సోనియా, మన్మోహన్‌లతో వెంకయ్య మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సహకరించాలని వారిని వెంకయ్య కోరారు.
జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ మూడు అంశాలను లేవనెత్తిందని, వీటిని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పరిష్కరించారని వెంకయ్య తెలిపారు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా, ప్రధాని తనకు తెలిపారని ఆయన చెప్పారు. అవసరమైతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందస్తుగా నిర్వహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.