గ్రూప్–3 పరీక్షల్లో దారుణంగా తెలుగు అనువాద ప్రశ్నలు
కొన్నిచోట్ల ఇంగ్లిష్‌లో ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి..
పూర్తిగా తెలుగు మీడియంలోనే చదివి పరీక్ష రాసినవారి
పరిస్థితి ఏమిటనే ఆందోళన.. ప్రశ్నపత్రాల అనువాదంపై
కనీస శ్రద్ధ పెట్టలేదని టీజీపీఎస్సీపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ముతక జననాలు.. ముతక మరణాలు.. ఇదేంటి ఏవో కొత్త పదాల్లా ఉన్నాయా? వీటి అర్థమేమిటనే సందేహం వస్తోందా? ఇవేకాదు గ్రూప్–3 పరీక్షల తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొత్త పదాలు మరెన్నో ఉన్నాయి. భారత జనాభా వృద్ధిరేటుకు సంబంధించిన ప్రశ్నలో.. ‘ది క్రూడ్ బర్త్ రేట్’ అనే ఆంగ్ల పదానికి ‘ముతక జననాల రేటు’ అనే అనువాదం చేశారు.
మరో ప్రశ్నలో ‘క్రూడ్ డెత్ రేటు’ అంటే.. ‘ముతక మరణాల రేటు’ అని తెలుగులో ఇచ్చారు. కొన్ని ప్రశ్నలలో తెలుగులో పదాలే లేనట్టుగా నేరుగా ఇంగ్లిష్ పదాలనే తెలుగు లిపి ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి?..: సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలో రూపొందించి, తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్నా.. తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తెలుగు మీడియంలో చదివినవారే ఉంటారు. వారు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లిష్‌లోని ప్రశ్న ఏమాత్రం అర్థంకాకపోయినా, తెలుగులోని అనువాదం సరిగా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేని పరిస్థితి ఉంటుంది.
కానీ అధికారులు ప్రశ్నపత్రాలను తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోని కొన్ని ప్రశ్నలను చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్టుగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇంత తేలికగా తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. లిప్యంతరీకరణ చేయడమేంటని అడుగుతున్నారు.
యూపీఎస్సీ వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఇస్తుంటారని.. కనీసం రాష్ట్ర స్థాయిలో రాసే పరీక్షల్లోనైనా తెలుగులో చూసుకుని పరీక్ష రాసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ‘‘గ్రూప్–3 పరీక్ష మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో అనువాదం సమస్య ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. దీనితో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది’’ అని కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పేర్కొన్నారు.
మూడు సెషన్ల హాజరు 50.24 శాతం
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. 76.4 శాతం మందే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ ప్రక్రియలోనే పావు వంతు అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా.. మరో పావు వంతు మంది హాల్‌టికెట్లు తీసుకుని కూడా పరీక్షలు రాయలేదు.
Comments
Please login to add a commentAdd a comment