దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: అధ్యాపకులు జ్ఞానంతో పాటు విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచేలా బోధన పద్ధతిని అవలంభించాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. అప్పుడు విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారని చెప్పారు. స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం వ్యక్తిగత వికాసంపై విద్యార్థులకు ఒకరోజు శిక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువు పట్ల ప్రేమతో, గౌరవ భావంతో మెలగడానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించాలని, అప్పుడే జన్మకు సార్థకత లభిస్తుందన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త ఆలోచనలను ఆచరించే వారే ముందు భవిష్యత్తులో అగ్రస్థానంలో నిలుస్తారన్నారు. క్లిష్ట సమస్యను ఎదుర్కొనేటప్పుడు వ్యక్తి యొక్క ప్రతి స్పందనలను నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. విద్యార్ధి తమ విద్యా జీవితంలో అధైర్యపడకుండా ముందు కు వెళ్లాలన్నారు. ఎప్పుడూ నిరాశకు తావివ్వకూడదని, ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నా రు. అనంతరం వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా కొన్ని కవితలు చెబుతూ ఆకట్టుకున్నారు.
గోల్డ్‌మెడల్ ప్రదానం...
యండమూరి విరేంద్రనాథ్ దాదాపు 400 మంది విద్యార్థులకు తార్కిక జ్ఞానానికి సంబంధించి ప్రశ్నలు వేశారు. ఇందులో బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి పృద్విదీప్‌రెడ్డి అత్యధిక మార్కులు సాధించి విజేతగా నిలిచారు. ఆ విద్యార్థికి యండమూరి గోల్డ్‌మెడల్ బహుకరించారు. అనంతరం కళాశాల యాజమాన్యం యాజమాన్యం యండమూరి వీరేంద్రనాథ్‌కు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి.తిరుపతిరెడ్డి, అకాడమిక్ సలహాదారులు డాక్టర్ కె.సుధాకర్, లక్ష్మినారాయణ, కార్యదర్శి పి.సూర్యనారాయణ, అధ్యక్షుడు సంపత్‌కుమార్, డీన్ ఐ.రవికుమార్, కన్వీనర్ టి.శ్రావణ్‌కుమార్, సంతోష్‌కుమార్, మీడియా అధికారి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ధైర్యాన్ని పెంచాలి- ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్
Published Tue, Sep 17 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement