
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. గోవాలో గురు, శుక్రవారాల్లో జరిగిన కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సును ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభించారు. గత ఏడాది కమిటీ చేపట్టిన కార్యక్రమాలను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. అనంతరం వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్లలో అమలు చేస్తున్న విధానాలు, సమస్యలు, కొత్త చర్యలపై చర్చించారు. అన్ని పీఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.
రెండోసారి చక్రపాణి ఎన్నిక: యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు ఆయన కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం. చక్రపాణి మాట్లాడుతూ అందరి నమ్మకాన్ని కాపాడుతూ కమిటీ మరింత బాగా పనిచేసేలా కృషి చేస్తానని అన్నారు. యూపీఎస్సీ చైర్మన్ సహా అన్ని రాష్ట్రాల చైర్మన్లకు గురువారం రాత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ విందు ఇచ్చారు.