వికాసం: సమస్యని చంపటానికి మూడు బాణాలు
మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం.
వింధ్యారణ్య ప్రాంత లోయలో ఒక చిన్న పల్లె ఉంది. పచ్చటి చెట్ల మధ్య సంతోషంగా కాలం గడిపే ఆ గిరిజనులకి అకస్మాత్తుగా ఒక విపత్తు వచ్చి పడింది. గుంపులుగుంపులుగా పులులు వచ్చి వాళ్ల ఆవుల్నీ, గేదెల్నీ పొట్టన పెట్టుకోవటమే కాక, ఇళ్లమీద కూడా దాడి చేయసాగాయి. ఆ గ్రామస్థులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి శరణు వేడారు. వాళ్లని రక్షించడం కోసం ద్రోణుడు ధర్మరాజుని పంపాడు. ధర్మరాజు వెళ్లి పులుల తాలూకు తరువాతి దాడి కోసం ఆ గ్రామంలో ఎదురుచూశాడు. అవి వచ్చినప్పుడు వాటి నాయకుణ్ని చంపి, మిగతా వాటిని అడవిలోకి పారదోలాడు. విజయోత్సాహంతో గిరిజనులు నాట్యాలు చేశారు. ధర్మరాజుకి ఘనంగా సత్కారం చేసి పంపారు. కానీ వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నెల తిరిగే సరికి ఆ క్రూర మృగాలు ఈసారి మరింత పెద్ద గుంపుగా గ్రామం మీద పడ్డాయి.
ద్రోణుడు భీముణ్ని పంపాడు. భీముడి ఆయుధం ‘గద’. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆయుధాల్లో ఒకటి. అయితే అది ఏనుగుని సంహరించగలదు, రథాల్ని బద్దలగొట్టగలదే తప్ప ‘చురుకైన’ పులుల మీద ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. భీముడు క్షతగాత్రుడై పడిపోయాడు. అప్పుడు ద్రోణుడు అర్జునుణ్ని పంపగా, అతను వెళ్లి తనకున్న విలువిద్యా నైపుణ్యంతో అన్ని పెద్దపులుల్ని చంపి తన సోదరుడిని రక్షించి వెనక్కి తెచ్చాడు. ద్రోణుడు అర్జునుణ్ని అభినందించాడు.
అయితే సమస్య తీరలేదు. ఏడాది తిరిగే సరికి యవ్వనంతో బలిసిన తరువాతి తరం పులులు గ్రామం మీద భయంకరంగా దాడి చేశాయి. గ్రామస్తులు మళ్లీ వెళ్లి ద్రోణున్ని శరణు వేడారు. అతడు ఈసారి ఆఖరి ఇద్దరిని పంపించాడు.
నకుల సహదేవులు వెంటనే రంగంలోకి దిగలేదు. ముందు పరిసర ప్రాంతాలని పరిశీలించారు. గ్రామం చుట్టూ కందకాలు తవ్వించే పని నకులుడు చేపడితే, తగినంత ధైర్యాన్నిచ్చి పులులతో ఎలా యుద్ధం చేయాలో వాళ్లకి సహదేవుడు నేర్పి యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఈసారి పులులు దండెత్తినప్పుడు ఏమాత్రం ప్రాణనష్టం లేకుండా గ్రామస్థులే వాటిని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టారు. తిరిగివచ్చిన నకుల సహదేవుల్ని ‘ఇది నిశ్చయంగా మీ విజయం’ అంటూ ద్రోణుడు పొగిడాడు.
ఈ కథ మూడు సూత్రాల్ని చెబుతుంది.
1. ఒక సమస్య తాలూకు కొమ్మల్ని కత్తిరిస్తే, తాత్కాలిక విజయం దొరుకుతుందేమో తప్ప పరిష్కారం దొరకదు. 2. సమస్యని ఎదుర్కోవడానికి ముందు దాన్ని నిశితంగా పరిశీలించి, ఏ ఆయుధం వాడాలో తెలుసుకుంటే సగం సమస్య తీరినట్టే. 3. మన ఆయుధం ఎంత గొప్పదైనా, సమస్యని పరిష్కరించేదిగా ఉండాలే తప్ప కేవలం గొప్పదిగా ఉన్నంత మాత్రాన దానితో సమస్యని పరిష్కరించలేం.
‘సమస్య’ అంటే ఏమిటి? ఆర్థిక, గృహ, వృత్తిపరమైన రంగాల్లో బాధనీ, ఇబ్బందినీ కలుగజేసేది. ఇది శారీరకం కావొచ్చు. మానసికం కావొచ్చు. ఇంట్లో జీవిత భాగస్వామితో బాధలు, బయట అవమానాలు, రేపటి పట్ల భయం, దగ్గరివారి మరణం మొదలైనవి ‘మానసిక’ కష్టాలు. అనారోగ్యం, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో వెహికల్ ఆగిపోవటం, అర్ధరాత్రి ఏసీ పనిచెయ్యకపోవటం, ‘శారీరక’ బాధలకి ఉదాహరణలు. ‘సమస్యలు క్లిష్టమైనవి కాబట్టి వాటిని మనం ధైర్యంతో ఎదుర్కొనలేము’ అన్న సిద్ధాంతం తప్పు. మనం ధైర్యంతో ఎదుర్కోలేకపోబట్టే సమస్యలు క్లిష్టమౌతాయి. నరకం (సమస్య)లో ఉన్నప్పుడు అక్కడే ఆగిపోతే, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. అడుగు ముందుకు వేస్తే, బయటపడటానికి కనీసం ‘సగం అవకాశం’ ఉంటుంది.
- యండమూరి వీరేంద్రనాథ్