Acharya Atreya 100th Birth Anniversary: Songs, Family, Wife, Biography - Sakshi
Sakshi News home page

Acharya Atreya: తెలుగుపాట గుండెచప్పుడు

Published Fri, May 7 2021 1:10 PM | Last Updated on Fri, May 7 2021 3:07 PM

Acharya Atreya 100th Birth Anniversary: Songs, Family, Wife, Biography, Manasu Kavi - Sakshi

‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా’ రాసి
గొప్ప సామ్యవాద కవి ఏమో అనిపించుకున్నాడాయన.
‘ముద్దబంతి పూవులో మూగ కళ్ల ఊసులో’ రాసి
గొప్ప భావకవి ఏమో అని సందేహం కలుగచేశాడాయన.
‘నేనొక ప్రేమ పిపాసిని’ అని రాస్తే
ఇంతకు మించిన వైరాగ్య కవి లేడు అని అందరూ అన్నారు.
‘మనసు గతి ఇంతే’ అని అంటే
ఇతనే కదా తెలుగులో మనసున్న కవి అని శ్లాఘించారు.
‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ అనగానే బాబోయ్‌ బూత్రేయ అన్నవారూ ఉన్నారు.
కటాక్షించేవాడు ఎవరు ఎలా కోరితే అలా కటాక్షిస్తాడు.
ఆత్రేయ తెలుగు సినిమా పాటకు, మాటకు చేసిన కటాక్షం సామాన్యమైనది కాదు.
వంద సంవత్సరాల వరకూ మరో వేయి సంవత్సరాల వరకూ నిలబడేది.
‘నా పాట నీ నోట పలకాల సిలకా’ అని ఏ ముహూర్తాన రాశాడో
ఆయన పాట తెలుగువారి నోట పలుకుతూనే ఉంది. పలుకుతూనే ఉంటుంది.

‘అనుక్షణం మరణభయం
జీవన సంభరణ భయం
అంధకారం అయోమయం
ఆర్తనాద సంకులం
మనిషికి మనిషన్న భయం
మనసంటే మనకు భయం
సత్యమన్నచో సచ్చే భయం
చచ్చు దాకా చావు భయం’...
ఇది ఆత్రేయ తన ‘భయం’ అనే నాటకం కోసం రాసిన పాట.
కవిని దార్శనికుడు అంటారు. ఇవాళ్టి సన్నివేశానికి ఈ పాట సరిగ్గా సరిపోలేదూ? ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం ఆత్రేయ దీనిని రాసి ఇవాళ్టి సన్నివేశానికి సిద్ధం చేశాడా? ఏమో.
∙∙ 


ఆత్రేయ ‘ఈనాడు’ అనే నాటకం రాశాడు. అది దేశ విభజన సమయంలో సామరస్యాన్ని బోధించడానికి చేసిన ప్రయత్నం. ఆ నాటకంలో ఒక హిందువు మిత్రుడు ఒక ముస్లిం మిత్రుడికి దేశ స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా గాంధీ గారి బొమ్మను బహూకరిస్తాడు. కాని నాటకం చివరలో ఒక మతోన్మాది విసిరిన కత్తికి ఆ గాంధీ బొమ్మ ముక్కలవుతుంది. ఈ నాటకాన్ని 1948 జనవరి 30న నెల్లూరులో ప్రదర్శించారు. కాని అదే రోజు గాంధీ మీద అలాంటి దాడే జరిగి ఆయన ప్రాణాలు వదిలారు. ఆత్రేయ దార్శనికమా ఇది. ఏమో. కాని తాను రాసిందే ప్రదర్శన రోజున జరగడం విని ఆత్రేయ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. గాంధీ గారిని హత్య చేయడం ఏమిటి? ఏమిటి ఇదంతా? మనిషి ఇలా ఎందుకు? ఆ సున్నిత మనస్కుడిని అయిన వారు తమ ఊరికి తీసుకెళ్లి రెండు మూడు నెలలు ఉంచుకుని తిరిగి మామూలు మనిషిని చేసి పంపాల్సి వచ్చింది.
∙∙ 
సినిమాల్లోకి వెళ్లడం ఎలాంటిదంటే కల్పిత మబ్బులకు నెమలి నాట్యమాడటం లాంటిది. దానికి ముందు ఆ నెమలికి సహజ సిద్ధమైన స్పందన ఉంటుంది. శక్తి ఉంటుంది. అది తన సంకల్పబలంతో మబ్బులను కూడా సృష్టించి ఆడ గలిగేలా ఉంటుంది. ఆచార్య ఆత్రేయగా తెలుగువారికి విఖ్యాతుడైన కిళాంబి వెంకట నరసింహాచార్యులు తొలిరోజుల్లో ఇలాగే కాలాన్ని దర్శించేవాడు. అన్యాయాలను దునుమాడేవాడు.  లోకంలోని చెడ్డను ఏవగించుకునేవాడు. ఆయన తన జీవితంలో రాసిన తొలి కవితే ‘దేవుళ్లదంతా అన్యాయమే’ శీర్షికతో ఉంటుంది. దేవుళ్లు న్యాయంగా వ్యవహరిస్తే ఈ లోకం ఇలా ఎందుకు వుంటుంది. ఆ కవిత రాసే నాటికి ఆత్రేయ హైస్కూలు పిల్లవాడు.

నెల్లూరు జిల్లా తన మృత్తిక నుంచి మొలకొలుకులు బియ్యాన్ని ఇచ్చినట్టే చాలామంది కళాకారులను, రచయితలను, కవులను ఇచ్చింది. ఆత్రేయను కూడా సూళ్లూరుపేట ప్రాంతం నుంచి ఆ కాళంగి నది నీటి నుంచి తెచ్చి ఇచ్చింది. వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న పూర్వీకుల నుంచి ఆ నేల ఆ భూమిని ఆత్రేయ పొందలేదు గాని వారి విద్వత్తును కొంత పొందగలిగాడు. చిన్నప్పుడే అంటే 8 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోవడంతో మేనమామ జగన్నాథాచార్యుల వద్ద పెరిగాడు. తెలుగు ఇళ్లల్లో పిల్లల్ని మేనమామలు ముద్దు చేస్తారు. పిల్లలకు మేనమామ ఛాయ వస్తుంది కూడా. అలాగే ఆత్రేయకు కూడా తన మేనమామ ఛాయ వచ్చింది. జగన్నాథాచార్యులు సాహిత్యాభిమాని. నాటకాల అభిమాని. మేనల్లుడికి కంద పద్యం ఇలా ఉంటుందని ఒక పాఠంగా చెప్తే రాత్రికి రాత్రి దాని మర్మం గ్రహించి కంద పద్యాలు రాసిన సమర్థుడు బాల ఆత్రేయ. నాటకాలకు వెంటబెట్టుకొని తీసుకువెళితే ఆ నాటకాలు చూసి వాటి మీద ఇష్టం పెంచుకున్నాడాయన. బహుశా అనుకున్నట్టున్నాడు– చదువు గిదువు పొట్టకూటి కోసం నాటకం జీవితం కోసం అని. చదువును అంతవరకే ఉంచాడు. నాటకాన్ని ఇంత దాకా తీసుకువచ్చాడు.
∙∙ 
ఇంటర్‌తో చదువు ఆపి నెల్లూరు కోర్టులో గుమాస్తాగా పని చేసిన ఆత్రేయ నాటకాలు చూడటం వేయడం కొనసాగించాడు. అప్పట్లో ఆయన తాను రాయని ‘ఎదురీత’ అనే నాటకాన్ని విపరీతంగా ఆడేవాడు. ఆ తర్వాత స్వయంగా ‘గౌతమ బుద్ధ’ అనే నాటకం రాసి ప్రదర్శించేవాడు. ‘గౌతమబుద్ధుడి’ గురించి పిల్లలకు తెలియచేయడానికి ఆ నాటకాన్ని కాలేజీల్లో వేయడానికి ఆత్రేయకు ఆహ్వానాలు అందేవి. ఆ గిరాకీ పెరిగాక ఆయన దాదాపుగా ఉద్యోగాన్ని, చేసే తలంపును కట్టి పెట్టాడు. ఆ రోజుల్లో గుడివాడ వెళ్లి అక్కడి ‘ఆంధ్రకళాపరిషత్‌’ ఆహ్వానం మేరకు స్వీయ రచన ‘పరివర్తన’ అనే నాటకం ఆడితే ఆ ఊళ్లోవాళ్లు అందరూ కలసి నాటకం టీచర్‌గా, మేనేజర్‌గా ఆత్రేయను అక్కడే ఉంచేశారు. ఆ తర్వాత ఆ ఊరికి చెందిన ఇద్దరు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు ఆయనతో కలసి ఒక త్రయంగా ఏర్పడి అన్నపూర్ణా పిక్చర్స్‌ బ్యానర్‌లో ఎన్ని మంచి సినిమాలు చేశారో అందరికీ తెలుసు. ‘తోడికోడళ్లు’లో ‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడిదానా’ ఎవరు మరువగలరు?
∙∙ 
ఆత్రేయను సినిమా రంగం వరకూ నాటకాలే చేర్చాయి. కోర్టులో గుమాస్తాగా తను పని చేసిన అనుభవం ‘ఎన్‌.జి.ఓ’ అనే ప్రఖ్యాత నాటకం రాయడానికి కారణం అయ్యింది. ‘కప్పలు’ ఆయన మరో ప్రసిద్ధ నాటకం. ఆ నాటకం క్లయిమాక్స్‌లో చేతిలో కొడవలి ఉన్నందుకు ఒక రైతు కూలీ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. కొడవలి కమ్యూనిస్టుల చిహ్నం కదా. సినిమాల్లో పని చేసినా సంభాషణలే తన ఏరియా అని ఆత్రేయ అనుకునేవారు. కాని ఆత్రేయ నాటకాలు గమనించిన దర్శకులు కె.ఎస్‌.ప్రకాశరావు ‘నీ మాటలో తూకం ఉంది. నువ్వు పాటలు రాయగలవు’ అనంటే ఆత్రేయ హటం చేశారు రాయనని. కాని రాశారు. అదే ‘దీక్ష’ సినిమాలో ‘పోరా బాబూ పో.. పోయి చూడు లోకం పోకడ’.. ఆయన మొదటి పాట. 1951లో ఈ పాటతో మొదలెట్టి 1989లో ‘ప్రేమయుద్ధం’ వరకూ ఆత్రేయ దాదాపు 1400 పాటలు రాశారు. ఒక రకంగా ఆయన కవిత్వంలో శ్రీశ్రీ చేసిన పనిని సినిమా పాటలో చేశారు. శ్రీశ్రీ కవిత్వాన్ని భూమార్గం పట్టిస్తే ఆత్రేయ సంస్కృత పదబంధాల తెలుగు పాటను అచ్చతెలుగులో తేట తెలుగులోకి తీసుకు వచ్చారు. అందుకే ఆయన పాట అందరికీ నచ్చింది. తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...

నీ సమకాలికులు ఎవరో తెలియకపోతే నీ గొప్పతనం నిజంగా అర్థం కాదు. 1950లో ఆత్రేయ సినిమా రంగం ప్రవేశం చేసిన ఒకటి రెండు సంవత్సరాలకు అటూ ఇటూ ఉద్ధండులైన సినిమా కవులు రంగం మీదకు వచ్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, కొసరాజు, మల్లాది రామకృష్ణ శాస్త్రి వీరిలో ముఖ్యులు. వీరందరిలోకి ఆత్రేయ కమర్షియల్‌ సినిమా రైటర్‌గా నిలబడ్డారు. ఆయన గొప్ప క్లాసిక్‌ రాయగలడు. పక్కా మాస్‌ రాయగలడు. ఇద్దరు దర్శకులు ఆత్రేయను పూర్తిగా విశ్వసించారు. ఒకరు కె.ఎస్‌.ప్రకాశరావు మరొకరు ఆదుర్తి సుబ్బారావు. ఆత్రేయ వల్ల వీరు వీరి వల్ల ఆత్రేయ లబ్ధి పొందారు. సినిమా సంభాషణల్లో సూపర్‌స్టార్‌ పింగళి నాగేంద్రరావు అయినా సగటు ప్రేక్షకుడి సినిమా సంభాషణ రచయిత ఒకడుంటాడు అని ‘ప్రేమనగర్‌’ వల్ల ఆత్రేయ తెలిశాడు. ‘ఏం రాశాడ్రా’ అనే మాట అప్పటి నుంచే మొదలైంది.

అంత వరకూ ఏం చేశాడ్రా, ఏం తీశాడ్రా మాత్రమే ఉండేవి. ‘ప్రేమనగర్‌’లో సంభాషణలు, పాటలు ఆత్రేయ విశ్వరూపం చూపాడు. ‘లతా... ఎందుకు చేశావీ పని’, ‘చినబాబు చెడిపోయాడు కాని చెడ్డవాడు కాదమ్మా’, ‘ఇదే మా ఎస్టేట్‌. ఇక్కణ్ణుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది’ అనే మాటలు గొప్పగా నిలిచాయి. ‘నీ కోసం వెలిసింది’, ‘మనసు గతి ఇంతే’ రాసిన ఆత్రేయే అదే సినిమాలో ‘లేలేలే... నా రాజా’ రాసి తన కలంలో నాటుసారా కూడా సిరా కాగలదని చూపాడు. ఆ తర్వాత ఆదుర్తితో ఆత్రేయ కలసి పూయించిన మందారపువ్వు ‘మూగమనసులు’ నేటికీ క్లాసిక్‌గా ఉంది. ఈ కథకు ముఖ్యకర్త ముళ్లపూడి వెంకట రమణే అయినా ఆత్రేయ చేతిలో పడ్డాక ఆ స్క్రిప్ట్‌ ఎక్కడికో వెళ్లింది. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అని ఆత్రేయ అన్నాడు. ‘పాడుతా తీయగా చల్లగా’ అని కూడా అని పాటలోని చల్లదనాన్ని పేద ప్రేక్షకుడికి పంచాడు.

ఆత్రేయతో ఒకసారి పని చేసిన వారు మరల ఆత్రేయతోనే పని చేయాలనుకుంటారు. తెలుగులో యువచిత్ర సంస్థ, జగపతి సంస్థ ఆత్రేయతోనే రాయించుకోవాలని నిశ్చయం చేసుకున్నాయి. జగపతి సంస్థ రాజేంద్ర ప్రసాద్‌ ఆత్రేయను ఒక పాట కోసం బెంగళూరు తీసుకెళ్లి హోటల్‌లో కూచోబెడితే ఆత్రేయ కాఫీలు గీఫీలు తాగడం తప్ప ఇంకేమీ చేయలేదు. బిల్లు పెరగడం తప్ప మరో లాభం కనిపించకపోయే సరికి రాజేంద్రప్రసాద్‌ గట్టిగా ఆయనను నిలదీసేంత పని చేశారు. ‘ఉండు.. రాస్తాను’ అని కారెక్కి షికారు బయలుదేరిన ఆత్రేయ ఆ సమయంలో కురిసిన నాలుగు చినుకులు, తడుస్తూ వెళ్లిన రెండు జడలు చూసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని రాస్తే ‘ఆత్మీయులు’లో అది తెలుగువారి తొలి వాన పాట అయ్యింది. బి.సరోజను కలల రాణిని చేసింది. అక్కినేని అభిమానుల ఆనందం సరేసరి. యువచిత్ర నిర్మాత కె.మురారి ‘గోరింటాకు’ తీస్తున్నప్పుడు ‘చెప్పనా... సిగ్గు విడిచి చెప్పరానివి’ పాట ఆత్రేయ రాశారు. అదే సినిమాలో వేటూరి ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పాట రాశారు. అయితే పల్లవి వరకే. ఆ రోజుల్లో దాసరి సినిమాల పాటలను పాలగుమ్మి పద్మరాజు గారు చెక్‌ చేసేవారు. ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పల్లవి చూసి ఇలాంటిది ఫలానా పల్లవికి పోలికగా ఉంది అని కామెంట్‌ చేశారు. వేటూరికి కోపం వచ్చి ఫైల్‌ విసిరికొట్టి వెళ్లిపోయారు. ఆ చరణాలు ఎవరు రాయాలి? ఇంకెవరు. ఆత్రేయే. ‘మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది’ అని ఎంత మంచి పల్లవి రాశాడాయన. ఆ తర్వాత ‘త్రిశూలం’లో ‘రాయిని ఆడది చేసిన రాముడివా’, ‘పెళ్లంటే పందిళ్లు తప్పట్లు తాళాలు’... ఇవన్నీ మురారికి ఆత్రేయ ఇచ్చిన కానుకలు. ‘నారి నారి నడుమ మురారి’లో ‘పెళ్లంటూనే వేడెక్కింది గాలి’ అని ఆత్రేయ మాత్రమే కదా రాయగలడు.

ఆత్రేయ మరో విశిష్టపర్వం కె.బాలచందర్‌ సినిమాలకు రాయడం. బాలచందర్‌ కొన్ని మొదట తెలుగులో, కొన్ని మొదట తమిళంలో తీశారు. కాని చాలా సినిమాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రీమేక్‌ అయ్యాయి. తమిళంలో కణ్ణదాసన్‌ రాసినదాన్ని తెలుగులో ఆత్రేయ గొప్పగా సమం చేసేవారు. ఆత్రేయ రాసింది అటు పక్క. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’, ‘ఏమిటి లోకం పలుగాకుల లోకం’, ‘సరిగమలు గలగలలు’, ‘బలే బలే మగాడివోయ్‌ బంగారు నాసామివోయ్‌’, ‘ఇటు అటు కాని హృదయం తోటి’, ‘తాళి కట్టు శుభవేళ’... ఎన్నెని. వీటికి తోడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చేత పాడించిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’ ఒక క్లాసిక్‌. ‘ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’ అని ఆత్రేయ ఆ పాటలో రాస్తాడు. కె.బాలచందర్‌ తీసిన ‘తొలి కోడి కూసింది’ సినిమాకు ఆత్రేయ రాసిన ‘అందమైన లోకమని రంగురంగులుంటాయని’ పాటకు ఆత్రేయ నంది అవార్డు అందుకున్నాడు. ఆత్రేయకు వచ్చిన ఏకైక నంది అవార్డు అదే. ఆ పాటలో ‘మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చెల్లెమ్మా’ అని రాస్తాడు ఆత్రేయ. తెలివి మీరే ఇవాళ్టి విపత్కరాలకు కారణం అవుతున్నాడు కదా మనిషి.

30 ఏళ్ల వయసులో సినిమా రంగానికి వచ్చిన ఆత్రేయ 38 ఏళ్ల పాటు సినిమా రంగంలో పని చేశారు. 68వ ఏట 1989లో మరణించేనాటి వరకూ ఆయన పని చేస్తూనే వెళ్లాడు. మధ్యలో వేటూరి అనే జంఝామారుతం వచ్చినా, దాశరథి, సినారెలాంటి సమర్థులు సత్తా చాటినా తన స్థానాన్ని చెక్కు చెదరక కాపాడుకున్నాడు. రాచరికంతో బతికాడు. అరాచకంగా ఉండగలననీ నిరూపించాడు. ఆయనతో ఊగిన వారున్నారు. తూగినవారున్నారు. వేగినవారున్నారు. అవన్నీ తాత్కాలికం అని ఆత్రేయకు తెలుసు. చివరకు తన కలం నుంచి వచ్చేదే చివరి వరకూ అనీ తెలుసు. అందుకే ఒక కవి పుట్టిన వందేళ్ల తర్వాత కూడా మనం తలచుకుంటున్నాం. మననం చేసుకుంటున్నాం. శ్లాఘించుకుంటున్నాం.
ఆత్రేయ మనసు కవి.
‘మనసు గతి ఇంతే’ అని రాశాడు.
మనం మాత్రం ‘మనసున్న కవికి మరణం లేదంతే’ అని పాడుకుంటూనే ఉంటాం.
ఆత్రేయా... నీకు శతపల్లవుల మాల.


నేనొక ప్రేమపిపాసిని

ఆత్రేయ భగ్న ప్రేమికుడు. కనుక భగ్న గీతాలు రాసేప్పుడు ఆ భగ్నత్వాన్ని గాఢంగా పాటల్లో చూపేవాడు. ఇంటర్‌ చదివాక ఆయన తన ఊళ్లో ఉన్న పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఆత్రేయను ప్రేమించింది. పెళ్లి చేసుకోవడమే తరువాయి. అయితే పెద్దలు లెక్కలు తీసి ఇద్దరూ స్వగోత్రీకులు అని తేల్చారు. కనుక పెళ్లికి అడ్డం పడింది. ఆత్రేయ ఇది తట్టుకోలేకపోయారు. పద్మావతి దూరమైంది. ఆ తర్వాత చాలారోజులకు ఆమె కనిపించి ‘నేను వీణ వాయించేదాన్ని తెలుసుగా. నువ్వు దూరమయ్యావని వీణను అటకెక్కించాను’ అని బాధ పడిందట. ఆత్రేయ రాసిన ‘ఈ వీణకు శృతి లేదు’ పాటను గుర్తు చేసుకోండి. ‘ఎందరికో హృదయం లేదు’ అని రాసింది తన పెద్దల గురించే. ఆత్రేయకు తాను రాసిన పాటలలో ‘నేనొక ప్రేమ పిపాసిని’ పాట చాలా ఇష్టం. ‘నువ్వు వలచావని తెలిసే లోపు నివురైపోతాను’ అని ఎంత వేదనగా రాశాడు. బాలూ ఎక్కడ కనిపించినా ఆత్రేయ ఆ పాట అడిగి పాడించుకునేవాడు. బాలూ తాను ఫీలవుతూ పాడతాడు. వేరేవాళ్లు పాడితే మనం ఫీలవుతామని ఆత్రేయ జోక్‌.

ఆత్రేయ వైరాగ్యం
ప్రసూతి వైరాగ్యంలాగా ఆత్రేయ వైరాగ్యం ఉండేది అప్పట్లో. ఆత్రేయతో పాట రాయించుకోవడానికి దర్శకుడు ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని ఆత్రేయ వెంట పెట్టేవాడు. ఆత్రేయను వెంటాడి పాట తెచ్చుకోవడం ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పని. చెన్నై అశోకా స్ట్రీట్‌లో మొదటి ఇల్లు పి.సుశీలది. రెండో ఇల్లు ఆత్రేయది. ఆ ఇంటి కారుషెడ్‌ను ఆయన ఇలా తన వెంటపడే అసిస్టెంట్‌ డైరెక్టర్ల కోసం కేటాయించాడు. అందులో రేయింబవళ్లు వాళ్లు తిని, కూచుని, నిద్రపోతుండేవాళ్లు. ఎప్పుడు పాట ఇస్తాడో తెలియదు కదా. ఈ బాధలన్ని పడలేక మళ్లీ జన్మలో ఆత్రేయతో రాయించకూడదని అనుకునేవారట. కాని పాట ఇచ్చాక అది రిలీజయ్యి హిట్‌ అయ్యాక ఆ వైరాగ్యం పోయి మళ్లీ ఆయన వెంట పడేవారు. ఆత్రేయ ఇంకా ఎంత వింత జీవి అంటే అర్ధరాత్రి వచ్చి షెడ్‌లో నిద్రపోతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను లేపి పాట చేతిలో పెట్టేవాడట. అమ్మయ్య... నా కష్టాలు గట్టెక్కాయని ఆ అసిస్టెంట్‌ తడుముకుంటూ లేచి అలెర్ట్‌ అయ్యేవాడట. ‘నాయనా.. ఈ పాట ఫలానా ప్రొడ్యూసర్‌కు ఇచ్చిరా. నీ పాట రేపు ఇస్తాను’ అనేవాడట ఆత్రేయ. ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భోరున విలపించేవాడట. ఆత్రేయ లీలలు అలా ఉండేవి.

నవ్విస్తూనే ఏడిపిస్తారు
జంధ్యాలగారు, ఆత్రేయగారు, రమణగారు– నా అభిమాన రచయితలు! ముగ్గురెందుకంటే–
ఒకరు నవ్విస్తారని, ఒకరు ఏడిపిస్తారని, ఒకరు నవ్విస్తూనే ఏడిపిస్తారని! 
ఆ మూడిటితోనే మన జీవితం ముడిపడి ఉందని!
మాటని పాటగాను, పాటని మాటగాను రాయగల– తేటతేట మాటల పాటల ముత్యాల మూటల నాటక సినీ ఘనాపాఠీ శ్రీ ఆత్రేయ! అంతంత తేలిక మాటలు కూడా గుండెల్లో గునపం దిగేసి 
కొబ్బరి కాయలకి డొక్కలు  ఒలుస్తున్నట్లుంటాయి! 
‘మీరు రాయక నిర్మాతల్నీ , రాసి ప్రేక్షకుల్నీ ఏడిపిస్తారు అంటారు?’ అని అడిగితే– ‘అవును! రాస్తూ నేనూ ఏడుస్తాను’ అంటాడు! 
కనీసం రెండు అర్థాలు లేకుండా ఆయన ఏదీ రాయలేడు!


‘పాడుతా తీయగా చల్లగా’.. ‘మనసు గతి ఇంతే’.. లాంటి పాటలు, ‘ఇక్కణ్ణించి మా అధికారం మొదలవుతుంది!’ ‘కాదు! మీ అహంకారం మొదలవుతుంది’ లాంటి మాటల ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే–  తెల్లారిపోతుంది తప్ప, గుండె చల్లారదు! కోడెనాగు సినిమాలో నాయకానాయకిలు పారిపోతూ ‘మాష్టారూ! ఈ సమాజానికి దూరంగా పారిపోతున్నాం! మమ్మల్ని ఆపద్దు!’ అంటే– మాష్టారు(ఆత్రేయ): ‘నాగరాజూ! మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో మనుషులుంటారు, ఆ మనుషులకి ఒక సమాజం ఉంటుంది! కనక ‘సమాజం నించి మీరెక్కడికీ పారిపోలేరు’ ఇలాంటి మాటలు ఎడంచేత్తో రాసి, కుడిచేత్తో ఫెయిర్‌ చేసిచ్చేస్తే రావు! రెండు చేతుల్తో గుండె లోతుల్లోంచి తోడితే వస్తాయి!

ఆయన నాటకాలు భయం, కప్పలు, ఎన్‌.జి.వో లాంటివి చదివినా, వేసినా, చూసినా గుండెల్ని పట్టేస్తాయి! నిరుద్యోగుల కష్టాలకథ ‘ఒక్కరూపాయి’ నాటిక ప్రారంభవాక్యాలు:– తెర తొలిగింది. అది ఒక అద్దెగది. ఉండేవాళ్ళకి చాలా చిన్నది, ఇచ్చేవాళ్ళకి చాలా పెద్దది... బ్రాకెట్టు మాటల్లో కూడా చాలా డ్రామా ఉంటుంది! 
‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాగా వచ్చిన నా నాటకం ‘ఒంటెద్దుబండి’ మొదటి ప్రదర్శన (1985) జి.ఎస్‌.ఆర్‌.మూర్తి మెమోరియల్‌ నాటక కళా పరిషత్తు, విజయవాడలో పూర్తవ్వగానే– స్టేజిమీదకొచ్చేసి, అభినందనల వడగళ్ళవాన కురిపిస్తున్న జనం మధ్యలోంచి ఒక పెద్దాయన నా చెయ్యి కుదిపేస్తూ– ‘‘ఆత్రేయ ‘ఎన్‌.జి.వో’ నాటకం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి అంత గొప్ప నాటకం చూసేనయ్యా’’ అన్న ఖీజ్ఛి ఆ్ఛట్ట ఇౌఝp జీఝ్ఛn్ట గుర్తొస్తే– ఈ నాటికీ నా రొమ్ము విరుచుకుంటుంది!
– ‘మనసుకవి’ గురించి మనసువిప్పిన నాటక, సినీ రచయిత ఎల్‌.బి.శ్రీరాం 


ఇళయరాజా పిలిచిన కవి

ఇళయరాజాను ఎవరైనా పిలవాల్సిందే కాని ఇళయరాజా ఎవ్వరినీ పిలవడు. కాని ఆయన పిలిచిన ఒకే ఒక కవి ఆత్రేయ. ఇళయరాజా తను ఖాళీ ఉన్నప్పుడు తట్టిన బాణీలను రికార్డు చేసి పెట్టుకుని ఉండేవాడు. అలా ఒకసారి కొన్ని బాణీలు పోగయ్యాక ఆత్రేయను పిలిచి ఆ బాణీలన్నింటికి పాటలు రాయమన్నాడు. ‘అన్నయ్యా... వీటికి మీరే రాయాలి. నా కోరిక’ అని స్వయంగా అడిగాడు. అంతే కాదు.. ‘మీకు కావలసిన టైమ్‌ తీసుకోండి’ అని కూడా అన్నాడు. ఆత్రేయ ఇళయరాజా కోరికను మన్నించి ఆ బాణీలకు పాటలు రాశాడు. ఆ రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. ఆ పాటలను తెలుగు సినిమా నిర్మాత–దర్శకుడు రమణమూర్తి తీసుకుని వాటికి వీలుగా కథను తయారు చేసి సినిమా తీశాడు. అదే ‘అభినందన’.

నిర్మాత దర్శకుడు
ఆత్రేయ తానే దర్శకుడిగా మారి ‘వాగ్దానం’ అనే సినిమా తీశాడు. అందులో అక్కినేని హీరో. తన సినిమాకు తానే షూటింగ్‌కు లేట్‌గా వచ్చేవాడు. అక్కినేని ఆయన కోసం వెయిట్‌ చేస్తూ కూచుని ఉండేవారు. ఏమిటి మహానుభావా ఈ ఆలస్యం అంటే ‘బద్దకిష్టుడైన రచయితను పెట్టుకున్నాను. అతను సీన్‌ ఇచ్చేసరికి ఈ వేళైంది’ అని జోక్‌ చేసేవాడట. అంటే ఆత్రేయ అనే దర్శకుడు, ఆత్రేయ అనే రచయితతో సీన్లు రాయించుకుంటున్నాడని అర్థం. వాగ్దానం సరిగా ఆడలేదు. అయితే ఆత్రేయ తాను రాసుకోగలిగినా దాశరథికి ఆ సినిమాలో పాటల రచయితగా అవకాశం ఇచ్చాడు. దాశరథి తొలి చిత్రం వాగ్దానమే.

నేను కవి... నువ్వు కవి
ఆత్రేయ మనసు కవి అని అందరూ చెప్పేది. చాలా పాటల్లో ఆయన మనసును వ్యాఖ్యానించాడు. కాని ‘నువ్వు’, ‘నేను’ అనే మాటలు ఎక్కువ వాడి పాటలు రాసింది ఆయనే. ‘నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు’, ‘నేనీ దరిని నువ్వా దరిని’, ‘నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు’, ‘నేను పుట్టాను ఈ లోకం నవ్వింది’, ‘నేను నేనుగా నీవు నీవుగా’... ఇవన్నీ ఆయన రాసిన పాటలే.  

వ్యాసం: సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement