సీఎం కేసీఆర్‌ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు | CM KCR Green Signal To Job Notifications | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ ప్రకటన.. నిరుద్యోగుల్లో ఆశలు

Published Mon, Dec 14 2020 3:38 AM | Last Updated on Mon, Dec 14 2020 8:27 AM

CM KCR Green Signal To Job Notifications - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సర్కారీ కొలువుల నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదివారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు’ అని సీఎం కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.   

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. కొలువుల జాతర మొదలుకానుంది. ఒకటీ రెండు నెలల్లో 50 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాఖల వారీగా ఖాళీల వివరాలను సేకరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదివారం సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. విద్యాశాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో అత్యధిక పోస్టులు అందుబాటులోకి రానున్నా యి. రాష్ట్రంలో 2018 తరువాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో ఇన్నాళ్లు నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇపుడు సీఎం ప్రకటనతో వారికి ఊరట లభించినట్లైంది. వీరంతా సీరియస్‌గా ప్రిపరేషన్‌లో మునిగిపోనున్నారు. 

విద్యాశాఖలో 15 వేలకు పైనే
రాష్ట్రంలోని పాఠశాలల్లో దాదాపు 15 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2017 సంవత్సరంలో 8,972 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విద్యాశాఖ తాజాగా మరో 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. అం దులో ప్రధానంగా విద్యార్థులు ఎక్కువగా ఉండి, ఒక్కరిద్దరే టీచర్లు ఉన్న స్కూళ్లు, సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లలో గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లు పని చేశారు. అంటే ఆ మేరకు ఉపాధ్యాయ ఖాళీలు కచ్చితంగా ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వేలకు పైగానే ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే అవకాశం ఉంటుంది.

పోలీసుశాఖలో 20 వేలు
రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఓకే చెప్పారు. 

టీఎస్‌పీఎస్సీ ద్వారా..
రాష్ట్రంలో 1,10,012 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఆయా శాఖల ద్వారా నిబంధనలకు సంబంధించిన క్లియరెన్స్‌లు లభిం చకపోవడంతో అన్నింటినీ భర్తీ చేయలేకపోయారు. 52,724 పోస్టులు భర్తీకి వివిధ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. అందులో 36,758 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. వాటిలో 35,724 పోస్టుల భర్తీ చేసినట్లు ఇటీవల టీఎస్‌పీఎస్సీ గవర్నర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

పాతవి... కొత్తవి కలిపి
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్‌ పోస్టులు, 1,503 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్‌ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

మూడేళ్లలో 52 వేలకు  పైగా పోస్టుల భర్తీ వైద్యారోగ్య శాఖలో 12 వేలు.. రెవెన్యూలో 4 వేలు

తాజా లెక్క తేలాలి...
రాష్ట్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన లెక్కల ప్రకారం ఉన్నత విద్యలో 4,702, వ్యవసాయ శాఖలో 3,673, పశుసంవర్ధక శాఖలో 1,842, బీసీ సంక్షేమ శాఖలో 2,881, అటవీ శాఖలో 3,602 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇపుడు సీఎం ఆదేశాలతో అన్ని శాఖల్లో తాజాగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించాక... నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అనుమతించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement