Vikasam
-
తెలుగు–ఒడియా అనువాద వారధి
ఫకీర్ మోహన్ సేనాపతితో మొదలైన ఆధునిక ఒడియా సాహిత్యం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. సమాజంలోని విభిన్న వర్గాల గొంతులను ప్రతిధ్వనిస్తోంది. ఇదివర కటితో పోల్చుకుంటే, ఒడియా రచయితలు అనువాదాలపై మరింతగా దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు భాషల్లో వెలువడిన సాహిత్యాన్ని ఒడియాలోకి అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధునిక ఒడియా సాహిత్య రంగంలో ఇదొక మేలి మలుపు. బరంపురంలో డిసెంబర్ 24, 25 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఒడియా రచయితలు అనువాదాలు మరింత విస్తృతంగా జరగాల్సి ఉందని అన్నారు. ‘రాజకీయాలు మనుషులను విడగొడితే, సాహిత్యం మనుషులను చేరువ చేస్తుంది. పరస్పర అనువాదాల వల్ల భాషా సంస్కృ తుల మధ్య, మనుషుల మధ్య మరింతగా సఖ్యత ఏర్పడుతుంది’ అని ప్రముఖ ఒడియా పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు గౌరహరి దాస్ అభిప్రాయపడటం విశేషం. ఆయన కథలను ‘గౌరహరి దాస్ కథలు’ పేరిట కెవీవీఎస్ మూర్తి తెలుగులోకి అనువదించారు. ‘వికాసం’ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లోనే ఈ అనువాద సంపుటి ఆవిష్కరణ కూడా జరిగింది. డిజిటల్ మీడియా వ్యాప్తి ఎంతగా పెరిగినా, ఒడియాలో ముద్రిత పత్రికలకూ ఆదరణ తగ్గకపోవడం మరో విశేషం. గౌరహరి దాస్ సంపాదకత్వంలోని ‘కథ’ మాసపత్రిక ఒడిశాలోనూ, ఒడిశా వెలుపల కూడా మంచి పాఠకాదరణ పొందుతోంది. కేవలం కథానికలను ప్రచురించే ఇలాంటి సాహితీ పత్రికేదీ మన తెలుగులో లేకపోవడం విచారకరం. ‘కథ’ మాసపత్రికను అత్యధిక జనాదరణ గల దినపత్రిక ఒడియా ‘సంబాద్’ ప్రచురిస్తోంది. ఇదే కాకుండా, ఒడిశాలో ‘కాదంబిని’, ‘ఆహ్వాన్’, ‘ఒడియా సాహిత్య’, ‘ప్రేరణ’ వంటి పత్రికలు సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి అనువాద సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక ‘కరోనా’ కాలంలో తెలుగులో మనకు ఉన్న వారపత్రికలు కూడా మూతబడ్డాయి. ఒడియాలో అనువాద సాహిత్యానికి అక్కడి పత్రికలు బాసటగా నిలుస్తుంటే, మనకు అలాంటి పత్రికలే ఇక్కడ కరవయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఒడిశా వెనుకబడిన రాష్ట్రమే అయినా, సాహితీరంగంలో మాత్రం ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. ఇతర భాషల సంగతి పక్కనపెడితే, తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే వస్తున్నాయి. బరంపురానికి చెందిన కడి రామయ్య వేమన పద్యాలను దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఒడియాలోకి అనువదించారు. ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ నవల ‘హృదయ నేత్రి’ని రఘునాథ్ పాఢి శర్మ ఒడియాలోకి అదే పేరుతో అనువదించారు. ఇది ఒడియాలోనూ మంచి పాఠకాదరణ పొందింది. వేంపల్లి గంగాధర్ రాసిన ‘ఆగ్రా టాంగా’ను ‘ఆగ్రారొ టాంగావాలా’ పేరిట అంజలీ దాస్ అనువదించారు. తెలుగు నుంచి ఒడియాలోకి విరివిగా అనువాదాలు సాగిస్తున్న వారిలో బంగాళీ నంద ప్రముఖుడు. ఉభయ భాషలూ ఎరిగిన ఒడియా రచయిత బంగాళీ నంద నేరుగా తెలుగు నుంచి ఒడియాలోకి అనువాదాలు సాగిస్తుండటం విశేషం. శివారెడ్డి, ఎన్.గోపి, ఓల్గా తదితరుల రచనలను ఆయన అనువదించారు. వీటిలో పలు పుస్తకాలను సాహిత్య అకాడమీ ప్రచురించింది. బరంపురానికి చెందిన ఉపద్రష్ట అనూరాధ పలు తెలుగు రచనలను ఒడియాలోకి అనువదించడమే కాకుండా, సుప్రసిద్ధ ఒడియా రచయిత మనోజ్ దాస్ కథలను, పలు ఇతర ఒడియా రచనలను తెలుగులోకి తీసుకొచ్చారు. ఉభయ భాషల్లోనూ ఆమె అనువాదాలు పాఠకాదరణ పొందాయి. కళింగ సీమలో చాగంటి తులసి కూడా విరివిగా అనువాదాలు చేశారు. ‘వికాసం’ కార్యదర్శి రవిశర్మ ఇటీవల అరణ్యకృష్ణ కవితలను తెలుగు నుంచి ఒడియాలోకి అనువదించారు. ఉభయ భాషల్లోని కొత్తతరం రచయితలు, కవులు విరివిగా అనువాదాలు చేస్తున్నట్లయితే, ఒకరి సాహిత్యం మరొకరికి చేరువ కావడమే కాకుండా, ఉభయ భాషల ప్రజల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: ఆంధ్రీ కుటీరం పేరుతో.. తండ్రి ఆశీస్సులతో..) – పన్యాల జగన్నాథదాసు, కవి, సీనియర్ జర్నలిస్టు -
కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’
తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది. అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్.ఎన్.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు. ‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది. ‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. ‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్’ (హిందీ అనువాదం), ఇన్నర్ విజన్ (ఇంగ్లిష్ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్ అనువాదం ‘విండ్స్ ఆర్ అలైవ్’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి. – పన్యాల జగన్నాథ దాసు, సీనియర్ జర్నలిస్ట్ -
వికాసం: సమస్యని చంపటానికి మూడు బాణాలు
మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. వింధ్యారణ్య ప్రాంత లోయలో ఒక చిన్న పల్లె ఉంది. పచ్చటి చెట్ల మధ్య సంతోషంగా కాలం గడిపే ఆ గిరిజనులకి అకస్మాత్తుగా ఒక విపత్తు వచ్చి పడింది. గుంపులుగుంపులుగా పులులు వచ్చి వాళ్ల ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకోవటమే కాక, ఇళ్లమీద కూడా దాడి చేయసాగాయి. ఆ గ్రామస్థులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి శరణు వేడారు. వాళ్లని రక్షించడం కోసం ద్రోణుడు ధర్మరాజుని పంపాడు. ధర్మరాజు వెళ్లి పులుల తాలూకు తరువాతి దాడి కోసం ఆ గ్రామంలో ఎదురుచూశాడు. అవి వచ్చినప్పుడు వాటి నాయకుణ్ని చంపి, మిగతా వాటిని అడవిలోకి పారదోలాడు. విజయోత్సాహంతో గిరిజనులు నాట్యాలు చేశారు. ధర్మరాజుకి ఘనంగా సత్కారం చేసి పంపారు. కానీ వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగే సరికి ఆ క్రూర మృగాలు ఈసారి మరింత పెద్ద గుంపుగా గ్రామం మీద పడ్డాయి. ద్రోణుడు భీముణ్ని పంపాడు. భీముడి ఆయుధం ‘గద’. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటి. అయితే అది ఏనుగుని సంహరించగలదు, రథాల్ని బద్దలగొట్టగలదే తప్ప ‘చురుకైన’ పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. భీముడు క్షతగాత్రుడై పడిపోయాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తనకున్న విలువిద్యా నైపుణ్యంతో అన్ని పెద్దపులుల్ని చంపి తన సోదరుడిని రక్షించి వెనక్కి తెచ్చాడు. ద్రోణుడు అర్జునుణ్ని అభినందించాడు. అయితే సమస్య తీరలేదు. ఏడాది తిరిగే సరికి యవ్వనంతో బలిసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. గ్రామస్తులు మళ్లీ వెళ్లి ద్రోణున్ని శరణు వేడారు. అతడు ఈసారి ఆఖరి ఇద్దరిని పంపించాడు. నకుల సహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, తగినంత ధైర్యాన్నిచ్చి పులులతో ఎలా యుద్ధం చేయాలో వాళ్లకి సహదేవుడు నేర్పి యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు ఏమాత్రం ప్రాణనష్టం లేకుండా గ్రామస్థులే వాటిని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకుల సహదేవుల్ని ‘ఇది నిశ్చయంగా మీ విజయం’ అంటూ ద్రోణుడు పొగిడాడు. ఈ కథ మూడు సూత్రాల్ని చెబుతుంది. 1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. 3. మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం. ‘సమస్య’ అంటే ఏమిటి? ఆర్థిక, గృహ, వృత్తిపరమైన రంగాల్లో బాధనీ, ఇబ్బందినీ కలుగజేసేది. ఇది శారీరకం కావొచ్చు. మానసికం కావొచ్చు. ఇంట్లో జీవిత భాగస్వామితో బాధలు, బయట అవమానాలు, రేపటి పట్ల భయం, దగ్గరివారి మరణం మొదలైనవి ‘మానసిక’ కష్టాలు. అనారోగ్యం, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో వెహికల్ ఆగిపోవటం, అర్ధరాత్రి ఏసీ పనిచెయ్యకపోవటం, ‘శారీరక’ బాధలకి ఉదాహరణలు. ‘సమస్యలు క్లిష్టమైనవి కాబట్టి వాటిని మనం ధైర్యంతో ఎదుర్కొనలేము’ అన్న సిద్ధాంతం తప్పు. మనం ధైర్యంతో ఎదుర్కోలేకపోబట్టే సమస్యలు క్లిష్టమౌతాయి. నరకం (సమస్య)లో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోతే, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. అడుగు ముందుకు వేస్తే, బయటపడటానికి కనీసం ‘సగం అవకాశం’ ఉంటుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: నాలుగు రకాల తండ్రులు
పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయనగా ఒక కొడుకు ‘పక్క ఊరి గుడికి మా స్నేహితులందరూ వెళ్తున్నారు. అక్కడ గుండు గీయించుకొని, చెరువులో మునిగి, దేవుడికి దండం పెట్టుకుంటే ఫస్టు ర్యాంకు వస్తుందట’ అని చెప్పాడనుకుందాం. వివిధ రకాల తండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం. హిరణ్యకశ్యపులు: ‘పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని గుళ్లకీ గోపురాలకీ తిరుగుతావా? (మధ్యలో భార్య అడ్డొస్తే) నోర్ముయ్! నీ మూలానే వీడిలా తయారయ్యాడు.’ పిల్లల్ని సొంతగా ఆలోచించనివ్వకుండా ప్రతి చిన్న విషయంలోనూ వేలుపెట్టడం, క్రమశిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం, తాము సాధించలేని పెద్ద పెద్ద ఆశలు పిల్లవాడి మీద పెట్టుకోవడం, అవి తీరకపోతే నిరాశతో మరింత రాక్షసులుగా మారటం, తమ మాటే వేదవాక్కులా నడవాలి అనుకోవటం ఈ టైపు తండ్రుల లక్షణాలు. వీళ్లకి తమ మీద, తమ మేధస్సు మీద గొప్ప నమ్మకం. పై ఉదాహరణలో ఆ పిల్లవాడు గాని పరీక్ష ఫెయిల్ అయితే ‘నా తప్పేమీ లేదు. గుడికి వెళ్తానంటే నాన్న వద్దన్నాడు. అందువల్ల భగవంతుడు నా తండ్రిపై ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు’ అని ఎస్కేప్ అయిపోతాడు. దృతరాష్టులు: ‘తప్పకుండా వెళ్దాం నాయినా! రేపే వెళ్దాం! నీతో పాటు నేను, మీ అమ్మ, అక్కయ్య కూడా గుండు కొట్టించుకుంటాం. నువ్వు పాసైతే మాకదే చాలు. నీ కోరిక మేమెప్పుడైనా కాదన్నామా?’ వీళ్లకి సంతానం ఏది చెప్తే అదే వేదం. ఆ తరువాత పిల్లవాడు ఫెయిల్ అయితే, ‘భగవంతుడి మీద (చదవటం మానేసి) భారం మోపాను. నేనేం చెయ్యను’ అని సమర్థించుకుంటాడు. చాలామంది తాగుబోతులు, క్లబ్బుల్లో జూదగాళ్లు, రాజకీయ నాయకులు తమ తమ రంగాల్లో చాలా బిజీగా ఉన్నాం అనుకొనేవారు ఈ విభాగంలోకి వస్తారు. పిల్లల మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పిల్లవాడు ఏది అడిగితే అది ఇవ్వటం ఈ రకపు తల్లిదండ్రుల అవలక్షణాలు. మరికొందరు పెద్దలు ‘నే చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు. మా పిల్లలైనా అనుభవించనీ’ అన్న ఉద్దేశంతో పిల్లల్ని విపరీతమైన గారాబంతో పెంచుతూ వారి భవిష్యత్తుని పాడుచేస్తారు. చిన్న వయసులోనే పిల్లలు హుక్కా హౌసుల్లో గంజాయికి అలవాటు పడటానికి, కారు ఆక్సిడెంట్లలో మరణించటానికి ఇలాంటి తల్లిదండ్రులే కారణం. జనకులు: ‘నేను నీ నమ్మకాన్ని కాదనను. కానీ పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణాల్తో చదువు పాడుచేసుకోకు. పరీక్షలయ్యాక, తప్పకుండా వెళ్దాం. కానీ కేవలం చెరువులో మునిగి గుండు గీయించుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ పాటికి చాలామందికి రావాలి కదా? తార్కికంగా ఆలోచించు. చదువుకోవటం ముఖ్యం. నమ్మకం తరువాత.’ పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులానికి పంపించి వేయటం వల్ల పురాణాల్లో (పిల్లల్ని బాగా పెంచటానికి ఉదాహరణగా నిలిచే) మంచి తండ్రులు తక్కువ కనపడతారు. ఒకవైపు స్త్రీ ధర్మాన్ని, మరొకవైపు ఆత్మగౌరవాన్ని సీతకు బోధించిన జనకుడు, ఇంకా కొంతవరకూ... దశరథుడు, అర్జునుడు వగైరా మంచి జనకులు. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి చేదోడు వాదోడుగా నిలిచి, వాళ్ల గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి సహాయపడతారు. దుర్యోధనులు: పిరికితనానికి మరోపేరైన లక్ష్మణ కుమారుడు ఇతడి కొడుకు. ఇతడి ప్రస్తావన ఉదాహరణకే తప్ప వాదనకి కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా భయంతోను, బలహీనతతోను ఉంటారు. కూతురికి ఐఐటీ సీటు వస్తే, ‘తాము నివసించే ప్రాంతానికి అది దూరం’ అని వదులుకున్న తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి స్వరంతో కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుంది. చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బలవంతంగా ఆ ట్రైనింగ్ మాన్పించారు. ఒక చెట్టు కింద ఒకామె ఏడుస్తుంటే గమనించాను. ఆ తరువాత తెలిసిన విషయమేమిటంటే, ఆమె కొడుకు లోపల ఎల్.కె.జి. ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. ఇది టెన్షన్‌కి పరాకాష్ట.అమ్మ మమకారం అందిస్తే, నాన్న ధైర్యం ఇస్తాడు. అమ్మలా అక్కున చేర్చుకోకపోవచ్చు. కానీ వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు. తండ్రి అవటం సులభం. మంచి సంతానానికి తండ్రి అవటం కష్టం. భగవంతుడు అన్నిచోట్లా దీపం పట్టుకుని నిలబడి దారి చూపించలేడు. అందుకే తండ్రుల్ని సృష్టించాడు. - yandamoori@hotmail.com యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: అల్లరికి నిర్వచనం
‘‘...పిల్లలకి రెండేళ్లు వచ్చేవరకూ నడవమని, మరింత మాట్లాడమనీ ప్రోత్సహిస్తాం. ఆ తరువాత ఇరవై ఏళ్లు కుదురుగా కూర్చోమని, మౌనంగా ఉండమని ప్రార్థిస్తాం’’ అంటుంది 69 మంది పిల్లల తల్లి మిస్సెస్ ఫియొడెర్ వసిలేవ్(ప్రపంచ రికార్డ్ హోల్డర్). తల్లిదండ్రులకి ‘పేరెంటింగ్’ మీద ఇచ్చే ఉపన్యాసాల్లో, ‘అల్లరి’ అంటే ఏమిటో నిర్వచించమని అడిగినప్పుడు, చాలామంది తల్లిదండ్రులు కూడా సరి అయిన సమాధానం చెప్పలేదు. తమకి విసుగు కలిగించే ప్రతీ పనినీ అల్లరి అంటారు చాలామంది తల్లిదండ్రులు. ‘‘పెద్దలు చెప్పిన మాట వినకపోవటమే అల్లరి’’ అంటారు మరికొందరు. నిర్వచనానికి ఇది కాస్త దగ్గరగా ఉన్నా నూటికి నూరుపాళ్లు కరెక్ట్ కాదు. ‘తిను’ అంటే తినకపోవటం, ‘ఆడు’ అంటే ఆడకపోవటం అల్లరి ఎలా అవుతుంది? బద్దకం, ఆలస్యంగా నిద్ర లేవటం, చెప్పిన మంచి మాట వినకపోవటం, ఎప్పుడూ పక్కమీదే పడుకొని ఉండటం, చిన్న చిన్న దొంగతనాలు చెయ్యటం, గట్టిగా అరుస్తూ గెంతులెయ్యటం, అతిథుల్ని డిస్టర్బ్ చెయ్యడం, అన్నం తినకపోవటం, తింటున్న ప్లేట్లు విసిరెయ్యటం, గంటల తరబడి టీవీ చూడటం, పెద్ద గొంతుతో వాదించటం... అన్నీ అల్లరిలోకే వస్తాయి. అల్లరి చాలావరకు క్రమశిక్షణా రాహిత్యంతో కూడుకున్నది. తల్లిదండ్రుల బలహీనత మీద పిల్లలు ఆడుకునే గేమ్‌తో అది మొదలవుతుంది. పిల్లలకి అల్లరి (ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్) తల్లిదండ్రులే నేర్పుతారు అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. అమ్మ చేసిన కూర నచ్చకపోతే దఢేలున ప్లేటు విసిరేస్తాడు కుర్రవాడు. బయట రూమ్‌లో పేపర్ చదువుతున్న తండ్రి విసుగ్గా ‘ఎందుకే వాడినలా విసిగిస్తావు? వాడికి ఇష్టమైందేదో చేసి పెట్టొచ్చు కదా’ అని తిడతాడు. తనకి కావలసింది కావాలంటే నాన్నని విసిగించాలి అన్న విషయం కుర్రవాడికి అర్థమవుతుంది. ముగ్గురూ బజారు వెళ్లినప్పుడు, క్రికెట్ బ్యాట్ కొనిపెట్టమంటే తండ్రి ‘మొన్నే కదా కొనిచ్చాను’ అని తిడతాడు. అప్పుడు ఆ కుర్రవాడు తల్లి దగ్గరికి వెళ్లి, ‘అమ్మా బ్యాటు... అమ్మా బ్యాటు’ అంటూ అందరూ వినేలా రాగం తీస్తాడు. ఈమెకీ బ్యాటుకీ సంబంధం ఏమిటా అని చుట్టూ ఉన్నవారందరూ వింతగా చూడటంతో ఆమె ఇబ్బందిపడి భర్తతో ‘వాడికి బ్యాట్ కొనిస్తారా? లేదా?’ అని బెదిరించినట్లు అడుగుతుంది. తండ్రి చచ్చినట్టు కొనిపెడతాడు. అప్పుడా కుర్రవాడికి ఒక విశ్వ రహస్యం అర్థమవుతుంది. ఇంట్లో నాన్నని విసిగించటం ద్వారా, బయట అమ్మని విసిగించటం ద్వారా, మొత్తం మీద అమ్మానాన్నలని ఆ విధంగా విడగొట్టడం ద్వారా తనక్కావలసిన పనులు చేయించుకోవచ్చు అని ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక సర్వే ప్రకారం పదహారేళ్లు వచ్చేసరికి టీనేజర్స్ సగటున పదివేల క్రైమ్, వయొలెన్స్, రొమాన్స్, హారర్ సంఘటనలు చదివి గానీ, సినిమాల్లో చూసి గానీ, విని గానీ ఉంటారట. కొన్ని వందల టీవీ సీరియల్స్ చూసి ఉండటం వల్ల వాళ్లకి ‘పెద్దలకి తెలివితేటలు ఉండవనీ, తండ్రులు తిట్టడానికీ, తల్లులు ఏడవటానికీ మాత్రమే పనికివస్తారనీ’ ఒక గాఢమైన అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుందిట. పిల్లల్లో అల్లరి తగ్గాలంటే భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఒకరు తిడుతున్నప్పుడు మరొకరు మాట్లాడకూడదు. ‘నువ్వు మమ్మల్ని విడగొట్టి మా బలహీనతల మీద ఆడుకోలేవు’ అన్న విషయం పిల్లవాడికి స్పష్టంగా అర్థమయ్యేలా ప్రవర్తించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ క్రమశిక్షణతో ఉండాలి. తాము టీవీ చూస్తూ, పిల్లల్ని వేరే గదిలో కూర్చుని చదువుకోమంటే అది సాధ్యం కాదు. చాలామంది పెద్దలు తాము గొప్ప తెలివిగా పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నామనుకొంటారు. తమ కన్నా పిల్లలు తెలివైనవాళ్లు అని నమ్మాలి. ఒక తండ్రి భారతదేశ పటాన్ని రాష్ట్రాలవారిగా కత్తిరించి కూతురికిచ్చి, ‘అరగంటలో వీటిని సరిగ్గా అతికించి చూపించు’ అన్నాడు. ఆ అమ్మాయి అయిదు నిమిషాల్లో ఆ పని చేసింది. ఆశ్చర్యపోయిన తండ్రి ‘ఇంత అద్భుతంగా ఎలా చేశావు’ అని అడిగితే, ఆ అమ్మాయి, ‘ఏముంది? వెనుక వైపు నా అభిమాన హీరో బొమ్మ చూసి అతికించాను’ అని చెప్పింది. - యండమూరి వీరేంద్రనాథ్ yandamoori@hotmail.com -
వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు
రోటరీ తరఫున ఇండియా వచ్చిన ఒక వియత్నాం మిత్రుడిని షాపింగ్‌కి తీసుకువెళ్లినప్పుడు, దాదాపు ప్రతి షాపు ముందూ ‘వాంటెడ్ సేల్స్‌బాయ్స్ - గర్ల్స్’ అన్న బోర్డు చూసి, ‘‘ఇన్ని ఉద్యోగాలుండగా మీ దేశంలో ఇంత నిరుద్యోగ సమస్య ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మా వాళ్లంతా డిగ్నిఫైడ్‌గా చదువుకున్నవారు’’ అన్నాను. ‘‘ఇంట్లో ఉండటం డిగ్నిటీయా?’’ అన్నాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉన్నదేమో అని చూశాను. కానీ అలాంటిదేమీ కనపడలేదు. ‘‘వాళ్లు ఇళ్లల్లో ఉండరు. సిటీలో కంప్యూటరో, సివిల్స్కో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు’’ అన్నాను. అతడు సాలోచనగా ‘‘చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ట్రైనింగ్ పొందవచ్చుగా’’ అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. ఒక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి, నిరుద్యోగులకి మధ్య నిష్పత్తిని నిరుద్యోగ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలోకెల్లా సౌభాగ్యవంతమైన ఖతర్ దేశంలో రెండొందల మందికి ఒక నిరుద్యోగి ఉంటే, బీద జింబాబ్వేలో నూటికి ఎనభై, భారతదేశంలో నూటికి ఏడుగురు నిరుద్యోగులు ఉన్నారు. నా గెస్ట్ తాలూకు దేశమైన వియత్నాం యుద్ధాల దేశం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అక్కడి అనెంప్లాయ్మెంట్ ఇండెక్స్ కేవలం మూడు శాతం మాత్రమే. బాల్యం నుంచే సమయం విలువ బాగా తెలుసుకున్నవాడు త్వరగా ధనవంతుడవుతాడు. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే గెలుపుకి మొదటి సోపానం. ఆ తర్వాత డబ్బు సంపాదించటానికి ఐదు మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు ‘కోరిక’: ఒకే ఒక్క ప్రశ్న. నాకు నిజంగా డబ్బు కావాలా లేక డబ్బు సంపాదించటం చేతకాకపోవటం వల్ల, నక్కా-ద్రాక్ష పళ్ల వ్యవహారంగా నేను నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఒక నిర్వికార వేదాంతిలాగ ఫోజు కొడుతున్నానా? రెండో మెట్టు ‘అవకాశం’: రెండే ప్రశ్నలు. అవకాశాలు లేకపోతే వాటిని నేనే విధంగా సృష్టించుకోవాలి? నేను పెద్ద తెలివైనవాడిని కాదు, చదువులో బ్రిలియెంట్ కాదు. కనీసం క్షవరం గాని, వడ్రంగి పని గాని చేయలేను. వ్యాపార మెళకువలు అస్సలు తెలియదు. అయినా నేను డబ్బు సంపాదించగలనా? మూడో మెట్టు ‘అవగాహన’: మూడు ప్రశ్నలు. నేనొక అవకాశం సృష్టించుకోవటానికి ఎంత డబ్బు, ఎంత సమయం వెచ్చించాలి? దీనిలో ఎంత శారీరక, మానసిక శ్రమ ఉన్నది? డబ్బు, సమయం, శక్తి... వీటిని నేను ఏ విధంగా సమకూర్చుకోగలను? నాలుగో మెట్టు ‘అంచనా’: నాలుగే నాలుగు ప్రశ్నలు. డబ్బు సంపాదించాలంటే నిశ్చయంగా తప్పు చేయాలా? ఈ ప్రపంచంలో ఎంతోమంది బీదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు సంపాదించి ధనవంతులైపోతూ ఉంటే, నేనింకా ఎందుకు వెనకబడి ఉన్నాను? డబ్బు సంపాదించటానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి అనుకుంటే అది ఏమిటి? ఒక డాక్టర్ అవటానికి గాని, ఇంజినీర్ అవటానికి గాని గొప్ప చదువు ఉండాలి సరే, కానీ ఎంతో మంది చదువులేనివాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కదా. అంటే, ధనవంతుడవ్వటానికి ఏ చదువూ అవసరం లేదన్న మాటేగా! వాళ్లకున్నది, నాకు లేనిది ఏమిటి? నాలో లోటుపాట్లు గురించి నేనెప్పుడైనా విమర్శ చేసుకున్నానా? అయిదో మెట్టు ‘పరిష్కారం’: దీనికి మాత్రం పది ప్రశ్నలు. గతంలో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసినవారు వాటిని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వచ్చేశారే? నేరస్తులు కూడా పరివర్తన చెంది డబ్బు సంపాదిస్తోండగా నేనెందుకు కేవలం నా తప్పుల గురించి, గతం గురించి, అనర్హతల గురించి బాధపడుతూ సమయం వృథా చేస్తున్నాను? నా జీవితాన్ని జీరో బేస్డ్ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు సలహా ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరు? నిజంగా ఈ సమస్య అంత పెద్దదా? అనవసరంగా ఊహించుకుంటున్నానా? డబ్బు సంపాదించటానికి నేనిప్పుడు చెయ్యబోయే ప్రయత్నాల్లో పూర్తిగా ఫెయిల్ అయితే నేనేం నష్టపోతాను? ఎంత నాశనం అవుతాను? చచ్చిపోతానా? ఒకవేళ నేను చచ్చిపోవటానికి ఇష్టపడకపోతే మరింత బలంగా పైకి లేవటం కోసం నేనేం చెయ్యాలి? - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు
రోటరీ తరఫున ఇండియా వచ్చిన ఒక వియత్నాం మిత్రుడిని షాపింగ్‌కి తీసుకువెళ్లినప్పుడు, దాదాపు ప్రతి షాపు ముందూ ‘వాంటెడ్ సేల్స్‌బాయ్స్ - గర్ల్స్’ అన్న బోర్డు చూసి, ‘‘ఇన్ని ఉద్యోగాలుండగా మీ దేశంలో ఇంత నిరుద్యోగ సమస్య ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మా వాళ్లంతా డిగ్నిఫైడ్‌గా చదువుకున్నవారు’’ అన్నాను. ‘‘ఇంట్లో ఉండటం డిగ్నిటీయా?’’ అన్నాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉన్నదేమో అని చూశాను. కానీ అలాంటిదేమీ కనపడలేదు. ‘‘వాళ్లు ఇళ్లల్లో ఉండరు. సిటీలో కంప్యూటరో, సివిల్స్కో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు’’ అన్నాను. అతడు సాలోచనగా ‘‘చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ట్రైనింగ్ పొందవచ్చుగా’’ అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. ఒక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి, నిరుద్యోగులకి మధ్య నిష్పత్తిని నిరుద్యోగ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలోకెల్లా సౌభాగ్యవంతమైన ఖతర్ దేశంలో రెండొందల మందికి ఒక నిరుద్యోగి ఉంటే, బీద జింబాబ్వేలో నూటికి ఎనభై, భారతదేశంలో నూటికి ఏడుగురు నిరుద్యోగులు ఉన్నారు. నా గెస్ట్ తాలూకు దేశమైన వియత్నాం యుద్ధాల దేశం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అక్కడి అనెంప్లాయ్మెంట్ ఇండెక్స్ కేవలం మూడు శాతం మాత్రమే. బాల్యం నుంచే సమయం విలువ బాగా తెలుసుకున్నవాడు త్వరగా ధనవంతుడవుతాడు. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే గెలుపుకి మొదటి సోపానం. ఆ తర్వాత డబ్బు సంపాదించటానికి ఐదు మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు ‘కోరిక’: ఒకే ఒక్క ప్రశ్న. నాకు నిజంగా డబ్బు కావాలా లేక డబ్బు సంపాదించటం చేతకాకపోవటం వల్ల, నక్కా-ద్రాక్ష పళ్ల వ్యవహారంగా నేను నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఒక నిర్వికార వేదాంతిలాగ ఫోజు కొడుతున్నానా? రెండో మెట్టు ‘అవకాశం’: రెండే ప్రశ్నలు. అవకాశాలు లేకపోతే వాటిని నేనే విధంగా సృష్టించుకోవాలి? నేను పెద్ద తెలివైనవాడిని కాదు, చదువులో బ్రిలియెంట్ కాదు. కనీసం క్షవరం గాని, వడ్రంగి పని గాని చేయలేను. వ్యాపార మెళకువలు అస్సలు తెలియదు. అయినా నేను డబ్బు సంపాదించగలనా? మూడో మెట్టు ‘అవగాహన’: మూడు ప్రశ్నలు. నేనొక అవకాశం సృష్టించుకోవటానికి ఎంత డబ్బు, ఎంత సమయం వెచ్చించాలి? దీనిలో ఎంత శారీరక, మానసిక శ్రమ ఉన్నది? డబ్బు, సమయం, శక్తి... వీటిని నేను ఏ విధంగా సమకూర్చుకోగలను? నాలుగో మెట్టు ‘అంచనా’: నాలుగే నాలుగు ప్రశ్నలు. డబ్బు సంపాదించాలంటే నిశ్చయంగా తప్పు చేయాలా? ఈ ప్రపంచంలో ఎంతోమంది బీదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు సంపాదించి ధనవంతులైపోతూ ఉంటే, నేనింకా ఎందుకు వెనకబడి ఉన్నాను? డబ్బు సంపాదించటానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి అనుకుంటే అది ఏమిటి? ఒక డాక్టర్ అవటానికి గాని, ఇంజినీర్ అవటానికి గాని గొప్ప చదువు ఉండాలి సరే, కానీ ఎంతో మంది చదువులేనివాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కదా. అంటే, ధనవంతుడవ్వటానికి ఏ చదువూ అవసరం లేదన్న మాటేగా! వాళ్లకున్నది, నాకు లేనిది ఏమిటి? నాలో లోటుపాట్లు గురించి నేనెప్పుడైనా విమర్శ చేసుకున్నానా? అయిదో మెట్టు ‘పరిష్కారం’: దీనికి మాత్రం పది ప్రశ్నలు. గతంలో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసినవారు వాటిని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వచ్చేశారే? నేరస్తులు కూడా పరివర్తన చెంది డబ్బు సంపాదిస్తోండగా నేనెందుకు కేవలం నా తప్పుల గురించి, గతం గురించి, అనర్హతల గురించి బాధపడుతూ సమయం వృథా చేస్తున్నాను? నా జీవితాన్ని జీరో బేస్డ్ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు సలహా ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరు? నిజంగా ఈ సమస్య అంత పెద్దదా? అనవసరంగా ఊహించుకుంటున్నానా? డబ్బు సంపాదించటానికి నేనిప్పుడు చెయ్యబోయే ప్రయత్నాల్లో పూర్తిగా ఫెయిల్ అయితే నేనేం నష్టపోతాను? ఎంత నాశనం అవుతాను? చచ్చిపోతానా? ఒకవేళ నేను చచ్చిపోవటానికి ఇష్టపడకపోతే మరింత బలంగా పైకి లేవటం కోసం నేనేం చెయ్యాలి? - యండమూరి వీరేంద్రనాథ్