
తొలి ఉద్యోగ పరీక్ష నేడే
* 4 జిల్లాల్లోని 99 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేసిన టీఎస్‌పీఎస్సీ
* అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి: చైర్మన్ ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో తొలి ఉద్యోగ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లలో భాగంగా మొదట జారీ చేసిన 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని 99 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షకు 30,783 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షను మొదటిసారిగా నిర్వహించబోతోంది.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు (ఆన్‌లైన్ మాక్ టెస్టు) ప్రత్యేక లింకును ఇచ్చింది. అలాగే ఆదివారం పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బందితో మాక్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో తొలి పరీక్షను కూడా విజయవంతంగా నిర్వహిస్తామన్న భావనకు వచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు పరీక్ష సమయం కంటే ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఆలస్యంగా వెళితే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక పేపరు-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు పేపరు-2 సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు ఉదయం పరీక్ష కోసం 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా వెళ్లాలని సూచించారు. గ్రామీణ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జనరల్ స్టడీస్ పేపరును తెలుగులోనూ ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు తీసుకోనున్నందున, ఈ ప్రక్రియకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆయా కేంద్రాలకు రావాల్సిన అవసరం ఉంది.
కేంద్రాల వారీగా హాజరయ్యే అభ్యర్థులు
నగరం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్ 25,303 75
కరీంనగర్ 1,310 4
ఖమ్మం 1,310 6
వరంగల్ 2,860 14
మొత్తం 30,783 99