Ganta chakrapani
-
జూలై మొదటి వారంలో గ్రూప్–2 ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఇంటర్వ్యూలను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే ఉపాధ్యాయ నియామకాల ఎంపిక చేపట్టామని, ఆ జాబితాను విద్యాశాఖకు పంపించామని పేర్కొన్నారు. చక్రపాణి నేతృత్వంలోని కమిషన్ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2017–18 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయనకు అందజేసింది. టీఎస్పీఎస్సీ చేపడుతున్న సంస్కరణలపైనా గవర్నర్‌కు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీలో సిబ్బంది నియామకం, భవనాల కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. టీఎస్పీఎస్సీలో వార్షిక కేలండర్ అమలు, గ్రూప్–1 నోటిఫికేషన్ తదితర అంశాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రూప్–2 నియామకాలకు సంబంధించిన వివరాలపైనా ఆరా తీశారు. గ్రూప్–1కు సంబంధించి జోన్లవారీగా పోస్టుల విభజనకు సర్కారు కసరత్తు చేస్తోందని ఆయనకు వివరించినట్టు తెలిసింది. రెండు నెలలపాటు ఇంటర్వ్యూలు... ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేకుండా సమగ్రమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు నియామకాలు పూర్తిచేస్తున్నందున టీఎస్పీఎస్సీని గవర్నర్ అభినందించారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్–2లో 1,032 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనవారి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, జూలై మొదటివారంలో ఇంటర్వ్యూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2,064 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. మొత్తం 39,659 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అందులో 3,186 పోస్టులకు ఆయా శాఖల నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. 128 గ్రూప్–2 పోస్టులు మినహా 36,474 పోస్టులను నోటిఫై చేశామని, అందులో 26,259 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. 3,494 పోస్టుల మెరిట్ æజాబితాలను విడుదల చేశామని, అవి సర్టిఫికెట్ల పరిశీలన వంటి వివిధ దశల్లో ఉన్నాయని చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో టీఎస్పీఎస్సీ సభ్యులు సి.విఠల్, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
20 వేలు దాటిన టీఎస్పీఎస్సీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుల భర్తీలో భాగంగా తాము చేపట్టిన నియామకాల సంఖ్య 20,679కి చేరుకుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 2,528 పోస్టులను భర్తీ చేసినట్లు ఆమె వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో సభ్యు లు సి.విఠల్, డి.కృష్ణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సాయిలు, మన్మథరెడ్డి మంగళవారం సమావేశమై 1,857 ఫారెస్టు బీట్ ఆఫీసర్, 699 స్కూల్ అసిస్టెంట్, 55 టీజీటీ సైన్స్ పోస్టుల ఫలితాలను ప్రకటించినట్లు తెలిపారు. 1,823 ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, కోర్టు కేసుల కారణంగా 33 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. మరొక పోస్టు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయిందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 699 స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులను నోటిఫై చేయగా, 653 పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 22 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వికలాంగులకు సంబంధించిన 22 పోస్టుల ఫలితాలను మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు. 52 టీజీటీ సైన్స్ పోస్టులను భర్తీ చేశామని వివరించారు. -
గంటలో రాజ్యాంగ పఠనం
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని ఒక గంట సమయంలో మౌఖికంగా చెప్పి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించిన లక్ష్మీశ్రీజ(10) తెలంగాణ అద్భుత బాలిక అని వక్తలు కొనియాడారు. బుధవారం శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని లక్ష్మీశ్రీజ, ఆమె తల్లిదండ్రులు, న్యూ ఎరా స్కూల్ యజమాని రమణారావు కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ చాంబర్లో లక్ష్మీశ్రీజ భారత రాజ్యాంగాన్ని సునాయాసంగా పఠనం చేయడాన్ని చూసి అక్కడికి వచ్చిన అతిథులు శ్రీజ జ్ఞాపకశక్తిని ప్రశంసించారు. శ్రీజ లాగా రాజ్యాంగాన్ని అలవోకగా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదని స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీ శంకర్ ఆమెను అభినందించారు. -
‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జూలూరి గౌరీ శంకర్ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్ర పాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేశవరావు మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం గురించి రాయాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ఎలా ముందున్నారో, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తెలంగాణను విలీనం చేసే విషయాల్ని, సాయుధ పోరాటం తర్వాత కూడా భూస్వాములే పాలించి, దళితులు, మైనారిటీలను అణిచివేతకు గురిచేసిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో అడపా సత్యనారాయణ చక్కగా పొందుపరిచారు’ అని కొనియాడారు. తెలంగాణ అస్థిత్వం గురించి ఈ పుస్తకంలో పొందుపర్చడం మంచి విషయమని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ చరిత్రను టీఎస్పీఎస్సీ పోటీపరీక్షల సిలబస్‌లో పెట్టడం గొప్ప విషయం, ఇలా అయినా లక్షలాది మంది తెలంగాణ చరిత్రను తెలుసుకునే అవకాశం కలిగిందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అడపా సత్యనారాయణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల గురించి, తెలంగాణలోని మిశ్రమ సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ పుస్తకం రచించానని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ అశోక్, ఉస్మానియా ప్రొఫెసర్ సుధారాణి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘంటా చక్రపాణికి సాహితీ పురస్కారం ప్రదానం
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి సాహిత్య ప్రక్రియలో తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది. చక్రపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర అనే రచనకు ఈ పురస్కారం దక్కింది. 2015వ సంవత్సరానికిగాను ఎంపికైన ఈ పురస్కారాన్ని సోమవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో అందజేశారు. తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ ఈ పురస్కారాన్ని అందజేశారు. పురస్కారం కింద రూ.20,116 నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ... నేను చదువుకున్న విశ్వవిద్యాలయంలో తీసుకున్న సర్టిఫికెట్ ఎంత విలువైనదో ఈ పురస్కారం కూడా అంతే గొప్పదన్నారు. సీఎం కేసీఆర్‌ను తాను ఏనాడూ పదవి అడగలేదని, టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని కూడా తాను వద్దన్నా పట్టుబట్టి నియమించారని తెలిపారు. తనను గుర్తించి సత్కరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అల్లం నారాయణ మాట్లాడుతూ... టీఎస్పీఎస్సీలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన ఘనత చక్రపాణిదే అన్నారు. కాగా, ఉత్తమ రచయిత్రి పక్రియలో 2016వ సంవత్సరానికిగాను రచయిత్రి తిరునగరి దేవకీదేవికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ నుంచే తెలంగాణ పునర్నిర్మాణం
కాళేశ్వరం/మంథని: ప్రపంచమంతా ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దీని ఫలాలు అందరికీ అందితే అత్యంత సుభిక్షమైన రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ పనులను, అలాగే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ పనులను ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణం కాళేశ్వరం నుంచి ప్రారంభమైందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుందని, ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తున్నారని కితాబిచ్చారు. -
టీఆర్టీపై అపోహలు వద్దు
సాక్షి, సిద్దిపేట: టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ)పై వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపే పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 14 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మరో నెలలో గురుకుల టీచర్లకు సంబంధించిన 6 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గురుకుల టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి నెలలో నియామక జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రూపు–2 పోస్టులకు సంబంధించిన కోర్టు కేసు త్వరలో క్లియర్ అవుతుందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల పోస్టులకు, గ్రూప్–4, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం 31 వేల పోస్టుల భర్తీ బాధ్యత తమపై పెట్టిందని, నియామకాలను పారదర్శకంగా చేపట్టడం వల్లే జాప్యం జరుగుతోం దని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం దృ ష్ట్యా పోస్టులు భర్తీ చేస్తున్నామని చక్రపాణి పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ కన్నా తెలంగాణలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎక్కువ పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. -
అన్ని రాష్ట్రాల్లో మోడల్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో వివిధ ఉద్యోగ పరీక్షల్లో మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ (పీఎస్సీ) చైర్మన్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. గోవాలో గురు, శుక్రవారాల్లో జరిగిన కమిటీ 20వ జాతీయ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. సదస్సును ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభించారు. గత ఏడాది కమిటీ చేపట్టిన కార్యక్రమాలను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు. అనంతరం వివిధ పబ్లిక్ సర్వీసు కమిషన్లలో అమలు చేస్తున్న విధానాలు, సమస్యలు, కొత్త చర్యలపై చర్చించారు. అన్ని పీఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా మోడల్ స్కీం, సిలబస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండోసారి చక్రపాణి ఎన్నిక: యూపీఎస్సీ చైర్మన్ సమక్షంలో పీఎస్సీ చైర్మన్ల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రొఫెసర్ చక్రపాణి రెండోసారి ఎన్నికయ్యారు. ఆ పదవిలో మరో రెండేళ్లపాటు ఆయన కొనసాగుతారు. ఒకే పీఎస్సీ చైర్మన్‌ను రెండోసారి ఎన్నుకోవడం ఇదే ప్రథమం. చక్రపాణి మాట్లాడుతూ అందరి నమ్మకాన్ని కాపాడుతూ కమిటీ మరింత బాగా పనిచేసేలా కృషి చేస్తానని అన్నారు. యూపీఎస్సీ చైర్మన్ సహా అన్ని రాష్ట్రాల చైర్మన్లకు గురువారం రాత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ విందు ఇచ్చారు. -
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు
-
కొలువుల జాతర
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు: టీఎస్పీఎస్సీ ♦ గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల.. నేడు వెబ్సైట్లో జాబితాలు ♦ వారంలో గ్రూప్–1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ.. తరువాత గ్రూప్–2కు.. ♦ 29, 30 తేదీల్లో పీజీటీలకు మెయిన్ పరీక్ష.. టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో ♦ స్పెషల్ టీచర్లకు జూలై 30న రాతపరీక్షలు ♦ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుభవార్త అందించింది. వివిధ కేటగిరీల్లో 2,437 పోస్టులకు సంబంధించి 15 రకాల నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో (tspsc.gov.in) అందుబాటులో ఉంటాయని తెలిపింది. గురువారం కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో గురుకుల డిగ్రీ లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, గురుకుల జూనియర్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్ష విధానం ఉంటుంది. గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు ఇంటర్వూ్య మాత్రమే ఉంటుంది. ఫారెస్టు కాలేజీలో ప్రొఫెసర్స్, లైబ్రేరియన్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల చివరి గడువు, పరీక్ష తేదీలను తాత్కాలికంగా నిర్ణయించారు. కచ్చితమైన తేదీలను నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల 128 పోస్టుల భర్తీకి నిర్వహించిన 2011 గ్రూప్–1.. 1,032 గ్రూప్–2 పోస్టుల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను శుక్రవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్–1కు 1:2 నిష్పత్తిలో 256 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, వారంలో వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, దీనికి 1:3 నిష్పత్తిలో 3,096 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని.. ఇంటర్వూ్యకు మాత్రం 1:2 రేషియోలో అభ్యర్థులను పిలుస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు చెక్ లిస్టులను చూసుకొని ఆయా సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని చక్రపాణి సూచించారు. సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. మధ్య దళారులను నమ్మొద్దు... ఇప్పటివరకు వివిధ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్‌లో మరింత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిస్తామని చక్రపాణి చెప్పారు. మధ్య దళారులు, వదంతులను అభ్యర్థులు నమ్మొద్దన్నారు. నియామకాల కోసం ప్రభుత్వం అప్పగించిన అన్ని ఇండెంట్లు పూర్తి చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇండెంట్లు æపెండింగ్‌లో లేవన్నారు. ఇప్పటికే 6 వేల పోస్టులను భర్తీ చేశామని, 4,432 మంది విధుల్లో చేరారని చెప్పారు. మరో 2 వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతందని, 7,306 గురుకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నిబంధనల ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చక్రపాణి చెప్పారు. ఆ తరువాత విద్యా శాఖ నుంచి జిల్లాల వారీగా పోస్టుల వివరాలతో కూడిన ఇండెంట్లు రావాలని, అవి వచ్చాకే నోటిఫికేషన్‌కు చర్యలు చేపడతామన్నారు. గురుకులాల టీచర్ల, పాఠశాలల టీచర్ల పరీక్ష స్కీం వేరుగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 29, 30 తేదీల్లో పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్షలు మే 31న రాత పరీక్ష నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల ‘కీ’లను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేస్తామని, ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ వెల్లడించారు. పీజీటీలకు మెయిన్ పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని, టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించేలా తాత్కాలిక షెడ్యూలు రూపొందించామని చెప్పారు. మొత్తానికి వచ్చే నెల 15 లోగా పరీక్ష నిర్వహిస్తామని, కచ్చితమైన పరీక్ష తేదీల షెడ్యూలును త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్ పోస్టులకు రాత పరీక్షలను వచ్చే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్ష షెడ్యూలు.. 29–6–2017, 30–6–2017: పీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 12–7–2017, 13–7–2017: పీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్) 4–7–2017, 5–7–2017, 6–7–2017: టీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 14–7–2017, 15–7–2017: టీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృతం) 30–7–2017: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్పెషల్ టీచర్స్ (ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్) స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష -
గ్రూప్–2లో మరింత తగ్గిన హాజరు
♦ 63.02 శాతానికి పరిమితం ♦ పేపర్–3, పేపర్–4 పరీక్షలూ ప్రశాంతం ♦ పరీక్షల నిర్వహణలో సహకరించిన ♦అందరికీ కృతజ్ఞతలు: ఘంటా చక్రపాణి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 పోస్టుల భర్తీకి చేపట్టిన గ్రూప్–2 పరీక్షల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పేపర్–3, పేపర్–4 రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్య మరింత తగ్గింది. శుక్రవారం జరిగిన పేపర్–1, పేపర్–2 పరీక్షలకు 65.60 శాతం మంది హాజరవగా ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 63.02 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని కేంద్రాల్లో ఒకే బార్‌కోడ్‌గల ప్రశ్నపత్రం, ఓఎంఆర్ జవాబుపత్రాల జారీలో పొరబాట్లు దొర్లగా పలు చోట్ల బయోమెట్రిక్ మెషిన్లు మొరాయించాయి. అయితే పేపర్–1, పేపర్–2 పరీక్షలతో పోలిస్తే పెద్దగా గందరగోళం లేకుండానే మొత్తంమీద పేపర్–3, పేపర్–4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల తొలిరోజు (శుక్రవారం) ఎదురైన అనుభవాలతో అభ్యర్థులు జాగ్రత్తపడ్డారు. పరీక్షలకు చాలా చోట్ల వారు సకాలంలో హాజరయ్యారు. ఉదయం నుంచే ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల పరిధిలో దాదాపు పది మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యం నిబంధన, సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం వంటి కారణాల వల్ల పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల పబ్లిక్ స్కూల్లో కేంద్రంలో 14 మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్, ప్రశ్నపత్రం ఒకే నంబర్‌కు బదులు వేర్వేరు నంబర్లతో ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగులో మూడు పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు మొరాయించాయి. మొదటి రోజు పరీక్షల సందర్భంగా నెట్వర్క్ సమస్య కారణంగా అభ్యర్థులందరి బయోమెట్రిక్ సమాచారం సేకరణ సాధ్యం కాలేదని, కానీ ఆదివారం పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరి బయోమెట్రిక్ డేటాను సేకరించామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్లు పరిశీలించారని, వారి అనుమానాలను కమిషన్ ఎప్పటికప్పుడు నివృత్తి చేసిందన్నారు. కమిషన్ సభ్యులతో కూడిన మూడు బృందాలు హైదరాబాద్‌లోని పరీక్ష కేంద్రాల్లో పరిశీలన జరిపినట్లు వివరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సూపరింటెండెంట్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుందన్నారు. టీఎస్పీఎస్సీ సిబ్బందితోపాటు 350 స్పెషల్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన జరిపాయన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణికి పరీక్ష... సిరిసిల్లలోని వికాస్ డిగ్రీ కళాశాలలో గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన వేములవాడకు చెందిన నంభీ నాగరాణి అనే ఏడు నెలల గర్భిణి రెండో అంతస్తులోని పరీక్ష హాల్లోకి వెళ్లలేక ఇబ్బంది పడింది. ఆమె విన్నపం మేరకు పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ జేసీ యాస్మిన్ బాషాకు సమాచారం అందించగా ఆమె ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజు పరీక్ష కేంద్రానికి చేరుకొని సహాయకుల ద్వారా నాగరాణిని మెట్లపై ఉన్న గదికి పంపించడానికి ప్రయత్నించారు. ఆమె ఎక్కలేకపోవడంతో ప్రిన్సిపాల్ ప్రాంగణంలో ప్రత్యేక పర్యవేక్షణ మధ్య పరీక్ష రాయించారు. అభ్యర్థి బిడ్డకు మహిళా కానిస్టేబుల్ స్తన్యం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఉన్న జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో చోటుచేసుకున్న సంఘటన మాతృత్వపు మమకారానికి నిదర్శనంగా నిలిచింది. ఐదు నెలల బిడ్డతో కలసి గ్రూప్–2 పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ తల్లి... పరీక్ష కేంద్రం బయట తన బంధువుకు బిడ్డను అప్పగించి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి పాల కోసం గుక్కపెట్టింది. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఆ పాపకు పాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చింది. -
గాంధేయవాదానికి వారసుడు ‘బోవెరా’
టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గూడ అంజయ్యకు ‘బోవెరా’ స్మారక అవార్డు ప్రదానం కరీంనగర్ కల్చరల్: దివంగత బోయినపల్లి వెంకటరామారావు గాంధేయవాదానికి వారసుడని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బోయినపల్లి వెంకటరామరావు 97వ జయంతి, సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపన దినం, బోవెరా కవితా పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం కరీంనగర్‌లోని ‘బోవెరా’ భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఘంటా చక్రపాణి స్మారకోపన్యాసం చేశారు. బోవెరాతో 35 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కరీంనగర్లో బోవెరా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బొవేరా కవితా పురస్కారాన్ని ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్యకు మరణానంతరం ప్రదానం చేయగా ఆయన సతీమణి గూడ హేమనళిని స్వీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రముఖ వాగ్గేయ కారులు గోరటి వెంకన్న, తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు, సాహితీవేత్తలు ఎంవీ.నర్సింహ రెడ్డి, దాస్యం సేనాధిపతి, గండ్ర లక్ష్మణ్‌రావు, సుంకె వెంకటాద్రి, మాడిశెట్టి గోపాల్, కాళ్ల నారాయణ, తోట లక్ష్మణ్‌రావు, వాల భద్రరావు, సజ్జన కమలాకర్, బోవెరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో గ్రూపు-2 అనుబంధ నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెలలో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం గతంలో 439 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా.. ఇటీవల మరో 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో 439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినా.. పోస్టులు తక్కువగా ఉన్నాయన్న కారణంతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. తాజాగా మళ్లీ 593 పోస్టుల భర్తీకి ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య 1,032కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులను గతంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ పరిధిలోకి తెస్తూ టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. గతంలో గ్రూప్-2 రాసేందుకు 5.64 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం కల్పిస్తూ అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఆలోచనలు చేస్తోంది. అయితే అంతకన్నా ముందు తాజాగా ప్రభుత్వం ఆమోదిం చిన పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి ఇండెంట్లు, రిజర్వేషన్, రోస్టర్ వివరాలు రావాల్సి ఉంది. త్వరలోనే వీటిపై ఆయా శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలి సింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే నెలలో వీలైతే మొదటి వారం లేదా రెండో వారం నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశాలను టీఎస్పీఎస్సీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
'ఆయన అహంకార దోరణి వీడాలి'
- తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కవాడిగూడ (హైదరాబాద్‌సిటీ) : గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగుల పరీక్షలను నిరుద్యోగుల డిమాండ్ మేరకే రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ల ఒత్తిడి మేరకే పరీక్షలు వాయిదా వేశామని చెప్పడం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అహంకార దోరణికి నిదర్శనమని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ నీల వెంకటేష్ తీవ్రంగా విమర్శించారు. 439 పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతున్న తరుణంలో పోస్టుల సంఖ్య పెంచాలని రెండు నెలలు ఉద్యమాలు చేస్తే ఉద్యమాలను అవమాన పర్చేలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి దిష్ఠిబొమ్మను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్-2 సర్వీస్‌లో మొత్తం 18 శాఖలలో పోస్టులు ఖాళీలుంటే కేవలం 5 శాఖలలో ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ వేశారని తెలిపారు. మిగతా శాఖలలో ఖాళీగా పోస్టులకు నోటిఫికేషన్ వేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌కు లేదా అంటూ ప్రశ్నించారు. గ్రూప్-2 పరీక్షలకు సిలబస్‌కు తగినట్లుగా పుస్తకాలు లేకపోవడం, పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 439 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేయడం ఛైర్మన్‌కు సమస్యల్లాగా కన్పించడం లేదా అంటూ నిలదీశారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయడంలో నిరుద్యోగులు చేసిన ఉద్యమాలా..? కోచింగ్ సెంటర్లా అనే విషయం తేల్చుకోవడానికి ఛైర్మన్ బహిరంగ విచారణకు సిద్దంగా కావాలని సవాల్ విసిరారు. అందుకు ఉస్మానియా యూనివర్శిటీయా.. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీయా తేల్చుకోవాలన్నారు. ఛైర్మన్ ఘంటా చక్రపాణి బహిరంగ విచారణకు రాకపోతే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మంది నిరుద్యోగులతో పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ సంఘర్షణ సమితి అధ్యక్షులు ర్యాగ రమేష్, అడపా చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్-2 పరీక్ష యథాతథం.. వాయిదా అబద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాలను (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితా) వివిధ శాఖల ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌లకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. మరో వారం రోజుల్లో 1050 ఏఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు. గ్రూపు-2 మినహా తాము నోటిఫికేషన్లు ఇచ్చిన అన్నింటి భర్తీని ఈనెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెలలో గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే ఆలోచన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే అది ప్రభుత్వం నుంచి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదన్నారు. -
నెలాఖరులోగా రెండు వేల మందికి అపాయింట్మెంట్లు
- టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి - ప్రభుత్వం కోరితే డీఎస్సీ నిర్వహణకూ సిద్ధంగా ఉన్నాం - గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పణ సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో తొమ్మిది పోటీ పరీక్షలు నిర్వహించిన ఘనత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)దేనని సంస్థ చైర్మన్ ఘంటా చ క్రపాణి అన్నారు. ఈ నెలాఖరుకల్లా సుమారు రెండు వేలమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ ఏర్పడి ఏడాది పూర్తయినందున చైర్మన్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి 2014-15 వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం ఘంటా చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పని తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని, మరింత మెరుగ్గా పనిచేసేందుకు పలు సూచనలిచ్చారని చెప్పారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రస్తుత విధానాలు, తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు ఫిబ్రవరి 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, యూపీఎస్సీ చైర్మన్ పాల్గొనే ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా గవర్నర్‌ను ఆహ్వానించినట్లు చక్రపాణి తెలిపారు. పునరావాస కేంద్రం కాకుండా.. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే కొంతమంది వ్యక్తులకు పునరావాస కేంద్రమనే అభిప్రాయం ఉండేదని, సమర్థులైన సభ్యులతో ప్రస్తుతం టీఎస్పీఎస్సీ.. వర్క్ స్టేషన్‌ను తలపిస్తోందని చైర్మన్ చక్రపాణి అన్నారు. కమిషన్ నిర్వహించిన తొమ్మిది పోటీ పరీక్షల్లో ఆరు ఆన్‌లైన్‌లోనూ, మూడు సంప్రదాయ పద్ధతిలోనూ నిర్వహించామన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్ష మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచామని, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి కాగా, సివిల్ ఇంజినీర్లకు ఈ నెలాఖరులోగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీఎస్సీ నిర్వహణ విషయమై విద్యాశాఖ తమతో చర్చించిందని, డీఎస్సీ నిర్వహణకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి చెప్పామన్నారు. పురపాలక శాఖలో వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు మథీనుద్దీన్ ఖాద్రీ, విఠల్, చంద్రావతి, వివేక్, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్, సాయిలు ఉన్నారు. -
విద్య, ఉద్యోగ సమాచారం
దసరా తర్వాత ఏఈఈ ఇంటర్వ్యూలు! నేడు ప్రాథమిక కీ విడుదల సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి దసరా తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఈ పోస్టులకు ఆదివారం ఏర్పాటు చేసిన రాత పరీక్ష జరుగుతున్న తీరును టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈఈ (మెకానికల్) ప్రాథమిక కీని ఈ నెల 19న (సోమవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్థులు తమ జవాబు పత్రాలను ప్రత్యేక లింకు ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వాటి కీ, జవాబు పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడంలో కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 85%, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 83%, ఏఈఈ రాత పరీక్షకు 63% మంది అభ్యర్థులు హాజరైనట్లు వివరించారు. ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆదివారం ముగిసింది. సీట్ అలాట్మెంట్ కార్డులను సంబంధింత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28లోపు సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి. మొదటి, తుది దశ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 202 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 15,365 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఈ మేరకు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక ఫీజులతో కలిపి మొత్తం రూ. 16,500కు మించి ఒక్క పైసా కూడా కళాశాలల యాజమాన్యాలకు చెల్లించనవసరం లేదని కన్వీనర్ అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎవరైనా అదనంగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఓయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. 292 ఎంఈడీ సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్: ఎంఈడీ కౌన్సెలింగ్‌లో భాగంగా 4 వర్సిటీల పరిధిలోని 292 మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మిషన్స్ డెరైక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో దాదాపు 1,200 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అప్పటికప్పుడే సీట్లు భర్తీ చేశారు. మొత్తం 340 సీట్లలో 292 భర్తీ అయ్యాయి. ఈ నెల 31న తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. -
టీఎస్పీఎస్సీకి మరో ఆరుగురు సభ్యులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యులుగా మరో ఆరుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేర కు టి.వివేక్, డి.కృష్ణారెడ్డి, డాక్టర్ కె.రామ్మోహన్‌రెడ్డి, మంగారి రాజేందర్, సీహెచ్ విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్ సీహెచ్ సాయిలు తదితరులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. 62 ఏళ్ల వయసు వరకు లేదా గరిష్టంగా ఆరే ళ్ల పాటు వారు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు పి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీ నుద్దీన్ ఖాద్రీ సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఈ ఆరుగురిని సభ్యులుగా నియమించారు. కొత్త సభ్యుల వివరాలు పేరు: తడకమళ్ల వివేక్ స్వస్థలం: దాచారం, నేరేడుచర్ల, నల్లగొండ జిల్లా విద్యాభ్యాసం: ఎంఏ(జియోగ్రఫీ), బీసీజే, డిప్లొమా (ఫ్రెంచ్), ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజాల్వేషన్ అంశంపై ‘నల్సార్’ నుంచి డిప్లొమా ఉద్యోగం: వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ (1983లో గ్రూప్-1 టాపర్) పేరు: మంగారి రాజేందర్ (జింబో) స్వస్థలం: వేములవాడ, కరీంనగర్ జిల్లా విద్యాభ్యాసం: బీఎస్సీ, ఎల్ఎల్ఎం ఉద్యోగం: 1989లో జిల్లా మున్సిఫ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ అకాడమీ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా తెలుగులో తీర్పు వెలువరించారు. ఎన్నో సంక్లిష్టమైన చట్టాలను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేశారు. న్యాయపరమైన అంశాలను విశ్లేషిస్తూ యాభైకిపైగా పుస్తకాలు రాశారు. న్యాయపరమైన అంశాలపై ఆయన పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. పేరు: సీహెచ్ విద్యాసాగర్‌రావు స్వస్థలం: గూడెం, ముస్తాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా విద్యాభ్యాసం: బీఎస్సీ, ఎల్ఎల్ఎం ఉద్యోగం: ప్రాసిక్యూషన్స్ రిటైర్డ్ డెరైక్టర్ (న్యాయ శాఖ) పేరు: డి.కృష్ణారెడ్డి స్వస్థలం: జలాల్పూర్, బాల్కొండ, నిజామాబాద్ విద్యాభ్యాసం: ఎంబీఏ, ఎల్ఎల్ఎం ఉద్యోగం: సహకార శాఖలో జాయింట్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ప్రస్తుతం సహకార ట్రిబ్యునల్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. పేరు: ప్రొఫెసర్ చింత సాయిలు స్వస్థలం: శ్రీమన్నారాయణపూర్, రఘునాథ్‌పల్లి, వరంగల్ జిల్లా విద్యాభ్యాసం: ఎంటెక్, పీహెచ్డీ (కెమికల్ ఇంజనీరింగ్) ఉద్యోగం: 24 ఏళ్లుగా అధ్యాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఉస్మానియా టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో వరంగల్ ఎన్ఐటీ, జేఎన్టీయూల్లో పనిచేశారు. పేరు: కూర రామ్మోహన్‌రెడ్డి స్వస్థలం: గోనెపల్లి, చిన్నకూరు, మెదక్ జిల్లా విద్యాభ్యాసం: ఎమ్మెస్సీ, పీహెచ్డీ (ఐసీటీ నుంచి) ఉద్యోగం: 1998లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి నిర్వహిస్తున్నారు. -
తొలి ఉద్యోగ పరీక్ష నేడే
-
తొలి ఉద్యోగ పరీక్ష నేడే
* 4 జిల్లాల్లోని 99 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ * అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి: చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో తొలి ఉద్యోగ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లలో భాగంగా మొదట జారీ చేసిన 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని 99 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 30,783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్లైన్ విధానంలో పరీక్షను మొదటిసారిగా నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు (ఆన్లైన్ మాక్ టెస్టు) ప్రత్యేక లింకును ఇచ్చింది. అలాగే ఆదివారం పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బందితో మాక్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో తొలి పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహిస్తామన్న భావనకు వచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఆలస్యంగా వెళితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక పేపరు-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పేపరు-2 సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం పరీక్ష కోసం 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా వెళ్లాలని సూచించారు. గ్రామీణ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జనరల్ స్టడీస్ పేపరును తెలుగులోనూ ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు తీసుకోనున్నందున, ఈ ప్రక్రియకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆయా కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉంది. కేంద్రాల వారీగా హాజరయ్యే అభ్యర్థులు నగరం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ 25,303 75 కరీంనగర్ 1,310 4 ఖమ్మం 1,310 6 వరంగల్ 2,860 14 మొత్తం 30,783 99 -
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన
-
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు. ఇందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిలబస్ విడుదల చేసిన వెంటనే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం వీలు కాకపోతే మంగళవారం ఉదయం విద్యార్థులు చూసుకునేలా చర్యలు చేపట్టింది. -
అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు
-
అక్టోబర్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్లు
‘సాక్షి’ భవిత సదస్సులో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు.. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకూ అందరికీ ఉద్యోగాలని వెల్లడి ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సుకు భారీగా అభ్యర్థుల రాక కిక్కిరిసిపోయిన త్యాగరాయ గానసభ ప్రాంగణం.. రహదారుల పక్కన స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శన అప్పటికప్పుడు నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు ఏర్పాటు రెండు చోట్లా అభ్యర్థులకు అవగాహన కల్పించిన నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణలో సమగ్ర ప్రణాళికలతో ముందుకువెళుతున్నామని, అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చెప్పారు. గ్రూప్ పరీక్షలకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు తన మాటలనే ప్రకటనగా భావించవచ్చని పేర్కొన్నారు. ‘సాక్షి భవిత’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభ, నగర కేంద్ర గ్రంథాలయంలో ‘గ్రూప్’ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది. ఊహించినదానికంటే ఈ సదస్సుకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వేల సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో త్యాగరాయ గానసభ కిక్కిరిసిపోయి, బయట కూడా నిలబడిపోయారు. ఆ వీధులన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. దీంతో బయట ఉన్న వారి సౌకర్యార్థం భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇంకా వస్తుండడంతో అప్పటిక ప్పుడు ఇక్కడి నగర కేంద్ర గ్రంథాలయంలోనూ సదస్సు నిర్వహించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ రెండు చోట్లా ఏకకాలంలో సదస్సు కొనసాగింది. వక్తలు ఒకచోట ప్రసంగించిన తర్వాత.. మరో వేదిక వద్దకు నడిచి వెళ్లి ప్రసంగించారు. అభ్యర్థులు నిపుణులు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నారు. సిలబస్, పరీక్షా విధానంపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సుకు ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. పారదర్శకంగా నియామకాలు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఘంటా చక్రపాణి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘‘కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో తొలితరం ఉద్యోగులు మీరే. ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా కష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని సాధించండి. ఉద్యోగ అభ్యర్థుల కోసం ‘సాక్షి’ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వంటి వాటిని సద్వినియోగం చేసుకోండి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నియామకాలు జరుగుతాయి. నాకుగానీ, మా సభ్యులకు కానీ ఎలాంటి సొంత ప్రయోజనాలు లేవు. అందరూ విద్యావంతులు, ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నవాళ్లే..’’ అని చక్రపాణి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇప్పుడున్నట్లుగా గ్రూప్-1, గ్రూప్-2 విభజన ఉండ బోదని, సివిల్స్ తరహాలో ఒకేవిధంగా తెలంగాణ సివిల్ సర్వీస్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఆ పరీక్షల్లో పొందిన మార్కులకు అనుగుణంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మరో వారంలో గ్రూప్-1, 2 సిలబస్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే అభ్యర్థులు సిలబస్‌పై స్పష్టత కోరుతున్నారని, ఏ పుస్తకాలు చదవాలో అడుగుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ సిలబస్‌ను మాత్రమే రూపొందిస్తుందని, ఎలాంటి పుస్తకాలో చదవాలో చెప్పదని స్పష్టం చేశారు. అభ్యర్థులు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని సూచించారు. వాయిదా వేసే ప్రసక్తే లేదు పరీక్షల నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని చక్రపాణి పేర్కొన్నారు. అటువంటి ఆలోచనను దరిచేరనీయవద్దని, పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘‘తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఉంటే... 6 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు సగటున వంద మంది పోటీపడుతున్నారు. అయినా అధైర్యం వద్దు. కష్టపడి చదివిన వారికి ఫలితం తప్పకుండా దక్కుతుంది. విద్యార్థులు ఏ రంగంలో చదువుకున్నారో.. ఆ రంగంలోని ఉద్యోగాలకు పోటీపడితే మంచిది. తమ సబ్జెక్టులో ఉన్న ప్రతిభకు నైపుణ్యాలు సంపాదిస్తే ఉద్యోగం సులువుగా సంపాదించవచ్చు. ఉద్యోగంలో త్వరగా స్థిరపడవచ్చు. అలా కాకపోతే మిగిలిన ఉద్యోగాలకు అనవసర పోటీ పెరుగుతోంది. ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ పెట్టాలన్న అంశంపై 30 మంది మేధావులతో చర్చించాం. పాలకులకు మాత్రమే విజన్ ఉంటే సరిపోదు.. అధికారులకూ ఉండాలి. ఉద్యోగం అనేది మిమ్మల్ని పోషించుకోవడానికి కాదు, రాష్ట్రానికి సేవ చేయడానికి ఇచ్చిన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలి. అంకితభావం, చొరవ, స్పష్టత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీపై ఉంది. కమిషన్‌పై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పుట్టిన ప్రాంతాన్ని అడగడాన్ని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని భూతద్దంలో చూపి కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం కోసమే నోటిఫికేషన్ వేశారని, ఆంధ్రవాళ్లకు అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారు. అవును.. తెలంగాణ ప్రాంత సమాజం కోసమే టీఎస్పీఎస్సీ ఉంది. రాజ్యాంగం మాకు ఆ హక్కు కల్పించింది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ప్రతిభ ఉంటే నిబంధనల ప్రకారం ఉద్యోగాలు దక్కుతాయి..’’ అని వ్యాఖ్యానించారు. 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు.. గతంలో లేనివిధంగా అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించబోతున్నట్లు చక్రపాణి చెప్పారు. ‘‘రాబోయే 4 నెలల్లో 10 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. 12 రంగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇంటర్ విద్యార్థులకు బిల్ కలెక్టర్, డిగ్రీ విద్యార్థులకు హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్... ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ తది తర బ్రాంచ్‌లు చేసిన విద్యార్థులకూ నోటిఫికేషన్లో స్థానం కల్పిస్తాం. హైదరాబాద్‌లో 250 బిల్ కలెక్టర్ పోస్టులున్నాయి. ఎగ్జిక్యూటివ్, గెజిటెడ్ పోస్టులలో అభ్యర్థుల విషయ పరి జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపై పట్టు తదితర అంశాలపై వారి సామర్థ్యాన్ని బేరీజు వేయడానికి ఇంట ర్వ్యూ తప్పనిసరి.,’’ అని పేర్కొన్నారు. సీరియస్‌గా సిద్ధమైతే విజయం మీదే ‘‘పోటీ పరీక్షల్లో తెలంగాణ ఆర్థిక, సామాజిక అంశాలు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ‘ది ఇన్వెంటింగ్ తెలంగాణ-సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ -2014’ పుస్తకం విద్యార్థులకు ఎంతో దోహదం చేస్తుంది. సీరియస్‌గా సన్నద్ధమైతే విజయం వరిస్తుంది..’’ఆటుపోట్లు ఎదురైతే నిరాశ చెందొద్దు. ఒక్కదారి మూసుకుంటే మరో దారి ఉందన్న ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. - ప్రొఫెసర్ కోదండరామ్ త్వరలోనే సిలబస్ ‘‘తెలంగాణ ఉద్యమ క్రమం, సాయుధ పోరాటం, ముల్కీ, నాన్ ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందం.. తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి. ఇందుకు సంబంధించి ప్రొఫెసర్లతో కలసి సమగ్ర సిలబస్ రూపొందించాం. త్వరలోనే పుస్తక రూపంలో అభ్యర్థుల ముంగిటకు రానుంది. తెలంగాణ ప్రాంతం వాళ్లే పేపర్ వాల్యూయేషన్ చేస్తారు’’ - వి.ప్రకాశ్, ప్రొఫెసర్ జయశంకర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు నైపుణ్యమే వరం ‘‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యమే వరం.. అది లేకుంటే భారమే. గైడ్ విధానాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ విధానం ద్వారా అభ్యర్థులు సహజసిద్ధ ఆలోచనలు చేయడం లేదు. సృజనాత్మకత పెంపొందడం లేదు. కోర్ సబ్జెక్టులపై విద్యార్థులు దృష్టి సారించాలి. ఇంటర్వ్యూ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ - విద్యావేత్త చుక్కా రామయ్య రెండు లక్షల ఉద్యోగాల భర్తీ: నాయిని తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఖాళీల వివరాలు రాగానే ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో దశల వారీగా రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని నాయిని చెప్పా రు. ఉద్యోగా ర్ధులం తా ఏకాగ్రతతో చది వి ఉద్యోగాలు సాధిం చాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘సాక్షి’ పెద్దపీట వేస్తోందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి తెలిపారు. త్వరలో వారికోసం ప్రత్యేక పేజీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల కోసం జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని రామచంద్రమూర్తి అన్నారు. నిరుద్యోగులకు విజయాల బాటలో ‘సాక్షి’ నిరంతరం చేయూతనిస్తుందని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి భరోసా ఇచ్చారు. -
ఉద్యోగాల గంట మోగింది
-
ఉద్యోగాల గంట మోగింది
► 770 సివిల్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ తొలి నోటిఫికేషన్ ► వచ్చే నెల 20న ఆన్లైన్ పరీక్ష, ►25న ఫలితాలు, మెరిట్ జాబితాలు ► 3,783 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం ►నెలాఖరులో మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు ►వచ్చే నెలలో వ్యవసాయ, రవాణాశాఖల్లో.. ►అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ►వీటికి నెలాఖరులోగా పూర్తిస్థాయి సిలబస్ ►టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) తొలి నోటిఫికేషన్ జారీ అయింది. వివిధ శాఖల్లో 770 సివిల్ ఇంజనీర్ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పోస్టుల భర్తీ కోసం బుధవారం దీనిని జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీలోగా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చు. ఇక మరిన్ని శాఖల్లో పలు పోస్టులకు ఈ నెలాఖరులోగా, అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయనున్నారు. హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్‌తో కలసి చైర్మన్ ఘంటా చక్రపాణి ఈ వివరాలను వెల్లడించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంతో మంది ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో జారీ చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను డిసెంబర్ నాటికి జారీచేస్తామన్నారు. వివిధ శాఖల నుంచి రోస్టర్, రిజర్వేషన్ల వివరాలు రాగానే మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. మొత్తంగా కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన 3,783 పోస్టులకు డిసెంబర్ నాటికి జారీ చేస్తామని తెలిపారు. చక్రపాణి వెల్లడించిన మరిన్ని అంశాలు ‘‘గ్రూప్ పోస్టులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తదితర కేటగిరీల పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపకల్పన జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరులోగా వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తాం. 400కుపైగా గ్రూప్-2 పోస్టులకు అక్టోబర్‌లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్లో రాతపరీక్ష నిర్వహిస్తాం. గ్రూప్-1 పోస్టులు ప్రస్తుతం 53 ఉన్నాయి. అందులో కొన్ని క్లియర్‌గా లేవు. డిసెంబర్లో వాటికి నోటిఫికేషన్ జారీచేస్తాం. కొత్త సిలబస్‌పై సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో గడువు ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నాం. దాంతోపాటు అప్పటిలోగా ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చి, మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రూప్-2లో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ ఏడాదికి గ్రూప్-2 ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. తెలంగాణలో అన్నింటికి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తాం. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా చర్యలు చేపడుతున్నాం. గ్రూప్-1, 2లలో మాత్రం ఆన్లైన్ పరీక్ష ఉండదు. మిగతా వాటిల్లో అవసరమైన మేరకు, ఆన్లైన్ పరిజ్ఞానం అవసరమున్న పోస్టులకు ఆన్లైన్ పరీక్షలు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. రవాణా శాఖలో ఏఎంవీఐలు పనిచేయాల్సింది కంప్యూటర్‌పైనే. కాబట్టి ఆ పోస్టులకు ఆన్లైన్ పరీక్షలే ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన పోస్టుల్లో దరఖాస్తుదారులు 30 వేలు దాటితే ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ నిర్వహిస్తాం. ముస్లిం రిజర్వేషన్ 4 శాతం అమలులో ఉంటుంది..’’ అని పలు ప్రశ్నలకు సమాధానంగా చక్రపాణి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని, వివాదాలకు చోటు లేకుండా చూస్తామని చెప్పారు. అభ్యర్థులు నమ్మకంతో ఉండాలని, ఉమ్మడి రాష్ట్రంలోని కమిషన్‌తో పోల్చవద్దని.. తమ పనితీరు చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ============ తొలి నోటిఫికేషన్ (సివిల్ ఇంజనీర్) పోస్టులు.. విభాగం పోస్టులు ఆర్డబ్ల్యూఎస్ 418 పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ 121 మున్సిపల్ , పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ 5 రోడ్లు భవనాల శాఖలో 83 నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో 143 మొత్తం 770 --------- - ఈ పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్/బీఈ చేసిన వారు అర్హులు. ఈ ఏడాది జూలై 1 నాటికి 44 ఏళ్లలోపు వయస్సు ఉండాలి (రిజర్వేషన్ మినహా). వేతన స్కేలు రూ.37,100-91,450. వచ్చే నెల 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 20న రాతపరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం, అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచిన నోటిఫికేషన్లో పొందవచ్చు. - 450 మార్కులకు ఆన్లైన్ పరీక్ష, 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటాయి. వచ్చే నెల 25వ తేదీ నాటికి ఫలితాలు, మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. తరువాత ఇంటర్వ్యూలు ఉంటాయి. - హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. 40 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే అవకాశం. - కమిషన్ చేపట్టిన ప్రత్యేక విధానం వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో ఇప్పటికే 2.62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుత పోస్టులకు అర్హులైన వారు 10వేల మంది వరకు ఉన్నారు. వీరంతా మూడు నిమిషాలు కేటాయించి వ్యాలిడేట్ చేస్తే చాలు. దరఖాస్తు చేసినట్లే. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓటీఆర్ చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. -
నేడు టీఎస్పీఎస్సీ వెబ్సైట్, లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్, లోగోను ఈనెల 11న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించింది. వెబ్సైట్ అడ్రస్‌ను ్టటఞటఛి.జౌఠి.జీగా రూపొందించినట్లు సమాచారం. నేటి నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈనెల 11వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూల్యాంకనాన్ని వచ్చే నెల మొదటి వారం నాటికి పూర్తి చేసి రెండోవారంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. మరోవైపు మూల్యాంకనం రేట్లను పెంచాలని టీటీఎఫ్ డిమాండ్ చేసింది. అసిస్టెంట్ ఎగ్జామినర్‌కి ఇస్తున్న రూ. 6 నుంచి రూ.15కు, స్పెషల్ అసిస్టెంట్‌కు రూ.125 నుంచి రూ.250కు, చీఫ్ ఎగ్జామినర్‌కు రూ.240 నుంచి రూ. 350కు పెంచాలని డిమాండ్ చేసింది. -
టీపీఎస్సీ చైర్మన్‌గా ఘంటా చక్రపాణి
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి పేరు ఖరారయ్యినట్లు సమచారం. మరికాసేపట్లో జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో జన్మించిన చక్రపాణి, ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనవర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో కాకతీయ యూనివర్శిటీలో సోషయాలజీ ప్రొఫెసర్ పని చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి మతంపై Phd చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్వల్పకాలం పాటు న్యూస్‌రీడర్‌గా పని చేశారు. జర్నలిస్టుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించిన ఆయన.. గడిచిన 20 ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా ఘంటా పని చేస్తున్నారు. అనేక టెలివిజన్ షోలు ఆయన నిర్వహించారు.