Telugu translation
-
ముతక జననాలు.. ముతక మరణాలు!
సాక్షి, హైదరాబాద్: ముతక జననాలు.. ముతక మరణాలు.. ఇదేంటి ఏవో కొత్త పదాల్లా ఉన్నాయా? వీటి అర్థమేమిటనే సందేహం వస్తోందా? ఇవేకాదు గ్రూప్–3 పరీక్షల తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొత్త పదాలు మరెన్నో ఉన్నాయి. భారత జనాభా వృద్ధిరేటుకు సంబంధించిన ప్రశ్నలో.. ‘ది క్రూడ్ బర్త్ రేట్’ అనే ఆంగ్ల పదానికి ‘ముతక జననాల రేటు’ అనే అనువాదం చేశారు. మరో ప్రశ్నలో ‘క్రూడ్ డెత్ రేటు’ అంటే.. ‘ముతక మరణాల రేటు’ అని తెలుగులో ఇచ్చారు. కొన్ని ప్రశ్నలలో తెలుగులో పదాలే లేనట్టుగా నేరుగా ఇంగ్లిష్ పదాలనే తెలుగు లిపి ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి?..: సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలో రూపొందించి, తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్నా.. తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తెలుగు మీడియంలో చదివినవారే ఉంటారు. వారు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లిష్‌లోని ప్రశ్న ఏమాత్రం అర్థంకాకపోయినా, తెలుగులోని అనువాదం సరిగా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేని పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు ప్రశ్నపత్రాలను తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోని కొన్ని ప్రశ్నలను చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్టుగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇంత తేలికగా తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. లిప్యంతరీకరణ చేయడమేంటని అడుగుతున్నారు.యూపీఎస్సీ వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఇస్తుంటారని.. కనీసం రాష్ట్ర స్థాయిలో రాసే పరీక్షల్లోనైనా తెలుగులో చూసుకుని పరీక్ష రాసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ‘‘గ్రూప్–3 పరీక్ష మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో అనువాదం సమస్య ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. దీనితో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది’’ అని కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పేర్కొన్నారు.మూడు సెషన్ల హాజరు 50.24 శాతంరాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. 76.4 శాతం మందే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ప్రక్రియలోనే పావు వంతు అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా.. మరో పావు వంతు మంది హాల్‌టికెట్లు తీసుకుని కూడా పరీక్షలు రాయలేదు. -
తెలుగు–ఒడియా అనువాద వారధి
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు. ‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) – పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు -
ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్
ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ సాగు భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన – ఇది 19వ శతాబ్దం నుండి మొదలై కొనసాగుతున్న మన దేశపు ఆదివాసుల కష్ట గాథ. అటవీ, ఖనిజ సంపదలను కొల్లగొట్టడా నికి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన నిషేధ విధానాలతో మొదలైన ఈ సంక్షోభం మరెన్నో హంగులు దిద్దుకొని నేటికీ కొనసాగుతూ ఉంది. ఆదివాసీల ప్రాచీన జీవన విధానం, సంస్కృ తుల్లోనే ప్రశాంతత, నెమ్మదితనం ఉన్నాయి. వారు అలాగే జీవించడంలో ఎంతో మక్కువను చూపి స్తారు. అటువంటి ఈ మొండి ప్రజలను ‘ప్రగతి శీల’ జీవన స్రవంతిలోనికి ఎట్లా తేవాలా అనే ఆలోచనలు 20వ శతాబ్ది తొలి భాగం నుండే మొదలైనాయి. బయటివారి రాజకీయ వ్యవస్థలు, పాలనా విధానాలను వారిపై రుద్దకుండా... ఆది వాసీల తత్త్వానికి సరిపడే రీతిలో మనమే ఒదిగి, బయటి వారి అతిక్రమణల ఛాయల నుండి వారిని రక్షిస్తూ... వారి సహజ ఆవరణంలోనే ఉండనిస్తూ ఆధునిక ప్రపంచపు విద్య, అవగాహనలు అందించే గొప్ప ప్రయత్నం హైదరాబాద్ సంస్థానంలో 1940ల్లో జరిగింది. ‘‘చదువుకోవటం వల్ల లౌకిక ప్రయోజనాలు న్నాయన్న సంగతి మూలవాసికి తెలిసినా అతని మనస్సులో, ఆత్మలో తనదైన సంస్కృతి పట్ల అసంకల్పితంగా, అతి లోతుగా ఇంకిపోయి ఉన్న అభిమానాన్నీ దాని పట్ల అతనికున్న గర్వభావ ననూ ఉద్ఘాటించటం ద్వారానే అతన్ని ఉత్తేజపరచ గలం,’’ అని హైదరాబాదు సంస్థానంలోని మూల వాసుల జీవనగతులను అప్పటికే పరిశీలిస్తూ నిర్ధారణకు వచ్చిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ పేర్కొన్నారు. అటు వంటి హైమండార్ఫ్‌ను ఆదిలాబాద్ గోండుల కోసం ఒక ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొం దించమని కోరింది నైజాం ప్రభుత్వం. తొలి గోండి భాషా వాచకాలను వాళ్ల జీవన వాతావరణం, పురాణాలు, కథలు, నమ్మకాలకు సంబంధించిన అంశాలతోనే ఆయన రూపొందించారు. ఈ ప్రయోగం ఫలించిన తర్వాత ఆదిలాబాద్ మూల వాసుల కోసం ఒక సమగ్ర పునరావాస, అభివృద్ధి పథకాన్ని కూడా రూపొందించి అమలు చేయమని, గిరిజన తెగలు, వెనుకబడిన తరగతుల విషయాల సలహాదారుగా అధికార పదవిలో ఆయనను నియమించింది నైజాం ప్రభుత్వం. ఒక మానవ శాస్త్రవేత్తకు ఇటువంటి బాధ్యతను అప్ప గించిన అరుదైన సందర్భం ఇది. కొమురం భీం తిరుగుబాటు అణచివేత తరువాత నిస్పృహలో కూరుకుపోయి ఉన్న ఆదిలాబాద్ మూలవాసుల జీవితంలో మళ్లీ ఉల్లాసాన్ని, నమ్మకాన్ని తీసుకువచ్చిన ఈ గొప్ప ప్రయత్నం గురించి కళ్లకుగట్టినట్టు వివరించే 1944, 1946 సంవత్సరాల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికలు నేటికీ చదువదగినవి. 80 శాతం మూలవాసీ కుటుంబాలకు 150,000 ఎకరాల భూమిని ప్రభుత్వ పట్టాలతో అందజేసి వారికి అత్యవసరమైన జీవనభద్రతను అప్పుడు కల్పించగలిగారు. అయితే తరువాతి దశకాల్లో వచ్చిన పరిణామాలతో ఈ అభివృద్ధి లాభాలను చాలా వరకు కోల్పోయి, నక్సల్ ఉద్యమం, దాని అణచివేత, మళ్లీ ప్రభుత్వం చొరవతో అమలుపరచిన అభివృద్ధి పథకాలు, వాటి లోపాలు – ఇట్లా ఎన్నో ఒడుదొడుకులకు వారు గురవుతూ వస్తూ ఉన్నారు. తమ చివరి రోజుల వరకూ తరచూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్‌ను సందర్శిస్తూ ఆదివాసీ జీవితాల్లో వస్తూ ఉన్న ఈ పరిణామాలను తెలుసుకుంటూ, సూచనలు సలహాలు ఇస్తూ తమ అనుబంధాన్ని కొనసాగించారు హైమండార్ఫ్ దంపతులు. వారి వలె ఆదివాసుల ఆప్యాయతను, ఆరాధనను పొందుతున్న మానవ శాస్త్రవేత్తలు అరుదు. ‘‘ఇక్కడ ఈ మూలవాసుల్లో వర్గభేదం లేని, లింగ అసమానతలు లేని, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేని, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత’’ అని హైమండార్ఫ్ ప్రభుత్వాధికారులకు, విధాన నిర్ణేతలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసులపై ఆయన వెలువరించిన వివిధ పుస్తకాలు, రచనల్లో వారి సంస్కృతుల గురించే కాకుండా వారికి అనువైన విద్య, తప్పనిసరిగా ఉండవలసిన సాగుభూమి భద్రత, వీటితో పాటు వారి జీవన దృష్టి గురించి చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ సంస్థానంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసుల సంక్షేమం గురించి పరి తపించే అధికారులు, సామాజిక కార్యకర్తలు, నాయ కులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచాయి. - సుమనస్పతి రెడ్డి ఆకాశవాణి విశ్రాంత అధికారి (మూలవాసుల విద్య, అభివృద్ధుల గురించి 1944, 1946ల్లో హైమండార్ఫ్ రాసిన నివేదికల తెలుగు అనువాదం హైమండార్ఫ్ దంపతుల స్మృతి దినంగా జరుపుకొనే జనవరి 11న, ఆయన చాలా కాలం నివసించిన మార్లవాయి గ్రామంలో (ఇప్పుడు కుమురం భీం జిల్లా) విడుదల కానుంది) -
ప్రేమ పోయిన తర్వాత...
‘ఇది ప్రేమ కథ కాదు. ప్రేమ పోయిన కథ.’ ఇలా ముగిసే చేతన్ భగత్ నవల, ‘ద గర్ల్ ఇన్ రూమ్ 105’లో– కథానాయకుడైన 27 ఏళ్ళ కేశవ్, ‘చందన్ క్లాసెస్’లో బోధిస్తుంటాడు. సహోద్యోగీ, ఢిల్లీ మాలవీయ నగర్ ఫ్లాట్‌మేటూ అయిన సౌరభ్ (గోలూ) తో కలిసి, ఒక ఫిబ్రవరి రాత్రి తాగుతూ ఉంటాడు. నాలుగేళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్, జారా పుట్టినరోజు అదేనని గుర్తుకొస్తుంది. అప్పుడే, తెల్లారి మూడు గంటలకు, జారా నుండి ‘నా పుట్టిన రోజని మరచిపోయావా! నువ్వు గుర్తుకొస్తున్నావు. రఘు మంచివాడే కానీ నాకు సరిపడినవాడు కాదు. ఇంకా, హిమాద్రి హాస్టల్లో 105వ నంబర్ గదిలోనే ఉన్నాను. ముందులాగే, కిటికీ బయటున్న మామిడి చెట్టెక్కి, గదిలోకొచ్చెయ్యి’ అన్న వాట్సాప్ మెసేజులు వస్తాయి. గతంలో కేశవ్ ఢిల్లీ ఐఐటీ వదులుతుండగా, అక్కడ పీహెచ్డీ చేయడానికి వచ్చిన జారాతో ప్రేమలో పడతాడు. ఆమె కశ్మీరీ ముస్లిం. కేశవ్ తండ్రి రాజస్తాన్, అల్వర్‌లో– ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున, అతనింటివారు వారి సంబంధాన్ని ఆమోదించరు. నవల మొదలయ్యేటప్పటికే జారా, కేశవ్‌కు దూరమై, అతని బ్యాచులోనే చదివిన తెలుగబ్బాయి రఘును పెళ్ళి చేసుకోడానికి రెండు నెలలే మిగిలుంటాయి. రఘు మల్టీనేషనల్ కంపెనీలో పైకి ఎదుగుతుంటాడు. కేశవ్, సౌరభ్–105కి వెళ్ళేటప్పటికే జారా చనిపోయి ఉంటుంది. ఆమె మెడ నులిమిన గుర్తులు కనబడతాయి. కేశవ్– దగ్గర్లోనే ఉండే జారా తండ్రి సఫ్దర్‌కూ, పోలీస్ ఇన్స్పెక్టర్ రానాకూ, రఘుకీ ఫోన్ చేసి చెప్తాడు. రఘు చెయ్యి విరిగి, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఉంటాడు. హాస్టల్ వాచ్‌మన్ లక్ష్మణ్ రెడ్డి, హత్యా సమయమప్పుడు తన నియమితమైన చోటున లేనందువల్లా, గతంలో జారా అతనితో గొడవపడ్డమూ తెలిసి, రానా అతన్ని కస్టడీలోకి తీసుకుంటాడు. అయితే, కేశవ్ – గోలూ సహాయంతో, తనే డిటెక్టివ్ పని మొదలెడతాడు. అతని మొదటి అనుమానం– జారామీద కన్నేసిన ఆమె పీహెచ్డీ గైడయిన సక్సేనా మీదకి వెళ్తుంది. కాకపోతే, సక్సేనా కుంటుతాడు కనుక అతను చెట్టెక్కలేడని గ్రహించిన కేశవ్ సందేహం, తీవ్రవాదుల్లో చేరిన జారా సవతి తమ్ముడైన సికందర్ పైకి మళ్ళుతుంది. సికందర్ ఉండే కశ్మీర్ వెళ్లినప్పుడు, సికందర్ ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడున్న ఆర్మీ ఆఫీసరైన ఫెయిజ్ పెళ్ళయి, కవల పిల్లలున్నవాడు. ఫెయిజ్‌తో జారా సంబంధం పెట్టుకుందన్న సాక్ష్యం దొరికినప్పుడు, అతనే హంతకుడని అనుమానిస్తాడు. సఫ్దర్‌కు, జారా పోయిన వందో రోజు అందరినీ పిలవమనీ, తను హంతకుడెవరో బయటపెడతాననీ చెప్పి, రానాకూ ఫోన్ చేస్తాడు. అందరికీ ఆ తెలివైన హంతకుడెవరో తెలుస్తుంది. నవల చివర్న, తను ప్రేమించిన జారా తనకు అర్థమే కాలేదని గుర్తిస్తాడు కేశవ్. గోలూతో కలిసి ‘జెడ్ డిటెక్టివ్స్’ అన్న ఏజెన్సీ తెరుస్తాడు. ‘నీ పిల్లలకు రఘు పోలికలు రావాలనుకుంటున్నావా – నల్లగా, అసహ్యంగా! కనీసం, కశ్మీరీల రంగు నిలబెట్టు.’ ఫెయిజ్, జారాకు పంపిన ఇలాంటి మెసేజులు, ఉత్తరాదిలో తెల్లచర్మంపట్ల ఉండే పక్షపాతాన్ని కనపరుస్తాయి. ముస్లిమ్/హిందూ మతవాదాలు, కశ్మీర్ సమస్యలు, హత్య గురించిన టీవీ చర్చలుండే పుస్తకమంతటా, కేవలం ఢిల్లీవాసులు మాత్రమే ఉపయోగించగలిగే, యథాలాపమైన హిందీ తిట్లూ, ‘ఠర్కీ, ఆషిక్, తమీజ్, గద్దార్, పంగా’ లాంటి మాటలూ కనబడతాయి. చేతన్ భగత్ మిగతా పుస్తకాలు– భిన్నమైన కులాల, ప్రాంతాల, సంస్కృతుల జంటలు ఆఖరికి కలిసిపోవడంతో ముగిస్తే, ఇది మాత్రం కొంచెం భిన్నంగా– ఎన్నో మలుపులతో, హత్యామర్మాన్ని ఛేదించినది. అయితే, రచయిత పుస్తకాలన్నిట్లోలాగే ఇదీ ఐఐటీ నేపథ్యంతో ఉన్నదే. సంభాషణలతోనే కొనసాగుతుంది. ఉత్తమ పురుషంలో ఉండే కథనం సరళమైన వాడుక భాషలో ఉంటుంది. ఈ నవలను 2018లో ప్రచురించినది వెస్ట్‌లాండ్. - యు. కృష్ణవేణి -
తెలుగులోకి పలు కమిషన్ల నివేదికలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశ సామాజిక నేపథ్యం, ప్రజలకు రిజర్వేషన్ల ఆవశ్యకతకు గల ప్రామాణికమైన మండల్, అనంతరామన్, హవనూర్ కమిషన్ నివేదికలను తెలుగులోకి తీసుకువచ్చి బీసీ కమిషన్ గొప్ప పని చేసిందని గవర్నర్ నరసింహన్ అభినందించారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు మూలాధారంగా నిలిచిన ఈ నివేదికలను దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ భాషలోకి తీసుకురావడం గొప్ప ప్రయత్నమన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ బీసీ కమిషన్ తెలుగులోకి అనువదించి, ప్రచురించిన మండల్ కమిషన్, హవనూర్, అనంతరామన్, ఇంగ్లిష్‌లో ప్రచురించిన ‘బీసీ నోట్‌బుక్ ’గ్రంథాల తొలిప్రతులను గవర్నర్‌కు అందజేసింది. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌తో పలు అంశాలపై గవర్నర్ చర్చించారు. గవర్నర్‌తో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఆంజనేయలుగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి అనితా రాజేంద్రన్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత సంవత్సర కాలంగా దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన బీసీ కమిషన్ల నివేదికలను, తెలంగాణ బీసీ కమిషన్ క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని వారు వివరించారు. అనంతరం ఇలాంటి కార్యాచరణను మున్ముందు కూడా కొనసాగించాలని గవర్నర్ కమిషన్ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అనువాదంలో అబద్ధాలు జోడించారు
సాక్షి, హైదరాబాద్: యూపీఐ చైర్పర్సన్ సోనియాగాంధీ హిందీలో మాట్లాడిన మాటల్లో లేని వాటిని కాంగ్రెస్ నేతలు తెలుగు అనువాదంలో జోడించి చెప్పారని కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్ సభలో సోనియా, రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారనీ, సోనియా మాట్లాడిన హిందీ చాలామందికి అర్థమైందన్నారు. అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా చేర్చారని వినోద్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్ చెప్పారని తెలి పారు. సోనియా మొదట తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరును మార్చాలని వినోద్ సూచించారు. దేశంలో తెలంగాణకు పాలనలో అనేక అవార్డులు, రివార్డు లు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ మం త్రులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును కొనియాడారని గుర్తుచేశారు. ఇలా నవజ్యోత్సిద్దూ, రేవణ్ణలు ఇసుక పాలసీ, గొర్రెల పంపకంపై తెలంగాణ ప్రభుత్వా న్ని కొనియాడారని ఉటంకించారు. కేసీఆర్ ఆమరణదీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామన్న ప్రకటన అమలు ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలు కారణమన్న సంగతి కోదం డరాంకు తెలియదా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 11న సోనియా సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇక రాహుల్ ప్రసం గం విన్న తర్వాత దేనితో కొట్టుకోవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కొమరంభీంను, అంబేడ్కర్‌ను విస్మరించామని అంటున్నారనీ, ఓ జిల్లాకు కొమరం భీం పేరు పెట్టిన విషయం రాహుల్‌కు స్థానిక నేతలు చెప్పలేదా? అని నిలదీశారు. అంబేడ్కర్ పేరు ప్రాణహితకు యథావిధిగా కొనసాగుతోందన్నారు. కాం గ్రెస్ ప్రణబ్ కమిటీ వేసినా అన్ని పార్టీలను తెలంగాణకు ఒప్పించింది టీఆర్ఎస్ పార్టీయేననీ, ప్రణబ్ కమిటీకి మెజారిటీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణను చంటిబిడ్డలా కేసీఆర్ సాకుతున్నారని వెల్లడించారు. హోదా అంటే ఏమిటో చెప్పాలి.. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్ నిర్వచనం చెప్పాలని వినోద్ కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఎవరూ ఇవ్వలేరనీ, ఏపీకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే పన్నుల ప్రోత్సాహకాలు ఇస్తే తామే కాదు కర్ణాటక, తమిళనాడు కూడా వ్యతిరేకిస్తాయన్నారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోందనీ, చంద్రబాబు దాన్ని తీసుకుంటా అంటున్నారనీ విమర్శిం చారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసహనంతోనే టీఆర్ఎస్ను బొంద పెడతా అంటున్నారని విమర్శించారు. ఉత్తమ్ ఇంకా ప్రచారమే ప్రారంభిం చలేదని, కాంగ్రెస్ గాంధీభవన్ నుంచి పాలించాల్సిం దేనని, వారు మాక్ అసెంబ్లీ పెట్టుకోవాల్సిందేనని వినోద్ చమత్కరించారు. -
మళ్లీ అదే తప్పు!
►తెలుగు అనువాదం లేని ప్రశ్నాపత్రం ►బీకాం విద్యార్థుల అవస్థలు ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో డొల్లతనం రోజుకో రూపంలో బయటపడుతోంది. డిగ్రీ పరీక్షల్లో పేపర్ లీక్ కావడంతో మొదలైన పొరపాట్లు రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం జరిగిన పరీక్షలో శనివారం నాటి పొరపాటే పునరావృతం అయింది. అనువాదమేదీ?: వర్సిటీ పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బీకాం ఆడిటింగ్ పరీక్ష నిర్వహిం చారు. అయితే ప్రశ్నాపత్రాన్ని పూర్తి గా ఆంగ్లంలోనే ముద్రించి తెలుగు అనువాదం ఇవ్వకపోవడంతో తెలుగు మాధ్యమం విద్యార్థులు బిక్కమొహం వేశారు. శనివారం జరిగిన బీకాం పరీక్షలోనూ ఇదే తప్పు జరిగింది. ప్రశ్నాపత్రం తయారుచేసిన వ్యక్తి తెలుగు అనువాదం ఇవ్వకపోవడం, ముద్రణా విభాగంలో అధికారులు, సిబ్బంది కూడా గుర్తించకపోవడం గమనార్హం. అదే అధ్యాపకుడు!: శనివారం పరీక్ష జరిగిన ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన అధ్యాపకుడే సోమవారం నాటి ఆడిటింగ్ ప్రశ్నాపత్రాన్నీ తయారు చేసినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రశ్నలు ఆంగ్లంలోనే ఉన్నట్లు అధికారులు శనివారమే గుర్తించా రు. కానీ ఒక్క రోజులో ప్రశ్నాపత్రం పునర్ముద్రణ, పంపిణీ అసాధ్యమని భావించి అదే ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. కానీ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో అధ్యాపకులు అనువదింపజేసే లా ఆదేశాలు జారీ చేశామని, తెలుగు మాధ్యమం వి ద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారని పరీక్షల విభాగం ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. బాధ్యులపై చర్యలతోనే చెక్ ప్రశ్నాపత్రాల రూపకల్పన, ముద్రణ, పంపిణీ వ్యవస్థలలో నిపుణులను నియమించడం, ఉద్యోగులను జవాబుదారీగా చేయడం ఎంతో అవసరం. తప్పులు పునరావృతం అయితే బాధ్యులపై చర్యలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడితే గానీ వీటికి అడ్డుకట్ట వేయలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ విచారణ ప్రారంభం బీఎస్సీ గణితం ప్రశ్నాపత్రం లీక్‌కు కారణాలను అన్వేషించే పనిలో వర్సిటీ అధికారులు ఉన్నారు. ఆచార్య రామ్మోహనరావు నేతృత్వంలో ఆచార్య పి.హృషీకేశవ రావు, ఆచార్య కె.విశ్వేశ్వరరావు పరీక్షల విభాగం అధికారులతో సమావేశమై ప్రాథమిక సమాచారం సేకరించారు. లీక్ జరిగినట్లు అనుమానిస్తున్న చోడవరంలోని పలు కళాశాలల వివరాలు, ఆధారాలను ఇప్పటికే అధికారులు పరీక్షల విభాగం నుంచి సేకరించారు. ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాలలో ఉంచడంతో దీనిని సైబర్ క్రైమ్ వారితో విచారణ జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత కమిటీ ప్రశ్నాపత్రం లీకేజీ కారణాలు, బాధ్యులను గుర్తించడంతో పాటు, పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి పలు సూచనలు చేసే దిశగా ప్రయత్నిస్తోంది. -
తెలుగులోనూ ప్రశ్నపత్రం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహిస్తున్న రాతపరీక్షల్లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాన్ని తెలుగులోనూ ఇస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ పేపర్‌ను ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇంగ్లిష్‌లో ఇచ్చే ప్రశ్నపత్రానికి పక్కనే తెలుగు అనువాదం ఇస్తామన్నారు. జవాబులు రాసేప్పుడు తెలుగులోగానీ, ఇంగ్లిష్‌లోగానీ ప్రశ్నలను చూసి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, రెండింటిలో ఏదో ఒక దానిని అభ్యర్థులు ఎంచుకోవాలని సూచించారు. మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పేపర్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. పరీక్షకు పక్కా ఏర్పాట్లు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లో 99 కేంద్రాల్లో నిర్వహించే ‘ఏఈఈ’ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు పార్వతీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపడుతోందని, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు మందుగానే చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 గంటల మధ్యలోనే, మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 మధ్యలోనే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లు, 1,050 మంది సిబ్బంది, 250 మందిని అబ్జర్వర్లను, తనిఖీల కోసం 29 స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్ ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న జనరల్ స్టడీస్ పరీక్ష పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పరిపాలనా ట్రిబ్యునల్‌కు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రాంచందర్‌రావు ట్రిబ్యునల్‌కు హామీ ఇచ్చారు. ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్లో జనరల్ స్టడీస్ పేపర్‌ను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రాసుకోవచ్చని ప్రకటించిందని, తర్వాత ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌లోనే ఇవ్వాలని నిర్ణయించిందని.. ఇది సరికాదంటూ ఆదిలాబాద్‌కు చెందిన చైతన్య, మరికొందరు అభ్యర్థులు శుక్రవారం పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనివల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ హామీ ఇవ్వడంతో పిటిషన్‌పై విచారణను ట్రిబ్యునల్ ముగించింది.