group-3 exam
-
ముతక జననాలు.. ముతక మరణాలు!
సాక్షి, హైదరాబాద్: ముతక జననాలు.. ముతక మరణాలు.. ఇదేంటి ఏవో కొత్త పదాల్లా ఉన్నాయా? వీటి అర్థమేమిటనే సందేహం వస్తోందా? ఇవేకాదు గ్రూప్–3 పరీక్షల తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొత్త పదాలు మరెన్నో ఉన్నాయి. భారత జనాభా వృద్ధిరేటుకు సంబంధించిన ప్రశ్నలో.. ‘ది క్రూడ్ బర్త్ రేట్’ అనే ఆంగ్ల పదానికి ‘ముతక జననాల రేటు’ అనే అనువాదం చేశారు. మరో ప్రశ్నలో ‘క్రూడ్ డెత్ రేటు’ అంటే.. ‘ముతక మరణాల రేటు’ అని తెలుగులో ఇచ్చారు. కొన్ని ప్రశ్నలలో తెలుగులో పదాలే లేనట్టుగా నేరుగా ఇంగ్లిష్ పదాలనే తెలుగు లిపి ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి?..: సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలో రూపొందించి, తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్నా.. తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తెలుగు మీడియంలో చదివినవారే ఉంటారు. వారు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లిష్‌లోని ప్రశ్న ఏమాత్రం అర్థంకాకపోయినా, తెలుగులోని అనువాదం సరిగా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేని పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు ప్రశ్నపత్రాలను తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోని కొన్ని ప్రశ్నలను చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్టుగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇంత తేలికగా తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. లిప్యంతరీకరణ చేయడమేంటని అడుగుతున్నారు.యూపీఎస్సీ వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఇస్తుంటారని.. కనీసం రాష్ట్ర స్థాయిలో రాసే పరీక్షల్లోనైనా తెలుగులో చూసుకుని పరీక్ష రాసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ‘‘గ్రూప్–3 పరీక్ష మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో అనువాదం సమస్య ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. దీనితో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది’’ అని కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పేర్కొన్నారు.మూడు సెషన్ల హాజరు 50.24 శాతంరాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. 76.4 శాతం మందే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ప్రక్రియలోనే పావు వంతు అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా.. మరో పావు వంతు మంది హాల్‌టికెట్లు తీసుకుని కూడా పరీక్షలు రాయలేదు. -
TGPSC: గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక, పరీక్ష 10 గంటలకు ప్రారంభం కావడంతో.. పలుచోట్ల పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో వారిని పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రాన్ని అనుమతించని అధికారులు. తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్పూర్ గ్రామానికి చెందిన ఆనంద్, వేములవాడ పట్టణానికి చెందిన మంజుల అనే ఇద్దరు అభ్యర్థులకు ఎంట్రీ నిరాకరణ. పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు అభ్యర్థులు.ఇక, సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 15 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వికారాబాద్ జిల్లాలో 15 మంది.. అలాగే, ఆదిలాబాద్ జిల్లాలో 20 మందికి ఆలస్యం కావడంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారులను ఎంత బ్రతిమిలాడినా వారిని పరీక్షా కేంద్రాల్లోకి పంపించలేదు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1.. అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న(రేపు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
రేపటి నుంచే గ్రూప్–3 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రోజు రెండు, రెండో రోజు ఒక పరీక్ష నిర్వహించనున్నారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1.. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ అయింది. కలెక్టర్లు, ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు, ఎస్పీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. టీజీపీఎస్సీ కార్యాలయానికి వాటిని అనుసంధానించి.. ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి గ్రూప్–3 అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తామని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసింది. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్‌టికెట్లను జారీ చేయబోమని పేర్కొంది. -
గ్రూప్స్ పరీక్షల వాయిదాను ఖండించిన కమిషన్.. అభ్యర్థుల రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ స్పందిస్తూ.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది.కాగా.. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదా ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. పరీక్షల తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. ఈ వార్తలను అభ్యర్థులను పట్టించుకోవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. గతకొద్ది రోజులుగా మరోమారు పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్-2 పోస్టులను 2000లకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఈ పరీక్షలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. అదేవిధంగా గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రకటనలు వెలువడి కూడా దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు ఇంతవరకు నిర్వహించలేదు. వాస్తవానికి డీఏఓ పరీక్ష ఈ ఏడాది జనవరిలో నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ముహూర్తం ఖరారు కాలేదు. దీంతో పాటు ఇతర పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో దీర్ఘకాలంగా వీటి కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పరీక్షలు ఇంకెప్పుడు జరుగుతాయనే అయోమయానికి గురవుతున్నారు. సన్నద్ధతకు సంకటం ఏదైనా పరీక్ష తేదీని ప్రకటిస్తే అభ్యర్థులు సన్నద్ధతకు ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూనుకోవడం, తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో నిరుద్యోగ అభ్యర్థులు కఠోర దీక్షతో ప్రిపరేషన్లో పడ్డారు. కొందరు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ సిద్ధమవుతున్నారు. మరికొందరైతే పనిచేస్తున్న ఉద్యోగాలకు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీలను ప్రకటించకుండా కమిషన్ కాలయాపన చేస్తుండటంతో సన్నద్ధత గాడి తప్పుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నెలంతా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు కొనసాగుతుండగా.. వచ్చే నెలలో సైతం పలు పరీక్షలకు కమిషన్ తేదీలు ఖరారు చేసింది. ఆగస్టు నెలలో నిర్వహించాల్సిన గ్రూప్–2 పరీక్ష నవంబర్ నెలకు వాయిదా పడింది. ఈ విధంగా పలు పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ, గ్రూప్–3 పరీక్షలపై తేల్చకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్రశాంతంగా గ్రూప్–3 పరీక్ష
– జిల్లా వ్యప్తంగా 136 కేంద్రాల్లో నిర్వహణ – పరీక్షకు 34,191 మంది హాజరు – 14,717 మంది అభ్యర్థుల గైర్హాజరు అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్–3 (పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–4) పరీక్ష ‘అనంత’లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 136 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 69.91 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 10 గంటల తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలను ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్వో సి.మల్లీశ్వరిదేవి తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 34,191 మంది అభ్యర్థులు హాజరు కాగా, 14,717 మంది గైర్హాజరయ్యారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నలుగురు అభ్యర్థులు నిర్ధేశించిన సమయం దాటిన తరువాత వచ్చారు. వారిని పరీక్షకు అనుమతించలేదు. తమ ఆలస్యానికి కారణాన్ని ఇన్చార్జి జేసీకి అభ్యర్థులు చెప్పుకున్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అనుమతించడం కుదరదని వారికి ఇన్చార్జి జేసీ చెప్పారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి వెనక్కి పంపించారు. -
గ్రూప్–3 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
► 23న జిల్లాలో 143 కేంద్రాల్లో నిర్వహణ ► జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి కాకినాడ సిటీ : తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 23న గ్రూప్–3 పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామమని జాయింట్ కలెక్టర్ జె.రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. గ్రూప్–3 పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశమందిరంలో లైజాన్ ఆఫీసర్లు, సహాయ లైజాన్ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఐదు డివిజన్ కేంద్రాల్లో 143 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–3 విభాగంలో పంచాయతీ గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు 62,671 మంది పరీక్షకు హాజరు కానున్నారన్నారు. కాకినాడలో 51, పెద్దాపురంలో 31, అమలాపురంలో 13, రాజమండ్రిలో 29, రామచంద్రపురంలో 19 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలను 39 రూట్లుగా విభజించి తహసీల్దార్లను లైజాన్ అధికారులుగా, డిప్యూటి తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లను సహాయ లైజాన్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. సంబంధిత పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తయిందన్నారు. 23న ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులను ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకూ మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డ్, ప్రభుత్వ ఉద్యోగ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటిది ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు. డౌన్లోడ్ చేసుకొన్న హాల్ టికెట్లో అభ్యర్థి ఫోటో లేకున్నా, అస్పష్టంగా, బాగా చిన్నదిగా ఉన్నా, సంతకంతో లేకున్నా అలాంటి సందర్భాల్లో అభ్యర్థులు తమ 3 పాస్‌పోర్టు ఫోటోలను ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేకుంటే పరీక్షకు అనుమతించరన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు తమ వెంట రైటింగ్‌పాడ్, నలుపు, నీలం బాల్ పెన్నులు తెచ్చుకోవాలన్నారు. అంధులకు, రెండు చేతులు లేని వారు పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. అంధులకు ప్రతి గంటకు 20 నిమిషాలు అదనపు సమయం ఇవ్వనున్నట్లు చెప్పారు. లైజాన్ అధికారులు, సహాయ లైజాన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శి టి.అలివేలుమంగ, సెక్షన్ ఆఫీసర్లు జీకే ప్రసూన, టి.శ్రీనివాసరావు, పి.శంకరరావు, కలెక్టరేట్ పర్యవేక్షణాధికారి రామ్మోహనరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.