సీబీఐని దుర్వినియోగం చేసి...‘సేవ్ డెమోక్రసీనా’?
ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ర్యాలీ: వెంకయ్య ధ్వజం
ముంబై/న్యూఢిల్లీ: సీబీఐని అడ్డుపెట్టుకుని విపక్ష నేతల్ని జైలుకు పంపిన కాంగ్రెస్.. ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించడం అర్థరహితమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముంబైలో శుక్రవారం విమర్శించారు. అగస్టా స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించేఎత్తుల్లో భాగమే ర్యాలీ అని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు కాంగ్రెస్‌కు నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే100 సార్లు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చేశారని చెప్పారు. అరుణాచల్, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనేవిధించారని, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాల్లీ రద్దు చేశారని గుర్తుచేశారు.
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘనత కాంగ్రెస్‌దేనని, ప్రతికా స్వేచ్ఛను రద్దు చేయడంతో పాటు ప్రతిపక్ష నేతల్ని జైలుకు పంపారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాగాల్ని స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని, అందువల్ల పార్లమెంట్ వెలుపల వారి నిరసనకు అర్థంలేదన్నారు. ప్రధాని మోదీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని వెంకయ్య విమర్శించారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కుతంత్రాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. అగస్టా స్కాంలో సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణకు కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. స్కాంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సేవ్ డెమోక్రసీ కాదు సేవ్ ఫ్యామిలీ: రవిశంకర్
కాంగ్రెస్‌ది సేవ్ డెమోక్రసీ ర్యాలీ కాదని, సేవ్ ఫ్యామిలీ ప్రచారమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఎప్పుడు విచారణ వేగవంతం చేసినా దేశద్రోహం, ప్రజాస్వామ్యంపై దాడంటూ గొడవ చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు.