఉపయోగించండి. అందరూ పరిపూర్ణులు కారనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు కూడా తెలుసు. మీలోని అసలైన లోపాన్ని వెల్లడించడానికి ఇబ్బందిగా ఉంటే.. ఉద్యోగానికి హాని కలిగించని విధంగా ఏదైనా చెప్పొచ్చు. ఉదాహరణకు.. నాకు లెక్కలంటే భయం అని చెబితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు.దాన్ని సులభంగా సరిచేసుకొనే అవకాశం ఉంది కాబట్టి రిక్రూటర్ ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు. ఒకవేళ మీలోని అసలైన లోపాలను చెబితే.. అదే సమయంలో వాటిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాలి. దాన్ని రిక్రూటర్ ఆమోదిస్తారు. మాటల్లో నిజాయతీ ధ్వనించాలి ఉద్యోగానికి మీరు సరిపోతే.. ఆ విషయాన్ని మరోసారి స్పష్టంగా తెలుసుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తుంది. అందుకే ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, బలాలను, బలహీనతలను తెలుసుకొనేందుకు ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. లోపాలను అధిగమిస్తూ బలాలను మెరుగుపర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియజేయాలి. కొందరు తమ బలాలను లోపాలుగా మార్చి చెబుతుంటారు. ఎలాగంటే.. నేను పని రాక్షసుడిని(వర్క్‌హాలిక్), పని పూర్తయ్యేదాకా విశ్రమించను అంటుంటారు. అది మంచి లక్షణమే, బలహీనత కాదు కదా! గతంలో కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి పాఠాల నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెబితే మీలో వ్యక్తిత్వం ఉందని రిక్రూటర్ భావించేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటల్లో నిజాయతీ ధ్వనించాలి. అందుకు ముందుగానే సిద్ధం కావాలి. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటికి ఎలా బదులివ్వాలి అనేది పునశ్చరణ చేసుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మౌఖిక పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగం చేజిక్కించుకోవడం సాధ్యమే.