పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయనగా ఒక కొడుకు ‘పక్క ఊరి గుడికి మా స్నేహితులందరూ వెళ్తున్నారు. అక్కడ గుండు గీయించుకొని, చెరువులో మునిగి, దేవుడికి దండం పెట్టుకుంటే ఫస్టు ర్యాంకు వస్తుందట’ అని చెప్పాడనుకుందాం. వివిధ రకాల తండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం.
హిరణ్యకశ్యపులు:
‘పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని గుళ్లకీ గోపురాలకీ తిరుగుతావా? (మధ్యలో భార్య అడ్డొస్తే) నోర్ముయ్! నీ మూలానే వీడిలా తయారయ్యాడు.’ పిల్లల్ని సొంతగా ఆలోచించనివ్వకుండా ప్రతి చిన్న విషయంలోనూ వేలుపెట్టడం, క్రమశిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం, తాము సాధించలేని పెద్ద పెద్ద ఆశలు పిల్లవాడి మీద పెట్టుకోవడం, అవి తీరకపోతే నిరాశతో మరింత రాక్షసులుగా మారటం, తమ మాటే వేదవాక్కులా నడవాలి అనుకోవటం ఈ టైపు తండ్రుల లక్షణాలు. వీళ్లకి తమ మీద, తమ మేధస్సు మీద గొప్ప నమ్మకం. పై ఉదాహరణలో ఆ పిల్లవాడు గాని పరీక్ష ఫెయిల్ అయితే ‘నా తప్పేమీ లేదు. గుడికి వెళ్తానంటే నాన్న వద్దన్నాడు. అందువల్ల భగవంతుడు నా తండ్రిపై ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు’ అని ఎస్కేప్ అయిపోతాడు.
దృతరాష్టులు:
‘తప్పకుండా వెళ్దాం నాయినా! రేపే వెళ్దాం! నీతో పాటు నేను, మీ అమ్మ, అక్కయ్య కూడా గుండు కొట్టించుకుంటాం. నువ్వు పాసైతే మాకదే చాలు. నీ కోరిక మేమెప్పుడైనా కాదన్నామా?’ వీళ్లకి సంతానం ఏది చెప్తే అదే వేదం. ఆ తరువాత పిల్లవాడు ఫెయిల్ అయితే, ‘భగవంతుడి మీద (చదవటం మానేసి) భారం మోపాను. నేనేం చెయ్యను’ అని సమర్థించుకుంటాడు. చాలామంది తాగుబోతులు, క్లబ్బుల్లో జూదగాళ్లు, రాజకీయ నాయకులు తమ తమ రంగాల్లో చాలా బిజీగా ఉన్నాం అనుకొనేవారు ఈ విభాగంలోకి వస్తారు. పిల్లల మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పిల్లవాడు ఏది అడిగితే అది ఇవ్వటం ఈ రకపు తల్లిదండ్రుల అవలక్షణాలు. మరికొందరు పెద్దలు ‘నే చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు. మా పిల్లలైనా అనుభవించనీ’ అన్న ఉద్దేశంతో పిల్లల్ని విపరీతమైన గారాబంతో పెంచుతూ వారి భవిష్యత్తుని పాడుచేస్తారు. చిన్న వయసులోనే పిల్లలు హుక్కా హౌసుల్లో గంజాయికి అలవాటు పడటానికి, కారు ఆక్సిడెంట్లలో మరణించటానికి ఇలాంటి తల్లిదండ్రులే కారణం.
జనకులు:
‘నేను నీ నమ్మకాన్ని కాదనను. కానీ పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణాల్తో చదువు పాడుచేసుకోకు. పరీక్షలయ్యాక, తప్పకుండా వెళ్దాం. కానీ కేవలం చెరువులో మునిగి గుండు గీయించుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ పాటికి చాలామందికి రావాలి కదా? తార్కికంగా ఆలోచించు. చదువుకోవటం ముఖ్యం. నమ్మకం తరువాత.’
పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులానికి పంపించి వేయటం వల్ల పురాణాల్లో (పిల్లల్ని బాగా పెంచటానికి ఉదాహరణగా నిలిచే) మంచి తండ్రులు తక్కువ కనపడతారు. ఒకవైపు స్త్రీ ధర్మాన్ని, మరొకవైపు ఆత్మగౌరవాన్ని సీతకు బోధించిన జనకుడు, ఇంకా కొంతవరకూ... దశరథుడు, అర్జునుడు వగైరా మంచి జనకులు. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి చేదోడు వాదోడుగా నిలిచి, వాళ్ల గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి సహాయపడతారు.
దుర్యోధనులు:
పిరికితనానికి మరోపేరైన లక్ష్మణ కుమారుడు ఇతడి కొడుకు. ఇతడి ప్రస్తావన ఉదాహరణకే తప్ప వాదనకి కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా భయంతోను, బలహీనతతోను ఉంటారు. కూతురికి ఐఐటీ సీటు వస్తే, ‘తాము నివసించే ప్రాంతానికి అది దూరం’ అని వదులుకున్న తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి స్వరంతో కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుంది.
చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బలవంతంగా ఆ ట్రైనింగ్ మాన్పించారు. ఒక చెట్టు కింద ఒకామె ఏడుస్తుంటే గమనించాను. ఆ తరువాత తెలిసిన విషయమేమిటంటే, ఆమె కొడుకు లోపల ఎల్.కె.జి. ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. ఇది టెన్షన్‌కి పరాకాష్ట.అమ్మ మమకారం అందిస్తే, నాన్న ధైర్యం ఇస్తాడు. అమ్మలా అక్కున చేర్చుకోకపోవచ్చు. కానీ వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు. తండ్రి అవటం సులభం. మంచి సంతానానికి తండ్రి అవటం కష్టం. భగవంతుడు అన్నిచోట్లా దీపం పట్టుకుని నిలబడి దారి చూపించలేడు. అందుకే తండ్రుల్ని సృష్టించాడు.
- yandamoori@hotmail.com
యండమూరి వీరేంద్రనాథ్