అదే కనుక మీరు 20 వేల అద్దె ఇంట్లో ఉండి, మిగిలిన 30,000 నెలనెలా ఆదా చేసినట్లయితే, 30 సంవత్సరాలు అయ్యేసరికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? ఊపిరి బిగబట్టి వినండి. అక్షరాలా 5 కోట్లు!
‘ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి’ అన్న సూక్తి ఆర్థిక సూత్రాలకి కూడా పనిచేస్తుంది. మిగతావాళ్లకి ఇంకా అలాంటి ఆలోచన రాకముందే తెలివైనవాడు దాన్ని తనకి అనుగుణంగా ఉపయోగించుకుంటాడు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ వామపక్ష వాది. ఆయన రాష్ట్రపతి అవగానే ఆర్థికశాఖని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తాత్కాలికంగానైనా చేపడతారని అందరికీ తెలిసిన విషయమే. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల మీద నమ్మకం ఉన్నవాడు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అవుతారు అన్న వార్త చూచాయగా తెలియగానే నా స్నేహితుడొకరు కొన్ని సెలెక్టెడ్ షేర్లలో పెట్టుబడి పెట్టి, సెన్సెక్స్ పెరుగుదలతో కేవలం 15 రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించాడు.
ఆర్థిక సూత్రాలు సరిగ్గా తెలియకపోతే వచ్చే నష్టాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చిన ఏడాది లోపే అప్పు తీసుకుని ఇల్లు, కారు, ఫర్నీచరు కొనుక్కున్నాడు. జీతంలో 80 శాతం వాయిదాలకే కట్టేవాడు. అయిదు సంవత్సరాల తరువాత రిసెషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతని అప్పు మొత్తం దాదాపు అలాగే ఉంది. అయిదు సంవత్సరాల పాటు అతను కట్టిన డబ్బంతా చాలావరకు వడ్డీకే సరిపోయింది. నిర్దిష్ట ఆర్థిక ప్రణాళికా రాహిత్యానికి ఇది చక్కటి ఉదాహరణ.
‘తెలివైనవాళ్లు అద్దె ఇళ్లల్లో ఉంటారు’ అనే పాత సామెత ఇప్పుడు నిజం కాకపోవచ్చు. కాని ఈ ఉదాహరణ చూడండి. మీరు ఒక సొంత ఇంటి కోసం 50 లక్షలు అప్పు తీసుకుంటే బ్యాంకుకి నెలనెలా 50 వేల చొప్పున 30 సంవత్సరాల పాటు చెల్లించాలి. అదే కనుక మీరు 20 వేల అద్దె ఇంట్లో ఉండి, మిగిలిన 30,000 నెలనెలా ఆదా చేసినట్లయితే, 30 సంవత్సరాలు అయ్యేసరికి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో తెలుసా? ఊపిరి బిగబట్టి వినండి. అక్షరాలా 5 కోట్లు.
ఒక మనిషి తన కోరికను కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయగలిగితే కూడా చాలా మిగుల్తుంది. ఈ గమ్మత్తయిన ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి నెలకి 50 వేలు వాయిదా కట్టడానికి ప్రిపేర్ అయి 50 లక్షలు అప్పుతో ఫ్లాట్ కొన్నాడు. అలా కాకుండా, అతడు అయిదు సంవత్సరాల పాటు ఇరవై వేల అద్దె ఇంట్లో ఉండి, నెలకి 30,000 ఆదా చేసుకోగలిగితే, 5 సంవత్సరాల్లో అతడి దగ్గర 23 లక్షల రూపాయలు ఉంటాయి. అప్పుడు కేవలం 27 లక్షలు అప్పు తీసుకుంటే చాలు. నెలకి 50,000 రూపాయల చొప్పున (అతడు దీనికి ముందే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి) సుమారు 6 సంవత్సరాల్లో దాన్ని చెల్లించి వేయగలడు. ఏడో సంవత్సరం నుంచి అదే 50,000 నెలనెలా బ్యాంకు రికరింగ్ డిపాజిట్‌లో వేసుకుంటే, 30 సంవత్సరాలయ్యేసరికి ‘సొంత ఇంటితో పాటు 5 కోట్లు’ కూడా మిగుల్తాయి. చిన్న లెక్క. కానీ అద్భుతమైనది. (కొత్త ఫ్లాట్ రేటు... 5 సంవత్సరాల తరువాత సెకెండ్ హ్యాండ్ ఫ్లాట్ రేటు ఒకే స్థాయిలో ఉంటాయని ఊహించి పై ఉదాహరణ ఇవ్వటం జరిగింది).
ఇటీవల ఒక ప్రకటన వచ్చింది. ఒక చిన్న కుర్రవాడు క్రికెట్ మ్యాచ్ ఆడకుండా తొందరగా ఇంటికి వచ్చేసి, ‘అందరూ వేసవి సెలవులకి వెళ్లిపోయారు’ అని కోపంగా బ్యాట్ విసిరేస్తాడు. తండ్రి ఎంతో సంతోషంగా ‘బ్యాంకు వాయిదా తగ్గింది కాబట్టి మనం కూడా విహారయాత్రకి వెళ్లొచ్చు’ అంటాడు. ఈ ప్రకటనలో రెండు లొసుగులున్నాయి. ఒకటి: పిల్లల్ని విహారయాత్రకి తీసుకెళ్లలేనంత ఆర్థిక స్థాయిలో ఉన్నవారికి ఆ అడ్వర్‌టైజ్‌మెంట్‌లో చూపించినంత పెద్ద ఇల్లు కావాలా? రెండు: వాయిదా సొమ్ము తగ్గిందని ఎవరూ సంతోషపడనక్కరలేదు. వాయిదా సొమ్ము తగ్గే కొద్దీ ఆ వ్యక్తి బ్యాంకుకు చెల్లించే డబ్బంతా కేవలం వడ్డీకే సరిపోతోందన్న మాట. మరోవిధంగా చెప్పాలంటే అతడు జీవితాంతం బ్యాంకుకి రుణపడి ఉంటాడ న్నమాట.
వికాసం: అద్దె ఇళ్లల్లో తెలివైనవాళ్లు
Published Sun, Aug 11 2013 2:19 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement