Yandamuri veerendranadh
-
రాయకుండా ఉండలేకపోయా!
పెత్తందార్ల అమానుష ప్రవర్తనలను తెలియజేసిన తెలుగు ఆధునిక నాటకం ‘కుక్క’ రజతోత్సవ సంవత్సర నేపథ్యంలో ఆత్రేయ, ఎన్.ఆర్.నంది వంటి ఆధునిక నాటక రచయితలకు కొనసాగింపుగా ప్రశంసలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ ‘కుక్క’ రూపొందిన వైనాన్ని నెమరువేసుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాయాలని రాసింది కాదు. రాయకుండా ఉండలేక రాసింది. నా సమక్షంలో జరిగిన వాస్తవిక సంఘటన నన్ను క్షుభితం చేసింది. ఆ అల్లకల్లోలాన్ని ఎలా వ్యక్తీకరించాలా? అని ఆలోచించాను. 1960ల్లో బ్యాంక్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్ జిల్లా కడెం అనే గ్రామం వెళ్లాను. నేను పనిచేస్తున్న జాతీయ బ్యాంకులో గౌరవంగా అప్పుతీసుకున్నాడు ఓ పటేలు. రికవరీ పనిపై మేం పటేలు ఇంటికి వెళ్లాం. మా దగ్గర అప్పుతీసుకున్న పటేలు గ్రామంలో అప్పులు ఇచ్చేవాడు. రికవరీ ఎలా చేసేవాడు? ఇంట్లోనే! వడ్డీకట్టని జీతగాళ్లను బండబూతులు తిడుతూ! నా సమక్షంలోనే పటేలు భార్య ఒక జీతగాణ్ణి కొట్టింది.. గంటెతో. నెత్తురు కక్కుకున్నాడు జీతగాడు! అతడు చేసిన నేరం? పటేలమ్మ పెట్టిన కూర అతడి చేతిలోంచి పడిపోవడమే! ‘మనుషులను కుక్కలకంటే హీనంగా చూస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం’ అని బలంగా చెప్పాలని నేను చేసిన ప్రయత్నం ‘కుక్క’గా రూపొందింది. ‘కుక్క కావాల్నా నాయినా..! ఒరే జీతగాడా, నువ్ జర కుక్కతీర్గ నిలబడరా...’ అన్న డైలాగ్‌కు ఎన్ని కనులు కన్నీరు కార్చాయో! ఎన్ని కన్నులు ఎర్రనయ్యాయో! కాబట్టే పదివేలసార్లకు పైగా ప్రదర్శితమైంది. ఇప్పుడు ‘నిశుంభిత’ తెలుగు నాటకాలను ప్రదర్శించే క్రమంలో ‘కుక్క’ను ప్రదర్శిస్తోంది! - ‘కుక్క’ రచయిత యండమూరి కుక్క నాటిక ప్రదర్శన నేడు ‘నిశుంభిత’ సంస్థ ఆధ్వర్యంలో దర్శకత్వం: రామమోహన్ హొలగొంది సమయం: సాయంత్రం 7.30 గంటలు వేదిక: లామకాన్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1 పాస్‌లకు: 9849256440 -
విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచాలి- ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్
దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: అధ్యాపకులు జ్ఞానంతో పాటు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచేలా బోధన పద్ధతిని అవలంభించాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. అప్పుడు విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారని చెప్పారు. స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం వ్యక్తిగత వికాసంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువు పట్ల ప్రేమతో, గౌరవ భావంతో మెలగడానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించాలని, అప్పుడే జన్మకు సార్థకత లభిస్తుందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త ఆలోచనలను ఆచరించే వారే ముందు భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలుస్తారన్నారు. క్లిష్ట సమస్యను ఎదుర్కొనేటప్పుడు వ్యక్తి యొక్క ప్రతి స్పందనలను నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. విద్యార్ధి తమ విద్యా జీవితంలో అధైర్యపడకుండా ముందు కు వెళ్లాలన్నారు. ఎప్పుడూ నిరాశకు తావివ్వకూడదని, ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నా రు. అనంతరం వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని కవితలు చెబుతూ ఆకట్టుకున్నారు. గోల్డ్‌మెడల్ ప్రదానం... యండమూరి విరేంద్రనాథ్ దాదాపు 400 మంది విద్యార్థులకు తార్కిక జ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. ఇందులో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి పృద్విదీప్రెడ్డి అత్యధిక మార్కులు సాధించి విజేతగా నిలిచారు. ఆ విద్యార్థికి యండమూరి గోల్డ్‌మెడల్ బహుకరించారు. అనంతరం కళాశాల యాజమాన్యం యాజమాన్యం యండమూరి వీరేంద్రనాథ్‌కు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి.తిరుపతిరెడ్డి, అకాడమిక్ సలహాదారులు డాక్టర్ కె.సుధాకర్, లక్ష్మినారాయణ, కార్యదర్శి పి.సూర్యనారాయణ, అధ్యక్షుడు సంపత్‌కుమార్, డీన్ ఐ.రవికుమార్, కన్వీనర్ టి.శ్రావణ్‌కుమార్, సంతోష్‌కుమార్, మీడియా అధికారి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
వికాసం: నాలుగు రకాల తండ్రులు
పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయనగా ఒక కొడుకు ‘పక్క ఊరి గుడికి మా స్నేహితులందరూ వెళ్తున్నారు. అక్కడ గుండు గీయించుకొని, చెరువులో మునిగి, దేవుడికి దండం పెట్టుకుంటే ఫస్టు ర్యాంకు వస్తుందట’ అని చెప్పాడనుకుందాం. వివిధ రకాల తండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం. హిరణ్యకశ్యపులు: ‘పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని గుళ్లకీ గోపురాలకీ తిరుగుతావా? (మధ్యలో భార్య అడ్డొస్తే) నోర్ముయ్! నీ మూలానే వీడిలా తయారయ్యాడు.’ పిల్లల్ని సొంతగా ఆలోచించనివ్వకుండా ప్రతి చిన్న విషయంలోనూ వేలుపెట్టడం, క్రమశిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం, తాము సాధించలేని పెద్ద పెద్ద ఆశలు పిల్లవాడి మీద పెట్టుకోవడం, అవి తీరకపోతే నిరాశతో మరింత రాక్షసులుగా మారటం, తమ మాటే వేదవాక్కులా నడవాలి అనుకోవటం ఈ టైపు తండ్రుల లక్షణాలు. వీళ్లకి తమ మీద, తమ మేధస్సు మీద గొప్ప నమ్మకం. పై ఉదాహరణలో ఆ పిల్లవాడు గాని పరీక్ష ఫెయిల్ అయితే ‘నా తప్పేమీ లేదు. గుడికి వెళ్తానంటే నాన్న వద్దన్నాడు. అందువల్ల భగవంతుడు నా తండ్రిపై ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు’ అని ఎస్కేప్ అయిపోతాడు. దృతరాష్టులు: ‘తప్పకుండా వెళ్దాం నాయినా! రేపే వెళ్దాం! నీతో పాటు నేను, మీ అమ్మ, అక్కయ్య కూడా గుండు కొట్టించుకుంటాం. నువ్వు పాసైతే మాకదే చాలు. నీ కోరిక మేమెప్పుడైనా కాదన్నామా?’ వీళ్లకి సంతానం ఏది చెప్తే అదే వేదం. ఆ తరువాత పిల్లవాడు ఫెయిల్ అయితే, ‘భగవంతుడి మీద (చదవటం మానేసి) భారం మోపాను. నేనేం చెయ్యను’ అని సమర్థించుకుంటాడు. చాలామంది తాగుబోతులు, క్లబ్బుల్లో జూదగాళ్లు, రాజకీయ నాయకులు తమ తమ రంగాల్లో చాలా బిజీగా ఉన్నాం అనుకొనేవారు ఈ విభాగంలోకి వస్తారు. పిల్లల మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పిల్లవాడు ఏది అడిగితే అది ఇవ్వటం ఈ రకపు తల్లిదండ్రుల అవలక్షణాలు. మరికొందరు పెద్దలు ‘నే చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు. మా పిల్లలైనా అనుభవించనీ’ అన్న ఉద్దేశంతో పిల్లల్ని విపరీతమైన గారాబంతో పెంచుతూ వారి భవిష్యత్తుని పాడుచేస్తారు. చిన్న వయసులోనే పిల్లలు హుక్కా హౌసుల్లో గంజాయికి అలవాటు పడటానికి, కారు ఆక్సిడెంట్లలో మరణించటానికి ఇలాంటి తల్లిదండ్రులే కారణం. జనకులు: ‘నేను నీ నమ్మకాన్ని కాదనను. కానీ పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణాల్తో చదువు పాడుచేసుకోకు. పరీక్షలయ్యాక, తప్పకుండా వెళ్దాం. కానీ కేవలం చెరువులో మునిగి గుండు గీయించుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ పాటికి చాలామందికి రావాలి కదా? తార్కికంగా ఆలోచించు. చదువుకోవటం ముఖ్యం. నమ్మకం తరువాత.’ పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులానికి పంపించి వేయటం వల్ల పురాణాల్లో (పిల్లల్ని బాగా పెంచటానికి ఉదాహరణగా నిలిచే) మంచి తండ్రులు తక్కువ కనపడతారు. ఒకవైపు స్త్రీ ధర్మాన్ని, మరొకవైపు ఆత్మగౌరవాన్ని సీతకు బోధించిన జనకుడు, ఇంకా కొంతవరకూ... దశరథుడు, అర్జునుడు వగైరా మంచి జనకులు. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి చేదోడు వాదోడుగా నిలిచి, వాళ్ల గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి సహాయపడతారు. దుర్యోధనులు: పిరికితనానికి మరోపేరైన లక్ష్మణ కుమారుడు ఇతడి కొడుకు. ఇతడి ప్రస్తావన ఉదాహరణకే తప్ప వాదనకి కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా భయంతోను, బలహీనతతోను ఉంటారు. కూతురికి ఐఐటీ సీటు వస్తే, ‘తాము నివసించే ప్రాంతానికి అది దూరం’ అని వదులుకున్న తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి స్వరంతో కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుంది. చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బలవంతంగా ఆ ట్రైనింగ్ మాన్పించారు. ఒక చెట్టు కింద ఒకామె ఏడుస్తుంటే గమనించాను. ఆ తరువాత తెలిసిన విషయమేమిటంటే, ఆమె కొడుకు లోపల ఎల్.కె.జి. ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. ఇది టెన్షన్‌కి పరాకాష్ట.అమ్మ మమకారం అందిస్తే, నాన్న ధైర్యం ఇస్తాడు. అమ్మలా అక్కున చేర్చుకోకపోవచ్చు. కానీ వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు. తండ్రి అవటం సులభం. మంచి సంతానానికి తండ్రి అవటం కష్టం. భగవంతుడు అన్నిచోట్లా దీపం పట్టుకుని నిలబడి దారి చూపించలేడు. అందుకే తండ్రుల్ని సృష్టించాడు. - yandamoori@hotmail.com యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: అల్లరికి నిర్వచనం
‘‘...పిల్లలకి రెండేళ్లు వచ్చేవరకూ నడవమని, మరింత మాట్లాడమనీ ప్రోత్సహిస్తాం. ఆ తరువాత ఇరవై ఏళ్లు కుదురుగా కూర్చోమని, మౌనంగా ఉండమని ప్రార్థిస్తాం’’ అంటుంది 69 మంది పిల్లల తల్లి మిస్సెస్ ఫియొడెర్ వసిలేవ్(ప్రపంచ రికార్డ్ హోల్డర్). తల్లిదండ్రులకి ‘పేరెంటింగ్’ మీద ఇచ్చే ఉపన్యాసాల్లో, ‘అల్లరి’ అంటే ఏమిటో నిర్వచించమని అడిగినప్పుడు, చాలామంది తల్లిదండ్రులు కూడా సరి అయిన సమాధానం చెప్పలేదు. తమకి విసుగు కలిగించే ప్రతీ పనినీ అల్లరి అంటారు చాలామంది తల్లిదండ్రులు. ‘‘పెద్దలు చెప్పిన మాట వినకపోవటమే అల్లరి’’ అంటారు మరికొందరు. నిర్వచనానికి ఇది కాస్త దగ్గరగా ఉన్నా నూటికి నూరుపాళ్లు కరెక్ట్ కాదు. ‘తిను’ అంటే తినకపోవటం, ‘ఆడు’ అంటే ఆడకపోవటం అల్లరి ఎలా అవుతుంది? బద్దకం, ఆలస్యంగా నిద్ర లేవటం, చెప్పిన మంచి మాట వినకపోవటం, ఎప్పుడూ పక్కమీదే పడుకొని ఉండటం, చిన్న చిన్న దొంగతనాలు చెయ్యటం, గట్టిగా అరుస్తూ గెంతులెయ్యటం, అతిథుల్ని డిస్టర్బ్ చెయ్యడం, అన్నం తినకపోవటం, తింటున్న ప్లేట్లు విసిరెయ్యటం, గంటల తరబడి టీవీ చూడటం, పెద్ద గొంతుతో వాదించటం... అన్నీ అల్లరిలోకే వస్తాయి. అల్లరి చాలావరకు క్రమశిక్షణా రాహిత్యంతో కూడుకున్నది. తల్లిదండ్రుల బలహీనత మీద పిల్లలు ఆడుకునే గేమ్‌తో అది మొదలవుతుంది. పిల్లలకి అల్లరి (ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్) తల్లిదండ్రులే నేర్పుతారు అంటే ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు. అమ్మ చేసిన కూర నచ్చకపోతే దఢేలున ప్లేటు విసిరేస్తాడు కుర్రవాడు. బయట రూమ్‌లో పేపర్ చదువుతున్న తండ్రి విసుగ్గా ‘ఎందుకే వాడినలా విసిగిస్తావు? వాడికి ఇష్టమైందేదో చేసి పెట్టొచ్చు కదా’ అని తిడతాడు. తనకి కావలసింది కావాలంటే నాన్నని విసిగించాలి అన్న విషయం కుర్రవాడికి అర్థమవుతుంది. ముగ్గురూ బజారు వెళ్లినప్పుడు, క్రికెట్ బ్యాట్ కొనిపెట్టమంటే తండ్రి ‘మొన్నే కదా కొనిచ్చాను’ అని తిడతాడు. అప్పుడు ఆ కుర్రవాడు తల్లి దగ్గరికి వెళ్లి, ‘అమ్మా బ్యాటు... అమ్మా బ్యాటు’ అంటూ అందరూ వినేలా రాగం తీస్తాడు. ఈమెకీ బ్యాటుకీ సంబంధం ఏమిటా అని చుట్టూ ఉన్నవారందరూ వింతగా చూడటంతో ఆమె ఇబ్బందిపడి భర్తతో ‘వాడికి బ్యాట్ కొనిస్తారా? లేదా?’ అని బెదిరించినట్లు అడుగుతుంది. తండ్రి చచ్చినట్టు కొనిపెడతాడు. అప్పుడా కుర్రవాడికి ఒక విశ్వ రహస్యం అర్థమవుతుంది. ఇంట్లో నాన్నని విసిగించటం ద్వారా, బయట అమ్మని విసిగించటం ద్వారా, మొత్తం మీద అమ్మానాన్నలని ఆ విధంగా విడగొట్టడం ద్వారా తనక్కావలసిన పనులు చేయించుకోవచ్చు అని ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక సర్వే ప్రకారం పదహారేళ్లు వచ్చేసరికి టీనేజర్స్ సగటున పదివేల క్రైమ్, వయొలెన్స్, రొమాన్స్, హారర్ సంఘటనలు చదివి గానీ, సినిమాల్లో చూసి గానీ, విని గానీ ఉంటారట. కొన్ని వందల టీవీ సీరియల్స్ చూసి ఉండటం వల్ల వాళ్లకి ‘పెద్దలకి తెలివితేటలు ఉండవనీ, తండ్రులు తిట్టడానికీ, తల్లులు ఏడవటానికీ మాత్రమే పనికివస్తారనీ’ ఒక గాఢమైన అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటుందిట. పిల్లల్లో అల్లరి తగ్గాలంటే భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఒకరు తిడుతున్నప్పుడు మరొకరు మాట్లాడకూడదు. ‘నువ్వు మమ్మల్ని విడగొట్టి మా బలహీనతల మీద ఆడుకోలేవు’ అన్న విషయం పిల్లవాడికి స్పష్టంగా అర్థమయ్యేలా ప్రవర్తించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ క్రమశిక్షణతో ఉండాలి. తాము టీవీ చూస్తూ, పిల్లల్ని వేరే గదిలో కూర్చుని చదువుకోమంటే అది సాధ్యం కాదు. చాలామంది పెద్దలు తాము గొప్ప తెలివిగా పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నామనుకొంటారు. తమ కన్నా పిల్లలు తెలివైనవాళ్లు అని నమ్మాలి. ఒక తండ్రి భారతదేశ పటాన్ని రాష్ట్రాలవారిగా కత్తిరించి కూతురికిచ్చి, ‘అరగంటలో వీటిని సరిగ్గా అతికించి చూపించు’ అన్నాడు. ఆ అమ్మాయి అయిదు నిమిషాల్లో ఆ పని చేసింది. ఆశ్చర్యపోయిన తండ్రి ‘ఇంత అద్భుతంగా ఎలా చేశావు’ అని అడిగితే, ఆ అమ్మాయి, ‘ఏముంది? వెనుక వైపు నా అభిమాన హీరో బొమ్మ చూసి అతికించాను’ అని చెప్పింది. - యండమూరి వీరేంద్రనాథ్ yandamoori@hotmail.com -
వికాసం: ఈ ముగ్గురిలో ఎవరు మీరు?
అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. ఒక ఊళ్లో రామ్, రాబర్ట్, రహీమ్ అనే ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా చెప్పుల షాపులు స్థాపించారు. రామ్‌కి ఒక అద్భుతమైన కళ ఉన్నది. చెప్పును చూసి సరిగ్గా మన్నుతుందో లేదో చెప్పగలడు. చెప్పులు కుట్టేవాళ్లని కొంతమందిని పిలిచి, వాళ్లలో తనకి సంతృప్తికరంగా కుట్టినవారికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వారు తయారుచేసి తీసుకొచ్చిన చెప్పుల మీద తన సొంత బ్రాండ్ పేరు ముద్రిస్తాడు. అంతే. అది బాటా, పాపులర్, అడిడాస్, నైకీ, ఉడ్‌ల్యాండ్స్ లాంటిది ఏదైనా కావొచ్చు. కేవలం తన బ్రాండ్ పేరు వల్ల యాభై రూపాయలు ఖరీదు చేసే చెప్పుని అతడు రెండు వందలకి అమ్ముతాడు. అతని బ్రాండ్‌కి మన్నిక గ్యారెంటీ. కేవలం షాపు డెకరేషన్‌కే అతడు కొన్ని లక్షలు ఖర్చుపెట్టాడు. అక్కడ షాపింగ్ చేయటం ఆ ఊళ్లో వాళ్లకి ప్రిస్టేజి. సంవత్సరం తిరిగే సరికల్లా అతడు కోటి రూపాయలు సంపాదించాడు. రాబర్ట్‌కి స్కిల్ ఉంది. అద్భుతంగా చెప్పులు కుడతాడు. అతడు కుట్టిన చెప్పులు వేసుకుంటే మేఘాల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. చిన్న గదిలో కూర్చుని రోజుకి కేవలం అయిదు జతల చెప్పులు మాత్రమే కుడతాడు. ఒక్కొక్కదాని ఖరీదు దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. కేవలం రాజాలు, కోటీశ్వరులు అతని చెప్పులు కొనగలరు. సంవత్సరంలో అతడూ కోటి రూపాయలు సంపాదించాడు. రహీమ్ కొన్ని వేల చెప్పులు కొని ఒక గోడౌన్ లాంటి షాపులో పెట్టాడు. అక్కడ చెప్పుల జత కేవలం పాతిక రూపాయలకే దొరుకుతుంది. అయితే కుడి కాలి చెప్పు దొరికితే, ఎడమ కాలి చెప్పు కోసం దాదాపు అరగంట వెతుక్కోవాలి. అక్కడ తరచూ వినిపించే పదం ‘చౌక’. ఏడాదిలో అతడి లాభం కోటి దాటింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ గెలవాలనుకుంటాడు. కానీ కొందరు ఓడిపోతూంటారు. దీనికి కారణం వాళ్లు తమలో ఎటువంటి శక్తి ఉన్నదో సరిగ్గా గుర్తించలేకపోవటమే. ఒక మంచి నటుడు గొప్ప రాజకీయవేత్త కాలేకపోవచ్చు. ఒక గొప్ప క్రికెట్ ఆటగాడు మంచి నటుడు కాలేకపోవచ్చు. జీవితంలో గెలవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది మనిషి తన ‘అంతర్గత కళ’ని గుర్తించటం. ఒక వ్యాపారంలో గాని, వృత్తిలో గాని ప్రవేశించబోయేముందు అదే వృత్తిలో విఫలమైన వ్యక్తుల్ని పరిశీలించాలి. సక్సెస్ అయినవారి గెలుపు వెనుక కారణాన్ని పట్టుకోవాలి. దానికన్నా ముఖ్యంగా తనలో రామ్, రాబర్ట్, రహీమ్ లాంటి వ్యక్తి ఎవరున్నారో గుర్తించాలి. రహీమ్‌లు ట్రేడర్లు. కేవలం వ్యాపారం చేస్తారు. రాబర్ట్‌లు స్కిల్డ్ వర్కర్స్. రాబర్ట్‌లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లవుతే రిటైర్ అయ్యేవరకు రాత్రింబవళ్లు కంప్యూటర్ మీద పనిచేస్తూనే ఉంటారు. రామ్‌లు వారితో పని చేయించుకొంటారు. చేస్తున్న పనిమీద ఉత్సాహం, కృషి ఉంటే బిల్‌గేట్స్, స్టీవ్జాబ్స్లు తయారవుతారు. కావల్సింది కృషి. అది ఉంటే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. ఒక కుర్రవాడు రాత్రింబవళ్లు కృషి చేసి వెయ్యి మీటర్ల రేసుకి తయారయ్యాడు. పిస్టల్ సౌండు వినపడగానే గుండెల్లోకి గాలి, కళ్లలోకి బలం తీసుకొని పరిగెత్తటం ప్రారంభించాడు. అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. ఇంతలో పోటీ నిర్వాహకులు తనవైపు వేగంగా రావటం గమనించాడు. వాళ్లు కంగ్రాట్స్ చేస్తూంటే, ‘‘కానీ వాళ్లు నా కన్నా ముందే వెళ్లారుగా’’ అన్నాడు దిగులుగా. నిర్వాహకులు అటు చూసి, ‘‘లేదు లేదు. వాళ్లింకా నాలుగో రౌండు దాటుతున్నారు. ఆ చప్పట్లు మీకోసం’’ అన్నారు. ప్రస్తుతం మన యువత అమెరికా వెళ్లటానికి కలలు కంటోంది. రామ్‌లు పెరిగేకొద్దీ, అమెరికన్లు ఇండియాలో ఉద్యోగం చేయటానికి కలలు కంటారు. అందుకే దేశానికి నారాయణమూర్తి, రతన్‌టాటా లాంటి రామ్‌ల అవసరం చాలా ఉంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు
రోటరీ తరఫున ఇండియా వచ్చిన ఒక వియత్నాం మిత్రుడిని షాపింగ్‌కి తీసుకువెళ్లినప్పుడు, దాదాపు ప్రతి షాపు ముందూ ‘వాంటెడ్ సేల్స్‌బాయ్స్ - గర్ల్స్’ అన్న బోర్డు చూసి, ‘‘ఇన్ని ఉద్యోగాలుండగా మీ దేశంలో ఇంత నిరుద్యోగ సమస్య ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మా వాళ్లంతా డిగ్నిఫైడ్‌గా చదువుకున్నవారు’’ అన్నాను. ‘‘ఇంట్లో ఉండటం డిగ్నిటీయా?’’ అన్నాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉన్నదేమో అని చూశాను. కానీ అలాంటిదేమీ కనపడలేదు. ‘‘వాళ్లు ఇళ్లల్లో ఉండరు. సిటీలో కంప్యూటరో, సివిల్స్కో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు’’ అన్నాను. అతడు సాలోచనగా ‘‘చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ట్రైనింగ్ పొందవచ్చుగా’’ అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. ఒక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి, నిరుద్యోగులకి మధ్య నిష్పత్తిని నిరుద్యోగ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలోకెల్లా సౌభాగ్యవంతమైన ఖతర్ దేశంలో రెండొందల మందికి ఒక నిరుద్యోగి ఉంటే, బీద జింబాబ్వేలో నూటికి ఎనభై, భారతదేశంలో నూటికి ఏడుగురు నిరుద్యోగులు ఉన్నారు. నా గెస్ట్ తాలూకు దేశమైన వియత్నాం యుద్ధాల దేశం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అక్కడి అనెంప్లాయ్మెంట్ ఇండెక్స్ కేవలం మూడు శాతం మాత్రమే. బాల్యం నుంచే సమయం విలువ బాగా తెలుసుకున్నవాడు త్వరగా ధనవంతుడవుతాడు. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే గెలుపుకి మొదటి సోపానం. ఆ తర్వాత డబ్బు సంపాదించటానికి ఐదు మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు ‘కోరిక’: ఒకే ఒక్క ప్రశ్న. నాకు నిజంగా డబ్బు కావాలా లేక డబ్బు సంపాదించటం చేతకాకపోవటం వల్ల, నక్కా-ద్రాక్ష పళ్ల వ్యవహారంగా నేను నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఒక నిర్వికార వేదాంతిలాగ ఫోజు కొడుతున్నానా? రెండో మెట్టు ‘అవకాశం’: రెండే ప్రశ్నలు. అవకాశాలు లేకపోతే వాటిని నేనే విధంగా సృష్టించుకోవాలి? నేను పెద్ద తెలివైనవాడిని కాదు, చదువులో బ్రిలియెంట్ కాదు. కనీసం క్షవరం గాని, వడ్రంగి పని గాని చేయలేను. వ్యాపార మెళకువలు అస్సలు తెలియదు. అయినా నేను డబ్బు సంపాదించగలనా? మూడో మెట్టు ‘అవగాహన’: మూడు ప్రశ్నలు. నేనొక అవకాశం సృష్టించుకోవటానికి ఎంత డబ్బు, ఎంత సమయం వెచ్చించాలి? దీనిలో ఎంత శారీరక, మానసిక శ్రమ ఉన్నది? డబ్బు, సమయం, శక్తి... వీటిని నేను ఏ విధంగా సమకూర్చుకోగలను? నాలుగో మెట్టు ‘అంచనా’: నాలుగే నాలుగు ప్రశ్నలు. డబ్బు సంపాదించాలంటే నిశ్చయంగా తప్పు చేయాలా? ఈ ప్రపంచంలో ఎంతోమంది బీదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు సంపాదించి ధనవంతులైపోతూ ఉంటే, నేనింకా ఎందుకు వెనకబడి ఉన్నాను? డబ్బు సంపాదించటానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి అనుకుంటే అది ఏమిటి? ఒక డాక్టర్ అవటానికి గాని, ఇంజినీర్ అవటానికి గాని గొప్ప చదువు ఉండాలి సరే, కానీ ఎంతో మంది చదువులేనివాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కదా. అంటే, ధనవంతుడవ్వటానికి ఏ చదువూ అవసరం లేదన్న మాటేగా! వాళ్లకున్నది, నాకు లేనిది ఏమిటి? నాలో లోటుపాట్లు గురించి నేనెప్పుడైనా విమర్శ చేసుకున్నానా? అయిదో మెట్టు ‘పరిష్కారం’: దీనికి మాత్రం పది ప్రశ్నలు. గతంలో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసినవారు వాటిని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వచ్చేశారే? నేరస్తులు కూడా పరివర్తన చెంది డబ్బు సంపాదిస్తోండగా నేనెందుకు కేవలం నా తప్పుల గురించి, గతం గురించి, అనర్హతల గురించి బాధపడుతూ సమయం వృథా చేస్తున్నాను? నా జీవితాన్ని జీరో బేస్డ్ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు సలహా ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరు? నిజంగా ఈ సమస్య అంత పెద్దదా? అనవసరంగా ఊహించుకుంటున్నానా? డబ్బు సంపాదించటానికి నేనిప్పుడు చెయ్యబోయే ప్రయత్నాల్లో పూర్తిగా ఫెయిల్ అయితే నేనేం నష్టపోతాను? ఎంత నాశనం అవుతాను? చచ్చిపోతానా? ఒకవేళ నేను చచ్చిపోవటానికి ఇష్టపడకపోతే మరింత బలంగా పైకి లేవటం కోసం నేనేం చెయ్యాలి? - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: ఆర్థికంగా ఎదగటానికి మెట్లు
రోటరీ తరఫున ఇండియా వచ్చిన ఒక వియత్నాం మిత్రుడిని షాపింగ్‌కి తీసుకువెళ్లినప్పుడు, దాదాపు ప్రతి షాపు ముందూ ‘వాంటెడ్ సేల్స్‌బాయ్స్ - గర్ల్స్’ అన్న బోర్డు చూసి, ‘‘ఇన్ని ఉద్యోగాలుండగా మీ దేశంలో ఇంత నిరుద్యోగ సమస్య ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మా వాళ్లంతా డిగ్నిఫైడ్‌గా చదువుకున్నవారు’’ అన్నాను. ‘‘ఇంట్లో ఉండటం డిగ్నిటీయా?’’ అన్నాడు. అతని మాటల్లో వెటకారం ఏమైనా ఉన్నదేమో అని చూశాను. కానీ అలాంటిదేమీ కనపడలేదు. ‘‘వాళ్లు ఇళ్లల్లో ఉండరు. సిటీలో కంప్యూటరో, సివిల్స్కో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు’’ అన్నాను. అతడు సాలోచనగా ‘‘చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఆ ట్రైనింగ్ పొందవచ్చుగా’’ అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. ఒక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారికి, నిరుద్యోగులకి మధ్య నిష్పత్తిని నిరుద్యోగ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలోకెల్లా సౌభాగ్యవంతమైన ఖతర్ దేశంలో రెండొందల మందికి ఒక నిరుద్యోగి ఉంటే, బీద జింబాబ్వేలో నూటికి ఎనభై, భారతదేశంలో నూటికి ఏడుగురు నిరుద్యోగులు ఉన్నారు. నా గెస్ట్ తాలూకు దేశమైన వియత్నాం యుద్ధాల దేశం. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినా అక్కడి అనెంప్లాయ్మెంట్ ఇండెక్స్ కేవలం మూడు శాతం మాత్రమే. బాల్యం నుంచే సమయం విలువ బాగా తెలుసుకున్నవాడు త్వరగా ధనవంతుడవుతాడు. ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే గెలుపుకి మొదటి సోపానం. ఆ తర్వాత డబ్బు సంపాదించటానికి ఐదు మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు ‘కోరిక’: ఒకే ఒక్క ప్రశ్న. నాకు నిజంగా డబ్బు కావాలా లేక డబ్బు సంపాదించటం చేతకాకపోవటం వల్ల, నక్కా-ద్రాక్ష పళ్ల వ్యవహారంగా నేను నా చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఒక నిర్వికార వేదాంతిలాగ ఫోజు కొడుతున్నానా? రెండో మెట్టు ‘అవకాశం’: రెండే ప్రశ్నలు. అవకాశాలు లేకపోతే వాటిని నేనే విధంగా సృష్టించుకోవాలి? నేను పెద్ద తెలివైనవాడిని కాదు, చదువులో బ్రిలియెంట్ కాదు. కనీసం క్షవరం గాని, వడ్రంగి పని గాని చేయలేను. వ్యాపార మెళకువలు అస్సలు తెలియదు. అయినా నేను డబ్బు సంపాదించగలనా? మూడో మెట్టు ‘అవగాహన’: మూడు ప్రశ్నలు. నేనొక అవకాశం సృష్టించుకోవటానికి ఎంత డబ్బు, ఎంత సమయం వెచ్చించాలి? దీనిలో ఎంత శారీరక, మానసిక శ్రమ ఉన్నది? డబ్బు, సమయం, శక్తి... వీటిని నేను ఏ విధంగా సమకూర్చుకోగలను? నాలుగో మెట్టు ‘అంచనా’: నాలుగే నాలుగు ప్రశ్నలు. డబ్బు సంపాదించాలంటే నిశ్చయంగా తప్పు చేయాలా? ఈ ప్రపంచంలో ఎంతోమంది బీదవాళ్లు, మధ్యతరగతివాళ్లు డబ్బు సంపాదించి ధనవంతులైపోతూ ఉంటే, నేనింకా ఎందుకు వెనకబడి ఉన్నాను? డబ్బు సంపాదించటానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి అనుకుంటే అది ఏమిటి? ఒక డాక్టర్ అవటానికి గాని, ఇంజినీర్ అవటానికి గాని గొప్ప చదువు ఉండాలి సరే, కానీ ఎంతో మంది చదువులేనివాళ్లు కూడా డబ్బు సంపాదిస్తున్నారు కదా. అంటే, ధనవంతుడవ్వటానికి ఏ చదువూ అవసరం లేదన్న మాటేగా! వాళ్లకున్నది, నాకు లేనిది ఏమిటి? నాలో లోటుపాట్లు గురించి నేనెప్పుడైనా విమర్శ చేసుకున్నానా? అయిదో మెట్టు ‘పరిష్కారం’: దీనికి మాత్రం పది ప్రశ్నలు. గతంలో నేను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ నాకన్నా పెద్ద తప్పులు చేసినవారు వాటిని సరిదిద్దుకొని సరైన మార్గంలోకి వచ్చేశారే? నేరస్తులు కూడా పరివర్తన చెంది డబ్బు సంపాదిస్తోండగా నేనెందుకు కేవలం నా తప్పుల గురించి, గతం గురించి, అనర్హతల గురించి బాధపడుతూ సమయం వృథా చేస్తున్నాను? నా జీవితాన్ని జీరో బేస్డ్ స్థాయి నుంచి పునర్నిర్మించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు సలహా ఇవ్వటానికి సరైన వ్యక్తి ఎవరు? నిజంగా ఈ సమస్య అంత పెద్దదా? అనవసరంగా ఊహించుకుంటున్నానా? డబ్బు సంపాదించటానికి నేనిప్పుడు చెయ్యబోయే ప్రయత్నాల్లో పూర్తిగా ఫెయిల్ అయితే నేనేం నష్టపోతాను? ఎంత నాశనం అవుతాను? చచ్చిపోతానా? ఒకవేళ నేను చచ్చిపోవటానికి ఇష్టపడకపోతే మరింత బలంగా పైకి లేవటం కోసం నేనేం చెయ్యాలి? - యండమూరి వీరేంద్రనాథ్ -
వికాసం: అద్దె ఇళ్లల్లో తెలివైనవాళ్లు
అదే కనుక మీరు 20 వేల అద్దె ఇంట్లో ఉండి, మిగిలిన 30,000 నెలనెలా ఆదా చేసినట్లయితే, 30 సంవత్సరాలు అయ్యేసరికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? ఊపిరి బిగబట్టి వినండి. అక్షరాలా 5 కోట్లు! ‘ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి’ అన్న సూక్తి ఆర్థిక సూత్రాలకి కూడా పనిచేస్తుంది. మిగతావాళ్లకి ఇంకా అలాంటి ఆలోచన రాకముందే తెలివైనవాడు దాన్ని తనకి అనుగుణంగా ఉపయోగించుకుంటాడు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ వామపక్ష వాది. ఆయన రాష్ట్రపతి అవగానే ఆర్థికశాఖని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తాత్కాలికంగానైనా చేపడతారని అందరికీ తెలిసిన విషయమే. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల మీద నమ్మకం ఉన్నవాడు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అవుతారు అన్న వార్త చూచాయగా తెలియగానే నా స్నేహితుడొకరు కొన్ని సెలెక్టెడ్ షేర్లలో పెట్టుబడి పెట్టి, సెన్సెక్స్ పెరుగుదలతో కేవలం 15 రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించాడు. ఆర్థిక సూత్రాలు సరిగ్గా తెలియకపోతే వచ్చే నష్టాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిన ఏడాది లోపే అప్పు తీసుకుని ఇల్లు, కారు, ఫర్నీచరు కొనుక్కున్నాడు. జీతంలో 80 శాతం వాయిదాలకే కట్టేవాడు. అయిదు సంవత్సరాల తరువాత రిసెషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని అప్పు మొత్తం దాదాపు అలాగే ఉంది. అయిదు సంవత్సరాల పాటు అతను కట్టిన డబ్బంతా చాలావరకు వడ్డీకే సరిపోయింది. నిర్దిష్ట ఆర్థిక ప్రణాళికా రాహిత్యానికి ఇది చక్కటి ఉదాహరణ. ‘తెలివైనవాళ్లు అద్దె ఇళ్లల్లో ఉంటారు’ అనే పాత సామెత ఇప్పుడు నిజం కాకపోవచ్చు. కాని ఈ ఉదాహరణ చూడండి. మీరు ఒక సొంత ఇంటి కోసం 50 లక్షలు అప్పు తీసుకుంటే బ్యాంకుకి నెలనెలా 50 వేల చొప్పున 30 సంవత్సరాల పాటు చెల్లించాలి. అదే కనుక మీరు 20 వేల అద్దె ఇంట్లో ఉండి, మిగిలిన 30,000 నెలనెలా ఆదా చేసినట్లయితే, 30 సంవత్సరాలు అయ్యేసరికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? ఊపిరి బిగబట్టి వినండి. అక్షరాలా 5 కోట్లు. ఒక మనిషి తన కోరికను కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయగలిగితే కూడా చాలా మిగుల్తుంది. ఈ గమ్మత్తయిన ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి నెలకి 50 వేలు వాయిదా కట్టడానికి ప్రిపేర్ అయి 50 లక్షలు అప్పుతో ఫ్లాట్ కొన్నాడు. అలా కాకుండా, అతడు అయిదు సంవత్సరాల పాటు ఇరవై వేల అద్దె ఇంట్లో ఉండి, నెలకి 30,000 ఆదా చేసుకోగలిగితే, 5 సంవత్సరాల్లో అతడి దగ్గర 23 లక్షల రూపాయలు ఉంటాయి. అప్పుడు కేవలం 27 లక్షలు అప్పు తీసుకుంటే చాలు. నెలకి 50,000 రూపాయల చొప్పున (అతడు దీనికి ముందే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి) సుమారు 6 సంవత్సరాల్లో దాన్ని చెల్లించి వేయగలడు. ఏడో సంవత్సరం నుంచి అదే 50,000 నెలనెలా బ్యాంకు రికరింగ్ డిపాజిట్లో వేసుకుంటే, 30 సంవత్సరాలయ్యేసరికి ‘సొంత ఇంటితో పాటు 5 కోట్లు’ కూడా మిగుల్తాయి. చిన్న లెక్క. కానీ అద్భుతమైనది. (కొత్త ఫ్లాట్ రేటు... 5 సంవత్సరాల తరువాత సెకెండ్ హ్యాండ్ ఫ్లాట్ రేటు ఒకే స్థాయిలో ఉంటాయని ఊహించి పై ఉదాహరణ ఇవ్వటం జరిగింది). ఇటీవల ఒక ప్రకటన వచ్చింది. ఒక చిన్న కుర్రవాడు క్రికెట్ మ్యాచ్ ఆడకుండా తొందరగా ఇంటికి వచ్చేసి, ‘అందరూ వేసవి సెలవులకి వెళ్లిపోయారు’ అని కోపంగా బ్యాట్ విసిరేస్తాడు. తండ్రి ఎంతో సంతోషంగా ‘బ్యాంకు వాయిదా తగ్గింది కాబట్టి మనం కూడా విహారయాత్రకి వెళ్లొచ్చు’ అంటాడు. ఈ ప్రకటనలో రెండు లొసుగులున్నాయి. ఒకటి: పిల్లల్ని విహారయాత్రకి తీసుకెళ్లలేనంత ఆర్థిక స్థాయిలో ఉన్నవారికి ఆ అడ్వర్టైజ్మెంట్లో చూపించినంత పెద్ద ఇల్లు కావాలా? రెండు: వాయిదా సొమ్ము తగ్గిందని ఎవరూ సంతోషపడనక్కరలేదు. వాయిదా సొమ్ము తగ్గే కొద్దీ ఆ వ్యక్తి బ్యాంకుకు చెల్లించే డబ్బంతా కేవలం వడ్డీకే సరిపోతోందన్న మాట. మరోవిధంగా చెప్పాలంటే అతడు జీవితాంతం బ్యాంకుకి రుణపడి ఉంటాడ న్నమాట.