వికాసం: ఈ ముగ్గురిలో ఎవరు మీరు?
అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు.
ఒక ఊళ్లో రామ్, రాబర్ట్, రహీమ్ అనే ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా చెప్పుల షాపులు స్థాపించారు. రామ్‌కి ఒక అద్భుతమైన కళ ఉన్నది. చెప్పును చూసి సరిగ్గా మన్నుతుందో లేదో చెప్పగలడు. చెప్పులు కుట్టేవాళ్లని కొంతమందిని పిలిచి, వాళ్లలో తనకి సంతృప్తికరంగా కుట్టినవారికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వారు తయారుచేసి తీసుకొచ్చిన చెప్పుల మీద తన సొంత బ్రాండ్ పేరు ముద్రిస్తాడు. అంతే. అది బాటా, పాపులర్, అడిడాస్, నైకీ, ఉడ్‌ల్యాండ్స్ లాంటిది ఏదైనా కావొచ్చు. కేవలం తన బ్రాండ్ పేరు వల్ల యాభై రూపాయలు ఖరీదు చేసే చెప్పుని అతడు రెండు వందలకి అమ్ముతాడు. అతని బ్రాండ్‌కి మన్నిక గ్యారెంటీ. కేవలం షాపు డెకరేషన్‌కే అతడు కొన్ని లక్షలు ఖర్చుపెట్టాడు. అక్కడ షాపింగ్ చేయటం ఆ ఊళ్లో వాళ్లకి ప్రిస్టేజి. సంవత్సరం తిరిగే సరికల్లా అతడు కోటి రూపాయలు సంపాదించాడు.
రాబర్ట్‌కి స్కిల్ ఉంది. అద్భుతంగా చెప్పులు కుడతాడు. అతడు కుట్టిన చెప్పులు వేసుకుంటే మేఘాల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. చిన్న గదిలో కూర్చుని రోజుకి కేవలం అయిదు జతల చెప్పులు మాత్రమే కుడతాడు. ఒక్కొక్కదాని ఖరీదు దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది. కేవలం రాజాలు, కోటీశ్వరులు అతని చెప్పులు కొనగలరు. సంవత్సరంలో అతడూ కోటి రూపాయలు సంపాదించాడు.
రహీమ్ కొన్ని వేల చెప్పులు కొని ఒక గోడౌన్ లాంటి షాపులో పెట్టాడు. అక్కడ చెప్పుల జత కేవలం పాతిక రూపాయలకే దొరుకుతుంది. అయితే కుడి కాలి చెప్పు దొరికితే, ఎడమ కాలి చెప్పు కోసం దాదాపు అరగంట వెతుక్కోవాలి. అక్కడ తరచూ వినిపించే పదం ‘చౌక’. ఏడాదిలో అతడి లాభం కోటి దాటింది.
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తీ గెలవాలనుకుంటాడు. కానీ కొందరు ఓడిపోతూంటారు. దీనికి కారణం వాళ్లు తమలో ఎటువంటి శక్తి ఉన్నదో సరిగ్గా గుర్తించలేకపోవటమే. ఒక మంచి నటుడు గొప్ప రాజకీయవేత్త కాలేకపోవచ్చు. ఒక గొప్ప క్రికెట్ ఆటగాడు మంచి నటుడు కాలేకపోవచ్చు. జీవితంలో గెలవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావలసింది మనిషి తన ‘అంతర్గత కళ’ని గుర్తించటం.
ఒక వ్యాపారంలో గాని, వృత్తిలో గాని ప్రవేశించబోయేముందు అదే వృత్తిలో విఫలమైన వ్యక్తుల్ని పరిశీలించాలి. సక్సెస్ అయినవారి గెలుపు వెనుక కారణాన్ని పట్టుకోవాలి. దానికన్నా ముఖ్యంగా తనలో రామ్, రాబర్ట్, రహీమ్ లాంటి వ్యక్తి ఎవరున్నారో గుర్తించాలి.
రహీమ్‌లు ట్రేడర్లు. కేవలం వ్యాపారం చేస్తారు. రాబర్ట్‌లు స్కిల్డ్ వర్కర్స్. రాబర్ట్‌లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లవుతే రిటైర్ అయ్యేవరకు రాత్రింబవళ్లు కంప్యూటర్ మీద పనిచేస్తూనే ఉంటారు. రామ్‌లు వారితో పని చేయించుకొంటారు. చేస్తున్న పనిమీద ఉత్సాహం, కృషి ఉంటే బిల్‌గేట్స్, స్టీవ్‌జాబ్స్‌లు తయారవుతారు. కావల్సింది కృషి. అది ఉంటే విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది.
ఒక కుర్రవాడు రాత్రింబవళ్లు కృషి చేసి వెయ్యి మీటర్ల రేసుకి తయారయ్యాడు. పిస్టల్ సౌండు వినపడగానే గుండెల్లోకి గాలి, కళ్లలోకి బలం తీసుకొని పరిగెత్తటం ప్రారంభించాడు. అతడికి గమ్యం తప్ప మరేమీ కనపడలేదు. అతడు అయిదో రౌండులో గీత చేరుకుంటూండగా ప్రేక్షకుల నుంచి జయజయ ధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందే నలుగురు లైను దాటడం గమనించి, అతడు కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు. ఇంతలో పోటీ నిర్వాహకులు తనవైపు వేగంగా రావటం గమనించాడు. వాళ్లు కంగ్రాట్స్ చేస్తూంటే, ‘‘కానీ వాళ్లు నా కన్నా ముందే వెళ్లారుగా’’ అన్నాడు దిగులుగా. నిర్వాహకులు అటు చూసి, ‘‘లేదు లేదు. వాళ్లింకా నాలుగో రౌండు దాటుతున్నారు. ఆ చప్పట్లు మీకోసం’’ అన్నారు. ప్రస్తుతం మన యువత అమెరికా వెళ్లటానికి కలలు కంటోంది. రామ్‌లు పెరిగేకొద్దీ, అమెరికన్లు ఇండియాలో ఉద్యోగం చేయటానికి కలలు కంటారు. అందుకే దేశానికి నారాయణమూర్తి, రతన్‌టాటా లాంటి రామ్‌ల అవసరం చాలా ఉంది.
- యండమూరి వీరేంద్రనాథ్