సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. అదేవిధంగా గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రకటనలు వెలువడి కూడా దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు ఇంతవరకు నిర్వహించలేదు.
వాస్తవానికి డీఏఓ పరీక్ష ఈ ఏడాది జనవరిలో నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. దీంతో పాటు ఇతర పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో దీర్ఘకాలంగా వీటి కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పరీక్షలు ఇంకెప్పుడు జరుగుతాయనే అయోమయానికి గురవుతున్నారు.
సన్నద్ధతకు సంకటం
ఏదైనా పరీక్ష తేదీని ప్రకటిస్తే అభ్యర్థులు సన్నద్ధతకు ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూనుకోవడం, తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ అభ్యర్థులు కఠోర దీక్షతో ప్రిపరేషన్‌లో పడ్డారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ సిద్ధమవుతున్నారు. మరికొందరైతే పనిచేస్తున్న ఉద్యోగాలకు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రకటించకుండా కమిషన్ కాలయాపన చేస్తుండటంతో సన్నద్ధత గాడి తప్పుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నెలంతా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు కొనసాగుతుండగా.. వచ్చే నెలలో సైతం పలు పరీక్షలకు కమిషన్ తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన గ్రూప్–2 పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. ఈ విధంగా పలు పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ, గ్రూప్–3 పరీక్షలపై తేల్చకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పరీక్షలు ఎప్పుడు?
Published Thu, Sep 14 2023 1:29 AM | Last Updated on Thu, Sep 14 2023 10:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment