అందరికీ దూరమౌతున్నాను.. ఎలా? | Yandamuri Veerendranath question to answer | Sakshi
Sakshi News home page

అందరికీ దూరమౌతున్నాను.. ఎలా?

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

అందరికీ దూరమౌతున్నాను.. ఎలా?

అందరికీ దూరమౌతున్నాను.. ఎలా?

జీవన గమనం
నాకిద్దరు పిల్లలు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒక్క క్షణం పడదు. ఏం చేయాలో తోచటం లేదు.
- సరళ, నిజామాబాద్

మీరు వారి వయసు రాయలేదు. పది పన్నెండేళ్ల వరకూ పిల్లలు ప్రేమతో కొట్టు కోవటం, తిట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. సాధారణంగా టీవీ రిమోట్స్ కోసం దెబ్బ లాడుకుంటూ ఉంటారు. కొంచెం వయ సొచ్చాక కూడా వారిలో ఆ విభేదాలుంటే అప్పుడు జాగ్రత్త పడాలి. పూర్వం ఇంట్లో పెద్దవారుండేవారు.

వారు పిల్లల్ని కూర్చో బెట్టుకుని రామలక్ష్మణుల బంధం గురించీ, కౌరవ పాండవ శత్రుత్వం వల్ల వచ్చిన నష్టాల గురించీ చెప్పేవారు. అలా చిన్నప్పటి నుంచీ వారిలో ఒక స్నేహ భావాన్ని పెంపొందించేవారు. చిన్నవాడికి పెద్దవాడిని పరీక్షపెట్టి మార్కులు వేయమనండి. ఇద్దరికీ బహుమతులివ్వండి. వాళ్లిద్దరినీ ఒక టీమ్‌గా, మీరూ మీ వారూ ఒక టీమ్‌గా కేరమ్స్‌లాంటి గేమ్స్ ఆడండి. చిన్నవాడి బాధ్యతని పెద్దవాడికి అప్పగించండి. ఇద్దరినీ కలిపి ఏదైనా టూర్‌కి పంపండి. తల్లిదండ్రుల పరోక్షంలో ఒకరి బాధ్యత మరొకరికి అప్పగిస్తే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కూడా పెరుగుతుంది.
 
నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తానని అందరూ తిడుతూంటారు. ఆవేశం వస్తే మాట తడబడుతుంది. నత్తి వస్తోంది. మనసులో ఏదీ దాచుకోలేను. దీనివల్ల అందరికీ దూరం అవు తున్నాను. నేను చెప్పేది అవతలివారికి అర్థం కాదు అంటారు. రెండు నిమిషాల్లో చెప్పాల్సింది పది నిమిషాలు చెప్తావు అంటారు. మంచి సలహా ఇవ్వగలరు.
- అవంతిక, కంచికచర్ల

‘‘అవిస్తరం అసందిగ్ధం... వర్ధతే మధ్య మన్వరం’’ అంటూ సంభాషణ ఎలా ఉండాలో రామాయణంలో వాల్మీకి చక్కగా వివరిస్తాడు. క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువైన స్వరంతో వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి, ప్రతి అక్షరం మధ్యమ స్వరంలో పలకాలట. టీవీ యాంకర్లు వెంటనే నేర్చుకోవలసిన విషయమిది. ‘‘... శత్రు మిత్ర జ్ఞానము లేనివాడు, ఎటువంటి అహంకార పరిస్థితుల్లోనూ మృదు సంభాషణ వీడనివాడు భగవత్-భక్తుడు’’ అని భగవద్గీతలో చెప్పటం జరిగింది.

గొప్ప సంభాషణా చాతుర్యానికి ఉదాహరణ హనుమంతుడు. అశోకవృక్షం కింద కూర్చొని, ‘ఏమి జరిగినా అది రాక్షస మాయేమో’ అని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించ డానికి ఎంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు గమనిస్తే హనుమంతుడి వాక్చతురత, చాతుర్యం తెలిసిపోతాయి. వాల్మీకి ఇంత వివరంగా చెప్పింది, వేమన రెండు వాక్యాల్లో సింపుల్‌గా ‘‘అల్పు డెపుడు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’’ అని చెప్తాడు. జాతిని ప్రభావితం చేసిన సోక్రటిస్, బుద్ధుడు, క్రీస్తు, మహ్మద్ ప్రవక్త, నెల్సన్ మండేలా.. ఇలా ఏ మహనీయుడ్ని తీసుకున్నా, వారి కార్యాచరణ నిబద్ధతతో పాటు మాటల్లోని సౌమ్యత కూడా అంతే గొప్పగా కనపడు తుంది. ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బందిపెట్టే ‘అ’మధుర సంభాషణ నాలుగు విధాలుగా ఉంటుంది.
 
పారుష్యం. అంటే... కఠినత్వం. వాగ్బాణం ఎదుటి మనసుని చీల్చకూడదు  అనృతం. అంటే... అబద్ధం చెప్పటం. వారిజాక్షులందు, వైవాహికములందు తప్ప, తరచు అబద్ధాలు చెప్పటం వల్ల ప్రేమించినవారు దూరమౌతారు.
  పైశున్యం. చాడీలు చెప్పడం. దీనివల్ల కలహాలు, విరోధాలు ఏర్పడతాయి.
  ప్రేలాపం. వాక్కును ఆచితూచి వినియోగించకపోవటం. దీన్నే అసందర్భ ప్రేలాపం అంటారు.
 ఆత్మన్యూనత పెరిగేకొద్దీ ‘వాగ్ధాటి’ ఎక్కువ అవుతుంది. జీవితంలో సుఖం లేని వ్యక్తులు ‘మందు’లో ఎక్కువ ఆవేశ పడేదీ, బిగ్గరగా మాట్లాడేదీ, రాత్రి పది తర్వాత బార్లు ఫస్టు గేర్లయ్యేది అందుకే. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో ఒత్తిడితో నలిగిపోయే కొందరు మహిళల సంభా షణలో ‘చెప్పుకోవాలనే’ తపన కన బడుతూ ఉంటుంది.

వ్యక్తిగత, గృహ సంబంధిత విషయాలు బయటివారితో చర్చించకూడదు. చులకన అయిపోతాం. సానుభూతి చూపిస్తూ ‘సలహాదారుగా’ మార టానికి తయారవుతారు. మనసులో బాధ బయటకి చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. తగ్గదు. తాత్కా లికంగా ఉపశమనం కలుగుతుం దంతే. విరిగిన ఎముకకి పిండికట్టు కట్టటం లాంటిది ఇది.
 
ఈ క్రింది అంశాలు దృష్టిలో పెట్టుకోండి.
* మాట్లాడటానికి తగిన విధంగా మీ మూడ్ ఉందా? పరిశీలించుకోండి
* వినటానికి సరైన స్థితిలో అవతలవారి మూడ్ ఉందా? గమనించండి.  
* వారి మూడ్‌ని, మీ మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా?  
* అవతలివారి పరి స్థితిని బట్టి మూడ్ మార్చుకొనే ‘అవసరం’ మీకుందా?  
* మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి  
* వాదన వేడెక్కగానే కట్ చెయ్యండి  
* గ్రూప్‌లో ఉన్నప్పుడు మీ సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి. మాట్లాడటం వెండి. మౌనం బంగారం! సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!! తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం తుప్పుపట్టిన ఇనుము..!!!
 - యండమూరి వీరేంద్రనాథ్
 
ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి. జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు.
 
మా చిరునామా: సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement