రాయకుండా ఉండలేకపోయా!
పెత్తందార్ల అమానుష ప్రవర్తనలను తెలియజేసిన తెలుగు ఆధునిక నాటకం ‘కుక్క’ రజతోత్సవ సంవత్సర నేపథ్యంలో ఆత్రేయ, ఎన్.ఆర్.నంది వంటి ఆధునిక నాటక రచయితలకు కొనసాగింపుగా ప్రశంసలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ ‘కుక్క’ రూపొందిన వైనాన్ని నెమరువేసుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘రాయాలని రాసింది కాదు. రాయకుండా ఉండలేక రాసింది. నా సమక్షంలో జరిగిన వాస్తవిక సంఘటన నన్ను క్షుభితం చేసింది. ఆ అల్లకల్లోలాన్ని ఎలా వ్యక్తీకరించాలా? అని ఆలోచించాను. 1960ల్లో బ్యాంక్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్ జిల్లా కడెం అనే గ్రామం వెళ్లాను. నేను పనిచేస్తున్న జాతీయ బ్యాంకులో గౌరవంగా అప్పుతీసుకున్నాడు ఓ పటేలు. రికవరీ పనిపై మేం పటేలు ఇంటికి వెళ్లాం. మా దగ్గర అప్పుతీసుకున్న పటేలు గ్రామంలో అప్పులు ఇచ్చేవాడు. రికవరీ ఎలా చేసేవాడు? ఇంట్లోనే! వడ్డీకట్టని జీతగాళ్లను బండబూతులు తిడుతూ! నా సమక్షంలోనే పటేలు భార్య ఒక జీతగాణ్ణి కొట్టింది.. గంటెతో. నెత్తురు కక్కుకున్నాడు జీతగాడు! అతడు చేసిన నేరం? పటేలమ్మ పెట్టిన కూర అతడి చేతిలోంచి పడిపోవడమే!
‘మనుషులను కుక్కలకంటే హీనంగా చూస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం’ అని బలంగా చెప్పాలని నేను చేసిన ప్రయత్నం ‘కుక్క’గా రూపొందింది.
‘కుక్క కావాల్నా నాయినా..!
ఒరే జీతగాడా, నువ్ జర కుక్కతీర్గ నిలబడరా...’
అన్న డైలాగ్‌కు ఎన్ని కనులు కన్నీరు కార్చాయో! ఎన్ని కన్నులు ఎర్రనయ్యాయో! కాబట్టే పదివేలసార్లకు పైగా ప్రదర్శితమైంది. ఇప్పుడు ‘నిశుంభిత’ తెలుగు
నాటకాలను ప్రదర్శించే క్రమంలో ‘కుక్క’ను ప్రదర్శిస్తోంది!
- ‘కుక్క’ రచయిత యండమూరి
కుక్క నాటిక ప్రదర్శన నేడు
‘నిశుంభిత’ సంస్థ ఆధ్వర్యంలో
దర్శకత్వం: రామమోహన్ హొలగొంది
సమయం: సాయంత్రం 7.30 గంటలు
వేదిక: లామకాన్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1
పాస్‌లకు: 9849256440