అసమ్మతి గొంతుకను అణచివేస్తున్నారు : ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: దేశంలో అసమ్మతి గొంతుకను అణచివేయడంతో పాటు గోరక్షకుల పేరుతో తీవ్ర హింస జరుగుతోందని ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నేతృత్వంలో బుధవారం రాష్ట్రపతితో సమావేశమైన కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, జేడీ–యూ, ఆర్జేడీ ప్రతినిధులు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేశారు.
దేశంలో శాంతి భద్రతల్ని, పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల విశ్వసనీయతపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ప్రణబ్‌తో సమావేశం అనంతరం గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపు పన్ను శాఖలను ప్రతిపక్ష పార్టీ నేతలను, ముఖ్యంగా ముఖ్యమంత్రులను హింసించడానికే వాడుకుంటోందని విమర్శించారు.
వారు గెలిస్తే సరిగా పనిచేస్తున్నట్లా: వెంకయ్య
బీజేపీ ప్రభుత్వం ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొట్టిపారేశారు. ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు అవి సరిగా పనిచేస్తున్నట్టు.. గెలవకపోతే వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నట్లా అని ప్రశ్నించారు.