
బంగాళీ నంద
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు.
‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది.
డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి.
ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది.
బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..)
– పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment