ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు.
‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది.
న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది.
1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment