న్యూఢిల్లీ: దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువ నాయకులంతా సీనియర్ల మీద గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద విమర్శలు కురిపించారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాల వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి థరూర్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, ముంబై మాజీ కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా మన్మోహన్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు. యువ నాయకులంతా కావాలనే.. హానికరమైన విధానంలో మన్మోహన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (రాహుల్ సేనపై దృష్టి)
ఈ క్రమంలో మనీష్ తివారీ ‘బీజేపీ కూడా 2004-2014 వరకు అధికారంలో లేదు. కానీ ఒక్క నాయకుడు కూడా వాజ్‌పేయిని గానీ, అడ్వాణీని కానీ విమర్శించలేదు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌లో కొందరు మన్మోహన్ సింగ్ మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని ట్విట్ చేశారు. శశి థరూర్ కూడా మన్మోహన్‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘నేను మనీష్ తివారీ, మిలింద్ డియోరాలతో ఏకీభవిస్తున్నాను. యూపీఏ పదేళ్ల పాలన గురించి కావాలనే హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మన అపజయాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఎంతో కృషి చేయాలి. అంతేకానీ సైద్ధాంతికపరంగా మనం విభేదించే వారితో చేతులు కలిపి ఇలా విమర్శలు చేయడం మంచిది కాదు’ అంటూ ట్వీట్ చేశారు. (నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!)
I agree with @ManishTewari & @milinddeora. UPA's transformative ten years were distorted & traduced by a motivated & malicious narrative. There's plenty to learn from our defeats & much to be done to revive @INCIndia. But not by playing into the hands of our ideological enemies. https://t.co/Ui6WUlBl3F
— Shashi Tharoor (@ShashiTharoor) August 1, 2020
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా.. పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరారు. తాజాగా రాజస్తాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. సీనియర్లు తమకు అవకాశం ఇవ్వడం లేదని.. గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని.. గుర్తింపు దక్కడం లేదని.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సోనియా గాంధీ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. (కొత్త సారథి కావలెను)
దీనిలో గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారితో పాటు.. రాహుల్ గాంధీ టీం పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వం వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని యువ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో యువ నాయకులు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌పై కేంద్ర వైఖరి, చైనాతో వివాదం వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో వీరంతా విఫలమయ్యారని ఆరోపించారు. సీనియర్ నాయకులు ప్రధానిపై చేసే దాడి చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో పార్టీలో మరింత ఆత్మ పరిశీలన, సంప్రదింపులు, చర్చలు ఉండాలని యువ నాయకులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment