Atreya
-
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
Acharya Atreya: తెలుగుపాట గుండెచప్పుడు
-
Acharya Atreya: తెలుగుపాట గుండెచప్పుడు
‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా’ రాసి గొప్ప సామ్యవాద కవి ఏమో అనిపించుకున్నాడాయన. ‘ముద్దబంతి పూవులో మూగ కళ్ల ఊసులో’ రాసి గొప్ప భావకవి ఏమో అని సందేహం కలుగచేశాడాయన. ‘నేనొక ప్రేమ పిపాసిని’ అని రాస్తే ఇంతకు మించిన వైరాగ్య కవి లేడు అని అందరూ అన్నారు. ‘మనసు గతి ఇంతే’ అని అంటే ఇతనే కదా తెలుగులో మనసున్న కవి అని శ్లాఘించారు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ అనగానే బాబోయ్ బూత్రేయ అన్నవారూ ఉన్నారు. కటాక్షించేవాడు ఎవరు ఎలా కోరితే అలా కటాక్షిస్తాడు. ఆత్రేయ తెలుగు సినిమా పాటకు, మాటకు చేసిన కటాక్షం సామాన్యమైనది కాదు. వంద సంవత్సరాల వరకూ మరో వేయి సంవత్సరాల వరకూ నిలబడేది. ‘నా పాట నీ నోట పలకాల సిలకా’ అని ఏ ముహూర్తాన రాశాడో ఆయన పాట తెలుగువారి నోట పలుకుతూనే ఉంది. పలుకుతూనే ఉంటుంది. ‘అనుక్షణం మరణభయం జీవన సంభరణ భయం అంధకారం అయోమయం ఆర్తనాద సంకులం మనిషికి మనిషన్న భయం మనసంటే మనకు భయం సత్యమన్నచో సచ్చే భయం చచ్చు దాకా చావు భయం’... ఇది ఆత్రేయ తన ‘భయం’ అనే నాటకం కోసం రాసిన పాట. కవిని దార్శనికుడు అంటారు. ఇవాళ్టి సన్నివేశానికి ఈ పాట సరిగ్గా సరిపోలేదూ? ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం ఆత్రేయ దీనిని రాసి ఇవాళ్టి సన్నివేశానికి సిద్ధం చేశాడా? ఏమో. ∙∙ ఆత్రేయ ‘ఈనాడు’ అనే నాటకం రాశాడు. అది దేశ విభజన సమయంలో సామరస్యాన్ని బోధించడానికి చేసిన ప్రయత్నం. ఆ నాటకంలో ఒక హిందువు మిత్రుడు ఒక ముస్లిం మిత్రుడికి దేశ స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా గాంధీ గారి బొమ్మను బహూకరిస్తాడు. కాని నాటకం చివరలో ఒక మతోన్మాది విసిరిన కత్తికి ఆ గాంధీ బొమ్మ ముక్కలవుతుంది. ఈ నాటకాన్ని 1948 జనవరి 30న నెల్లూరులో ప్రదర్శించారు. కాని అదే రోజు గాంధీ మీద అలాంటి దాడే జరిగి ఆయన ప్రాణాలు వదిలారు. ఆత్రేయ దార్శనికమా ఇది. ఏమో. కాని తాను రాసిందే ప్రదర్శన రోజున జరగడం విని ఆత్రేయ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. గాంధీ గారిని హత్య చేయడం ఏమిటి? ఏమిటి ఇదంతా? మనిషి ఇలా ఎందుకు? ఆ సున్నిత మనస్కుడిని అయిన వారు తమ ఊరికి తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని తిరిగి మామూలు మనిషిని చేసి పంపాల్సి వచ్చింది. ∙∙ సినిమాల్లోకి వెళ్లడం ఎలాంటిదంటే కల్పిత మబ్బులకు నెమలి నాట్యమాడటం లాంటిది. దానికి ముందు ఆ నెమలికి సహజ సిద్ధమైన స్పందన ఉంటుంది. శక్తి ఉంటుంది. అది తన సంకల్పబలంతో మబ్బులను కూడా సృష్టించి ఆడ గలిగేలా ఉంటుంది. ఆచార్య ఆత్రేయగా తెలుగువారికి విఖ్యాతుడైన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తొలిరోజుల్లో ఇలాగే కాలాన్ని దర్శించేవాడు. అన్యాయాలను దునుమాడేవాడు. లోకంలోని చెడ్డను ఏవగించుకునేవాడు. ఆయన తన జీవితంలో రాసిన తొలి కవితే ‘దేవుళ్లదంతా అన్యాయమే’ శీర్షికతో ఉంటుంది. దేవుళ్లు న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఇలా ఎందుకు వుంటుంది. ఆ కవిత రాసే నాటికి ఆత్రేయ హైస్కూలు పిల్లవాడు. నెల్లూరు జిల్లా తన మృత్తిక నుంచి మొలకొలుకులు బియ్యాన్ని ఇచ్చినట్టే చాలామంది కళాకారులను, రచయితలను, కవులను ఇచ్చింది. ఆత్రేయను కూడా సూళ్లూరుపేట ప్రాంతం నుంచి ఆ కాళంగి నది నీటి నుంచి తెచ్చి ఇచ్చింది. వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న పూర్వీకుల నుంచి ఆ నేల ఆ భూమిని ఆత్రేయ పొందలేదు గాని వారి విద్వత్తును కొంత పొందగలిగాడు. చిన్నప్పుడే అంటే 8 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో మేనమామ జగన్నాథాచార్యుల వద్ద పెరిగాడు. తెలుగు ఇళ్లల్లో పిల్లల్ని మేనమామలు ముద్దు చేస్తారు. పిల్లలకు మేనమామ ఛాయ వస్తుంది కూడా. అలాగే ఆత్రేయకు కూడా తన మేనమామ ఛాయ వచ్చింది. జగన్నాథాచార్యులు సాహిత్యాభిమాని. నాటకాల అభిమాని. మేనల్లుడికి కంద పద్యం ఇలా ఉంటుందని ఒక పాఠంగా చెప్తే రాత్రికి రాత్రి దాని మర్మం గ్రహించి కంద పద్యాలు రాసిన సమర్థుడు బాల ఆత్రేయ. నాటకాలకు వెంటబెట్టుకొని తీసుకువెళితే ఆ నాటకాలు చూసి వాటి మీద ఇష్టం పెంచుకున్నాడాయన. బహుశా అనుకున్నట్టున్నాడు– చదువు గిదువు పొట్టకూటి కోసం నాటకం జీవితం కోసం అని. చదువును అంతవరకే ఉంచాడు. నాటకాన్ని ఇంత దాకా తీసుకువచ్చాడు. ∙∙ ఇంటర్‌తో చదువు ఆపి నెల్లూరు కోర్టులో గుమాస్తాగా పని చేసిన ఆత్రేయ నాటకాలు చూడటం వేయడం కొనసాగించాడు. అప్పట్లో ఆయన తాను రాయని ‘ఎదురీత’ అనే నాటకాన్ని విపరీతంగా ఆడేవాడు. ఆ తర్వాత స్వయంగా ‘గౌతమ బుద్ధ’ అనే నాటకం రాసి ప్రదర్శించేవాడు. ‘గౌతమబుద్ధుడి’ గురించి పిల్లలకు తెలియచేయడానికి ఆ నాటకాన్ని కాలేజీల్లో వేయడానికి ఆత్రేయకు ఆహ్వానాలు అందేవి. ఆ గిరాకీ పెరిగాక ఆయన దాదాపుగా ఉద్యోగాన్ని, చేసే తలంపును కట్టి పెట్టాడు. ఆ రోజుల్లో గుడివాడ వెళ్లి అక్కడి ‘ఆంధ్రకళాపరిషత్’ ఆహ్వానం మేరకు స్వీయ రచన ‘పరివర్తన’ అనే నాటకం ఆడితే ఆ ఊళ్లోవాళ్లు అందరూ కలసి నాటకం టీచర్‌గా, మేనేజర్‌గా ఆత్రేయను అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత ఆ ఊరికి చెందిన ఇద్దరు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు ఆయనతో కలసి ఒక త్రయంగా ఏర్పడి అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్లో ఎన్ని మంచి సినిమాలు చేశారో అందరికీ తెలుసు. ‘తోడికోడళ్లు’లో ‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా’ ఎవరు మరువగలరు? ∙∙ ఆత్రేయను సినిమా రంగం వరకూ నాటకాలే చేర్చాయి. కోర్టులో గుమాస్తాగా తను పని చేసిన అనుభవం ‘ఎన్.జి.ఓ’ అనే ప్రఖ్యాత నాటకం రాయడానికి కారణం అయ్యింది. ‘కప్పలు’ ఆయన మరో ప్రసిద్ధ నాటకం. ఆ నాటకం క్లయిమాక్స్‌లో చేతిలో కొడవలి ఉన్నందుకు ఒక రైతు కూలీ మహిళను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొడవలి కమ్యూనిస్టుల చిహ్నం కదా. సినిమాల్లో పని చేసినా సంభాషణలే తన ఏరియా అని ఆత్రేయ అనుకునేవారు. కాని ఆత్రేయ నాటకాలు గమనించిన దర్శకులు కె.ఎస్.ప్రకాశరావు ‘నీ మాటలో తూకం ఉంది. నువ్వు పాటలు రాయగలవు’ అనంటే ఆత్రేయ హటం చేశారు రాయనని. కాని రాశారు. అదే ‘దీక్ష’ సినిమాలో ‘పోరా బాబూ పో.. పోయి చూడు లోకం పోకడ’.. ఆయన మొదటి పాట. 1951లో ఈ పాటతో మొదలెట్టి 1989లో ‘ప్రేమయుద్ధం’ వరకూ ఆత్రేయ దాదాపు 1400 పాటలు రాశారు. ఒక రకంగా ఆయన కవిత్వంలో శ్రీశ్రీ చేసిన పనిని సినిమా పాటలో చేశారు. శ్రీశ్రీ కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తే ఆత్రేయ సంస్కృత పదబంధాల తెలుగు పాటను అచ్చతెలుగులో తేట తెలుగులోకి తీసుకు వచ్చారు. అందుకే ఆయన పాట అందరికీ నచ్చింది. తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా... నీ సమకాలికులు ఎవరో తెలియకపోతే నీ గొప్పతనం నిజంగా అర్థం కాదు. 1950లో ఆత్రేయ సినిమా రంగం ప్రవేశం చేసిన ఒకటి రెండు సంవత్సరాలకు అటూ ఇటూ ఉద్ధండులైన సినిమా కవులు రంగం మీదకు వచ్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, కొసరాజు, మల్లాది రామకృష్ణ శాస్త్రి వీరిలో ముఖ్యులు. వీరందరిలోకి ఆత్రేయ కమర్షియల్ సినిమా రైటర్‌గా నిలబడ్డారు. ఆయన గొప్ప క్లాసిక్ రాయగలడు. పక్కా మాస్ రాయగలడు. ఇద్దరు దర్శకులు ఆత్రేయను పూర్తిగా విశ్వసించారు. ఒకరు కె.ఎస్.ప్రకాశరావు మరొకరు ఆదుర్తి సుబ్బారావు. ఆత్రేయ వల్ల వీరు వీరి వల్ల ఆత్రేయ లబ్ధి పొందారు. సినిమా సంభాషణల్లో సూపర్‌స్టార్ పింగళి నాగేంద్రరావు అయినా సగటు ప్రేక్షకుడి సినిమా సంభాషణ రచయిత ఒకడుంటాడు అని ‘ప్రేమనగర్’ వల్ల ఆత్రేయ తెలిశాడు. ‘ఏం రాశాడ్రా’ అనే మాట అప్పటి నుంచే మొదలైంది. అంత వరకూ ఏం చేశాడ్రా, ఏం తీశాడ్రా మాత్రమే ఉండేవి. ‘ప్రేమనగర్’లో సంభాషణలు, పాటలు ఆత్రేయ విశ్వరూపం చూపాడు. ‘లతా... ఎందుకు చేశావీ పని’, ‘చినబాబు చెడిపోయాడు కాని చెడ్డవాడు కాదమ్మా’, ‘ఇదే మా ఎస్టేట్. ఇక్కణ్ణుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది’ అనే మాటలు గొప్పగా నిలిచాయి. ‘నీ కోసం వెలిసింది’, ‘మనసు గతి ఇంతే’ రాసిన ఆత్రేయే అదే సినిమాలో ‘లేలేలే... నా రాజా’ రాసి తన కలంలో నాటుసారా కూడా సిరా కాగలదని చూపాడు. ఆ తర్వాత ఆదుర్తితో ఆత్రేయ కలసి పూయించిన మందారపువ్వు ‘మూగమనసులు’ నేటికీ క్లాసిక్‌గా ఉంది. ఈ కథకు ముఖ్యకర్త ముళ్లపూడి వెంకట రమణే అయినా ఆత్రేయ చేతిలో పడ్డాక ఆ స్క్రిప్ట్ ఎక్కడికో వెళ్లింది. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అని ఆత్రేయ అన్నాడు. ‘పాడుతా తీయగా చల్లగా’ అని కూడా అని పాటలోని చల్లదనాన్ని పేద ప్రేక్షకుడికి పంచాడు. ఆత్రేయతో ఒకసారి పని చేసిన వారు మరల ఆత్రేయతోనే పని చేయాలనుకుంటారు. తెలుగులో యువచిత్ర సంస్థ, జగపతి సంస్థ ఆత్రేయతోనే రాయించుకోవాలని నిశ్చయం చేసుకున్నాయి. జగపతి సంస్థ రాజేంద్ర ప్రసాద్ ఆత్రేయను ఒక పాట కోసం బెంగళూరు తీసుకెళ్లి హోటల్లో కూచోబెడితే ఆత్రేయ కాఫీలు గీఫీలు తాగడం తప్ప ఇంకేమీ చేయలేదు. బిల్లు పెరగడం తప్ప మరో లాభం కనిపించకపోయే సరికి రాజేంద్రప్రసాద్ గట్టిగా ఆయనను నిలదీసేంత పని చేశారు. ‘ఉండు.. రాస్తాను’ అని కారెక్కి షికారు బయలుదేరిన ఆత్రేయ ఆ సమయంలో కురిసిన నాలుగు చినుకులు, తడుస్తూ వెళ్లిన రెండు జడలు చూసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని రాస్తే ‘ఆత్మీయులు’లో అది తెలుగువారి తొలి వాన పాట అయ్యింది. బి.సరోజను కలల రాణిని చేసింది. అక్కినేని అభిమానుల ఆనందం సరేసరి. యువచిత్ర నిర్మాత కె.మురారి ‘గోరింటాకు’ తీస్తున్నప్పుడు ‘చెప్పనా... సిగ్గు విడిచి చెప్పరానివి’ పాట ఆత్రేయ రాశారు. అదే సినిమాలో వేటూరి ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పాట రాశారు. అయితే పల్లవి వరకే. ఆ రోజుల్లో దాసరి సినిమాల పాటలను పాలగుమ్మి పద్మరాజు గారు చెక్ చేసేవారు. ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పల్లవి చూసి ఇలాంటిది ఫలానా పల్లవికి పోలికగా ఉంది అని కామెంట్ చేశారు. వేటూరికి కోపం వచ్చి ఫైల్ విసిరికొట్టి వెళ్లిపోయారు. ఆ చరణాలు ఎవరు రాయాలి? ఇంకెవరు. ఆత్రేయే. ‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది’ అని ఎంత మంచి పల్లవి రాశాడాయన. ఆ తర్వాత ‘త్రిశూలం’లో ‘రాయిని ఆడది చేసిన రాముడివా’, ‘పెళ్లంటే పందిళ్లు తప్పట్లు తాళాలు’... ఇవన్నీ మురారికి ఆత్రేయ ఇచ్చిన కానుకలు. ‘నారి నారి నడుమ మురారి’లో ‘పెళ్లంటూనే వేడెక్కింది గాలి’ అని ఆత్రేయ మాత్రమే కదా రాయగలడు. ఆత్రేయ మరో విశిష్టపర్వం కె.బాలచందర్ సినిమాలకు రాయడం. బాలచందర్ కొన్ని మొదట తెలుగులో, కొన్ని మొదట తమిళంలో తీశారు. కాని చాలా సినిమాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రీమేక్ అయ్యాయి. తమిళంలో కణ్ణదాసన్ రాసినదాన్ని తెలుగులో ఆత్రేయ గొప్పగా సమం చేసేవారు. ఆత్రేయ రాసింది అటు పక్క. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’, ‘ఏమిటి లోకం పలుగాకుల లోకం’, ‘సరిగమలు గలగలలు’, ‘బలే బలే మగాడివోయ్ బంగారు నాసామివోయ్’, ‘ఇటు అటు కాని హృదయం తోటి’, ‘తాళి కట్టు శుభవేళ’... ఎన్నెని. వీటికి తోడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చేత పాడించిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ ఒక క్లాసిక్. ‘ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’ అని ఆత్రేయ ఆ పాటలో రాస్తాడు. కె.బాలచందర్ తీసిన ‘తొలి కోడి కూసింది’ సినిమాకు ఆత్రేయ రాసిన ‘అందమైన లోకమని రంగురంగులుంటాయని’ పాటకు ఆత్రేయ నంది అవార్డు అందుకున్నాడు. ఆత్రేయకు వచ్చిన ఏకైక నంది అవార్డు అదే. ఆ పాటలో ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చెల్లెమ్మా’ అని రాస్తాడు ఆత్రేయ. తెలివి మీరే ఇవాళ్టి విపత్కరాలకు కారణం అవుతున్నాడు కదా మనిషి. 30 ఏళ్ల వయసులో సినిమా రంగానికి వచ్చిన ఆత్రేయ 38 ఏళ్ల పాటు సినిమా రంగంలో పని చేశారు. 68వ ఏట 1989లో మరణించేనాటి వరకూ ఆయన పని చేస్తూనే వెళ్లాడు. మధ్యలో వేటూరి అనే జంఝామారుతం వచ్చినా, దాశరథి, సినారెలాంటి సమర్థులు సత్తా చాటినా తన స్థానాన్ని చెక్కు చెదరక కాపాడుకున్నాడు. రాచరికంతో బతికాడు. అరాచకంగా ఉండగలననీ నిరూపించాడు. ఆయనతో ఊగిన వారున్నారు. తూగినవారున్నారు. వేగినవారున్నారు. అవన్నీ తాత్కాలికం అని ఆత్రేయకు తెలుసు. చివరకు తన కలం నుంచి వచ్చేదే చివరి వరకూ అనీ తెలుసు. అందుకే ఒక కవి పుట్టిన వందేళ్ల తర్వాత కూడా మనం తలచుకుంటున్నాం. మననం చేసుకుంటున్నాం. శ్లాఘించుకుంటున్నాం. ఆత్రేయ మనసు కవి. ‘మనసు గతి ఇంతే’ అని రాశాడు. మనం మాత్రం ‘మనసున్న కవికి మరణం లేదంతే’ అని పాడుకుంటూనే ఉంటాం. ఆత్రేయా... నీకు శతపల్లవుల మాల. నేనొక ప్రేమపిపాసిని ఆత్రేయ భగ్న ప్రేమికుడు. కనుక భగ్న గీతాలు రాసేప్పుడు ఆ భగ్నత్వాన్ని గాఢంగా పాటల్లో చూపేవాడు. ఇంటర్ చదివాక ఆయన తన ఊళ్లో ఉన్న పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఆత్రేయను ప్రేమించింది. పెళ్లి చేసుకోవడమే తరువాయి. అయితే పెద్దలు లెక్కలు తీసి ఇద్దరూ స్వగోత్రీకులు అని తేల్చారు. కనుక పెళ్లికి అడ్డం పడింది. ఆత్రేయ ఇది తట్టుకోలేకపోయారు. పద్మావతి దూరమైంది. ఆ తర్వాత చాలారోజులకు ఆమె కనిపించి ‘నేను వీణ వాయించేదాన్ని తెలుసుగా. నువ్వు దూరమయ్యావని వీణను అటకెక్కించాను’ అని బాధ పడిందట. ఆత్రేయ రాసిన ‘ఈ వీణకు శృతి లేదు’ పాటను గుర్తు చేసుకోండి. ‘ఎందరికో హృదయం లేదు’ అని రాసింది తన పెద్దల గురించే. ఆత్రేయకు తాను రాసిన పాటలలో ‘నేనొక ప్రేమ పిపాసిని’ పాట చాలా ఇష్టం. ‘నువ్వు వలచావని తెలిసే లోపు నివురైపోతాను’ అని ఎంత వేదనగా రాశాడు. బాలూ ఎక్కడ కనిపించినా ఆత్రేయ ఆ పాట అడిగి పాడించుకునేవాడు. బాలూ తాను ఫీలవుతూ పాడతాడు. వేరేవాళ్లు పాడితే మనం ఫీలవుతామని ఆత్రేయ జోక్. ఆత్రేయ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యంలాగా ఆత్రేయ వైరాగ్యం ఉండేది అప్పట్లో. ఆత్రేయతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఆత్రేయ వెంట పెట్టేవాడు. ఆత్రేయను వెంటాడి పాట తెచ్చుకోవడం ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పని. చెన్నై అశోకా స్ట్రీట్‌లో మొదటి ఇల్లు పి.సుశీలది. రెండో ఇల్లు ఆత్రేయది. ఆ ఇంటి కారుషెడ్ను ఆయన ఇలా తన వెంటపడే అసిస్టెంట్ డైరెక్టర్ల కోసం కేటాయించాడు. అందులో రేయింబవళ్లు వాళ్లు తిని, కూచుని, నిద్రపోతుండేవాళ్లు. ఎప్పుడు పాట ఇస్తాడో తెలియదు కదా. ఈ బాధలన్ని పడలేక మళ్లీ జన్మలో ఆత్రేయతో రాయించకూడదని అనుకునేవారట. కాని పాట ఇచ్చాక అది రిలీజయ్యి హిట్ అయ్యాక ఆ వైరాగ్యం పోయి మళ్లీ ఆయన వెంట పడేవారు. ఆత్రేయ ఇంకా ఎంత వింత జీవి అంటే అర్ధరాత్రి వచ్చి షెడ్లో నిద్రపోతున్న అసిస్టెంట్ డైరెక్టర్‌ను లేపి పాట చేతిలో పెట్టేవాడట. అమ్మయ్య... నా కష్టాలు గట్టెక్కాయని ఆ అసిస్టెంట్ తడుముకుంటూ లేచి అలెర్ట్ అయ్యేవాడట. ‘నాయనా.. ఈ పాట ఫలానా ప్రొడ్యూసర్‌కు ఇచ్చిరా. నీ పాట రేపు ఇస్తాను’ అనేవాడట ఆత్రేయ. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ భోరున విలపించేవాడట. ఆత్రేయ లీలలు అలా ఉండేవి. నవ్విస్తూనే ఏడిపిస్తారు జంధ్యాలగారు, ఆత్రేయగారు, రమణగారు– నా అభిమాన రచయితలు! ముగ్గురెందుకంటే– ఒకరు నవ్విస్తారని, ఒకరు ఏడిపిస్తారని, ఒకరు నవ్విస్తూనే ఏడిపిస్తారని! ఆ మూడిటితోనే మన జీవితం ముడిపడి ఉందని! మాటని పాటగాను, పాటని మాటగాను రాయగల– తేటతేట మాటల పాటల ముత్యాల మూటల నాటక సినీ ఘనాపాఠీ శ్రీ ఆత్రేయ! అంతంత తేలిక మాటలు కూడా గుండెల్లో గునపం దిగేసి కొబ్బరి కాయలకి డొక్కలు ఒలుస్తున్నట్లుంటాయి! ‘మీరు రాయక నిర్మాతల్నీ , రాసి ప్రేక్షకుల్నీ ఏడిపిస్తారు అంటారు?’ అని అడిగితే– ‘అవును! రాస్తూ నేనూ ఏడుస్తాను’ అంటాడు! కనీసం రెండు అర్థాలు లేకుండా ఆయన ఏదీ రాయలేడు! ‘పాడుతా తీయగా చల్లగా’.. ‘మనసు గతి ఇంతే’.. లాంటి పాటలు, ‘ఇక్కణ్ణించి మా అధికారం మొదలవుతుంది!’ ‘కాదు! మీ అహంకారం మొదలవుతుంది’ లాంటి మాటల ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే– తెల్లారిపోతుంది తప్ప, గుండె చల్లారదు! కోడెనాగు సినిమాలో నాయకానాయకిలు పారిపోతూ ‘మాష్టారూ! ఈ సమాజానికి దూరంగా పారిపోతున్నాం! మమ్మల్ని ఆపద్దు!’ అంటే– మాష్టారు(ఆత్రేయ): ‘నాగరాజూ! మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో మనుషులుంటారు, ఆ మనుషులకి ఒక సమాజం ఉంటుంది! కనక ‘సమాజం నించి మీరెక్కడికీ పారిపోలేరు’ ఇలాంటి మాటలు ఎడంచేత్తో రాసి, కుడిచేత్తో ఫెయిర్ చేసిచ్చేస్తే రావు! రెండు చేతుల్తో గుండె లోతుల్లోంచి తోడితే వస్తాయి! ఆయన నాటకాలు భయం, కప్పలు, ఎన్.జి.వో లాంటివి చదివినా, వేసినా, చూసినా గుండెల్ని పట్టేస్తాయి! నిరుద్యోగుల కష్టాలకథ ‘ఒక్కరూపాయి’ నాటిక ప్రారంభవాక్యాలు:– తెర తొలిగింది. అది ఒక అద్దెగది. ఉండేవాళ్ళకి చాలా చిన్నది, ఇచ్చేవాళ్ళకి చాలా పెద్దది... బ్రాకెట్టు మాటల్లో కూడా చాలా డ్రామా ఉంటుంది! ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాగా వచ్చిన నా నాటకం ‘ఒంటెద్దుబండి’ మొదటి ప్రదర్శన (1985) జి.ఎస్.ఆర్.మూర్తి మెమోరియల్ నాటక కళా పరిషత్తు, విజయవాడలో పూర్తవ్వగానే– స్టేజిమీదకొచ్చేసి, అభినందనల వడగళ్ళవాన కురిపిస్తున్న జనం మధ్యలోంచి ఒక పెద్దాయన నా చెయ్యి కుదిపేస్తూ– ‘‘ఆత్రేయ ‘ఎన్.జి.వో’ నాటకం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అంత గొప్ప నాటకం చూసేనయ్యా’’ అన్న ఖీజ్ఛి ఆ్ఛట్ట ఇౌఝp జీఝ్ఛn్ట గుర్తొస్తే– ఈ నాటికీ నా రొమ్ము విరుచుకుంటుంది! – ‘మనసుకవి’ గురించి మనసువిప్పిన నాటక, సినీ రచయిత ఎల్.బి.శ్రీరాం ఇళయరాజా పిలిచిన కవి ఇళయరాజాను ఎవరైనా పిలవాల్సిందే కాని ఇళయరాజా ఎవ్వరినీ పిలవడు. కాని ఆయన పిలిచిన ఒకే ఒక కవి ఆత్రేయ. ఇళయరాజా తను ఖాళీ ఉన్నప్పుడు తట్టిన బాణీలను రికార్డు చేసి పెట్టుకుని ఉండేవాడు. అలా ఒకసారి కొన్ని బాణీలు పోగయ్యాక ఆత్రేయను పిలిచి ఆ బాణీలన్నింటికి పాటలు రాయమన్నాడు. ‘అన్నయ్యా... వీటికి మీరే రాయాలి. నా కోరిక’ అని స్వయంగా అడిగాడు. అంతే కాదు.. ‘మీకు కావలసిన టైమ్ తీసుకోండి’ అని కూడా అన్నాడు. ఆత్రేయ ఇళయరాజా కోరికను మన్నించి ఆ బాణీలకు పాటలు రాశాడు. ఆ రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. ఆ పాటలను తెలుగు సినిమా నిర్మాత–దర్శకుడు రమణమూర్తి తీసుకుని వాటికి వీలుగా కథను తయారు చేసి సినిమా తీశాడు. అదే ‘అభినందన’. నిర్మాత దర్శకుడు ఆత్రేయ తానే దర్శకుడిగా మారి ‘వాగ్దానం’ అనే సినిమా తీశాడు. అందులో అక్కినేని హీరో. తన సినిమాకు తానే షూటింగ్‌కు లేట్‌గా వచ్చేవాడు. అక్కినేని ఆయన కోసం వెయిట్ చేస్తూ కూచుని ఉండేవారు. ఏమిటి మహానుభావా ఈ ఆలస్యం అంటే ‘బద్దకిష్టుడైన రచయితను పెట్టుకున్నాను. అతను సీన్ ఇచ్చేసరికి ఈ వేళైంది’ అని జోక్ చేసేవాడట. అంటే ఆత్రేయ అనే దర్శకుడు, ఆత్రేయ అనే రచయితతో సీన్లు రాయించుకుంటున్నాడని అర్థం. వాగ్దానం సరిగా ఆడలేదు. అయితే ఆత్రేయ తాను రాసుకోగలిగినా దాశరథికి ఆ సినిమాలో పాటల రచయితగా అవకాశం ఇచ్చాడు. దాశరథి తొలి చిత్రం వాగ్దానమే. నేను కవి... నువ్వు కవి ఆత్రేయ మనసు కవి అని అందరూ చెప్పేది. చాలా పాటల్లో ఆయన మనసును వ్యాఖ్యానించాడు. కాని ‘నువ్వు’, ‘నేను’ అనే మాటలు ఎక్కువ వాడి పాటలు రాసింది ఆయనే. ‘నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు’, ‘నేనీ దరిని నువ్వా దరిని’, ‘నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు’, ‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది’, ‘నేను నేనుగా నీవు నీవుగా’... ఇవన్నీ ఆయన రాసిన పాటలే. వ్యాసం: సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ కోరిక తీరకముందే కన్ను మూసిన ఆత్రేయ!
తెలుగునేలలో ఆత్రేయ పేరు తెలియని పద్యం, నాటకం, సినిమా రచన ఉండవు. ఈ మూడు ప్రక్రియలలోనూ ఆత్రేయ కలం కదం తొక్కినా ఆయన సినీ కవిగానే ఎక్కువమందికి తెలుసు. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. పేరులోని ఆచార్యను, గోత్రనామమైన ఆత్రేయ సను కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ కలం పేరుతో ఆయన సుప్రసిద్ధులయ్యారు. 7.5.1921న నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలూకాలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. 1951లో సినీరంగ ప్రవేశం చేసిన ఆత్రేయ రచయితగా కొంతకాలం సినీరంగాన్ని ఏలారు. తన రాతతో ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపిస్తారని పేరుపడ్డారు. అంతటి ఆత్రేయ ఎన్ని సినిమాలకు ఎన్ని పాటలు రాశారో చివరి వరకూ ఎప్పుడూ లెక్కవేసుకోలేదు. కానీ 69 ఏళ్ల వయస్సులో (1989) ఆకస్మికంగా ఆయనకో కోరిక కలిగింది. ‘నా పాట నీ నోట పలకాలి’ అనే మకుటంతో అసంఖ్యాకమైన తన సినిమా పాటల్లో కొన్నింటిని పుస్తక రూపంలో వెలువరించాలని. ఆ మనోవాంఛను మద్రాసు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా కోసం పరిశోధన చెయ్యడానికి వెళ్లిన నా దగ్గర ఆత్రేయ వెలిబుచ్చారు. పుస్తక ప్రచురణకు ఆర్థికంగా తోడ్పడటానికి ముందుకొచ్చే తన నిర్మాతలు ఇద్దరు ముగ్గురున్నా, వాళ్లు తనను నమ్మడం లేదని వాపోయారు. ఆ సందర్భంగా చిత్రసీమకు సంబం ధించిన ఆయన ఆత్మీయ మిత్రులలో ఆ కోరికను నెరవేర్చడానికి సమర్థులుగా డాక్టర్ కొంగర జగ్గయ్య పేరును నేను సూచించాను. ఆ సూచనను ఆత్రేయ కూడా ఆమోదిం చడంతో వెంటనే అన్నానగర్‌లో ఉంటున్న జగ్గయ్య గారిం టికి వెళ్లాం. ఆత్రేయ సినిమా పాటలలో కొన్నింటిని మాత్రమే కాదు– అంతవరకు ఆ ప్రక్రియలో వచ్చిన అన్నింటినీ అచ్చు వేద్దామని జగ్గయ్యగారు ప్రతిపాదించి పాటలు సేకరణ బాధ్యతను మాత్రం నామీద పెట్టారు. తను ఆశించిన దాని కంటే విస్తృత స్థాయిలో తన కోరిక నెరవేరుతున్నందుకు బ్రహ్మానందభరితులైన ఆత్రేయ ఆ ప్రతిపాదన వెంటనే కార్యరూపం ధరించాలని, అందుకు నెల్లాళ్ల వ్యవధిలో తిరిగి కలుద్దామని జగ్గయ్యగారిని కోరారు. కానీ దురదృష్టవశాత్తు అలా కలవాలనుకున్న రోజునే అకస్మాత్తుగా ఆత్రేయ తనువు చాలించారు (13.9.89). ఆత్రేయ సంస్మరణ సభలో జగ్గయ్య ఆత్రేయ కడపటి కోరికను వెల్లడించి, ఆయన సమగ్ర రచనల ముద్రణ కోసం ముందుకు రావాలని పరిశ్రమలోని పెద్దలకు పిలుపునిచ్చారు. ఆ సూచనకు పరిశ్రమ నుండి సానుకూలమైన స్పందన లభించింది. జగ్గయ్య జాప్యం చేయకుండా కార్యరంగంలోకి దూకి తను మేనేజింగ్ ట్రస్టీగా మరో 8 మంది ప్రముఖులు ట్రస్టీలుగా ‘మనస్విని’ పేరుతో ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్టీని నెలకొల్పారు. దాని తరఫున ఆత్రేయ లభ్య సమగ్ర సాహి త్యాన్ని 7 సంపుటాలుగా ప్రచురించారు. ఆత్రేయ సాహితికి జగ్గయ్య సంపాదకులు కాగా, నేను సహ సంపాదకుణ్ని. ఆత్రేయ సాహితిలో మూడు సంపుటాలు నాటక సాహి త్యానికి, మూడు సంపుటాలు సినిమా పాటలకు, ఏడవ సంపుటి ఆత్మకథ మొదలైన ఇతర రచనలకు కేటాయించాం. ఆత్రేయ సాహితి ఆవిష్కరణ 7.5.1990న మద్రాసులోని దక్షిణ భారత చలనచిత్ర సంఘం థియేటర్లో ఘనంగా జరి గింది. ఆత్రేయ సాహితికి పాఠకలోకం నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆత్రేయ సాహితి ప్రతులు స్వల్పకాలంలోనే చెల్లిపోవడంతో ఆత్రేయ అభిమానులు పునర్ముద్రణ కోసం అడుగుతూనే ఉన్నారు. ప్రథమ ముద్రణలో మాకు కూడా కొన్ని లోటుపాట్లు కనిపించి ఆ దిశగా ప్రయత్నం చెయ్యాలను కున్నా, జగ్గయ్యగారి హఠాన్మరణం (5.3.2004)తో మన స్విని మూలబడి ఆత్రేయ సాహితి తిరిగి వెలుగుచూడ్డం సాధ్యం కాలేదు. కానీ అనుకోకుండా 25.2.2017న నేను అతిథిగా హాజరయిన ‘పాడుతా తీయగా’ రికార్డింగ్ కార్యక్రమంలో మాన్య మిత్రులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ సాహితి పునర్ముద్రణ ప్రసక్తి తెచ్చి, ఆ అక్కరను, దాని ఆసరాకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆ మనస్వి ప్రతిపాదన నాకు ఆనందం కలిగించినా, ఆ అంశం మీద చర్చించి నాటక సాహిత్యానికి అంతగా ఆదరణ లేకపోవడం వల్ల పరిష్కృత ముద్రణను పాటలకు మాత్రం పరిమితం చెయ్యాలని నిర్ణయించాం. ఈ బృహత్కార్యంలో తన ఆత్మీయ మిత్రులు, సాహితీ ప్రియులు అయిన డా. కె. ఇ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్ అధినేత) భాగస్వామిని చెయ్యాలని ఎస్బీబీ సంకల్పించారు. రెడ్డిగారు సంతోషంగా అంగీకరించారు. కానీ, ఆ గాన గంధర్వుని పూనిక సాకారం కాకుండానే ఆ దుర్విధి ఆయనను మనకు దూరం చేసింది. అనంతరం బాలు వాగ్దానానికి భంగం కలుగకుండా ఆ ప్రాణమిత్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని పూర్తి చేయడానికి డా. వరప్రసాద్ రెడ్డి సహృదయతతో ముందుకొచ్చారు. ఆత్రేయ సాహితి (1990)లోని మూడు సినిమా సంపుటాలతో కలిపి అప్పట్లో వివిధ కారణాలవల్ల 1092 పాటల్ని మాత్రమే ప్రచురింపగలిగాం. ఇప్పుడు ఆ లోటును సరిదిద్దు కోవడానికి అవకాశం రావడంతో ఆత్రేయ అక్షర సేద్యానికి, బాలు పవిత్ర సంకల్పానికి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఆత్రేయ సాహితి పేరుతో ఆత్రేయ సినీ గేయ సర్వస్వాన్ని విస్తృత పరిశోధనతో రెండు భాగాలుగా (ఒకే సెట్) అందిస్తున్నాం. డబ్బింగ్ చిత్రాలతో సహా 477 చిత్రాల నుంచి ఆత్రేయ మొత్తం పాటల్ని (1636) సేకరించి ప్రచురి స్తున్న ఈ సంపుటాలలో ఆత్రేయ పాట ఒక్కటి కూడా మిగలకుండా, ఆత్రేయది కాని పాట ఒక్కటీ చొరబడకుండా మా పరిధి మేరకు ప్రయత్నించాం. ఆత్రేయ అభిమానులు, సహృదయ విమర్శకులు మా శ్రమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని’ అని ఆత్రేయే అన్నట్టు ఆత్రేయ సాహితి ఇంత సమగ్రంగా ఈ స్థాయిలో వెలువడ్డం ఆత్రేయ అనుకోనిది, అనుకోని ‘నిధి’. ఆత్రేయ సాహితి ఆవిష్కరణ సందర్భంగా ఆత్రేయ, బాలుగార్లకు అంజలి ఘటిస్తున్నాను. – డాక్టర్ పైడిపాల, వ్యాసకర్త సినీ గేయ సాహిత్య విమర్శకులు, ‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు మొబైల్ : 99891 06162 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఆత్రేయ
-
మనసైన పాట
-
మనసుకవి ఆచార్య ఆత్రేయ
హైదరాబాద్: మనసుకవి ఆత్రేయ మనసు పై పలు సినిమా పాటలు రాసినా... ఈ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రగతిశీల దృక్పదం ఉన్న నాటక రచయితగా ప్రసిద్ది పొందారని... కిడాంబి నరసింహాచార్యులుగా సినీ రంగ ప్రవేశం చేశాక ఆత్రేయగా మారారని డా.సి.నారాయణ రెడ్డి గుర్తుచేసుకున్నారు.. మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి ఉత్సవాల సందర్భంగా అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన అభినందన-ఆత్రేయ అవార్డుల బహూకరణ సభకు ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రసంగించారు. ఆత్రేయ రచించిన ఎన్జిఓ, కప్పలు, విశ్వశాంతి, ఆయనను మహారచయితగా నిలబెట్టాయన్నారు. సినిమా సంభాషణలతోపాటు మాటలు, పాటలు ఛందోబద్ద పద్యాలురాసిన ఆత్రేయ సాహిత్యంలో తన ప్రతిభను చతుర్ముఖంగా ఆవిష్కరించారన్నారు. ఈ సందర్బంగా ప్రముఖ సినీ మాటల రచయిత మరుధూరి రాజా, సినీ గేయ రచయిత వెన్నెలకంటిలను అభినందన-ఆత్రేయ అవార్డులతో ఘనంగా సత్కరించారు. -
అనుకోలేదని ఆగవు కొన్ని...
మే 7 ఆత్రేయ జయంతి ఆత్రేయకు నివాళి అంటే ఆయన పాటను తలచుకోవడమే! జీవితాన్ని అర్థం చేసుకోవడమే... ఆ వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే!! తెలుగు సులువుగా లేకపోతే ఆత్రేయ సులువైన కవి అయి ఉండేవాడు కాదు. సుకవీ అయి ఉండేవాడు కాదు. తెలుగు- ఆత్రేయను గొప్ప కవిని చేసింది. ఆత్రేయ- తెలుగును గొప్ప పాట చేశాడు. ఒక చిన్నపిల్లవాడు ఇంటి నుంచి తప్పిపోయాడు. తల్లిదండ్రుల కనిపించక నిర్మానుష్యమైన ఎడారిలో, ఎండలో, కన్నీళ్లను తాగుతూ, వెక్కిళ్లు పెడుతూ తిరుగుతున్నాడు. ఆ పిల్లవాడు తన వేదనను పాటలో చెప్పాలి. ఏం పాడతాడు? కవిత్వం చెబుతాడా? ప్రాసతో కనికట్టు ప్రదర్శిస్తాడా? స్వచ్ఛమైన పసి దుఃఖం అది. మాటలు కూడా అంతే స్వచ్చంగా ఉండాలి. అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి నాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి... ఏ పిల్లాడైనా ఇంతకు మించి ఏం మాటలు కూడగట్టుకోగలడు ఆ కష్టంలో? ఈ పాట రాసేటప్పటికి ఆత్రేయ వయసు 50 ఏళ్లు. కాని రాస్తున్న క్షణాన తొమ్మిదేళ్లు. ఆత్రేయ మాటల మనిషి. ఉత్త మాటల మనిషి కాదు. నెల్లూరు జిల్లాలోని చిన్న పల్లెటూళ్లో పుట్టి, పెరిగి, ప్రజల జీవనాడిగా ఉండే భాషలోని మాటలను పట్టి కలంలో నింపుకున్న మనిషి. వాటిని ఆయన మొదటగా ఉపయోగించింది నాటకాల్లోనే. ‘ఎన్.జి.వో’ నాటకం చాలా పెద్ద హిట్. ‘కప్పలు’ ఇంకా పెద్ద హిట్. నేరుగా, సులభంగా, సూటిగా ఉన్న మాట శక్తి ఆత్రేయకు బాగా తెలుసు. మాటను నాటడం, పర్మినెంట్ మెమరీ చిప్‌గా చేసి మనసులోకి ఎక్కించడం బాగా తెలుసు. పొడుగు పొడుగు సంభాషణలతో కాదు, చిన్న చిన్న పదాలతోనే. ప్రేమ్‌నగర్‌లో హీరో గురించి చెప్పాలి. కాని అతడి గౌరవం పోకుండా చెప్పాలి. అందుకే ఆత్రేయ రాస్తాడు: ‘చినబాబు చెడిపోయాడేమోగాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా’. సన్నివేశాన్ని మాత్రమే కాదు, సినిమా సోల్‌ని కూడా నాలుగడుగులు పైకి లేపడం ఆత్రేయకు తెలుసు. అందుకే మూగమనసులు సినిమాలో రాస్తాడు: ‘చావు ఎంతమందినో విడదీస్తుంది. కాని కొంతమందిని కలుపుతుంది’. కేరెక్టర్ని, కేరెక్టర్ డెప్త్‌ని చెప్పే డైలాగ్స్ ఆత్రేయ పాళీ చివర ఉంటాయి. అడిగితే చాలు కాగితం మీద కదులుతాయి. ‘వెలుగు నీడలు’ సినిమాలో ఆ ఫేమస్ డైలాగ్ గుర్తు లేదా? ‘కన్నీరే మనిషిని బతికించగలిగితే అమృతంలాగే అదీ కరవైపోయేది’. ఆత్రేయకు ముందు ‘ఆచార్య’ అనే అలంకారం ఉంది. నిజంగా ఆయన ఆచార్యుడే. మాటల యూనివర్సిటీకి రిటైర్మెంట్ లేని వైస్ చాన్సలర్. ఆత్రేయకు మాటలు తెలుసు. మాటల వల్ల వచ్చే కష్టం తెలుసు. ‘ఇవాళ కాదు. రేపు’, ‘ఇప్పుడేం అవకాశాలు లేవు పో’, ‘నీ ముఖానికి సినిమాలా’... ఇలాంటి మాటలన్నీ పడ్డాడు. ఇంట్లో వెండి చెంబు అమ్మి మద్రాసు చేరుకొని కటిక నేల మీద ఆకలి కడుపుతో నిదురించాడు. తన ప్రాంతం వాడే అయిన హాస్యనటుడు రమణారెడ్డి ‘రావయ్యా రా’ అని పిలిచి నాలుగిడ్లీలు పెట్టిస్తే కారం వల్లో, కృతజ్ఞత వల్లో కళ్లల్లో నీళ్లు కారిపోయేవి. తెల్లవారితే ఎలా అని భయం. రాత్రయితే ఏమిటి దారి అని భీతి. కాని మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నెల్లూరు నుంచి వచ్చిన పంతులుగారు బాగా రాస్తారు అని వచ్చింది. సినిమాలు వచ్చాయి. మాటకు మాటా ఇచ్చేవాడు నెగ్గుకు వస్తాడు. అప్పుడైనా ఎప్పుడైనా ఆత్రేయ పాటించింది ఒకటే సూత్రం. జయభేరి సినిమాలో ఆయనే డైలాగ్ రాసినట్టు ‘సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది’ అనేదే ఆ సూత్రం. మాటైనా, పాటైనా సులువుగా ఉండాలి. సామాన్యుడికి అందాలి. ‘మనసు గతి ఇంతే’... రిక్షావాడూ పాడాడు. పండితుడూ గౌరవించాడు. సేయింగ్స్ అనండీ, సామెతలు అనండి, జాతీయాలు అనండి... అలాంటివి వింటే మనిషి వాటిని టక్కున పట్టుకుంటాడు. కంఠోపాఠం చేసుకుంటాడు. ఆత్రేయ తన ప్రతి పాటనూ అలా ఒక సేయింగ్లాగానో, సామెతలాగానో మలిచాడు. పల్లవిలోనో చరణంలోనో ఎక్కడో ఒకచోట ఒక జాతీయంలాంటి మాట రాస్తాడు. మన ఆత్రేయ ఏం చెప్పాడురా అని ప్రేక్షకుడు పట్టుకుంటాడు. గతంలో వేమనకు ఈ గౌరవం దక్కింది. ఆ తర్వాత ఆత్రేయకు. ‘మనసే మనిషికి తీరని శిక్ష’ అనో ‘మమతే మనిషికి బందిఖానా’ అనో ఆత్రేయ అంటే ఒక ఓదార్పు. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ’ అనంటే తెరిపినపడ్డ భావన. ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అనో ‘ఏ కన్నీళ్లైనా వెచ్చగానే ఉంటాయి’ అనో అనంటే ఈ కష్టం మనకే కాదు అందరూ పడుతున్నారు అందరూ అనుభవిస్తున్నారు దీనిని భరించొచ్చు అనే ధైర్యం. అందుకే ఆత్రేయ ‘నవ్వుతూ బతకాలిరా’ అన్నాడు. ‘సిరిమల్లె పువ్వల్లే నవ్వు’ అని కూడా అన్నాడు. తమిళంలో కణ్ణదాసన్ గొప్ప కవి. తెలుగులో ఆత్రేయ అంతకు ఏమాత్రం తక్కువ కాదు. తమిళంలో హిట్ అయిన తన సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు పాటల కోసం బాలచందర్‌కు ఆత్రేయ తప్ప వేరెవరూ కనిపించలేదు. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’, ‘కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు’, ‘అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం’, ‘తాళికట్టు శుభవేళ’... అన్నీ ఎమ్.ఎస్. విశ్వనాథన్ బాణీలతో ఆత్రేయ మాటలతో తెలుగువారిని ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు ‘గుప్పెడు మనసు’ కోసం ఆత్రేయ రాసిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ పాట ఒకెత్తు. బాలమురళీకృష్ణ గంభీరంగా గానం చేసిన ఈ పాటలో మనసు చేసే మాయలన్నింటినీ ఆత్రేయ చాలా సులభమైన మాటల్లో చూపిస్తాడు. ‘లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’.... ఈ రెండు వాక్యాలతో ఆత్రేయ ఫ్రాయిడ్ సరసన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆత్రేయ చాలా పాప్యులర్ నంబర్స్ రాశాడు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’... చాలా కోమలమైన గీతాలు రాశాడు ‘నీవు లేక వీణ పలకలేనన్నది’... చాలా ప్రబోధాత్మక గీతాలు రాశాడు ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’.. శ్రీశ్రీ మనందరికీ ఇష్టమే. కాని ఆత్రేయ ఆయనను తలపించేలా ‘చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా’ అంటూ ‘కారులో షికారుకెళ్లే’.. పాట రాశాడు. శ్రీశ్రీ మాత్రం తక్కువ తిన్నాడా. ఆత్రేయను గౌరవిస్తూ ఆత్రేయ పేటెంట్గా భావించే ‘మనసు’ను మకుటంగా తీసుకుంటూ ‘మనసున మనసై బతుకున బతుకై’ పాట రాసి శ్రోతల తోడుండిపోయాడు. కాలం మారింది. వేటూరి కొండగాలి వచ్చి హీరోయిన్ కోకెత్తుకెళ్లింది. చక్రవర్తి విజృంభించాడు. సినారె స్థిరంగా తన పల్లవులను సారించాడు. ఆత్రేయ కొంచెం వెనుకబడ్డాడు. కాని ఆయన పాట కాదు. ‘సీతారామ కల్యాణం’, ‘అభినందన’ సినిమాలు ఆత్రేయ సిరా పలుచబడలేదనడానికి ఉదాహరణలు. ఆత్రేయ సంపాదించుకున్నాడా పోగొట్టుకున్నాడా ఎవరికి కావాలి? ఆత్రేయ తన పాటలను తెలుగువారికి ఎంత సంపదగా ఇచ్చి వెళ్లాడా కావాలి. ఆత్రేయ గాలిలో తేలే పాత్రల్ని, ఊతం లేని సన్నివేశాలను ఇచ్చి పాట రాయమన్నవారిని రాయక ఏడిపించాడు. తనను కదిలించే చిన్న సన్నివేశానికి కూడా ఆకాశమంత ఎత్తున్న అర్థమున్న రాసి ప్రేక్షకులను ఏడిపించాడు. ఆత్రేయ పాట ద్విముఖి. అది ఒకరికి కన్నీటి చుక్క. మరొకరి ఆనందబాష్పం. ఆ మనసున్న మాటకు మల్లెపూల దోసిలి. - సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి ‘‘ఆత్రేయ తన పాండిత్యాన్ని పాటల్లో ప్రదర్శించలేదు. సినిమా పాటను పామరులకు సన్నిహితం చేసిన ఘనత ఆయనదే. ఆయన రాసిన పాటల్లో నాకు బాగా ఇష్టమైనది ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా’. రొమాన్స్‌లో కమ్యూనిజాన్ని ఈ పాటలో చూపించారు. ఆయన జీవిత చరమాంకంలో బాగా సన్నిహితంగా మసిలే అవకాశం నాకు దక్కింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆయన స్వీయ చరిత్ర రాయడం మొదలుపెట్టి, పూర్తి చేయకుండానే కన్నుమూశారు. అది వచ్చి ఉంటే మనకు ఎన్నో విలువైన విషయాలు తెలిసుండేవి. ఆ విషయంలో మనం దురదృష్టవంతులం.’’ - కోన వెంకట్, రచయిత అసలు పేరు : కిళాంబి వేంకట నరసింహాచార్యులు జననం: 07-05-1921 జన్మస్థలం: నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు స్వస్థలం: సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు తల్లిదండ్రులు: సీతమ్మ, కృష్ణమాచార్యులు చదువు: ఎస్.ఎస్.ఎల్.సి. వివాహం - భార్య: 1940 - పద్మావతి తొలిచిత్రం - పాట: దీక్ష (1951) - పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ ఆఖరిచిత్రం - పాట: ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం పాటలు: సుమారు 1400 దర్శకునిగా: వాగ్దానం (1961) నటించిన సినిమా: కోడెనాగు (1974) గౌరవ పురస్కారాలు: వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని7 సంపుటులుగా 1990లో ప్రచురించింది, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు. మరణం : 13-09-1989 -
నా ఎదుట... ఆత్రేయ పాట... ఓ చందమామా!
పాట నాతో మాట్లాడుతుంది నా తండ్రి ఆత్రేయ గురించి ఏం చెప్పను. నిముషం సుఖపడితే నెలరోజులు కన్నీళ్లు ఒక్కసారి నవ్వితే - వందసార్లు ఏడ్పులు- రాయక నిర్మాతలను - రాసి ప్రేక్షకులను ఏడిపించడం నేను చూడలేదు కానీ - రాస్తూ - ఏడుస్తున్నప్పుడు చూశాను అంటూ ఆత్రేయ పాట నాతో సంభాషణ మొదలెట్టింది. ‘‘దేవుడు - దయ్యము నాలో నావాసము సేయుచుండి అటునిటు లాగన్ జీవితమతి సంకులమై నావికుడే లేని నావ నడకలు నడిచెన్, ...అని తన జీవితపు ప్రయాణ నిడివి సారాంశాన్ని చిన్ని పద్యంలో నిజాయితీగా నిర్వచించిన బ్రష్ట యోగి’’ - అంది. ‘ఆత్రేయ జీవితం ఇంత తెలిసినట్టు మాట్లాడుతున్నావు - నీవు ‘మనసు గతి ఇంతే’ పాటవా అన్నాను. ‘కాదు’ అంది. శ్రీశ్రీ రాశారని భ్రమపడిన ‘కారులో షికారుకెళ్లె’ పాటవా. ‘‘కాదులే’’ ‘ఎవరీ పాట’ అని నాలో ఆలోచనలు గిలకొడుతుండగా జాలిపడి... నీ ఊహకందను గానీ, తేనె మనసులు ‘చందమామా అందాల మామా’ పాటను అంది. ‘ఔరా’ అనుకున్నాను. సంపాదకీయానికైనా సమ్మోహనపరిచే బాణి ఇవ్వగలిగే మహాదేవన్ సంగీతం. ఆయన... కవికి ట్యూన్ ఇవ్వడం మహాపాపం అని నమ్మిన బోళా సంగీత మహా(దేవుడు) దేవన్. ‘పెళ్లిచూపుల్లో ఎందుకు నచ్చాడో ఆ నచ్చిన తనతో నా సహజీవనమెపుడు...’ అనే భావనను చందమామ కేంద్రబిందువుగా చెప్పాలని ఆత్రేయ తలంపు. ఆత్రేయ కన్నుపెన్ను సున్నితపు త్రాసు. కుప్పలు కుప్పలుగా గుప్పించదు. ఒక్కో అక్షరాన్ని తన నెత్తురులోనో- కన్నీళ్లలోనో అచ్చుబోసి తీసి పదాలుగా పేర్చడం ఆత్రేయ అలవాటు. తను రాయడు డిక్టేట్ చేస్తాడు. మెదడులో అల్లుకుని - తెంపేసి - మళ్లీ మళ్లీ... ఇలా కాగి కాగి... ఆగి ఆగి... వేగి వేగి... లేఖకునితో రాయిస్తాడు. తపిస్తున్నాడు ఆత్రేయ... అపుడు నేనన్నాను... ‘‘తండ్రీ! నీ ఎదుట నేనున్నాను. నన్ను మీరు చూడట్లేదు. మీ ఎదుట... ‘మీరేం చెబుతారో!’ అని మీ అసిస్టెంటు ఉన్నాడు. అందరం కలిస్తే పల్లవిగా కాగితంపై నేనుంటాను’’ అని. ఆశ్చర్యం!! క్షణంలో అల్లుకున్నాడు నా కన్నయ్య. ‘‘చందమామ... అందాల మామా! నీ ఎదుట నేను - వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు...’’ తెనుగు సినీ పాటల పూదోటలో ఇలాంటి సన్నివేశానికి ఇంత అపురూపమైన పల్లవి మరొకటి లేదు. రాదు. చంద్రుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, అటు ప్రేయసికి, ఇటు ప్రియునికి దగ్గరగా కనిపిస్తాడు. ‘అటు తన ఎదురుగా, ఇటు నా ఎదురుగా ఉన్న నువ్వు మా ఎదురుగా ఎప్పుడుంటావు?’ అని అడుగుతుంది కథానాయిక. ‘‘మేమిద్దరం ఎప్పుడు కలుస్తాము’’ అనే విషయాన్ని సినిమాలో ఇంత అందంగా ఇంత కవితాసుందరంగా చందమామను అడగడం నిజంగా చందమామంత అందంగా ఉంది కదూ! ఇక తొలి చరణం ఎంత మహాద్భుతంగా, మహిళా మనస్సును ఎంత సున్నితంగా రాశాడో చూడండి. చాలామంది యువకులకు తెలియనిది ఏంటంటే, యువతులు... ఆత్రేయ కాలంలోనైనా ఈ సుద్దాల అశోక్‌తేజ కాలంలోనైనా యువకుల సౌందర్య సాంద్రత కన్నా వారిచ్చే ‘భద్రత’ను ఎక్కువ కోరుకుంటారనేది. ఆ విషయాన్ని స్త్రీ హృదయాన్ని ఆపాదించుకుని గమనిస్తే ‘గీత రచయితలు పాత్ర హృదయంలోకి వెళ్లి ఎలా పాటని ఆవిష్కరించారో తెలుస్తుంది. ‘పెళ్లిచూపులకు వారొచ్చారు (ఇప్పుడైతే వాడొచ్చాడని రాస్తాం). చూడాలని నే ఓరగ చూశా వల్లమాలిన సిగ్గొచ్చింది - కన్నుల దాక కన్నులు పోక (కళ్లలో కళ్లుపెట్టి చూళ్లేకపోయా) మగసిరి ఎడదనె చూశాను - తలదాచుకొనుటకది చాలనుకున్నాను’- అని ముగిస్తాడు. స్త్రీ హృదయావిష్కరణ - జీవిత గమనంలో ప్రయాసలు - పరుగులు - అలసటలు - ఆవేదనలు - ఆశాభంగాలు - ఆటుపోట్లుంటే ఏమి... తలదాచుకునేటంత విశాలంగా ఉంది అతని మగటిమి చూపే ఛాతీ. పురుషుని మానసిక వయస్సు కన్నా స్త్రీ ఎక్కువ పరిపక్వత కలిగి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల పరిశోధన. ఆ పరిణతి చెందిన స్త్రీ మనస్సును సాధారణ సంభాషణా రూపంలో చరణం రాసి నాలాంటి వారిని తన చరణాగతులను చేస్తాడు. మనసు కవిర్షి - నా తండ్రి ఆత్రేయ - అంటూ నా సజల నేత్రాలయంలో స్ఫటిక మూర్తిగా ఘనీభవించింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
పిల్లలపై పెద్దల ప్రభావం
ఆదిత్య టైటిల్ పాత్ర పోషించిన బాలల చిత్రం ‘ఆత్రేయ’. అనూహ్య, జీవా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి శాంతికుమార్ చిలుముల దర్శకుడు. స్టార్ట్ (సర్వీస్ త్రూ ఆర్ట్) హెల్ప్ ఫౌండేషన్-డాట్‌కామ్ ఆర్ట్ క్రియేషన్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న బాలల దినోత్సవ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లల పెంపకంలో పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తల నేపథ్యంలో సాగే కథాంశమిది. కథానుగుణంగా కావాల్సినంత వినోదం కూడా ఉంది. పెద్దల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ సినిమా ద్వారా తెలుపుతున్నాం. ఆత్రేయగా ఆదిత్య, ఎలైస్గా అనూహ్య చక్కగా నటించారు. జీవా మంత్రిగా నటించారు’’ అని తెలిపారు. -
రాయకుండా ఉండలేకపోయా!
పెత్తందార్ల అమానుష ప్రవర్తనలను తెలియజేసిన తెలుగు ఆధునిక నాటకం ‘కుక్క’ రజతోత్సవ సంవత్సర నేపథ్యంలో ఆత్రేయ, ఎన్.ఆర్.నంది వంటి ఆధునిక నాటక రచయితలకు కొనసాగింపుగా ప్రశంసలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ ‘కుక్క’ రూపొందిన వైనాన్ని నెమరువేసుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రాయాలని రాసింది కాదు. రాయకుండా ఉండలేక రాసింది. నా సమక్షంలో జరిగిన వాస్తవిక సంఘటన నన్ను క్షుభితం చేసింది. ఆ అల్లకల్లోలాన్ని ఎలా వ్యక్తీకరించాలా? అని ఆలోచించాను. 1960ల్లో బ్యాంక్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్ జిల్లా కడెం అనే గ్రామం వెళ్లాను. నేను పనిచేస్తున్న జాతీయ బ్యాంకులో గౌరవంగా అప్పుతీసుకున్నాడు ఓ పటేలు. రికవరీ పనిపై మేం పటేలు ఇంటికి వెళ్లాం. మా దగ్గర అప్పుతీసుకున్న పటేలు గ్రామంలో అప్పులు ఇచ్చేవాడు. రికవరీ ఎలా చేసేవాడు? ఇంట్లోనే! వడ్డీకట్టని జీతగాళ్లను బండబూతులు తిడుతూ! నా సమక్షంలోనే పటేలు భార్య ఒక జీతగాణ్ణి కొట్టింది.. గంటెతో. నెత్తురు కక్కుకున్నాడు జీతగాడు! అతడు చేసిన నేరం? పటేలమ్మ పెట్టిన కూర అతడి చేతిలోంచి పడిపోవడమే! ‘మనుషులను కుక్కలకంటే హీనంగా చూస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం’ అని బలంగా చెప్పాలని నేను చేసిన ప్రయత్నం ‘కుక్క’గా రూపొందింది. ‘కుక్క కావాల్నా నాయినా..! ఒరే జీతగాడా, నువ్ జర కుక్కతీర్గ నిలబడరా...’ అన్న డైలాగ్‌కు ఎన్ని కనులు కన్నీరు కార్చాయో! ఎన్ని కన్నులు ఎర్రనయ్యాయో! కాబట్టే పదివేలసార్లకు పైగా ప్రదర్శితమైంది. ఇప్పుడు ‘నిశుంభిత’ తెలుగు నాటకాలను ప్రదర్శించే క్రమంలో ‘కుక్క’ను ప్రదర్శిస్తోంది! - ‘కుక్క’ రచయిత యండమూరి కుక్క నాటిక ప్రదర్శన నేడు ‘నిశుంభిత’ సంస్థ ఆధ్వర్యంలో దర్శకత్వం: రామమోహన్ హొలగొంది సమయం: సాయంత్రం 7.30 గంటలు వేదిక: లామకాన్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 1 పాస్‌లకు: 9849256440 -
గీత స్మరణం
పల్లవి : అతడు: ఏమని వర్ణించనూ... ఏమని వర్ణించనూ నీకంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వునూ నీ ఇలవేల్పును... ఏమని వర్ణించనూ... అమె: ఆ... ఆహహ... ఆ... అ: పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు ॥ తీర్చిన బొమ్మలా తీరైనవాడూ (2) తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించనూ... చరణం: 1 అ: రాముడు కాడమ్మా నిందలు నమ్మడూ కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరూ నువ్వు పూజించు దేవుళ్ల లోపాలు లేనివాడు నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించనూ... చరణం: 2 అ: కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా తన కళ్లతో జగతి చూపించగలడమ్మా ॥ ఆ: ఆ దేవుడెదురైతే వేరేమి కోరను... ఆ దేవుడెదురైతే వేరేమి కోరను నా అన్న రూపాన్ని చూపితే చాలును ఏమని ఊహించనూ నా అన్న రూపునూ నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ నా ఇలవేల్పును ఏమని ఊహించనూ చిత్రం : డ్రైవర్ రాముడు (1979) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : చక్రవర్తి గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల నిర్వహణ: నాగేష్ -
మనసులు దోచిన కవి ఆత్రేయ
నేడు ఆచార్య ఆత్రేయ వర్ధంతి తెలుగువారి మనసులు దోచిన కవి ఆత్రేయ. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. మనసుకవిగా ముద్ర వేసుకున్న ఆచార్య ఆత్రేయ పూర్తి పేరు ‘కిళాంబి వేంకట నరసింహాచార్యులు’. పేరులో ఆచార్యని, గోత్రంలోని ఆత్రేయను తీసుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారాయన. 1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, తెలుగువారికి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. తన కలం రుచి చూపించారు. 1988లో ఒకసారి ఆత్రేయ ‘అభినందన’ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో ఇళయరాజా తన ట్యూన్‌ను ఆత్రేయకు వినిపించారు. ఆ ట్యూన్‌ను తకారంలో తీసుకుంటే... ‘తాన నాననననా తరతాన నాననననా’ ఇంత వరకు బాగానే ఉందినిపిస్తోంది. ఆ తర్వాత ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ ‘తారి తాన తాన తాన తాననా తానా...’ విని, ఎన్ని తానాలు రా... అని ఆత్రేయ అన్నారు. అప్పుడు ఇళయరాజా ‘చూడండి గురువుగారు’ మీరు నా మ్యూజిక్‌కి తగ్గట్టు ఒక్క అక్షరం మిస్‌కాకుండా పాట రాయండి. లేకపోతే మీరు పాట రాసి ఇవ్వండి నేను ట్యూన్ చేసుకుంటాను అన్నారు. అప్పుడు ఇళయరాజా ట్యూన్‌కి ఒక్క అక్షరం కూడ పొల్లుపోకుండా ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం...’ అని అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఆత్రేయగారి కెరీర్లో వెనక్కి చూస్తే... ఆయన ట్యూన్‌కి పాటలు రాయడం చాలా అరుదు. అలాంటిది అభినందన సినిమా పాటలన్నీ ఆయన ట్యూన్స్‌కి రాయడం విశేషం. అందులో ప్రతీ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సినిమా హిట్ కావడంలో ఆత్రేయగారి హస్తం ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఆచార్య ఆత్రేయ ఫ్రొఫైల్ అసలు పేరు : కిళాంబి వేంకట నరసింహాచార్యులు జననం : 07-05-1921 జన్మస్థలం : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట తాలుకా మంగళంపాడు స్వస్థలం : సూళ్లూరుపేట తాలుకా ఉచ్చూరు తల్లిదండ్రులు : సీతమ్మ, కృష్ణమాచార్యులు చదువు : ఎస్.ఎస్.ఎల్.సి. వివాహం - భార్య : 1940 - పద్మావతి తొలిచిత్రం - పాట : దీక్ష (1951) - పోరా బాబూ పో పోయి చూడు లోకం పోకడ ఆఖరిచిత్రం - పాట : ప్రేమయుద్ధం (1990) - ఈ మువ్వలగానం మన ప్రేమకు ప్రాణం పాటలు : సుమారు 1400 దర్శకునిగా : వాగ్దానం (1961) నటించిన సినిమా : కోడెనాగు (1974) గౌరవ పురస్కారాలు : 1989 మే లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు పొందారు. తొలి కోడి కూసింది (1981) లో ‘అందమైన లోకమనీ’ పాటకు నంది అవార్డు అందుకున్నారు. ఇతరవిషయాలు : గోత్రనామం ఆత్రేయను, పేరులో ఆచార్యను కలిపి ‘ఆచార్య ఆత్రేయ’ అని పెట్టుకున్నారు. చిన్నప్పుటి నుండే చదువు మీద కన్నా నాటకాల మీదనే మక్కువ చూపేవారు. రాజన్ అనే మిత్రుని సాయంతో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఒకసారి వీధి దీపం కింద కూర్చొని ‘గౌతమబుద్ధ’ అనే నాటకం రాసి దానిని యాభైరూపాయలకు అమ్మి, దానితో తన అవసరాలను తీర్చుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చిన్న వేషానికి అవకాశమొచ్చినా అది నచ్చక వెనక్కి వ చ్చేశారు. ఆ తర్వాత షావుకారు చిత్రానికి డైలాగులు రాసే అవకాశం వచ్చినా అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ‘మనోహర’ అనే చిత్రానికి డైలాగ్ అసిస్టెంట్‌గా మాటసాయం చేశారు. చివరికి ‘దీక్ష’ సినిమాతో ఆత్రేయ సినీరంగంలోకి తెరంగేట్రం చేశారు. చాలా పద్యాలు, నాటకాలు, నాటికలు రచించారు. దాదాపు 400 చిత్రాలకు రచన చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ మీద 12 మంది పరిశోధనలు చేశారు. ‘మనస్విని’ సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 సంపుటలుగా 1990లో ప్రచురించారు, ఆయన ‘మనసుకవి’గా ప్రజల మన్ననలు పొందారు. మరణం : 13-09-1989 - నాగేష్