pressures
-
17 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ల(వీసీల)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీలపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి.యూనివర్సిటీల్లో టీఎన్ఎస్ఎఫ్, కూటమి అనుకూల ఉద్యోగులు వీసీలను బెదిరిస్తూ.. రాజీనామాలు చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో జూలై 2 నాటికే వీసీలంతా రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో తాజాగా ఆయా వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. -
వెహికల్స్‌ను క్లీన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా?
పెద్ద పెద్ద ఇళ్లల్లో గచ్చును శుభ్రం చేయడానికి, వాహనాలను శుభ్రం చేయడానికి వాషర్లు తప్పనిసరి. ఇప్పటి వరకు విరివిగా వాడుకలో ఉన్న వాషర్లన్నీ విద్యుత్తు సాయంతో పనిచేసేవే! ఇవి కాస్త భారీగా కూడా ఉంటాయి. ఎక్కడికంటే అక్కడికి తరలించాలంటే కష్టమే! పైగా ఆరుబయట ఉన్న వాహనాన్ని శుభ్రం చేయాలంటే, ఇంట్లో ఉన్న ప్లగ్ సాకెట్ నుంచి ఆరుబయట ఉన్న వాహనం వరకు సరిపోయే పొడవాటి తీగ కావాల్సి ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్న ‘ఆల్బో పోర్టబుల్ కార్డ్‌లెస్ ప్రెషర్ వాషర్’కు అంత పటాటోపం ఏమీ అక్కర్లేదు. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. విద్యుత్ వాషర్లకంటే ఇది తేలిక కూడా. దీని బరువు ఆరుకిలోలే! పైగా దీని అడుగున అమర్చిన చక్రాల వల్ల దీనిని ఎక్కడికైనా సులువుగా నడిపించుకుంటూ పోవచ్చు. దీని సిలిండర్‌లో నీళ్లు నింపుకొని, స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు. ఇందులోని బ్యాటరీ విడుదల చేసే 55 బార్ల ప్రెషర్ ధాటికి ఎంతగా మురికిపట్టిన గచ్చయినా, వాహనాలైనా ఇట్టే శుభ్రమైపోతాయి. అమెరికన్ కంపెనీ ‘ఆల్బో’ రూపొందించిన ఈ పోర్టబుల్ ప్రెషర్ వాషర్ ఈ ఏడాదికి రెడ్ డాట్ డిజైన్ అవార్డు కూడా అందుకుంది. దీని ధర 249 డాలర్లు (రూ.20,355) మాత్రమే! ప్రస్తుతం ఇది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచేలా... రష్యా వ్యూహం
Kremlin called for "pressure" on Kyiv: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి జపోరిజ్జియాలో ఉన్న అణుకర్మాగారంపై రష్యా దాడి చేస్తుందంటూ ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీని వల్ల యూరప్ దేశాలకు అత్యంత ప్రమాదమని చెర్నోబిల్ అణుప్రమాదం లాంటిది మరొక విపత్తు ముంచుకొస్తుందని హెచ్చరిచ్చింది కూడా. రష్యా దూకుడుకి అడ్డుకట్టవేయమని పశ్చిమ దేశాలను కోరింది. ఐతే రష్యా తాము అణుకర్మాగారంపై దాడుల జరపలేదని వాదించింది. కేవలం తాము ఆ ప్రాంతాన్ని అధినంలోకి తెచ్చుకున్నాం అని నొక్కి చెప్పింది. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా అణు కర్మాగారంపై క్షిపిణి దాడులు చేస్తుందని, అందుకే ఆ కర్మాగారాన్ని మూసేశామని చెప్పారు. పైగా కర్మాగారం చాలావరకు దెబ్బతిందని ఇక ఏ క్షణమైన రేడియోషన్స్ లీకవుతాయంటూ యూరప్ దేశాలను హెచ్చరించారు జెలెన్స్కీ. రష్యా కూడా ఆయా వ్యాఖ్యలన్నింటిని ఖండిస్తూ వచ్చింది. ఈ విషయం పై ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. దీంతో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోస్సీ తాను స్వయంగా ఆ ప్లాంట్‌ని పర్యవేక్షించడానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తాము చాలాకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాం అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌పై ప్రపంచ దేశాల నుంచి మరింత ఒత్తిడి పెరగుతుందన్నారు. యూరోపియన్ ఖండాన్ని ప్రమాదంలోకి నెట్టేయకుండా అన్ని దేశాలు ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తాము కూడా ఈ అణు కర్మాగారం ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేలా కీవ్ పై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిస్తున్నాం అని చెప్పారు. రాఫెల్ గ్రోస్సీ పర్యటనతో ఐఏఈఏ మాస్కో నియంత్రిత భూభాగాల్లో భద్రతను నిర్ధారించడమే కాకుండా ప్రబలంగా ఉన్న నష్టాలను కూడా పరిగణలోని తీసుకుంటుందని తెలిపారు. -
ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు
తిరువణ్నామలై: తమిళనాడులో మరో లాకప్ డెత్ చోటుచేసుకుంది. దాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, తమకు రూ.7 లక్షలు ఆఫర్ చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఒప్పుకోవాలంటూ దాదాపు రోజంతా వెంట పడ్డారని చెప్పింది. తిరువణ్నామలై జిల్లాకు చెందిన తంగమణి (47)ని కల్తీ మద్యం అమ్ముతున్నాడంటూ ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. మర్నాడు అతను ఆస్పత్రిలో మరణించాడు. లాకప్‌లో పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు దినకరన్ ఆరోపించాడు. ‘‘దీనిపై అల్లరి చేయొద్దని పోలీసులు బెదిరించారు. తక్షణం అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము దాకా మాతో బేరమాడారు. చివరికి రూ.7 లక్షలు ఇవ్వజూపారు’’ అని ఆరోపించాడు. తమకు డబ్బులొద్దని, తండ్రి మరణానికి కారకులైన పోలీసులపై కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీనిపై విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే చెన్నైలో లాకప్ డెత్ జరగ్గా బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారమిచ్చింది. -
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. సక్సెస్ సీక్రెట్
సవాలక్ష ఒత్తిళ్లతో నిండిపోయి ఉంటుంది కార్పొరేట్ వరల్డ్. ఇక గూగుల్ లాంటి బడా కంపెనీలను నడిపించే సుందర్ పిచాయ్లాంటి వాళ్లపై అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిని ఎలా డీల్ చేస్తాను, పని చేసేందుకు కావాల్సిన శక్తిని తిరిగి ఎలా తెచ్చుకుంటాననే విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల వెల్లడించారు సుందర్ పిచాయ్. పని ఒత్తిడి మధ్య రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది సీఈవోలో టూర్లకు వెళ్తుంటారు. ప్రకృతిలో విహార యాత్రలు చేస్తుంటారు. కానీ సుందర్ పిచాయ్ బయట ఎక్కడా అడుగు పెట్టరట. తాను ఉన్న చోటులోనే ప్రత్యేకమైన పద్దతిలో విశ్రాంతి తీసుకుంటారట. దీన్ని నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ (ఎన్ఎస్డీఆర్)గా పేర్కొంటారట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ ఆండ్ర్యూ హ్యుబర్ ఈ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికాలో విస్త్రృతం చేశారు. ఒక చోట కదలకుండా ఉండి ఆలోచనలను ఒకే అంశంపై నియంత్రిస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని త్వరగా జయించవచ్చంటూ ఎన్ఎస్డీఆర్ టెక్నిక్‌ని అమెరికన్లలో పాపులర్ చేశారు. ఎన్ఎస్డీఆర్కి సంబంధించిన విధానాలను యూట్యూబ్ ద్వారా చూస్తూ సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ ఒత్తిడిని దూరం చేసుకుంటారట. నేలపై ఒక చోట పడుకుని ఆలోచనలను నియంత్రిస్తూ.. క్రమంగా ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు బ్రెయిన్ మరింత షార్ప్‌గా పని చేస్తుందంటున్నారు సుందర్ పిచాయ్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రతిపాదిన నాన్ స్లీపింగ్ డీప్ రెస్ట్ మెథడ్‌ని మన భారతీయులు ఎప్పుడో కనిపెట్టారు. శ్వాసమీద ధ్యాస, యోగ నిద్ర పేరుతో ప్రాచీన మహర్షులు మెదడుపై ఒత్తిడిని తగ్గించి ఉత్తేజపరిచే మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చదవండి: Sundar Pichai: ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను -
ఆటోడ్రైవర్ అఘాయిత్యం.. మైనర్ బాలికపై స్నేహితులతో కలిసి
సాక్షి, లంగర్‌హౌస్(హైదరాబాద్): మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా బడా నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నీరుగార్చే యత్నం చేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. లంగర్‌హౌస్ ప్రాంతంలో నివాసముండే బాలిక పాఠశాలలో చదువుకుంటోంది. నిత్యం స్కూల్‌కు వెళ్లి వచ్చే క్రమంలో ఆటో డ్రైవర్ బాలిక వెంటపడ్డాడు. ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లిన బాలికను స్నేహితుడితో కలిసి ఆటోలో ఓల్డ్‌సిటీలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై తన స్నేహితుడితో కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా సోమవారం ఉదయం బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం బాలికను భరోసా కేంద్రానికి తరలించగా పలుమార్లు లైంగికదాడి జరిగినట్లు ఆమె తెలిపింది. ఆటోడ్రైవర్‌ను కాపాడేందుకు బడా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాలిక కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
మహారత్న కంపెనీపై ప్రైవేటీకరణ కత్తి.. ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి పనిచేసేలా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సాధ్యమైన చోట్ల ప్రైవేట్ రంగ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లను కూడా భాగస్వాములను చేయాలని ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచించినట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ తెలిపారు. ‘దేశీయంగా మరిన్ని చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ మరింతగా అన్వేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఓఎన్జీసీ మరింతగా కృషి చేయాలి‘ అని ఆయన పేర్కొన్నారు. తాను స్వంతంగా అన్వేషించలేని సంక్లిష్టమైన ప్రదేశాల్లో ఓఎన్జీసీ ప్రైవేట్, విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయాలని కపూర్ సూచించారు. సాంకేతిక సహకారం తీసుకోవడం మొదలుకుని పాక్షికంగా అన్వేషించిన, పూర్తిగా అభివృద్ధి చేయని నిక్షేపాలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం మొదలైన అంశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రస్తుత క్షేత్రాల నుంచి ఉత్పత్తిని మరింత పెంచుకోవడంలోనూ ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిని చేయవచ్చని తెలిపారు. మహారత్న కంపెనీ అయినందున ఓఎన్జీసీకి ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని, అంతిమ నిర్ణయం కంపెనీ బోర్డ్ తీసుకోవాల్సి ఉంటుందని కపూర్ తెలిపారు. ముంబై హై, బసేన్ అండ్ శాటిలైట్ (బీ అండ్ ఎస్) వంటి కీలక క్షేత్రాల్లో ప్రైవేట్ సంస్థలకు 60 శాతం దాకా వాటాను ఇవ్వడం పరిశీలించాలంటూ పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్నాథ్ ఇటీవలే ఓఎన్జీసీకి లేఖ రాసిన నేపథ్యంలో కపూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది..
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): చక్కగా చదువుకోలేకపోతున్నాననే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దయాళ్‌పూర్‌నకు చెందిన వీరేంద్రసింగ్ నేగి, సోనియా నేగి దంపతులకు కుమార్తె జాహ్నవి నేగి (17), కుమారుడు ఉన్నారు. వీరు మియాపూర్ మైహోమ్స్‌లో టార్క్ ఐఎస్ బ్లాక్‌లో 9వ అంతస్తులో జీవనం కొనసాగిస్తున్నారు. జాహ్నవి ప్రస్తుతం సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు వాకింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 9వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జాహ్నవి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. చదువులో మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు -
వాటర్‌తో గోల్డ్! వాట్ ఏ టైమింగ్
నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్‌తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నీటి విషయంలో.. నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. సిరంజీ సాయంతో.. పిరియాడిక్ టేబుల్లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. రిస్క్ ఉంది అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్’ జర్నల్‌లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. -
ఇదే నామాట.. నా మాటే శాసనం.. తహసీల్దార్‌పై ఎమ్మెల్సీ సోదరి జులుం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలో మరో తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే, ఇది సాధారణ బదిలీ కాదు! మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి బ‘ది’లీ అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం పాటు తర్జనభర్జన చేసిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు రాజకీయ నేతల ఒత్తిడికే తలొగ్గినట్లు కనిపిస్తోంది. వేలేరు తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేసి సమస్యకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తహసీల్దార్, వేలేరు జెడ్పీటీసీకి నడుమ జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో మొత్తం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పుడిది అటు ఉద్యోగ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది.. వేలేరు మండలం షోడషపల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యాన చాలాకాలంగా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ తలెత్తిన అంతర్గత వివాదాల కారణంగా మైనింగ్‌పై తరుచూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మొరం తరలిస్తున్న వాహనాలను వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. వీటిని సీజ్ చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి.. వేలేరు జెడ్పీటీసీ సరిత రంగంలోకి దిగారు. నేరుగా తహసీల్దార్‌కు ఫోన్ చేసిన సీజ్ చేసిన వాహనాలకు కేవలం రూ.25వేల చొప్పున మాత్రమే జరిమానా విధించాలని సూచించారు. అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని తెలిపారు. దీనికి తహసీల్దార్ ససేమిరా అన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. జెడ్పీటీసీ – తహసీల్దార్ నడుమ మాటామాటా పెరిగినా, తహసీల్దార్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమెను బదిలీ చేయించేందుకు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫలితంగా ప్రజాప్రతినిధి మాట విననందుకు తహసీల్దార్ విజయలక్ష్మి అక్కడి నుంచి కలెక్టరేట్ బదిలీ అయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు తహసీల్దార్ – జెడ్పీటీసీ నడుమ వ్యవహారం రచ్చగా మారడంతో గ్రామంలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న వారు తెరపైకి వచ్చారు. ఏకంగా వారు «పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహారం పెద్దగా మారుతుండడంతో ఇరువర్గాల వారికి కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఫోన్లో మాట్లాడే క్రమంలో స్థానిక నాయకులపై కూడా జెడ్పీటీసీ అనుచితంగా మాట్లాడటం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో వీరిని కూడా బుజ్జగించేందుకు చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. నేనే సమాచారం ఇచ్చా... మొత్తం వ్యవహారంపై వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత వివరణ ఇస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్యాతండా నుంచి కొందరు మొరం తరలిస్తుండగా తానే అడ్డుకుని తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మైనింగ్ అధికారులకు సైతం ఫోన్లో సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. ఇక కలెక్టరేట్ అధికారులు మాత్రం వేలేరు తహసీల్దార్ బదిలీ వ్యవహారాన్ని పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టినట్లుగా చూడాలని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కొన్ని సందర్భాల్లో సహజమే అయినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు -
కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!
కోల్‌కతా: రాత్రికి రాత్రి లాటరీ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. 70 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి పేరు నిన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడాయన పేరు పశ్చిమ బెంగాల్ లో మారు మోగుతోంది. ఆయనే ఇందిరా నారాయణన్. గత ఆదివారం ఆయనను కోటి రూపాయల లాటరీ వరించింది. దీంతో జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బు వచ్చి పడే సరికి.. వాటితో పాటు కష్టాలు కూడా వచ్చేశాయి. లాటరీ తగిలిందన్న విషయం తెలియగానే తమకు కొంత డబ్బులు ఇవ్వాలంటూ.. అతనికి బెదిరింపులు, ఒత్తిడులు పెరిగాయి. దీంతో ప్రాణ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నాడు. చదవండి: '79 ఏళ్ల వయసులో ఏడుగురిని చిత్తు చేసింది' కాగా, ఇటీవల గుప్తిపారా మార్కెట్లో మింటూ బిశ్వాస్ అనే లాటరీ సెంటర్ యజమాని వద్ద టికెట్ కొన్నాడు. రూ. 60 పెట్టి, 10 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి మర్చిపోయాడు. లాటరీ ఫలితాలు కూడా చూడలేదు. తనకు టికెట్లను అమ్మిన లాటరీ సెంటర్ యజమాని మింటూ బిశ్వాస్.. తనకు ఫోన్ చేసి డబ్బులు వచ్చిన విషయాన్ని చెప్పాడని.. తన షాప్ నుంచి కొన్న టికెట్లకు బహుమతి వచ్చిందని.. షాపు యజమానిక ద్వారానే తనకు విషయం తెలిసిందని చెప్పాడు. లాటరీ తగిలిందని తెలిసినప్పటి నుంచి తనకు బెదిరింపులు ప్రారంభం అయ్యాయని.. అందుకే ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నానని చెప్పారు. చదవండి: ఏడాదిలో రూ.750 కోట్లు వసూళ్లు రాబట్టిన స్టార్హీరో -
రోజూ ఆందోళన... నిద్ర పట్టడం లేదు
నా వయసు 32 ఏళ్లు. వృత్తిరీత్యా ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. టార్గెట్లను సాధిస్తూ ఉండాలి. దాంతో నిత్యం తీవ్రమైన ఆందోళనతో ఉంటుంటాను. చాలా త్వరగా ఉద్వేగాలకు గురవుతుంటాను. ఎప్పుడూ ఏదో ఆలోచనలు. రాత్రి సరిగా నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి. – డి. జయదేవ్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యతో అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. ఎప్పుడూ ఆకలి, అతిగా మూత్ర విసర్జన... ఎందుకిలా? నా వయసు 39 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. ఆకలి బాగా వేస్తుంది. బాగానే తింటున్నాను. అయినా చాలా నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ లక్షణాలు చెబుతుంటే... నాకు షుగర్ వచ్చిందేమోనని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి. – ఎల్. శ్రీకాంత్, కాకినాడ ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్ లక్షణాలనే పోలి ఉన్నాయి. డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, కొన్ని సందర్భాల్లో మీరు చెబుతున్నట్లుగానే ప్రైవేట్ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ షుగర్ పరీక్షలు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, హెచ్‌బీ1ఏసీ వంటి పరీక్షలతో డయాబెటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. వీలైనంత త్వరగా మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనలను అనుసరించండి. ఒంటి మీద గడ్డలు... ఎవరిని సంప్రదించాలి? నా వయస్సు 36 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా? – ఆర్. జయకృష్ణ, కొత్తగూడెం మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్ ఆంకాలజిస్టును సంప్రదించండి. అగర్బత్తీ వాసన వస్తే చాలు తలనొప్పి! అగర్బత్తీల వాసన నా ముక్కుకు సోకగానే వెంటనే నాకు తలనొప్పి (డల్ హెడేక్) మొదలవుతోంది. ఆ తలనొప్పి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇంట్లో దైవప్రార్థన కోసం అగర్బత్తీలు వెలిగిస్తారు కాబట్టి దానిని కాదనలేను. నేనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంటాను. అంతేకాదు... ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్ల దగ్గరనుంచి ఆ వాసన రాగానే కడుపులో తిప్పడంతో పాటు మళ్లీ హెడేక్ మొదలువుతుంటుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా అక్కడ్నుంచి దూరంగా వెళ్తుంటాను. ఆఫీస్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం పరిష్కారం సూచించండి. – ఎమ్. సుందరి, విశాఖపట్నం మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు ఒక రకం మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పిని ప్రేరేపించే అంశాల్లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో అగరుబత్తీలు, పెర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. కొందరిలో చాక్లెట్లు, స్వీట్స్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తలనొప్పి రాకుండానే ముందుగా తీసుకునే మందులు (ప్రొఫిలాక్సిస్) తీసుకోండి. మీకు తలనొప్పిని ప్రేరేపించే అంశాలేమిటో తెలుసు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండండి. డాక్టర్ జి. నవోదయ కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వెంట్రుక.. ఒత్తిడి తెలుస్తుందిక
హైదరాబాద్: గోవుల్లో ఒత్తిడిస్థాయిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటివరకు పశువుల రక్తం, మూత్రం, మలాన్ని సేకరించి అందులోని హార్మోన్ల పెరుగుదల ఆధారంగా వాటి శారీరకఒత్తిడి తీవ్రతను గుర్తించే పద్ధతిని పాటిస్తుండగా తాజాగా గోవుల వెంట్రుకలను పరీక్షించడం ద్వారా ఒత్తిడిని కచ్చితంగా నిర్ధారించొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీసీఎంబీకి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమాపతి, డాక్టర్ వినోద్‌కుమార్, హిమాచల్‌ప్రదేశ్ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అరవింద్, ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని ప్రొఫెసర్ క్లైవ్ ఈ ప్రయోగాలు చేపట్టారు. దేశంలోని 54 గోశాలల్లో 11 ఏళ్ల వయసుగల 540 ఆవుల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగాలు జరిపారు. పశువుల శారీరక ఒత్తిడికి కారణమైన కాట్రిసోల్ హార్మోన్లు వాటి వెంట్రుకల్లో అధికంగా ఉన్నట్లు ఈ ప్రయోగాల్లో గుర్తించారు. ఒత్తిడికి కారణం జీవన పరిస్థితులే... పశువుల కొట్టాలు, గోశాలలు, ఇతర షెల్టర్లలో పెంచే ఆవులు సాధారణ సమయాల్లో ఉన్నప్పుడు వాటిలో విడుదలయ్యే హార్మోన్లు, ఒత్తిడికి గురైనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్లను అనేకసార్లు పరిశీలించారు. మైదాన ప్రాంతాల్లో ఉండే ఆవులను, షెడ్లలోని పశువుల పరిస్థితులతో పోల్చగా గోశాలల్లో ఉండే వాటిలోనే శారీరక ఒత్తిడి అధికంగా ఉం టోందని తేల్చారు. షెడ్లలో పడుకునేందుకు నేల సరిగా లేకపోవడం, పరిశుభ్రంగా ఉంచకపోవడం, తక్కువస్థలంలో ఎక్కువ పశువులను పెట్టడం, అధిక వయసు వంటి సమస్యల వల్ల గోవుల్లో కాట్రిసోల్ హార్మ న్ అధికంగా విడుదలై అవి ఎక్కువ ఒత్తిడికి గురవుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో కనుగొన్నారు. దేశంలో పశుసంపదను కాపాడాలంటే పశువుల పెంపకం, వాటి రక్షణ విషయంలో మార్పులు జరగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, మంచి వాతావరణం, శాస్త్రీయ పద్ధతులు పాటించి షెడ్లు ఏర్పాటు చేయాలంటున్నారు. -
ఏసీ వల్లనే ఈ సమస్యా?
నా వయసు 36 ఏళ్లు. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు చెప్పినట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగిన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బీపీ), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా? నా వయసు 52 ఏళ్లు. కొన్ని ఆర్థిక సమస్యలతో ఇటీవల డబుల్‌షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నాను. నా పనిలో భాగంగా అకౌంట్స్ అన్నీ చాలా నిశితంగా చూడాల్సి ఉంటుంది. అందుకోసం చాలా ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా రాకూడదు కాబట్టి చాలా తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. ►పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ►చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ►కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి ►కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు ►రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ►భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితోనూ బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. వేసవిలో వ్యాయామం ఆపేయాలా? నేను ఫిబ్రవరిలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కాబట్టి వ్యాయామం ఆపేయడం మంచిదని కొందరు స్నేహితులు చెబుతున్నారు. దయచేసి నాకు ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితోపాటు ఖనిజ లవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలను నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ►ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. ►చెమటను పీల్చే కాటన్దుస్తులను ధరించండి. ►బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ►మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అమెరికా మార్కెట్.. సవాలే!
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు ధరల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ... సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వృద్ధి అవకాశాలు ఇకముందు కూడా సవాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) ఆమోదం కొన్ని నెలలుగా మెరుగుపడింది. ప్రస్తుత తీరు ప్రకారం 2017–18 సంవత్సరంతో పోలిస్తే 2018–19లో ఏఎన్‌డీఏ ఆమోదాలు 38 శాతం పెరుగుతాయని ఐఐఎఫ్ఎల్ అనలిస్ట్ పేర్కొన్నారు. యూఎస్ఎఫ్డీఏ ఇకముందూ ఏఎన్‌డీఏల అనుమతుల వేగాన్ని పెంచనుందని అనలిస్టుల అంచనా. దీనివల్ల అమెరికా జనరిక్ మార్కెట్ వాతావరణం మెరుగుపడుతుందని, మొత్తం మీద జనరిక్స్ అనుమతులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మొదటి సారి (ప్రత్యేకమైన) జనరిక్స్ అనుమతులు పెరుగుతాయని అంచనా. భిన్నమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులు, బయోసిమిలర్ల పరంగా ఉన్న అవకాశాల వైపు కంపెనీలు చూస్తున్నాయని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ కపాడియా తెలిపారు. పోటీ కంపెనీలతో పోలిస్తే కాంప్లెక్స్ ఉత్పత్తులు ఉన్న కంపెనీల పట్ల బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. వీటికి అధిక వ్యాల్యూషన్ ఇస్తున్నాయి. అమెరికా మార్కెట్లో ప్రత్యేక ఉత్పత్తులు సన్‌ఫార్మా పట్ల సానుకూలంగా ఉండేందుకు స్పెషాలిటీ ఉత్పత్తులే కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. ఆంకాలజీ ఔషధం యోన్సా, సోరియాసిస్ చికిత్సలో వినియోగించే ఇలుమ్యాలను 2018–19 మొదటి అర్ధ సంవత్సరంలో సన్ ఫార్మా అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. కంటి చికిత్సకు సంబంధించి గ్జెల్ప్రోస్ను మూడో త్రైమాసికంలో లాంచ్ చేసింది. అలాగే, ప్రస్తుత త్రైమాసికం (మార్చి ముగిసేలోపు)లో సీక్వాను విడుదల చేయనుంది. ఇక జనరిక్స్ పరంగా ఎక్కువగా ధరల ఒత్తిడి చవిచూడని దిగ్గజ కంపెనీల్లో అరబిందో ఫార్మా కూడా ఒకటి. ఏ ఉత్పత్తిపైనా ఎక్కువగా ఆధారపడి లేకపోవడం కంపెనీకి కలిసొచ్చిందన్నది విశ్లేషణ. పైగా ఇంజెక్టబుల్స్ వంటి పరిమిత పోటీ ఉన్న ఉత్పత్తులపైనే కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా సానుకూలించింది. దీనికి అదనంగా కొనుగోళ్ల ద్వారా వృద్ధి అవకాశాల పెంపుపై కంపెనీ దృష్టి సారించడం గమనార్హం. యూరోప్‌లో ఇటీవలే అపోటెక్స్ కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను అరబిందో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఎబిట్డాకు ఐదు రెట్లు, అమ్మకాలకు ఒక రెట్టు మాత్రమే ఖర్చు చేసి చౌకగా ఈ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. అమెరికాలో శాండజ్‌కు చెందిన డెర్మటాలజీ వ్యాపారాన్ని ఏకీకృతం చేసే పనిని కూడా చేపట్టింది. దీనివల్ల 2019–20లో కంపెనీ షేరువారీ ఆర్జన 15–20% పెరుగుతుందని ఎలారా క్యాపిటల్ అంచనా. అమెరికా వ్యాపారం బలంగా ఉండటం, యూరోపియన్ యూనియన్‌లో వృద్ధి చెందుతుండటం, ఆపరేటింగ్ మార్జిన్లను ప్రతికూలం నుంచి రెండంకెల లాభదాయకత దిశగా తీసుకెళ్లడం వంటివి అరబిందో వృద్ధి అవకాశాలను పెంచేవిగా విశ్లేషకుల అంచనా. ఇక లుపిన్ కూడా అమెరికా మార్కెట్లో వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్యావిస్ను 2015లోనే 880 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఓపియోడ్ ఔషధాల పరంగా 2018–19 ఆరంభంలో రూ.1,464 కోట్ల ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. కొన్ని మాలిక్యూల్స్ పరంగా పనితీరు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ మాజీ సీఎఫ్‌వో రమేష్ స్వామినాథన్ తెలిపారు. -
పేరెంట్స్కూ పరీక్షే!
బుర్రలో చాలా కెమికల్స్ ఉంటాయి. నిజానికి అదో కెమిస్ట్రీ ల్యాబ్! సరైన కెమికల్ రియాక్షన్లకి సరైన టెంపరేచర్ అవసరం. అలాగే... పరీక్షల సమయంలో పిల్లల బ్రెయిన్ లేబొరేటరీలో సరైన రిజల్ట్స్ కోసం సరైన పేరెంటింగ్ అంతే అవసరం. ఒత్తిడి పెట్టకుండా పిల్లలను పరీక్షలకు ఎలా తయారు చేయవచ్చో అవగాహన కలిగించేందుకే ఈ ప్రత్యేక కథనం. ముందుగా పెద్దలు తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. అంతగా చదువుకోని అండర్గ్రాడ్యుయేట్కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు రమేశ్. ఆ ఇంటికి కాస్త దూరంలోనే మరో అబ్బాయి కూడా చదువుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శీతల్. శీతల్ వాళ్ల నాన్న పోస్ట్ గ్రాడ్యుయేట్. రమేశ్‌తో పోలిస్తే శీతల్ వాళ్లది కాస్తంత కలిగిన కుటుంబం. ఒకే స్కూల్ కాదుగానీ... రమేశ్, శీతల్ ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. పైగా రమేశ్‌తో పోలిస్తే శీతలే చదువులో చురుకు. మంచి క్లవర్ స్టూడెంట్ అని పేరు. మున్ముందే కెరియర్ ప్లానింగ్లూ గట్రా తెలియని రమేశ్ వాళ్ల నాన్న అతడికి ఎప్పుడూ భరోసా ఇచ్చాడు. రమేశ్‌కు తనపై తనకు నమ్మకం కలిగేలా మాట్లాడుతుండేవాడు. కానీ శీతల్ వాళ్ల నాన్న కెరియర్ ప్లానింగ్ గురించీ, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, సాధించాల్సిన గోల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా పదో తరగతి పరీక్షల్లో శీతల్‌తో పోలిస్తే రమేశ్ గ్రేడ్స్ బాగా వచ్చాయి. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో చాలా బాగా స్కోర్స్ సాధిస్తారనుకున్న పిల్లల్లోని మూడింట రెండు వంతుల మంది పిల్లలు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్ సాధించారు. వారి స్కోర్ అలా తగ్గడానికి కారణం ఆ పిల్లలు కాదు. కేవలం వాళ్ల తల్లిదండ్రులే. భరించగలిగే ఒత్తిడి అంటే... ఒత్తిడి ఎప్పుడూ చెడ్డదేనా? కాదు... ఓ మోతాదుకు మించనంతవరకు ఒత్తిడి చాలా మంచిది. చిన్నారులపై కాస్తంత ఒత్తిడి కూడా లేదనుకోండి. అప్పుడు పిల్లలు ఎగ్జామ్‌ను లైట్ తీసుకుంటారు. చదవాల్సిన పోర్షన్‌ను చదవనే చదవరు. ఇది ఎంతమాత్రమూ తగదు. ఇలాంటి పిల్లలపై పేరెంట్స్ కాస్త ఒత్తిడి పెంచాల్సిందే. ఒకింత శ్రద్ధతో తమంతట తామే చదువుపై శ్రద్ధ చూపే పిల్లలుంటారు. వారి గుణం, వారు చదువు పట్ల చూపే శ్రద్ధాసక్తులు వంటివి తల్లిదండ్రులకు తెలిసే ఉంటాయి. ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు అతిగా ఒత్తిడి పెంచేలా చేయకూడదు. చేస్తే ఏమవుతుందో చూద్దాం. అసలే తమకు ఉన్న శ్రద్ధతో తాము చదువుకునే దానికి తోడు... తమ కెరియర్ తల్లిదండ్రులు చూపుతున్న అతి శ్రద్ధను చూస్తున్న కొద్దీ ఆ పిల్లల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది యాంగై్జటీకి దారితీస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ’ అంటారు. దీన్నే మరోలా చెప్పుకుందాం. ఎలాంటి ఒత్తిడి లేని సాధారణ పరిస్థితుల్లో వారు పుస్తకంలోని దాదాపు ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయగలరు. కానీ పెర్ఫార్మెన్స్ యాంగై్జటీకి గురైనప్పుడు మాత్రం వారిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో తాము రాస్తున్నదంతా కరెక్టేనా, ప్రదర్శించాల్సినంత ప్రతిభను తాము ప్రదర్శిస్తున్నామా లేదా అనే సందేహాలు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన సందేహాలు ఊడలమర్రిలా పెరిగి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరీక్షలకు చదువుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ పిల్లల్లో అనుకూల ధోరణి పెంపొందేలా, ఆత్మవిశ్వాసం నింపేలా ఉండాలి. అంతేతప్ప పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించేలా ఉండకూడదు. ఒకటే మెదడు.. రెండు రకాల చర్యలు అందరిలో ఉండేదీ మెదడే. కానీ అదే మెదడు మనం వాడుకునే తీరును బట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. మొదటిది చిన్నారికి మీరిచ్చే భరోసా, సాంత్వన, ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడే మాటలు. ఇది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ అదే మరొక తండ్రి... తన కొడుకు/కూతురి కెరియర్ పట్ల ప్రదర్శించే అతి శ్రద్ధ, అతి జాగ్రత్త ఆ చిన్నారిలో పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని పెంచితే అదే మెదడు ప్రతికూల ఫలితాలిచ్చేలా చేస్తుంది. పిల్లలిద్దరిలోనూ ఒకే లాంటి మెదడు... కాని అదిలా రెండు రకాలుగా ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. భరోసాలో జరిగే ప్రక్రియ ఇదే... మీ అమ్మాయి పరీక్షల కోసం తయారవుతున్నదనుకుందాం. ఆమె స్వతహాగానే బాగా చదువుతుంది. శ్రద్ధ ఎక్కువే. అలాంటప్పుడు మీరు అమ్మాయిపై అదనంగా భారం వేయకండి. జస్ట్ భరోసా నింపండి చాలు. అదెలా? అమ్మాయి పరీక్షకు ప్రిపేర్ అవుతుంటుంది. ఎనిమిదింటికి భోజనం చేసి, తొమ్మిదిగంటలకల్లా పడుకునేది కాస్తా... రాత్రి పది దాటినా చదువుతోంది. తల్లి పాల గ్లాసుతో వెళ్లింది. ‘మరికాసేపు చదువుతావా? అలాగైతే ఈ పాలు తాగు’ అంది. ఇక్కడ ఆ తల్లి ధోరణీ, మాటలూ ఎలా ఉండాలంటే... ‘నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు. మేం హాయిగా ఏ టీవీ చూసుకుంటూనో ఎలా ఉండగలం. హాయిగా మా మానాన మేమెలా నిద్రపోగలం. కాబట్టి మావంతుగా నీకు తోడుగా ఉంటున్నాం’ అంటూ అమ్మాయిలో సాంత్వన నింపేలా ఉండాలి. అంతే తప్ప... ‘మరికాసేపు చదవడం కోసం టీ తాగు... అప్పుడు నిద్రరాకుండా ఉంటుంది’ అనో... లేదా ‘ఉండాలనుకున్న దాని కంటే మరో అరగంట ఎక్కువగా మేలుకొని చదువుకో’ అనేలాగో ఆ మాటలు ఉండకూడదు. ఇలాంటి మాటలు పెర్ఫార్మెన్స్ యాంగై్జటీని కలిగిస్తాయి. అలాగే మర్నాడు అమ్మాయిని తండ్రి ఎగ్జామినేషన్ సెంటర్‌కు తీసుకెళ్లే సమయంలో, ‘నువ్వెలాగూ ఈమాత్రం దూరం రాలేవని కాదు... కాకపోతే నేను నీకు తోడుగా వస్తే నీపై కాస్త ఒత్తిడి తగ్గడం కోసం వెంట వచ్చా’ లాంటి మాటలు వినిపించాలి. వెళ్లేప్పుడు ‘జాగ్రత్తగా రాయి... టెన్షన్ పడకు’ లాంటి మాటలను అనునయంగా చెప్పండి. ఆ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న పాడుచేశాననీ, పది మార్కులు తగ్గవచ్చని అమ్మాయి అందనుకోండి. వెంటనే... ‘అలా జరగదేమోలే. చూద్దాం. నువ్వు అనుకున్నంత సంతృప్తి పడకపోవడం వల్ల నీలో అలాంటి ఫీలింగ్ ఉందేమోలే’ అనండి. అంతే తప్ప... ‘పది మార్కులంటే మాటలా... మరో పేపర్లో కనీసం 20 అయినా ఎక్కువ సంపాదించేలా చూడు. అప్పుడే ఆ నష్టం కాంపెన్సేట్ అవుతుంది’ లాంటి మాటలు మాట్లాడకండి. సాంత్వన మాటలతో ఏం జరుగుతుంది? మనందరి మెదడులో మాట్లాడేలా చేసే స్పీచ్ సెంటర్, చూసిందేమిటో చెప్పే విజువల్ సెంటర్ లాగే మరో ప్రత్యేక ప్రాంతమూ ఉంటుంది. దాని పేరు రివార్డ్ సెంటర్. ఉదాహరణకు మీరో ఎగ్జామ్‌లో క్లాస్ ఫస్ట్ వచ్చారు. మీ టీచర్ మిమ్మల్ని ‘గుడ్’ అని మెచ్చుకుంది. అప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్ అనే సంతోషం కలిగించే ఒక జీవరసాయనం విడుదల అవుతుంది. టీచర్ ఇచ్చిన ఆ అభినందన రివార్డ్‌తో కలిగిన సంతోషాన్ని పదే పదే పొందడం కోసం మళ్లీ మళ్లీ మీరు క్లాస్ ఫస్ట్ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే ఆ రివార్డు సెంటర్ ఇచ్చే ప్లెజర్ కోసం ప్రయత్నిస్తుంటారన్నమాట. అలా ప్లెజర్ ఇస్తుంది కాబట్టే దాన్నే ప్లెజర్ సెంటర్ అని కూడా అంటారు. ఇక అలాగే తల్లి తాను నిద్రపోకుండా తన కోసం మేల్కొని ఉండి పాల గ్లాసు తెచ్చి ఇచ్చిందనే భావన కూడా అమ్మాయిలో ఒక కృతజ్ఞతను పెంపొందిస్తుంది. ఎదుటి వాళ్ల చర్య తమకు సంతోషం కలిగించిన భావన అనేది ‘ఫినైల్ ఇథలమైన్’ అనే మెదడులోని రసాయనం వల్ల కలుగుతుంది. అలాగే మర్నాడు ఉదయం ఎగ్జామ్ సెంటర్ దగ్గర తండ్రి మాటలూ, తండ్రి ఇచ్చే నమ్మకం, భరోసా అన్నవి అమ్మాయి మెదడులోని డోపమైన్ లాంటి హుషారు కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయి. మన ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు మూలం డోపమైన్. ఈ రసాయనం లోపిస్తే మన దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సంట్రేషన్) తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఇది తగ్గడం వల్ల ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే తండ్రి భరోసా డోపమైన్‌ను స్రవించేలా చేస్తుంది. కాస్త అటు ఇటు ప్రవర్తించినా మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడనే భావనను పెంచి ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు కారణమవుతుంది. అలాగే ఎండార్ఫిన్ అనే మెదడులోని రసాయనం మనలో యాంగై్జటీని తొలగిస్తుంది. ఉదాహరణకు అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్ బాగా రాసిందనుకుందాం. అప్పుడు స్రవించిన ఎండార్ఫిన్ అమ్మాయిలో ‘ఫీల్ గుడ్’ భావన పెంచుతుంది. అదే ఫీలింగ్‌ను మర్నాడు కూడా పొందడం కోసం ఇంకా బాగా చదువుతుంది. అంతే తప్ప... కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే పిల్లలు విజయాలు సాధిస్తారన్న మాట పూర్తిగా నిజం కాదు. ఇక ఆమె పరీక్షలు బాగా రాస్తున్న కొద్దీ తన మెదడులో ఇంకెన్నో రకాల సంతోష రసాయనాలు స్రవిస్తూ మరింత బాగా పెర్ఫార్మ్ చేసేలా ఆమెను ప్రోత్సహిస్తుంటాయి. వాటిలో ఎన్. ఆరాకిడోనోయల్ డోపమైన్ (ఎన్ఏడీఏ), నలడోయిన్, అరాకిడోనోయల్ గ్లెసెరాల్, వైరోడమైన్ వంటివి చాలానే ఉంటాయి. మరి పైన పేర్కొన్న దానికి ప్రతికూలంగా జరిగేదేమిటి? తల్లిదండ్రులు కేవలం పిల్లల్లో పరీక్షల ఒత్తిడిని మరింతగా పెంచే పనులే చేస్తున్నారనుకుందాం. అంటే ఉదాహరణకు... ‘బాగా చదువు. ఇప్పుడు చదవకపోతే భవిష్యత్తులో మట్టితట్టలు మోయడానికి తప్ప దేనికీ పనికిరావు. ర్యాంకులు రాకుండా కేవలం ఫస్ట్ క్లాస్ వస్తే... ఇప్పటి కాంపిటీషన్లో దిక్కూదివాణం ఉండదు. మీ మేనమామగారి అమ్మాయిలా నువ్వూ యూఎస్ వెళ్లాలి. మినిమమ్ ఐఐటీకి ప్రిపేర్ అయితేగానీ మామూలు బీటెక్ కూడా దక్కని రోజులివి’ లాంటి మాటలు పిల్లల్లో ఒత్తిడి పెంచేస్తాయి. ఓ మోస్తరుగా 70%, 80% పొందేవాళ్లు కూడా 60% లు లేదా ఏ సెకండ్ గ్రేడ్కో తగ్గినా తగ్గవచ్చు. ఇలాంటి మాటలతో మెదడులో ఏం జరుగుతుంది? ఒత్తిడిని పెంచి పెర్ఫార్మెన్స్ యాంగై్జటీ కలిగించే సందర్భంలో అమ్మాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. మెదడులో ‘అమిగ్దలా’ అనే ఒక అవయవం ఉంటుంది. బాదాం షేపులో ఉండే ఈ అవయవం మనలో భయం, ఆందోళనా వంటి భావనలు ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్‌ను వెదికి పట్టుకుంటుంది. అంతేకాదు... ఆ ఫీలింగ్స్ కలిగిన వెంటనే పక్కనే ఉండే హైపోథెలామస్ అనే అవయవానికి సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడది ఎదుట ఉన్న ఆ ప్రమాదాన్నీ, ముప్పునూ ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్లను విడుదల చేయమంటూ శరీరాన్ని ఆదేశిస్తుంది. అంతే... పెద్దపొత్తంలో హార్మోన్లూ, జీవరసాయనాలూ ఒంట్లో వెలువడుతాయి. ఉదాహరణకు పిల్లలు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనైనప్పుడు పరిస్థితిని తప్పించుకునేందుకు ఎడ్రినల్ గ్రంథి నుంచి కార్టిసాల్స్, అడ్రినాలిన్, నార్–అడ్రినాలిన్ అనే హార్మోన్లు స్రవించాల్సిందిగా హైపోథెలామస్ అనే మెదడు భాగం... శరీరాన్ని ఆదేశిస్తుంది. దాంతో ఆమెలో రక్తపోటు పెరుగుతుంది. కాలేయం నుంచి చక్కెరలు వేగంగా విడుదలవుతాయి. ఒంటికి హాని చేసే కార్టిజోల్స్ అనే హానికర రసాయనాలు వెలువడుతాయి. ఇవి ఎముకల్ని బలహీనపరుస్తాయి. అయితే ఇలా రసాయనాలు వెలువడటం అన్నది ఏ కొద్దిసమయం పాటో జరిగితే పర్లేదు. కానీ పరీక్షలు కనీసం 20 రోజుల పాటు కొనసాగుతుంటాయి. ఇది పిల్లల ఒంటికీ, మెదడుకూ, భవిష్యత్తులో వాళ్ల కెరియర్‌కే హాని చేయవచ్చు. అందుకే పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన సాంత్వననిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, తనపై తనకు నమ్మకం కలిగేలా ఉండాలి తప్ప... అతి ప్రవర్తనతో వాళ్లలో పలాయనభావాన్నీ, తల్లిదండ్రుల పట్ల ఏవగింపునూ కలిగించేలా ఉండకూడదు. పిల్లల్లో ఒత్తిడి పెరిగిన లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మరింత చేయూతనిస్తూ, ఆసరాగా నిలవాలి. అప్పుడే పిల్లల విజయాలనూ చవిచూడవచ్చు. వాళ్లలో ఆత్మహత్యల్లాంటి భావనలూ విజయవంతంగా నిరోధించవచ్చు. కేర్ అండ్ శ్రద్ధ అవసరమే... పై కథ చదివాక ‘పిల్లలపై శ్రద్ధ చూపకపోతే ఎలా?’ అనేది సగటు తల్లిదండ్రుల ప్రశ్న. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి పట్ల అదనపు శ్రద్ధ అవసరమే. కానీ అది పాయసంలో చక్కెర లేదా బెల్లం అంత మోతాదులో కావాలి. పాయసం రుచిగా ఉండాలంటే... అందులో మిగతా పదార్థాల రుచి కూడా తెలిసేలా... ఉండాల్సినంత తియ్యగానే ఉండాలి. చక్కెర అతిగా పడితే విపరీతమైన తీపి పెరిగి, పదార్థంపై మొహంమొత్తుతుంది. ఇదే ఉదాహరణ పెద్దలు తమ పిల్లల పట్ల ప్రదర్శించాల్సిన శ్రద్ధకూ వర్తిస్తుంది. ఇక్కడ పిల్లలపై తామెంత ఒత్తిడిని కలిగిస్తున్నారు, అది వారు భరించే స్థాయిలో ఉందా లేదా అన్నది తెలుసుకోగలగడమే మంచి పేరెంట్ తాలూకు విజ్ఞత. పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోందని గ్రహించడం ఎలా? పరీక్షల కారణంగా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని గ్రహించడానికి వీలుగా వాళ్ల శరీరం కూడా తల్లిదండ్రులకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఉదాహరణకు... ∙పిల్లల్లో నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుండటం ∙ఏదైనా అంశం పట్ల దృష్టికేంద్రీకరణ/ఏకాగ్రత తగ్గడం ∙గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్‌గా కనిపించడం ∙త్వరగా విసుగు, నిర్లిప్తత, కోపం వంటి భావనలకు లోనుకావడం వంటి ప్రవర్తనాపూర్వకమైన లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శారీరక లక్షణాల్లో భాగంగా కనిపించేవి... ∙వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం ∙మాటిమాటికీ చెమటలు పడుతూ ఉండటం ∙ఛాతీ పట్టేసినట్లు ఉండటం ∙వేగంగా శ్వాసతీసుకుంటూ ఉండటం వంటివీ కనిపించవచ్చు. ∙పిల్లల్లో మైగ్రేన్ తలనొప్పుల వంటివి కనిపిస్తే... ఈ సీజన్లోనైతే దానికి కారణం పరీక్షల ఒత్తిడే కావచ్చని ఊహించడం తేలికే. అలాగే మరికొందరిలో తీవ్రమైన ఒత్తిడి ఆస్తమాకూ దారితీయవచ్చు. ∙ఇక బాలికల్లో అయితే వారి మెదడులోని హైపోథెలామస్ గ్రంథి ఆదేశాల మేరకు గొనాడోట్రాఫిన్ వంటి హార్మోన్లు స్రవించడం వల్ల రుతుస్రావం క్రమం తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తూ, వాళ్ల హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడినట్లు స్పష్టంగా తెలియజేస్తుంది. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
యానీ
‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’’ అన్నాడు సత్య. ‘‘కానీ జీవితమే ప్రెషర్గా అనిపిస్తున్నప్పుడు జీవితాన్ని కూడా ముందుగానే కదా ముగించుకోవాలి సత్యా?’’ అంది యామిని.చటుక్కున తల తిప్పి చూశాడు సత్య. అతడి కళ్లలోకే చూస్తూ ఉంది యామిని. ‘‘ఏమంటున్నావ్ యానీ.. జీవితం నీకు ప్రెషర్గా అనిపిస్తోందంటే.. నా ప్రేమ నీకు ప్రెషర్గా అనిపిస్తోందనేనా! అనుకున్నాం గుర్తులేదా, ప్రేమే మన జీవితం అని. ఇప్పుడెందుకిలా జననం.. మరణం.. అంటున్నావ్? ప్రేమ ఎక్కడికి పోయింది? ఏమైంది నీకు’’ అన్నాడు çసత్య. యామినిని అతడు యానీ అంటాడు. ‘‘ప్రేమ ఎక్కడికి పోయింది అని అడిగావ్. కానీ అడగాల్సింది నేను సత్యా. నాపై నీకుందని నువ్వు చెప్పిన ప్రేమ, నాపై నీకు ఉందని నేను నమ్మిన ప్రేమ ఎక్కడికో పోయిందని నాకు అనిపిస్తోంది కాబట్టే.. నాకూ ఇక్కడఉండాల్సిన పని లేదనిపిస్తోంది’’‘‘ఇక్కడ అంటే?’’‘‘ఈ లోకంలో..’’‘‘ఎందుకు నన్ను, ఈ ప్రపంచాన్ని ఒంటరిని చేసి వెళ్లాలనుకుంటున్నావ్ యానీ? ఊహు, ఒంటరిని కాదు, అనాథను చేసి.’’‘‘కవిత్వం ఆపు సత్యా. నేను లేకపోతే ప్రపంచం ఒంటరి, అనాథ అవడం ఏంటి? నేనే ఇక్కడ ఒంటరిగా, అనాథగా ఉండలేక వెళ్లి పోవాలని అనుకుంటున్నాను.’’ ‘‘నేను ఉన్నా కూడానా?’’‘‘ఉన్నావ్. కానీ నా కోసంలేవు’’ ‘‘చచ్చిపో.. యానీ.. ఇలా నన్ను చంపే బదులు’’‘‘పీడ విరగడ అవుతుందనే కదా.. మాటల్లో మాటల్లో నన్ను చావు దాకా తెచ్చావ్?’’‘‘మరేంటి యానీ! హాయిగానే ఉన్నాం కదా. కలుస్తున్నాం.మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోతున్నాం. ఇంటికి వెళ్లాక కూడా ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ హాని జరిగింది మన ప్రేమకు. ముందిది చెప్పు. ప్రెషర్ ఎందుకు?’’ ‘‘ఈ మాట నువ్వు ముందే అడగలేదంటే.. నువ్వే నా ప్రెషర్ అని నీకు అర్థమయిందనే కదా నేను అర్థం చేసుకోవాలి సత్యా’’‘‘భగవంతుడా.. ఏం కావాలి నీకిప్పుడు?’’‘‘నీకేం అవసరం లేదా సత్యా?’’‘‘ఏదైనా తక్కువైతే ఆ తక్కువైంది అవసరం అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్‌లో ఉండగా నాకేం తక్కువవుతుంది? నాకేం అవసరం అవుతుంది?’’‘లైఫ్‌లో ఉండడం అంటే ఇలా ఎవరికి వాళ్లం ఉండడమేనా? ఇద్దరంఒకరిగా ఉండలేమా? ఒకే ఇంట్లో. ఒకే సమయంలో. ఒకే చోట?’’‘‘పెళ్లి గురించేనా?’’‘పెళ్లి గురించేనంటే.. అప్పుడు నువ్వుంటావ్.. ‘ఇప్పుడూ పెళ్లయిట్లే కదా ఉంటున్నాం’ అని. కానీ మనిద్దరం ఒకటే అని ప్రపంచానికి తెలియడం ముఖ్యం సత్యా. అప్పుడు నాకు ఏ ప్రెషరూ ఉండదు’’‘ఇప్పుడు మాత్రం.. ఎందుకుండాలి యానీ.. నీకు ప్రెషర్?’’‘‘తెలీదు. కానీ ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. లోకం నిన్ను నిన్నుగా కాకుండా, నన్ను నన్నుగా కాకుండా మనిద్దర్ని కలిపి చూసేవరకూ నాకు ప్రెషరే. నిన్ను చూస్తే నేను గుర్తుకు రావాలి. నన్ను చూస్తే నువ్వు గుర్తుకు రావాలి.. ఈ లోకానికి’’. ‘‘కవిత్వం నువ్వు మాట్లాడుతున్నావ్ యానీ ఇప్పుడు’’‘‘కవిత్వం మాట్లాడ్డం కాదు. హృదయంతో మాట్లాడుతున్నాను.’’‘‘సరే, పెళ్లి చేసుకుందాం’’‘‘సరే ఏంటి! నీకక్కర్లేదా పెళ్లి? నాకోసం సరేనంటున్నావా? నేను ప్రెషర్ ఫీలవుతానని, నేను నా పిచ్చి హృదయపు భాషలో మాట్లాడి నిన్ను చంపడం మానేస్తానని. అంతేకదా! పెళ్లయ్యాక కూడా నాహృదయపు పిచ్చి భాష ఎక్కడికీ పోదు. ఎందుకంటే.. నీపై నా ప్రేమఎక్కడికీ పోదు. ‘‘ఇప్పుడేంటి?’’‘‘నీకు ఉద్యోగం వచ్చేవరకు, మా వాళ్లు తెస్తున్న సంబంధాలను నేను ఆపగలను సత్యా. కానీ నీకు ఉద్యోగం వచ్చి, నన్ను పెళ్లి చేసుకునే వరకు మన ప్రేమను నాకడుపులోనే దాచి ఉంచలేను’’ అంది యామిని. ‘‘కమ్ అగైన్’’ అన్నాడు సత్య. ‘‘అవును’’ అంది యామిని. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు సత్య. యామిని ఏడుస్తోంది. ‘‘నీకు ప్రేమను మాత్రమే పంచాలనుకున్నాను సత్యా. కానీ ప్రెషర్ని ఒక్కదాన్నీ భరించే శక్తి లేకపోయింది’’ అంది. సత్య ఇంకా ఆమెను హత్తుకునే ఉన్నాడు. యామిని కూడా అతడి గుండెలపై అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత.. కొద్దిసేపటికి.. మెల్లగా ‘‘సత్యా’’ అంది. ‘‘ఊ..’’ అన్నాడతను. ‘మనం పెళ్లి చేసుకుందాం. నేను ప్రెగ్నెంట్‌నని తెలియజెప్పడానికైనా పెళ్లిచేసుకుందాం’’ అంది.‘‘సరే’’ అన్నాడు సత్య. ‘‘ఇవాళే.. ఇప్పుడే’’ అంది యామిని. ‘‘ఇవాళా! ఇప్పుడా?’’ నవ్వాడు సత్య. ‘‘అవును’’ అంది. ‘‘సరే’’ అన్నాడు. ‘సరే’ అన్న తర్వాత యామినికి మళ్లీ కనిపించలేదు సత్య. ఎప్పటికీ కనిపించలేదు. ‘‘ఎవరు? నీ కూతురా! చక్కగా ఉంది. నీలాగే’’ అన్నాడు సత్య. చాచి సత్య చెంప మీద కొట్టింది యామిని.‘‘సిగ్గుందా. ఇది మన కూతురు. అడుగో నా భర్త. ధైర్యవంతుడు. ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ముందే చెప్పేశాను నా కడుపులో బిడ్డ ఉందని. పెళ్లి చేసుకోడానికి ముందు నన్ను నా భర్త ఏమడిగాడో తెలుసా? ‘ఎవరతను? నేను వెతికి తెచ్చేదా?’ అని! వద్దన్నాను. ‘పిరికివాడిని పట్టి తెచ్చినా, మళ్లీపారిపోతాడు. వద్దు’ అన్నాను. ఏమన్నాడో తెలుసా? ‘అలా అనకు. ఎందుకు రాలేకపోయాడో’ అన్నాడు! సత్య కళ్ల నిండా నీళ్లు. ‘‘ఎందుకు పారిపోయావ్? నీ కడుపులో కాదు కదా బిడ్డ ఉంది.నువ్వెందుకు భయపడి పారిపోయావ్?’’సత్య మాట్లాడ్డం లేదు. కన్నీళ్లు అతడి చెంపల మీదుగా జారుతున్నాయి. ‘‘చెప్పు.. ఎందుకు పారిపోయావ్?’’ అడుగుతోంది యామిని. యామిని కూతురు తల్లి చేతుల్లోంచి ముందుకు వాలి సత్య కన్నీళ్లను తుడవడానికి తన చిట్టి చేతులతో ప్రయత్నిస్తోంది! అంత దగ్గరగా నిలుచుని ఉంది యామిని.. సత్యకు. నిండు పున్నమి ఆ రోజు. బయటì గేటుకు తలుపు వేసి ఇంట్లోకి వస్తుండగా.. ఆ వెన్నెల్లో గేటు బయట నిలుచుని కనిపించాడు సత్య! సత్య, యామినీ మొదట కలుసుకున్నదీ పున్నమి రోజే. ‘‘ప్రెషర్ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’అని నేనన్నప్పుడు.. నువ్వేమన్నావో గుర్తొచ్చింది యానీ’’ అన్నాడు సత్య. యామినికి ఆ మాట అర్థమయ్యేలోపే.. ఇంట్లోంచి పెద్దగా అరుపు వినిపించింది. ‘‘యామినీ.. పిల్ల పడిపోతోంది!’’ అని. గభాల్న, బిడ్డను పడిపోకుండా పట్టుకుంది యామిని. సత్య ఇంకా అక్కడ ఉండగనే యామిని భర్త పరుగున వచ్చి, కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘ఎవరూ లేరు కదా! ఇంతసేపూ ఎవరితోమాట్లాడుతున్నావ్ యామినీ’’ అని లోపలికి వెళ్లిపోయాడు. యామిని మాట్లాడలేదు. కళ్ల నిండా నీళ్లతో సత్యనే చూస్తూ ఉంది. - మాధవ్ శింగరాజు -
ఫైబ్రాయిడ్స్ మళ్లీ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – సుహాసిని, విశాఖపట్నం గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఏడీహెచ్‌డీ.. తగ్గుతుందా? మా బాబు వయసు ఆరేళ్లు. ఎప్పుడూ కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. పదే పదే ఒకే మాట రిపీట్ చేస్తుంటాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – ఎస్. రంగారావు, భీమవరం ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గుతాయా? నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఈ సమస్యతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది? హోమియోతో పరిష్కారం లభిస్తుందా? – ఆర్. శంకర్రావు, కావలి చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ప్రకృతితో దోస్తీ.. మంచిదే!
ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని చాలాకాలంగా తెలుసు. ఈ విషయాన్ని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు. పచ్చటి చెట్ల మధ్య ఎక్కువ కాలం గడపడం గుండెజబ్బులతోపాటు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను అడ్డుకోగలదని, ఒత్తిడిని దూరం చేయగలదని తాము దాదాపు 29 కోట్ల మంది వివరాలను విశ్లేషించడం ద్వారా తెలుసుకున్నామని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ శాస్త్రవేత్త కామీ ట్వోహిగ్ బెన్నెట్ తెలిపారు. ఇప్పటికే జరిగిన దాదాపు 140 అధ్యయనాలను మరోసారి సమీక్షించడం ద్వారా తమకు ఈ విషయం అర్థమైందని చెప్పారు. సహజసిద్ధమైన లేదా పార్కుల్లాంటి మానవ నిర్మిత పచ్చటి ప్రాంతాలు రెండింటి ద్వారా మన ఆరోగ్యానికి అందే లాభం ఒకేలా ఉందని వీరు తేల్చి చెప్పారు. చెట్లు, పచ్చదనం అందుబాటులో లేనివారి ఆరోగ్యాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఎంతో తేడా కనిపించిందని బెన్నెట్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా ఉన్న వారి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తెలిసిందని వివరించారు. పచ్చదనానికి దగ్గరగా ఉన్న వారి ఎంగిలిలో ఒత్తిడిని సూచించే కార్టిసాల్ రసాయనం తక్కువగా ఉందని తెలిపారు. -
కలయిక ప్రమాదమా?
నాకు పెళ్లై ఇంకా సంవత్సరం కాలేదు. నాకు ఇప్పుడు నాలుగో నెల. మూడు నెలల పాటు భార్యభర్తలు కలవద్దు అన్నారు. కానీ మేము కలిశాం. నాలుగో నెల నుంచి అయితే కలవొచ్చు అన్నారు. మొదటి మూడు నెలలు కలిశాము కదా... బిడ్డకు ఏమైనా హాని కలుగుతుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. – ఎ.ఆర్. విశాఖపట్టణం గర్భం దాల్చిన తర్వాత, అది నిలవడానికి మొదటి మూడు నెలలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా మొదటి మూడు నెలలు భార్యాభర్తలు దూరంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. కొంతమందిలో పొత్తికడుపు, గర్భాశయం పైన ఒత్తిడి, కుదుపు వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరిలో గర్భం బలహీనంగా ఉన్నప్పుడు అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్త తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. అలా అని అందరిలో సమస్య ఉండాలని ఏమీలేదు. ఇప్పుడు మీరు నాలుగో నెలలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏమీ కాలేదు కాబట్టి అయిపోయిన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. హాని జరిగి ఉంటే ఈ సమయానికే తెలిసిపోయేది. కాబట్టి అనవసరంగా భయపడకుండా ప్రెగ్నెన్సీని ఆనందంగా ఆస్వాదించండి. ‘పీరియడ్ పెయిన్’ తగ్గించడానికి కొన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ఒకవేళ వాస్తవం అయితే ఈ యాప్ ఏ రకంగా ఉపయోగపడుతుందో వివరించగలరు. – ఎన్.స్వాతి, విజయనగరం పీరియడ్ పెయిన్ తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్ యాప్ ఒకటి అందుబాటులో ఉంది. జర్మనీలోని పరిశోధకులు, చైనాలోని పరిశోధకులతో కలిసి.. కొంతమందిపైన ఆక్యూప్రెజర్ పద్ధతిని వాడారు. అది సత్ఫలితాలను ఇచ్చాక ఆ పద్ధతిని యాప్‌గా మార్చడం జరిగింది. పొత్తి కడుపుపైన కొన్ని ప్రదేశాలపై ఆక్యూప్రెజర్.. అంటే చేతి వేళ్లతో మసాజ్ చేయడం వల్ల చాలామందిలో అంటే యాభైశాతానికి పైన పీరియడ్స్ సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలిగిందని పరిశోధకుల విశ్లేషణ. ఈ అంశంపైన స్మార్ట్‌ఫోన్ యాప్‌లో పొత్తికడుపు పైన ఎక్కడ ఎలా మసాజ్ చేయాలో చూపించడం జరుగుతుంది. ఆ యాప్‌లో రిమైండర్స్ వస్తూ ఉంటాయి. అలాగే అందులో వారి పీరియడ్స్ తారీఖు, ఎన్నిరోజులు బ్లీడింగ్, నొప్పి ఉంటుంది వంటి అనేక విషయాలను పంపించిన తర్వాత ఆక్యూప్రెజర్ పద్ధతి ఎప్పుడు, ఎన్నిసార్లు చేయాలనే విషయం దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్స్ మొదలయ్యే అయిదు రోజుల ముందు నుంచి, పీరియడ్స్ పూర్తయ్యే వరకు రోజుకు ఒకటి లేదా రెండు, మూడుసార్లు యాప్‌లో చూపినట్లు ఆయా ప్రదేశాలపై మసాజ్ చేయాలి. దానివల్ల చాలామందికి నొప్పి నుంచి యాభైశాతానికి పైన నొప్పి తగ్గే అవకాశాలు ఉండొచ్చు. దీనివల్ల నొప్పి నివారణ మాత్రలు వాడే పరిస్థితి తగ్గొచ్చు. స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవుపెట్టే రోజులు తగ్గుతాయి. సమస్యేమీ లేకుండా వచ్చే పీరియడ్స్ నొప్పికి ఈ యాప్ వాడి చూడొచ్చు. కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించి వారి సలహామేరకు వాడటం మంచిది. గర్భానికి ముందు స్త్రీలు ‘ఫిట్నెస్’తో ఉండడం వల్ల, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని చదివాను. ఈ ‘ఫిట్నెస్’ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? జెస్టేషనల్ డయాబెటిస్ గురించి తెలియజేయగలరు. – బి.శోభన, కంకిపాడు గర్భం రాకముందు నుంచే స్త్రీలు బరువు ఎక్కువ, తక్కువ లేకుండా వారి పొడుగుకి తగ్గ బరువు ఉండటం చాలా అవసరం. ఎక్కువ బరువు ఉండటం వల్ల గర్భం దాల్చిన తర్వాత, ఇంకా బరువు పెరుగుతారు. దానివల్ల ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ తక్కువ బరువు ఉండి పోషకాహార లోపం ఉన్నప్పుడు... గర్భం దాలిస్తే రక్తహీనత వంటి సమస్యల వల్ల బిడ్డ బరువు పెరగకపోవడం, అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు వంటి అనేక ఇబ్బందులు ఏర్పడొచ్చు. కాబట్టి గర్భం రాకముందే బరువు ఎక్కువగా ఉన్నవారు వాకింగ్, యోగా వంటి వ్యాయామాలతో పాటు ఆహారంలో అన్నం తక్కువ తినడం, కొవ్వు పదార్థాలు తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకొని బరువు తగ్గడం మంచిది. బరువు మరీ తక్కువగా ఉండి, రక్తహీనత వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటిని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలో షుగర్ శాతం పెరిగి మధుమేహం రావడాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది ప్రెగ్నెన్సీలో కొందరిలో కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, కుటుంబంలో షుగర్ ఉన్నవాళ్లలో, బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఇంకా కొన్ని కారణాల వల్ల రావచ్చు. జెస్టేషనల్ డయాబెటిస్‌ను రక్తంలో ఎఫ్బీఎస్, పీఎల్బీఎస్ లేదా జీసీటీ, ఓజిటీటీ వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీనికి డాక్టర్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటిస్తూ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ల ద్వారా నియంత్రణలో ఉంచుకోవలసి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరుగుతాయి. దాంతో ప్రెగ్నెన్సీలో అబార్షన్లు, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, బిడ్డలో లోపాలు, బిడ్డ ఎక్కువ బరువు పెరగడం, కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడొచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
భావోద్వేగాలను నియంత్రించుకోగలరా?
నిద్రలో కలత చెందటం, రోజుల తరబడి నిద్ర కరవు కావడం, శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లనుకోవటం, వారిలో వారు మాట్లాడుకోవటం, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడటం. ఇవన్నీ వివిధరకాల భావోద్వేగాలకు లోనైనవారి లక్షణాలు. సంతోషంతో అరవటం, ఎదుటవున్నవారిని ఎత్తుకోవటం, ఆనందబాష్పాలు మొదలైనవి కూడ భావోద్వేగాలే అయితే వీటివల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సహజమైనాయి. ఎలాంటి స్థితిలోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. మీరు మీ ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోండి. 1. మిమ్మల్ని బాధపెట్టే, ఇబ్బందిపెట్టే ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. మీ రియాక్షన్ వల్ల లాభం జరుగుతుందా అని ఆలోచిస్తారు. మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే అలాంటి ఆలోచనను మానుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయో విశ్లేషించగలరు. ఎ. కాదు బి. అవును 4. ప్రశాంతంగా, నిదానంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడ చాలా హుందాగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 5. మాటల వల్ల కొందరు బాధపడతారు. కొందరు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు తోచిన విధంగా మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనగా ఉన్నప్పుడు సంగీతాన్ని వింటారు. డ్యాన్స్ చేస్తారు. మీ అలవాట్లు ఎలావున్నాయోనని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరెలాంటి సమయాల్లో చాలా ఆనందంగా గడుపుతారో (కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం మొదలైనవి) గుర్తిస్తారు. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఆనందం కలిగించే పనులను చేయటం అలవాటుగా చేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ఎస్/నో, మంచి/చెడు ఇలా ప్రతి విషయానికి రెండు పార్శా్వలు ఉంటాయని మీకు తెలుసు. అందుకే మీరు భావోద్వేగాలకు లోనైనప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఎ. కాదు బి. అవును 9. మీ ఎమోషన్స్‌ను అణచివేయడం కన్నా వాటిని మంచిగా మలచుకోవటానికే ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని రకాల భావోద్వేగాలు అవసరమవుతాయని గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. మీ సమస్య మరీ ఎక్కువైనప్పుడు సైకాలజిస్ట్ సహాయం పొందటం మరచిపోరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే ఎమోషన్స్‌ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంటుంది. ఉత్సాహం కలిగినప్పుడు ఎలా ఉంటారో ఒత్తిడిలో కూడ అలాగే ఉండగలరు. ఒడిదుడుకులలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో మీరు చాలా వీక్. ప్రతి విషయానికీ డీలా పడిపోతూ అసంతృప్తితో ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ మిమ్మల్ని వెంటాడతాయి. ‘బి’ లను సూచనలుగా భావించి ఎమోషన్స్‌ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. -
స్కూల్ టెస్ట్ టెన్షన్..?
ఎగ్జామ్స్ మొదలవుతున్నాయంటే పిల్లలు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి పిల్లలు చురుగ్గా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి కల్పిస్తున్నారా? 1. పరీక్ష ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల నిద్ర తప్పని సరిగా పోయేటట్లు చూస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. టైమ్ అయిపోయిందని లేదా ఒత్తిడి కారణంగా తినాలనిపించక ఖాళీ కడుపుతో పరీక్షలకు వెళ్లిపోతుంటారు పిల్లలు. ఇది తప్పని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. తాజా పండ్లు, కూరగాయలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి పరీక్షల సమయంలో తప్పని సరిగా వీటిని తినిపిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 4. పిల్లలు ఒకింత ఆందోళన కొద్దీ అన్నం తినడానికి విముఖత చూపిస్తూ ఆర్టిఫీషియల్ షుగర్స్‌తో చేసిన స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, వేపుడు పదార్థాలు, మాంసం వంటి చిరుతిళ్లను ఇష్టపడతారు. ఇవి ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి తిననివ్వకుండా జాగ్రత్తపడతారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలు తినకూడని వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచి తినవద్దు అని కండిషన్ పెడితే చిన్నబుచ్చుకుంటారు, ఆ మూడ్‌తో చదువు మీద దృష్టికేంద్రీకరించలేరు కాబట్టి పరీక్షల సమయంలో ఇంట్లోకి రానివ్వరు. ఎ. అవును బి. కాదు 6. ఈ సమయంలో పిల్లలకు నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువ సేపు శక్తినిచ్చే మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 7. పరీక్షల గురించి భయపెట్టకుండా జాగ్రత్తలను మాత్రమే చెబుతున్నారు, ఎ. అవును బి. కాదు 8. ఉన్న సమయమంతా కూర్చుని చదవడమే కాకుండా రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయా మం చేస్తే మెదడు చురుగ్గా ఉంటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లలను పరీక్షల ఒత్తిడికి లోనుకానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే ఒకసారి మనస్తత్వ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు చెప్పే విషయాలను గమనించండి. -
అమ్మానాన్న.. ఆలోచించండి!
‘హిందీలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ సినిమా చూసినప్పుడు.. కాలేజీలు కొంచెం వైవిధ్యంగానే ఉంటున్నాయనిపిస్తుంది కదా. అదంతా బుల్ షిట్. అది కేవలం సినిమాలో మాత్రమే. నిజ జీవితంలో కాదు.. నిజ జీవితంలో మేము ప్రెషర్ కుక్కర్లో ఉన్నాం. ప్రెషర్ కుక్కర్లో ఏమవుతున్నదో తెలుసా? అంతా మాడిపోతున్నది. మీరు మీ పిల్లలకు బ్యాట్‌మెన్ కామిక్ బుక్ ఇస్తే.. వాళ్లు దాన్ని ఒక్క పేజీ కూడా వదిలిపెట్టకుండా చదువుతారు. కానీ.. అదే కామిక్ బుక్ మీద టెస్ట్ పెడతారంటే మాత్రం కామిక్ బుక్‌ను కూడా ద్వేషిస్తాడు. పిల్లాడు తన కాళ్ల మీద నిలబడాలనుకుంటున్నప్పుడు.. తన స్వశక్తితో ఎదగాలనుకుంటున్నప్పుడు ఎందుకు మీరు కిందికి లాగుతున్నారు. మాకు ర్యాంకులు ఎందుకు ఇస్తున్నారు. ర్యాంకుల పేరుతో మాకు మరో రకమైన ఒత్తిడిని కలగజేస్తున్నారనే విషయం మీకు తెలుస్తున్నదా? ఒకవేళ నేను సింగర్, ఆర్టిస్ట్, డ్యాన్సర్ లేదంటే ఓ ఫిలిం డైరెక్టర్ కావాలనుకుంటే ఎలా? వీటిలో ఏదైనా నేను కావాలనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదివే పైథాగరస్ థీరమ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది నాకు? చతురస్రంలో ఎన్ని భుజాలుంటే నాకెందుకు? ఇవన్నీ అసలు నేనెందుకు చదవాలి. మమ్మల్ని వదిలేయండి. మేం ఏం చేయాలనుకుంటున్నామో.. చేయనీయండి. మీరు ఊహించినదానికన్నా ఎక్కువగా ఎదుగుతామేమో... మూసధోరణిని వీడండి..‘ –హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ విద్యార్థి చేసిన పోస్ట్ ఇది -
అలా ఆలోచన...
‘ఆధునిక జీవనంలో మహిళలు అమ్మతనాన్నిఆస్వాదించలేకపోతున్నారు. మానసిక ఒత్తిడితో మాతృత్వపు ఆనందాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికోసమే మా ‘ది న్యూ మామ్జ్ హబ్’’ అని చెప్పారు డాక్టర్ హాసిని యాదవ్. నవతరం తల్లులకు అండగా నిలుస్తూ... చిన్నారుల పోషణలోసలహాలు, సూచనలు అందజేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కేర్‌టేకింగ్, పేరెంటింగ్ నేర్పిస్తోంది. బాలానగర్: డాక్టర్ హాసిని డెంటల్ డాక్టర్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. విద్యాభ్యాసమంతా ఇక్కడే కొనసాగింది. వివాహానంతరం భర్తతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి బిజినెస్ అండ్ హాస్పిటలైజేషన్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేశారు. తాను తల్లి అవుతున్న విషయం తెలియడంతో ఓవైపు సంతోషం... మరోవైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని ఆందోళన. యూట్యూబ్, వెబ్సైట్లలో చూసి జాగ్రత్తలు తెలుసుకుంది. అలా ఆలోచన... హాసినికి నెలలు నిండగానే ఆమె తల్లి ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. బాబు పుట్టిన కొద్ది కాలానికి హాసిని అమ్మమ్మ చనిపోవడంతో తల్లి ఇండియాకు వచ్చేశారు. దీంతో బాబును ఎలా పెంచాలి? పాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాత్రి సమయంలో బాబు ఏడిస్తే ఏం చేయాలి? బాబుకు ఏం తినిపించాలి? తాను ఏం తీసుకోవాలి? ఇలా చాలా సమస్యలు హాసినికి ఎదురయ్యాయి. ఓ రోజు అర్ధరాత్రి బాబు బాగా ఏడ్చాడు. ఆమెకు ఎందుకో అర్థం కాలేదు. ఆకలి వేసి ఏడుస్తున్నాడా? లేదా ఏమైనా ఇబ్బందా? తెలియదు. ఇరుగుపొరుగు సహకారంతో ‘మామ్స్ హబ్’ ఉంటుందని తెలుసుకొని అక్కడ శిక్షణ తీసుకుంది. రెండో బాబు పుట్టిన తర్వాత హాసిని కుటుంబం ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన హాసినికి తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లుల కోసం ఏదైనా చేయాలని ఉండేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ను స్థాపించారు. ‘మాతృ సఖి’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదేంచేస్తుంది? సుమారు 6నెలలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన హాసిని గైనకాలజిస్టులు, సైకాలజిస్టులు, పిల్లల డాక్టర్లను కలిసి ‘ది న్యూ మామ్జ్ హబ్’ స్థాపించారు. బాలింతలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చిన్నారుల పోషణలో శిక్షణనిస్తోంది. 2017 జనవరిలో ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రతివారం ఒక సెషన్ ఉంటుంది. వారానికి ఒక అంశంపై నవతరం తల్లులందరితో మాట్లాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాసనాలు, శారీరక శ్రమ తగ్గటానికి ఎక్సర్సైజులు చేయిస్తారు. ఇప్పటి వరకు సుమారు 100 మందికి శిక్షణనిచ్చింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఒంట్లో ఓపిక లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో చాలామంది నిరాశగా ఉంటారు. మాతృత్వపు మధురానుభూతులు ఆస్వాదించలేరు. అలాంటి వారికి సలహాలు, సూచనలు అందజేస్తూ సాంత్వన చేకూర్చుతోందీ హబ్. దీనికి వీరేం చార్జి వసూల్ చేయడం లేదు. ఎవరైనా ఇస్తే మాత్రమే తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలకు www.thenewmumzhub.చూడొచ్చు. స్పష్టత వచ్చింది.. పిల్లల విషయంలో ఒత్తిడిని అధిగమించడం ఎలా? అనే అంశంపై నేను డాక్టర్ హాసిని యాదవ్‌ను సంప్రదించాను. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాను. ఉద్చ్యోగాన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఎలా? అని ఇంతకముందు భయపడేదాన్ని. ఇప్పుడా కంగారు లేదు. చాలా విషయాలపై స్పష్టత వచ్చింది. ఇప్పుడు నా కూతురితో ఆనందంగా గడుపుతున్నాను. – లావణ్య, డిజైనర్ ఆత్మస్థైర్యం పెరిగింది... మాది వరంగల్ జిల్లా. ఉద్యోగరీత్యా బాలానగర్‌లో ఉంటున్నాం. మేము ఇద్దరం ఉద్యోగులమే. మా అమ్మాయి పుట్టిన నెల రోజుల వరకే నాకు సెలవులు ఉన్నాయి. తర్వాత ఆఫీస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. ఇక్కడికి వచ్చి మాతో ఉండే పరిస్థితి లేకపోవడంతో.. మా అమ్మాయికి ఎలాంటి ఆహారం అందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అవగాహన లేదు. ‘ది న్యూ మామ్జ్ హబ్’కి వెళ్లాక నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఇప్పుడన్నీ తెలుసుకున్నాను. – సుమశ్రీ, బాలానగర్ -
గోరంత విషం
కొండంత కష్టం వచ్చినప్పుడు గోరంత విషం తీర్చేస్తుందనుకోవడం తప్పు. కష్టాన్నే గోరంతగా తీసిపడేయాలి. అందుకోసం..కొండంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి.కొండంత ధైర్యమా?ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?కష్టమే ఇస్తుంది. విషం ఇవ్వదు! డిగ్రీ పూర్తి చేయాలి. గ్రూప్స్ రాయాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. స్వతంత్రంగా జీవించాలి. మూడేళ్లుగా ఈ కలల సాగుకి నారు పోసి నీరు పెట్టాను. కానీ వేధింపుల చీడ సోకడంతో అవి మాడి మసైపోయాయి. దీని వెనుక ఉన్న మగ ప్రపంచపు కుట్రల్ని తలచుకుంటే గుండెల్లో భగ్గుమంటుంది. బస్టాప్‌లో ఉండగా, వాడు స్కూటర్ మీద రివ్వున దూసుకొచ్చి నా పక్కన నిలబడ్డాడు. కాలేజీ దగ్గర దించుతానన్నాడు. బదులివ్వకుండా కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాను. పావుగంట తర్వాత బస్సెక్కి కాలేజీకి పోయాను. కాలేజీలో మళ్లీ ఎదురయ్యాడు! దాదాపు నెల రోజులు ఇలా వెంటబడ్డాడు. ఓ రోజు మా ఇంటివరకూ వచ్చి.. ‘నువ్వంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం’ అన్నాడు. భయమేసింది. నిద్ర కూడా పట్టలేదు. మర్నాడు ఇంట్లో విషయం చెప్పేశాను. మా అమ్మ ఆ రోజు కాలేజీ మాన్పించింది. ఆ రాత్రి ఇంట్లో పంచాయితీ. నాన్న కాలేజీ మానేయమన్నాడు. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేస్తానని మొత్తుకున్నాను. కుదరదని ఖరాఖండిగా చెప్పేశాడు. ఏడ్చి గొడవ చేసినా ఎవ్వరూ వినలేదు. నా కన్నీళ్లు మా అన్నయ్యను కాస్త కరిగించినట్టున్నాయి. నా వెంటపడుతున్న వాడిని హెచ్చరించి వచ్చాడు. ఇంట్లోవాళ్లని ఒప్పించి నన్ను కాలేజీకి తీసుకుపోయాడు. రెండు నెలలు ప్రశాంతంగా గడిచాయి. ఆ తర్వాత మా అన్నయ్య నుంచి కొత్త రకం వేధింపులు! అవును మా అన్నయ్య నుంచే!! ‘‘ఆయన భార్య ఆరోగ్యం బాగా లేదట. నువ్వు నచ్చావట. నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి తర్వాత నిన్ను చదివిస్తాడట. నన్ను ఉద్యోగంలో పెట్టిస్తాడట’’ అంటూ నస పెట్టడం మొదలెట్టాడు. మా అన్నయ్య చెబుతున్నది నా వెంటపడినవాడి గురించే!‘‘మనిషి కూడా బాగున్నాడు. ఇంతకంటే అందగాడు దొరుకుతాడా నీకు’’ అంటూ ఒత్తిడి తెచ్చాడు. మా అమ్మానాన్నలు కూడా అన్నయ్యకే వంత పాడారు. పేరెంట్స్ సపోర్ట్ కూడా దొరకడంతో మా అన్నయ్య నా మీద మరింత ఒత్తిడి తెచ్చాడు. తట్టుకోవడం కష్టమైంది. చచ్చిపోదామనిపించి నెయిల్ పాలిష్ తాగాను. కానీ బతికి బయటపడ్డాను. దీంతో ఇంటా బయటా అందరూ నన్ను మాటలతో చంపేశారు. పీక్కుతిన్నారు. నా ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయి కేసు పెట్టించారు. ఈ విషయం తెలిశాక ఇంట్లో అందరూ నన్ను తిట్టిపోశారు. నేను వాళ్ల పరువును గంగలో కలిపానట!ఆ తర్వాత నా కష్టాలకు అంతూ దరీ లేకుండా పోయింది. పోలీసులు నన్ను వేధించిన వాడి పక్షాన నిలబడ్డారు. ‘‘ఏం రోగం నీకు? ఏమైనా ఉంచుకుంటానన్నాడా? పెళ్లే కదా చేసుకుంటానంటున్నాడు. చదివిస్తానని కూడా అంటున్నాడు కదా? ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకో’’ అని వాళ్లు కూడా అన్నారు! స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారు. వాళ్లు వాడిన భాష మానసికంగా నన్ను ఎంత హింసించిందంటే.. దాని గురించి నోటితో చెప్పలేను. కేసు వాపసు తీసుకునేందుకు వాళ్లు పన్నిన వ్యూహంలో ఆ భాష ఒక భాగమనుకుంటాను.ఇటువైపు ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగింది. ఇంటి గుట్టును రచ్చకెక్కించావంటూ నన్ను మాటలతో చిత్రవధ చేశారు. ఇక కేసును వెనక్కి తీసుకోక తప్పలేదు. నాకు అతణ్ణి పెళ్లి చేసుకోవాలని లేదు. అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే అతగాడికి లేదు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకు అతడు ‘పెళ్లి’ పదాన్ని వాడాడు. మా అన్నకు ఉద్యోగం వేయిస్తానన్నాడు. ఇంకా చెప్పాలంటే నా శరీరం కోసం మా అన్నను ఓ పావుగా వాడుకోవాలనుకున్నాడు. కానీ మా అన్నకి వాడి కుట్ర ఎందుకు అర్థం కాలేదో తెలియడం లేదు. ఇప్పుడు నన్ను కాలేజీ మాన్పించేశారు. నా కలల ప్రపంచాన్ని కూల్చేశారు. నాలుగు గోడల మధ్య నన్ను బందీని చేశారు. గట్టిగా మాట్లాడలేను. ఎవ్వరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. ఎవ్వరితోనూ నా బాధ పంచుకోవడానికి లేదు. ఎప్పుడూ మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉంటుంది. నిద్ర పట్టదు.నాది కాని నేరానికి నన్ను శిక్షించిన ఈ మగ సమాజంపై నాకు విపరీతమైన కోపం. బహుశా జీవితంలో ఏ మగాణ్ణీ నమ్మలేనేమో. సమాజ దృష్టికోణం మారాలి లైంగిక హింస / వేధింపుల కేసుల్లో బాధితురాలిని మరింత బాధల్లోకి నెట్టే శత్రుపూరిత వాతావరణం మన చుట్టూ అలముకుని ఉంది. ఉమ కేసు ఇందుకు ఒక ఉదాహరణ. చాలా సందర్భాల్లో బాధితుల పట్ల పోలీసులు స్పందించే తీరు సరిగా ఉండట్లేదు. పోలీసులు, మధ్యవర్తులు, పెద్ద మనుషులు రాజీ కుదుర్చుకునేలా వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాగయితే ఇక బాధితురాలికి చట్టం ఏం సాయం చేసినట్టు? ఏం న్యాయం జరుగుతున్నట్టు? ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ చట్టాలు అంటే ఇదేనా? చట్ట ప్రకారం తల్లిదండ్రుల దగ్గర వుండటాన్ని సేఫ్ కస్టడీ అంటాం. ఉమ కేసును బట్టి పరిశీలిస్తే కుటుంబమూ ఆమెకు సేఫ్‌గా లేదని అర్థమవుతోంది. మహిళా హక్కులూ చట్టాల గురించి ఎంతగా చెప్పుకుంటున్నా, మహిళా దినోత్సవాలు వందేళ్లుగా జరుపుకుంటున్నా ఇలాంటి గాథలు అనేకంగా వినవస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల అమలు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. బాధితులకు భరోసా ఇవ్వగలగాలి. స్త్రీల పట్ల సమాజం ఏర్పరచుకున్న దృష్టికోణంలో మార్పు రావాలి. – డాక్టర్ కె.అనితారెడ్డి, సంఘ సేవకురాలు, వరంగల్ (ఉమ కేస్ స్టడీ) – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి బ్యూరో ఇన్చార్జ్, వరంగల్ -
ఎగ్జామ్స్ గైడ్
పరీక్షలొచ్చేస్తున్నాయి. పరీక్షలకు సిద్ధపడే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకూ పరీక్షలంటే ఎంతో కొంత ఆందోళన సహజం. ఏడాది పాటు నేర్చుకున్న పాఠాలను, వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, మంచి మార్కులు సాధించడానికి పరీక్షలు ఒక అవకాశం. కొందరు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేసి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధపడితే, చాలామంది విద్యార్థులు పాఠాలు చదువుకున్నా, పరీక్షల్లో సరిగా రాయగలమో లేదోననే ఆందోళనతో సతమతమవుతుంటారు. తరగతి గదుల్లో బాగా రాణించే విద్యార్థులు సైతం ఆందోళన కారణంగా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేక పోతుంటారు. పరీక్షల గురించి ఆందోళన చెందడం వల్ల ఫలితం చెడుతుందే తప్ప ప్రయోజనం ఉండదు గానీ, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడి పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. సమయం శరణం గచ్ఛామి పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడానికి, సత్ఫలితాలు సాధించడానికి కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంటుందని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. పరీక్షలకు సంసిద్ధమయ్యేటప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వారు చేస్తున్న సూచనలు కొన్ని... ∙చదవాల్సిన అంశాలను వాయిదా వేయడం తగదు. ముందుగా సిద్ధం చేసుకున్న నోట్సును శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి చెందకుండా జాగ్రత్త పడాలి. ∙మిత్రులతో బాతాఖానీ, టీవీ చూస్తూ కూర్చోవడం, సోషల్ మీడియా చాటింగ్, సినిమాలు, షికార్లు, వీడియోగేమ్స్ వంటి కాలాన్ని హరించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ∙సిలబస్ కొండలా కనిపించినా నిర్ణీత టైమ్‌టేబుల్‌ను కచ్చితంగా అమలు చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను ఇట్టే రాయవచ్చు. ∙రోజూ నిర్ణీత సమయం ప్రకారం చదవాలి. ఏకధాటిగా గంటల తరబడి చదవడం వల్ల అలసట అనిపించవచ్చు. అలాంటప్పుడు కొద్దిసేపు మనసుకు నచ్చిన పనులు చేస్తూ రిఫ్రెష్ అయి మళ్లీ చదవడం మొదలుపెట్టాలి. ∙నిద్ర, కాలకృత్యాలు, ఆహారం తీసుకోవడం, స్వల్ప విరామం వంటివన్నీ పోయినా, రోజుకు కనీసం పది గంటల సమయం ఉంటుంది. విద్యార్థులు ఆ పదిగంటల సమయాన్నీ గరిష్టంగా చదువు కోసమే వినియోగించుకునేలా చూసుకోవాలి. ∙ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు వంటి గాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం క్షేమం. వీటి వల్ల సమయం వృథా కావడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది. ∙రిలాక్సేషన్ కోసం కొద్దిసేపు ఆటలు ఆడటం, డ్యాన్స్, స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. వీటి వల్ల చురుకుదనం పెరుగుతుంది. అనుకూల వాతావరణం చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ఎవరైనా పనులు సజావుగా చేయగలరు. విద్యార్థులు కూడా అంతే. ఒకే చోట కూర్చుని గంటల తరబడి చదువుకోవాలంటే ఎవరికైనా కష్టమే. పిల్లలు చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉంటే చదువుపై ఉత్సాహం పెరుగుతుంది. పుస్తకాల ర్యాక్‌లో పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే మంచి సాహిత్యం, మెదడుకు పదునుపెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు, పదసంపదను పెంపొందించే నిఘంటువులు వంటివి కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రణాళికతో కూడిన సాధనే కీలకం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ప్రణాళికతో కూడిన సాధనే కీలకం. విద్యా ప్రమాణాలను గుర్తించి భిన్న కోణాల్లో ఆలోచించి రాసే జవాబులను వాక్య పరిమితిని పాటిస్తూ నోట్స్ తయారు చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి పాఠ్యాంశమూ ఫలితాల సాధనలో కీలకమైనవే. చాలామంది విద్యార్థులు ఏయే చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? ఏవి ముఖ్యమైనవి? అని అడుగుతూ ఉంటారు. పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ప్రాధాన్యం లేనివి అంటూ ఏవీ ఉండవు. అన్నీ కీలకమైనవే. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. గతంలో అడిగిన ప్రశ్నలను గుర్తుచేసుకుని, వాటిని ఇంకా ఎన్ని విధాలుగా అడిగే అవకాశాలు ఉన్నాయో అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఉన్న చిత్రాలు, గ్రాఫ్‌లు, పట్టికల్లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తి చేయాలి. కీలకమైన పదాల అభ్యసనాన్ని మెరుగు పరచుకోవాలి. కఠిన పదాలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులను లేదా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే డిక్షనరీలు తిరగేయడం ద్వారా వాటి అర్థాలను తెలుసుకోవాలి. తరగతిలో జరిగే చర్చల్లో పాల్గొనడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా పరీక్షల్లో సులువుగా జవాబులను రాయవచ్చు. పరీక్షలకు ముందుగానే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి పూర్తిగా కట్టుబడి చదువు సాగించేటట్లయితే చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. ఇలా ప్రణాళిక వేసుకోవాలి పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మంచి ఫలితాలను సాధించడానికి అందుకు తగిన ప్రణాళికను ఎలా వేసుకోవాలనే దానిపై విద్యారంగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన సూచనలు... ∙మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, పరీక్షలు మొదలవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకోవాలి. ∙ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని రోజులు కేటాయించడం సాధ్యమవుతుందో లెక్క వేసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయడానికి బడ్జెట్ వేసుకున్నట్లే పరీక్షల కోసం కచ్చితమైన టైమ్ టేబుల్ వేసుకోవాలి. ∙కొన్ని సబ్జెక్టులు సులభంగా అనిపిస్తాయి. కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు సులభంగా పూర్తి చేయగలమనుకునే సబ్జెక్టులకు సిద్ధపడాల్సిన రోజులు తగ్గించుకుని, కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ రోజులు కేటాయించుకోవాలి. ∙రోజుకు ఎన్ని గంటలు చదవడానికి కేటాయించగలమనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సబ్జెక్టుల కోసం కేటాయించే వ్యవధిని సహేతుకంగా లెక్క వేసుకుని, వీలైనంత వరకు దానికి కట్టుబడి ఉండాలి. ∙చదువుకునే సమయాన్ని, రిలాక్స్ అయ్యే సమయాన్ని, రివిజన్ చేసుకునే సమయాన్ని, నిద్రకు కేటాయించే సమయాన్ని హేతుబద్ధంగా విభజించుకుని, ఆ టైమ్ టేబుల్‌కు కట్టుబడి పరీక్షలకు సమాయత్తం కావాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా వారిని పాజిటివ్ దృక్పథంతోనే ప్రోత్సహించాలి. ‘అమ్మో! ఇంత సిలబస్ ఉంది. ఎప్పుడు చదవాలి? ఎలా పూర్తి చేయాలి? ఇదంతా గుర్తు పెట్టుకోగలనా?’ అని బెంబేలెత్తిపోకుండా, ‘ఇదంతా నేను చక్కగా చదివి అర్థం చేసుకోగలను. బాగా జ్ఞాపకం ఉంచుకోగలను’ అనే భావనను పెంపొందించుకోవాలి. ఈ భావన కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారిని మరింత ఒత్తిడికి లోను చేయకుండా ఉండాలి. ‘ఈ పాఠం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇంతసేపు చదివినా ఆ పోయెమ్ రాదు. ఇక ఎగ్జామ్ ఎలా రాస్తావు?’ అంటూ వారిలో మరింతగా భయాందోళనలను సృష్టించరాదు. తల్లిదండ్రులే సంయమనాన్ని కోల్పోయి పిల్లలను ఒత్తిడికి గురిచేస్తే వారిలో నెగెటివ్ ఆలోచనలు పెరుగుతాయి. ఈ పరీక్షలు రాయడం తన వల్ల కాదనుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే వారు తమకు వచ్చిన అంశాలను కూడా కంగారులో మర్చిపోతారు. ఇక పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు టీవీలు చూస్తూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇలాంటి పనుల వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడిని ఇలా జయించండి పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి పలువురు మానసిక శాస్త్ర నిపుణులు, యోగా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలను పాటించినట్లయితే ఒత్తిడి, ఆందోళన లేకుండా పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని వారు చెబుతున్నారు. ∙ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా ‘పరీక్షలంటే యుద్ధం’ అనే భావనను పిల్లల్లో రేకెత్తించరాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి వెన్నంటే ఉండి, సామర్థ్యానికి తగిన ఫలితాలను రాబట్టేలా పిల్లలను ప్రోత్సహించడం కొనసాగించాలి. ∙ఒత్తిడి అనిపించినప్పుడు పిల్లలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఐదు నుంచి పది అంకెల వరకు లెక్కపెట్టిన తర్వాత శ్వాసను వదలడం ద్వారా ఒత్తిడి నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. ∙కొందరు పిల్లలు పరీక్ష హాలుకు వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. చివరి నిమిషం వరకు చదివితే బాగా రాసేస్తారని అనుకోవడం సరికాదు. చివరి నిమిషం ఒత్తిడిలో ఉన్నప్పుడు చదవడం వల్ల వచ్చిన విషయాలను కూడా మర్చిపోతారు. పరీక్ష హాలుకు వెళ్లడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి చదవడం మానేస్తే మంచిది. ∙కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటివి తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందనుకోవడం ఉత్త భ్రమ మాత్రమే. కెఫీన్ మోతాదు పెరిగితే ఆలోచనల్లోని స్పష్టత లోపించే ప్రమాదం ఉంది. ∙పరీక్షల కోసం సిద్ధపడే విద్యార్థులు చదువు సాగించేటప్పుడు ప్రతి గంటకు పది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. విరామ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం వంటి పనుల ద్వారా రిలాక్సేషన్ పొంది మళ్లీ చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ∙చదువు సాగించేటప్పుడు విజువలైజేషన్ టెక్నిక్ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కళ్లు మూసుకుని పరీక్ష హాలులోనే ఉన్నట్లు ఊహించుకోండి. ప్రశ్నపత్రం తీసుకున్నట్లు, అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే వచ్చినట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీలో పాజిటివ్ దృక్పథం దానంతట అదే పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు మీరు మంచి ఫలితాలను సాధించడానికి దోహదపడతాయి. ప్రశాంతంగా నిద్రించండి పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలామంది విద్యార్థులు అర్ధరాత్రి దాటేంత వరకు చదువుతూ జాగారాలు చేస్తుంటారు. ఇలా జాగారాలు ఉండటం కంటే రోజూ కనీసం ఆరేడు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలోనే మెదడుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. నిద్రించేటప్పుడు ‘సెరటోనిన్’ ఎంజైమ్ చురుగ్గా స్రవిస్తుంది. దీనివల్ల అభ్యసన సామర్థ్యం, జ్ఞాపకశక్తి దానంతట అదే పెరుగుతుంది. తగినంత విశ్రాంతి తర్వాత చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, కంటి నిండా నిద్రపోయే వారే ఎక్కువ పదాలను గుర్తుంచుకోగలరని పలు పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. అందువల్ల పరీక్షల సమయంలో విద్యార్థులు రోజూ కనీసం ఆరేడు గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవాలి. ‘బట్టీ’ విక్రమార్కులు కావద్దు పాఠాలను కేవలం బట్టీ పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదివరకటి పద్ధతిలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టేస్తే పరీక్షలు గట్టెక్కేసే అవకాశాలు ఉండేవి. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోక తప్పదు. పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్నీ, ప్రతి భావనను సమగ్రంగా అవగాహన చేసుకుని సమాధానాలను రాయాలి. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు తదుపరి సంవత్సరాల్లో జరిగే పరీక్షల్లో పునరావృతమయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. అందువల్ల బట్టీ విధానం కంటే, పాఠాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం సాగించడమే మేలు. ఎగ్జామ్స్ మేడిన్ చైనా... పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏదో ఒక దశలో ‘ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడ్రా బాబూ! అనుకోకుండా ఉండరు. పరీక్షలు కనిపెట్టిన మహానుభావుడు ఎవరో ఇదమిత్థంగా తెలియకపోయినా, అతగాడిని నోరారా తిట్టుకుంటూ ఉంటారు. ఇటీవల కొందరు ఔత్సాహికులు హెన్రీ ఫిషెల్ అమెరికన్ అనే తత్వవేత్త ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టి, విద్యార్థులను వేధించడానికి పరీక్షలు కనిపెట్టిన కఠినాత్ముడు, క్రూరాత్ముడు ఇతగాడేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. జర్మనీలో పుట్టి, అమెరికాలో స్థిరపడ్డ హెన్రీ ఫిషెల్ ఈ విషయంలో ఎలాంటి పాపమూ ఎరుగడు. ఈ పెద్దమనిషి ఇరవయ్యో శతాబ్దికి చెందిన తత్వవేత్త. పరీక్షల విధానం అంతకు చాలా పూర్వం నుంచే వాడుకలో ఉండేది. మొట్టమొదటగా చైనాలోని సుయి వంశీకుల పాలనలో క్రీస్తుశకం 605 సంవత్సరంలో పరీక్షల విధానం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ పద్ధతి వాడుకలోకి వచ్చింది. కింగ్ వంశీకులు ఈ పద్ధతిని 1905లో రద్దు చేశారు. అయితే, క్రీస్తుశకం 1806లో బ్రిటిష్ పాలకులు పరీక్షల పద్ధతిని తొలిసారిగా యూరోప్‌లో ప్రవేశపెట్టారు. సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశపెట్టిన ఈ పరీక్షల పద్ధతి శరవేగంగా ఇతర దేశాలకూ వ్యాపించింది. ఉద్యోగాలకు తగిన అభ్యర్థుల ఎంపిక కోసమే కాకుండా, పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు తరగతుల్లో ఉత్తీర్ణులను నిర్ధారించడానికి సైతం పరీక్షలు నిర్వహించడం వాడుకలోకి వచ్చింది. రియలిస్టిక్ ప్లాన్ ఉండాలి! పరీక్షలనగానే పిల్లలకు కాస్తంత భయం, ఒత్తిడి ఉండడం ఆరోగ్యకరమైన విషయమే! అసలు ఏమాత్రం భయం లేకున్నా పరీక్షలంటే సీరియస్‌నెస్ పోతుంది. అయితే ఇది స్థాయి దాటి ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తేనే ప్రమాదం. ఒత్తిడి ఎక్కువ అవ్వడం అన్నది సాధారణంగా అందరిలోనూ చూస్తూంటాం. ఇది ముఖ్యంగా పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ఎక్కువవుతూ ఉంటుంది. పరీక్ష రోజు, ఆ ముందు రోజే కాకుండా ముందు నుంచే చదవడం మొదలుపెడితే పరీక్షల సమయంలో ఒత్తిడిని తప్పించుకోవచ్చు. అలాగే పరీక్షల సమయంలో ‘రోజుకు ఇన్ని గంటలు చదివేస్తా. అన్ని చాప్టర్లూ ఫినిష్ చేసేస్తా..’ లాంటివి పెట్టుకోకుండా, రియలిస్టిక్ ప్లాన్ ఉంటే మంచిది. నిద్ర, ఆహారాలు మాని చదవడం ప్రమాదకరం. నిజానికి పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడానికి ఇంకాస్త ఎక్కువ నిద్రే అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదవమని ఒత్తిడి పెంచొద్దు. ఫిజికల్ ఎక్సర్సైజ్ పరీక్షల సమయంలో కొందరు స్కిప్ చేస్తుంటారు. కానీ దానివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పాజిటివ్ ఆటిట్యూడ్‌ను ఎప్పటికీ వదులుకోవద్దు. – డా. పద్మ పాల్వాయి, చైల్డ్ సైకియాట్రిస్ట్ టైమ్ టేబుల్ వేస్కొని చదువుతున్నా! పరీక్షలు దగ్గరైపోయాయి. ఇప్పటికే ఏయే సబ్జెక్ట్స్ ఎలా ఎలా చదవాలో టైమ్ టేబుల్ వేస్కున్నా. మ్యాథ్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. ఏది కష్టమో ఆ సబ్జెక్ట్‌కు ఎక్కువ టైమ్ ఇచ్చి చదువుతున్నా. కొంచెం భయమైతే ఉంది కానీ, ఇంట్లో, స్కూల్లో అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అమ్మ వాళ్లైతే ఇప్పుడు ఏ పనీ చెప్పడం లేదు కూడా. బాగా రాస్తానన్న నమ్మకం ఉంది. అందరికీ ఆల్ ది బెస్ట్. – దేవర ఉదయ్‌కిరణ్, పదో తరగతి విద్యార్థి టెక్ట్స్ బుక్స్ బాగా చదవాలి! పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బాగా చదివిన విద్యార్థులు కూడా ‘చదివినవన్నీ గుర్తుంటాయా?’ అని ఆందోళన పడుతూంటారు. అందుకే రోజూ ధ్యానం చేస్తే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పరీక్ష రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతబాగా పరీక్ష రాయగలరని తెలుసుకోవాలి. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజ్ మిల్క్, ఆయిల్ తక్కువగా ఉండే వంటకాలు, పండ్లు, కూరగాయలను పిల్లల డైట్లో చేరిస్తే బాగుంటుంది. పిల్లలు బట్టీ పట్టకుండా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. టెక్స్›్టబుక్స్ బాగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. – లక్ష్మీ శారద, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు -
విద్యార్థుల ఆత్మహత్యలపై ఏం చేస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాలల్లో విపరీతమైన ఒత్తిడి వాతావరణం నేపథ్యంలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసు జారీచేసింది. ఈ అంశంపై ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేవో నాలుగు వారాల్లో తెలపాలని నోటీసులో పేర్కొంది. కనీస మౌలిక వసతులు లేకుండా కళాశాలలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని, తగినన్ని స్నాన గదులు, మరుగుదొడ్లు కూడా లేవని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు చదువు పేరుతో మానసిక క్షోభకు గురిచేయడం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారాంతపు పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తూ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రత్యేక సెక్షన్లుగా విభజించడంతో తోటి విద్యార్థుల్లో ఆత్మన్యూనతాభావం పెరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితిని నివారించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని న్యాయవాది వివరించారు. -
ఇకనైనా బజ్జోమ్మా..!
పెద్దల్లో నిద్రలేమి సర్వసాధారణమే. వయసు మళ్లిన వారు వివిధ ఆరోగ్య సమస్యల కారణాల వల్ల నిద్రకు దూరమవుతుంటారు. పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, కుంగుబాటు వంటి కారణాల వల్ల యుక్త వయస్కులు కూడా నిద్రకు దూరమవుతుండటం మామూలే. అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఇటీవలి కాలంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. స్థూలకాయానికి ఇదే కారణం... చదువుల్లో పెరిగిన ఒత్తిడి, టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయి వీడియో గేమ్స్‌తో గడిపే అలవాటు, ఒంటికి అలసట కలిగించే ఆటపాటలకు అవకాశం లేకపోవడం వంటి పలు కారణాలు చిన్నారులను నిద్రకు దూరం చేస్తున్నాయి. అవసరమైన సమయం కంటే తక్కువసేపు నిద్రపోయే చిన్నారులు త్వరగా వయసుకు మించి బరువు పెరుగుతున్నారని వర్జీనియా కామన్వెల్త యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నాలుగు నుంచి పన్నెండేళ్ల లోపు వయసు గల 120 మంది పిల్లలపై నెలల తరబడి నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ బెర్నార్డ్ ఫ్యూమలర్ వెల్లడించారు. పిల్లల్లో స్థూలకాయానికి కొవ్వులతో నిండిన జంక్‌ఫుడ్, తీపి పదార్థాలనే అంతా నిందిస్తారు. చిన్నారులు స్థూలకాయం బారినపడటానికి ఇవి ప్రధాన కారణాలే అయినప్పటికీ నిద్రలేమి కూడా ఇందుకు కారణమవుతోందని ఆయన తెలిపారు. నిద్రలేమికి గురైన పిల్లల్లో జీవక్రియలు మందగిస్తాయని, ఫలితంగా వారు త్వరగా బరువు పెరిగిపోతారని వివరించారు. పిల్లలు వేళకు నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారు తగినంత సమయం నిద్రపోలేకపోతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుల సహాయం తీసుకోవాలని ప్రొఫెసర్ ఫ్యూమలర్ సూచిస్తున్నారు. మానసిక సమస్యలకూ మూలం... నిద్రలేమి కారణంగా స్థూలకాయం, దాని ద్వారా తలెత్తే శారీరక సమస్యలతో పాటు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. తగినంత నిద్రకు దూరమైన చిన్నారుల్లో ప్రవర్తనాపరమైన రుగ్మతలను గుర్తించినట్లు సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్లోని న్యూరోసైకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ డీన్ బీబె తెలిపారు. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో దుడుకు ప్రవర్తన, కుదురుగా ఉండలేకపోవడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయని ఆయన చెప్పారు. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడే పిల్లలు ఏకాగ్రత కోల్పోయి, చదువు సంధ్యల్లో వెనుకబడతారని వివరించారు.9 పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే...? పిల్లలు చక్కగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిలడెల్ఫియా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని స్లీప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జోడి మిండెల్ ఈ విషయమై చేసిన సూచనలు ఇవీ... ►రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా పిల్లలను ప్రోత్సహించాలి. ►పిల్లలు పడుకునే గదిలో తక్కువ కాంతితో ఉండే లైట్లు వెలిగించాలి. ►పిల్లలు నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఇంట్లోని టీవీలు, కంప్యూటర్ల వంటివి కట్టేయాలి. ►పిల్లలను పడుకోబెట్టి కథలు, కబుర్లు చెబుతూ వారిని నిద్రపుచ్చాలి. -
ఒత్తిడిలో పోలీస్..!
‘ఆదివాసీ, లంబాడాల మధ్య గొడవల నేపథ్యంలో వేరే జిల్లా నుంచి వచ్చాం. దాదాపు 15 రోజులు కావస్తోంది. కోరలు చాచే చలిలో రాత్రిళ్లు విధులు నిర్వహిస్తున్నాం. పదిరోజుల నుంచి భార్య పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు బందోబస్తు నిర్వహించాలో తెలియడం లేదు. సిబ్బంది కొరతతోనే ఈ పరిస్థితి ఉంది. వాతావరణం అలవాటు లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాం.’ – బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు మనోగతం.. బోథ్ : జిల్లాలోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో తగినంతా సిబ్బంది లేరు. చాలా మండలాల్లో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపైనే పని భారం పెరుగుతోంది. వాస్తవానికి జనాభా, నేరాల నమోదు ఆధారంగా ఒక్కోస్టేషన్కు 25నుంచి 50 మంది సిబ్బంది ఉండాలి. అందులో ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, మిగతావారు కానిస్టేబుళ్లు ఉండాలి. సర్కిల్‌కు ఒక సీఐ ఉండాలి. హోంగార్డులు వీరికి అదనం. అయితే ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల 6 నుంచి 20 మంది కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై మాత్ర మే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిపై పని భారం పెరుగుతోంది. ఫలితంగా కొంతమంది అనారోగ్యంతోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను నిరంతరం రక్షించే పోలీసులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పోలీసుస్టేషన్లలో సరిపడా సిబ్బంది లేక ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. సెలవుల్లోనూ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి. దీంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాణాలమీదకు వస్తున్న సంఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అయితే పెద్దసార్ల దృష్టిలో పడితే అంతే సంగతులు..అంటూ భయపడుతూనే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది. కుటుంబంతో గడిపే తీరిక లేక, సెలవులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీసు నియామకాలు చేపట్టడంలో ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 వేల మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 1906, మంచిర్యాల జిల్లాలో 1215, నిర్మల్ జిల్లాలో 887, కుమ్రంభీం జిల్లాలో 775 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. బోథ్ సర్కిల్లో ఇదీ పరిస్థితి... బోథ్ సర్కిల్ పరిధిలో బోథ్, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. బోథ్ స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు ఉండగా, బజార్ హత్నూర్ మండలంలో ఎస్సై లేకపోవడంతో బోథ్‌లోని రెండో ఎస్సై మొబిన్‌కు బజార్హత్నూర్ ఎస్సైగా బాధ్యతలు అప్పజెప్పారు. బోథ్ పోలీస్ స్టేషన్లో ఒక ఏఎస్సై, 16 మంది కానిస్టేబుళ్లు ఉండగా అందులో 10 మంది కానిస్టేబుళ్లు డిప్యుటేషన్, అటాచ్డ్గా ఉన్నారు. ప్రస్తుతం కేవలం 6 గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 18 గ్రామపంచాయతీలు ఉన్న నియోజకవర్గ కేంద్రంలో కేవలం ఆరుగురితో సరిపెట్టుకోవడంతో కానిస్టేబుళ్లపై తీవ్రమైన విధుల ఒత్తిడి ఏర్పడుతోంది. ఇక బజార్హత్నూర్ మండల పోలీస్‌స్టేషన్‌లో కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుళ్లపై విరుచుకునడుతున్న పోలీస్‌బాస్‌లు... విధుల ఒత్తిడి ఒకటైతే.. కొంత మంది పోలీస్ బాస్‌లు కానిస్టేబుళ్లపై పరుషపదజాలం వాడుతుండగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది కలివిడిగా ఉంటే.. మరికొంతమంది బాసిజం ప్రదర్శిస్తున్నారు. వారి ఇంటి అవసరాలకోసం వాడుకోవడం వంటివి కానిస్టేబుళ్లను తీవ్రంగా కుంగదీస్తోంది. నేను చేయను సార్ అంటే చాలు.. కానిస్టేబుళ్లపై విరుచకుపడే సంస్కృతి ఇంకా ఉండటంతో వారు మనోవేదనకు గురవుతున్నారు. ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది.. ⇒ నిత్యం ఎన్నో ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించే పోలీసులు వారి ఆరోగ్యంపై శ్రద్ధచూపకపోవడంతో అపాయంలో పడుతున్నారు. సాధారణంగా వచ్చే రక్తపోటు, మధుమేహం, గుండె, ఇతర సమస్యలను తగిన సమయంలో గుర్తించలేకపోవడంతో అవి క్రమేపీ తీవ్రమై ఒక్కసారిగా ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ⇒ జిల్లాలో అనారోగ్యంతో మృతిచెందిన పోలీసులు కొంతమంది.. ⇒ బోథ్ పోలీస్‌స్టేషన్‌లో మూడేళ్ల క్రితం విధులు నిర్వహించిన ఏఎస్సై సుభాష్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ⇒ కెరమెరి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోతీలాల్ సైతం విధుల నిర్వహణలో గుండెపోటుతో మృతిచెందాడు. ⇒ ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సుంగన్నకు కూడా అధిక రక్తపోటు రావడం, విధుల నిర్వహణ భారంగా మారడంతో గుండెపోటుతో మరణించారు. ⇒ గతేడాది గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణపతి సైతం గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. సిబ్బంది సంక్షేమానికి కృషి సిబ్బంది సంక్షేమంలో భాగంగా ప్రతివారం ఒక రోజు సెలవు అమలు చేస్తాం. దీంతో పాటు పెళ్లి వేడుకలకు కూడా సిబ్బందికి సెలవులు మంజూరు చేస్తాం. కానిస్టేబుళ్లపై ఎటువంటి ఒత్తిడి పడినివ్వం. త్వరలోనే కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. – కల్మేశ్వర్ సింగెన్వార్, ఎస్పీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కానిస్టేబుళ్లపై ఒత్తిడి పడనివ్వం అదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో కానిస్టేబుళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి ఉంది. అయితే దీనిని త్వరలోనే అధిగమిస్తాం. పోలీసుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. రాబోయే రోజుల్లో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఏర్పడుతుంది. – వారియర్, ఎస్పీ , అదిలాబాద్ జిల్లా -
అలసిపోతున్న నాలుగో సింహం
సమాజానికి ‘పెద్దన్న’ లాంటి పోలీసు నలిగిపోతున్నాడు. పెరుగుతున్న పనిభారం .. పెరగని సిబ్బందితో సతమతమవుతున్నాడు. 24 గంటల ఉద్యోగం..విధి నిర్వహణలో ఒత్తిడి వల్ల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నాడు. క్రమశిక్షణకు మారుపేరు లాంటి పోలీసు ఉద్యోగం కానిస్టేబుళ్లను నోరెత్తనీకుండా చేస్తోంది. దీంతో క్రమంగా ‘నాలుగో సింహం’ అలసిపోతోంది. పుత్తూరు: సమాజ భద్రతకు పోలీసుశాఖ ఇనుప కంచె లాంటిది. తొలి రక్షకుడు కానిస్టేబుల్. స్టేషన్ మెట్లు ఎక్కగానే మొదటగా కనిపించేది కూడా కానిస్టేబులే. బాధలో ఉన్న వ్యక్తి తన సమస్యలను తొలిగా చెప్పుకొనేది.. వినేది కూడా కానిస్టేబులే. అలాంటి కానిస్టేబుళ్లు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెరుగుతున్న పనిభారానికి తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో విధి నిర్వహణలో అలసిపోతున్నారు. 24 గంటల ఉద్యోగం (సమస్యలు ఏర్పడినప్పుడు) వల్ల శారీరక, మానసిక కుంగుబాటుకు గురిచేస్తోంది. క్రమశిక్షణకు మారుపేరు లాంటి డిపార్ట్మెంట్ కావడంతో తమ బాధలను పంటి బిగువున దిగమింగుతూ విధులను నిర్వహించాల్సిన పరిస్థితి. పెరుగుతున్న పనిభారం... పుత్తూరు, నగరి లాంటి పోలీస్ స్టేషన్లలో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు, రాత్రి గస్తీ, హైవే పట్రోలింగ్, ట్రాఫిక్ నియంత్రణ, నేరపరిశోధన, దొంగలను పట్టుకో వడం, రికవరీ, కోర్టు డ్యూటీలు, సమన్ల అందజేత, వీఐపీ పర్యటనలు, ఉత్సవాల బందోబస్తు, సమస్యలు ఏర్పడినప్పుడు పికెటింగ్ వంటి విధుల్లో పోలీస్ కానిస్టేబుâ¶్ల పాత్ర కీలకం. కొన్నేళ్లుగా జనాభాకు తగ్గట్టుగా పోలీస్ కానిస్టేబు ళ్ల నియామకాలు జరగడం లేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. దీంతో పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. 35 ఏళ్లకే శారీరక రుగ్మతలు 21 సంవత్సరాలకు పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరుతుంటే పనిభారం వల్ల 35 ఏళ్లు వచ్చేసరికే బీపీ, చక్కెర వ్యాధులకు గురి కావాల్సి వస్తోంది. 50 సంవత్సరాలు పైబడితే అసహనం.. మానసిక అశాంతి, నిద్రలేమితో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఉంది. సర్వీసు పూర్తయ్యే సరికే శరీరం రోగాల మయం కావాల్సి వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. 55 ఏళ్లకు రిటైర్మెంట్ను ప్రకటించి.. మిగిలిన సర్వీసు కాలానికి సంబంధించిన వేతనాలను, ఇతర బెనిఫిట్స్‌ను అందజేస్తే కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్లవుతారని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసువులు బాసిన కానిస్టేబుళ్లు పుత్తూరు మున్సిపల్ పరిధిలోని పిళ్లారిపట్టుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎం.సుధాకర్ విధినిర్వహణలో భాగంగా పట్రోలింగ్ నిర్వహిస్తూ అసువులు బాసారు. అలాగే పుత్తూరులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సమన్లు అందజేసేందుకు వెళ్లిన ఢిల్లీబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరిద్దరూ ఈ ఏడాదే మృతి చెందడం పోలీస్‌శాఖను కలవరానికి గురిచేసింది. -
మీపై ఒత్తిడి పెరుగుతోందా?
పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా కావచ్చు, ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్ వినటం, సినిమాలు చూడటం ఇలా ఏదోఒక రకంగా కొందరు స్ట్రెస్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయలేనివారు ఆందోళనను అదుపులో పెట్టుకోలేరు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్ట్రెస్‌వల్ల మీరూ సిక్‌గా మారారేమో, చెక్ చేసుకోండి. 1. రెస్ట్ తీసుకొనే సమయం దొరికి నా సరిగా నిద్రపోలేక పోతున్నారు. ఎ. కాదు బి. అవును 2. స్ట్రెస్ నుంచి దూరం అవ్వటానికి మద్యం అలవాటు నేర్చుకోవాలనిపిస్తోంది. ఎ. కాదు బి. అవును 3. చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడూ మూడీగానే ఉంటున్నారు. ఎ. కాదు బి. అవును 4. తరచుగా అలసిపోయినట్లు ఉండటం వల్ల పనిని మధ్యలోనే వదిలివేయవలసి వస్తోంది. ఎ. కాదు బి. అవును 5. కోపాన్ని అణచుకోవటం చాలా కష్టంగా మారింది. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనలో గందరగోళానికి గురవుతున్నారు. ఎ. కాదు బి. అవును 7. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని, మీ శ్రేయోభిలాషులనుంచి సూచనలు అందుతున్నాయి. ఎ. కాదు బి. అవును 8. ఆహారం మరీ ఎక్కువ లేదా తక్కువగా తీసుకుంటున్నారు. ఎ. కాదు బి. అవును 9. ఏ పని మీదా శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఎ. కాదు బి. అవును 10. మతిమరుపు వస్తోంది, ఎక్కుసార్లు తలనొప్పితో బాధపడుతున్నారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు నాలుగు వస్తే మీరిప్పుడిప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని మొదట్లోనే నియంత్రించుకోండి. ‘బి’ లు ఏడు దాటితే ఆందోళనవల్ల మీరు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతుంటారు. వెంటనే ఒత్తిడిని నియంత్రించుకోగలిగే మార్గాలను తెలుసుకొని వాటిని ఫాలో అవ్వండి. ‘ఎ’ లు ఏడు అంత కన్నా ఎక్కువగావస్తే మీలో ఆందోళనకు తావులేదు. -
పిట్టల్లా రాలుతున్న విద్యార్థులు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు చైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ విద్యార్థి పవన్‌కుమార్ (17)కు వారాంతపు పరీక్షల్లో రెండు మార్లు వరుసగా మార్కులు తక్కువగా వచ్చాయి. మరోసారి ఇలా తక్కువ మార్కులు వస్తే బాగోదని కళాశాల యాజమాన్యం హెచ్చరించింది. మరింత బాగా చదవాలని మరో వైపు తండ్రి ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాతి వారాంతపు పరీక్షకు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈసారి కూడా తక్కువ మార్కులు వస్తాయేమేనని భయపడి గత ఏడాది జూలై 11న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పాఠశాల, కళాశాల విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నా ప్రభుత్వం నుంచి వీసమెత్తు చలనం కూడా కనిపించడం లేదు. మూడున్నరేళ్లలో దాదాపు 100 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా బుధ, గురువారాల్లో మరో ముగ్గురు విద్యార్థులు వేర్వేరు చోట్ల ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉండి కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకున్న విద్యార్థులు రోజుకొకరు పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ పరంపరను నిలువరించడానికి ప్రభుత్వం పూనుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది. సంఘటనలు జరిగినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా కమిటీలంటూ హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. నీట్, ఎంసెట్, ఐఐటీ పేరుతో విరామం లేకుండా తరగతులు నిర్వహిస్తుంటే ఒత్తిడి తట్టుకోలేక నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీలతో పాటు ఇతర కాలేజీల్లోనూ పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు సైతం ప్రాణాలు తీసుకుంటుండటం చూస్తుంటే ఆయా విద్యా సంస్థల్లో విపరీతమైన ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. బలవన్మరణాల్లో పోలీసు రికార్డులకు ఎక్కినవి కొన్ని మాత్రమే. విచారకర విషయం ఏమిటంటే తాజాగా పదో తరగతి విద్యార్థులపై కూడా పలు పాఠశాలల్లో విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు. 10/10 పాయింట్లు (గ్రేడ్) రావాలని నిర్ధేసిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కమిటీల సిఫార్సులు గాలికి విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు డజనుకుపైగా విచారణ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో దేవుడికే ఎరుక. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో, ప్రొఫెసర్ నీరదారెడ్డి ఆధ్వర్యంలో నియమించిన కమిటీలు పలు విలువైన సూచనలు చేశాయి. ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేస్తున్నాయని, ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లను కొనసాగిస్తున్నాయని నీరదారెడ్డి కమిటీ తేల్చింది. జైళ్ల మాదిరిగా హాస్టళ్లను కొనసాగిస్తుండడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేసింది. వెయిటేజీ కారణంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులు మార్కుల కోసం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపింది. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి డి.చక్రపాణి, శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీ మాజీ వీసీ రత్నకుమారిల నేతృత్వంలో ఏర్పాటైన మరో కమిటీ కూడా పలు సూచనలు చేసింది. అయితే ఏ ఒక్క సూచనా అమలు కావడం లేదు. ఒత్తిడి తెస్తేనే చర్యలు: విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తీవ్ర ఒత్తిడి వస్తే తప్ప ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఏఎన్‌యూలో ఆర్కిటెక్ట్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. ఇది తీవ్ర సంచలనానికి దారితీసి రాష్ట్రమంతా అట్టుడికి పోవడం తెలిసిందే. ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్ బాబూరావును రక్షించేలా సర్కారు పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారు. దీంతొ వైఎస్సార్సీïపీ సహా ప్రజా సంఘాలన్నీ ఆందోళన ఉధృతం చేయడంతో ప్రభుత్వం చివరకు కేసు నమోదు చేయించింది. మార్కులు, ర్యాంకుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల విషయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు కమిటీలు వేసి ఆ తర్వాత పట్టించుకోక పోవడంతో విద్యార్థులు నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. ఈ కమిటీలు ఏం చెప్పాయంటే.. ►ఆదివారాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరాదు ►సాయంత్రం 4 గంటలకల్లా తరగతులు ముగించాలి ►తరగతులు, స్టడీ సమయం తొమ్మిది గంటలకు మించి ఉండరాదు ►ఇంటర్ మార్కులకు వెయిటేజీ తగ్గింటూ వచ్చి.. ఎంసెట్ విధానాన్ని క్రమేణా ఎత్తేయాలి ►శారీరక వ్యాయామానికి వీలుగా ఆటపాటలు ఉండాలి ►విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చి ఇతర గ్రూపుల్లోకి మార్చరాదు ►టీచర్, విద్యార్థు నిష్పత్తి బోర్డు నిబంధనల ప్రకారం ఉండాలి ►టీచర్లు, విద్యార్థులపై పని భారం పెంచరాదు ►ప్రతి ప్రైవేటు కాలేజీలో ఒక కౌన్సెలర్‌ను నియమించాలి ►విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రతి కాలేజీ ప్రత్యేక యాప్ రూపొందించుకోవాలి ►ఈ సూచలన్నీ అమలు చేసేందుకు ఆయా కాలేజీల వారీగా మానటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి ►జిల్లా స్థాయిలో ఎథికల్ కమిటీని నియమించాలి. ‘శ్రీ చైతన్య’లో విద్యార్థిని ఆత్మహత్య వర్ని(బాన్సువాడ): తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన తోట సంయుక్త (18) హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తోట రాజేందర్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సంయుక్త ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. చదువులో చురుకుగా ఉంటూ అందరితోనూ చలాకీగా ఉండే సంయుక్త బుధవారం రాత్రి కళాశాలలోని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. సంయుక్త తండ్రి బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. -
చిన్న కారణం.. నిండు జీవితం
సాక్షి, నెట్వర్క్: చిన్న చిన్న కారణాలకు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవలతో ఒకరు, అధ్యాపకుల తీరుతో మరొకరు, చదువు ఒత్తిడితో ఇంకొకరు.. కారణాలేవైతేనేమి చిన్న విషయాలకే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన తోట సంయుక్త (17).. హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య మెడికల్ క్యాంపస్‌లో నీట్ మెడిసిన్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. చదువు పట్ల ఒత్తిడికి గురైన సంయుక్త.. బుధవారం రాత్రి హాస్టల్ రూమ్‌లో చున్నీతో సీలింగ్ ప్యాన్‌కు ఉరేసుకుంది. మాదాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువులో ముందుండే విద్యార్థిని, కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేక పోతున్నామని బంధువులు అన్నారు. విజయనగరంలో పదో తరగతి విద్యార్థిని విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన మాలతి (15).. బొమ్మిక జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో మనస్తాపం చెందిన మాలతి.. గురువారం పురుగు మందు తాగింది. చుట్టుపక్కల వారు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారొచ్చి పరిశీలించే సరికి మృతి చెందింది. శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి.. శ్రీకాకుళం జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థి పూర్ణలక్ష్మీ నరసింహమూర్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బట్టలు ఆరేసుకునే ప్లాస్టిక్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడని అదే గదిలో ఉంటున్న విద్యార్థులు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని గాంధీనగర్ హరిజనవాడకు చెందిన పదో తరగతి విద్యార్థిని జి.పూజిత (15) బుధవారం అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరిలో బీటెక్ విద్యార్థి.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన బి.భానుకృష్ణ (21) కలికిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. క్లాస్ రెప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న భాను.. విద్యార్థుల మార్కుల విషయంలో అధ్యాపకులు కె.రాజు, అశోక్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గమనించాడు. విషయాన్ని మెకానికల్ విభాగాధిపతి శ్రీనివాసన్‌కు వివరించగా ఆయన పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను.. బుధవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విద్యార్థులు గమనించి హుటాహుటిన కలికిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. -
ఒత్తిడిని ఎదుర్కోవటం మీకు తెలుసా?
దగ్గరివారు దూరం అవ్వటం, ఒకరిపై పెట్టుకొన్న అంచనాలు తలకిందులవ్వటం, అనుకున్నది సాధించలేకపోవటం, ఉన్నదానికంటే ఎక్కువగా కోరుకోవటం... ఇలా ఎన్నో కారణాలు మనిషి ఒత్తిడికి కారణం అవుతాయి. ఇలాంటివాటిని ఎదుర్కొనేవారు ఎలాంటి బాధలు, అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలరు. సమస్యలను సున్నితంగా పరిష్కరించగలరు. మీరు స్ట్రెస్‌ను ఎదుర్కోగలరా? అది ఎలాగో మీకు తెలుసా? 1. బయట సమస్యలను ఇంటిదాకా తెస్తారు. ఎ. అవును బి. కాదు 2. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలను తెలుసుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. స్నేహితులతో అప్పుడప్పుడూ సమయాన్ని గడుపుతారు. ఎ. కాదు బి. అవును 4. స్పోర్ట్స్ / ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొంటారు. ఎ. కాదు బి. అవును 5. ఒకే విషయాన్ని పదేపదే తలచుకోరు. ఎ. కాదు బి. అవును 6. ఆధ్యాత్మికతకు మీలో చోటుంది. ఎ. కాదు బి. అవును 7. ఆనందించాల్సిన సమయంలో మీ వర్క్ పూర్తి చేయాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఒత్తిడికి కారణమైన విషయం/వ్యక్తుల్లో పాజిటివ్ అంశాలను గుర్తిస్తారు. ఊహలకు తావివ్వరు. ఎ. కాదు బి. అవును 9. ప్రతికూలంగా ఆలోచిం^è డాన్ని నిరోధిస్తారు. ఎ. కాదు బి. అవును 10. ఒత్తిడిలో ఉన్నప్పుడు మత్తు పదార్థాలు (ఆల్కహాల్, సిగరెట్) సాంత్వనను అందిస్తాయి. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీది ఒత్తిడిలో కూరుకుపోయే మనస్తత్వం. ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసే ప్రయత్నాన్ని మానండి. సమస్యలు సహజమని గుర్తించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఒత్తిడిని ఎదుర్కోవటం మీకు తెలుసు. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉంటారు. -
మద్యం వ్యాపారంలో వాటాలకోసం పోటీ
తమ మాట వినని వారి దుకాణాలకు తాళం అధికారం అండతో అధికారులపై ఒత్తిళ్లు సతమతమవుతున్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ప్రతి పనిలోనూ వాటాలకు పోటీపడుతున్నారు. తమ మాట వినని వారిని తమదైన శైలిలో బెదరిస్తున్నారు. అవసరమైతే అధికారులతో ఒత్తిళ్లు తెప్పించి తమ దారికి తెచ్చుకుంటున్నారు. అప్పటికీ మాట వినకపోతే వ్యాపారం చేసుకోకుండా అడ్డుతగుతున్నారు. కళ్యాణదుర్గంలో తముళ్ల రుబాబు మరీ ఎక్కువైంది. మద్యం దుకాణాలలో భాగస్వామ్య వాటాల కోసం టీడీపీ ముఖ్య నేత అనుచరులు ఏకంగా బెదిరింపులకు దిగారు. వాటాలు ఇవ్వకపోతే వ్యాపారాల చేయకూడదంటూ మద్యం దుకాణాలకు తాళాలు వేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఆరు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో మూడు దుకాణాలు టీడీపీకి కోటరీకే దక్కాయి. మరొక దుకాణం టీడీపీ మాజీ ప్రజాప్రతినిధికి దక్కింది. మిగిలిన రెండు దుకాణాలను ఇతరులు టెండర్లలో దక్కించుకున్నారు. అయితే ఈ రెండు దూకాణాల్లో వాటా ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత అనుచరులు బెదరింపులకు దిగుతున్నారు. అనంతపురం రహదారిలోని దుకాణంలో 50 శాతం వాటా ఇవ్వాలని సదరు టీడీపీ నేతలు దుకాణం దక్కించుకున్న వ్యక్తికి వర్తమానం పంపారు. వాటా ఇవ్వకపోతే దుకాణం నడుపుకోలేరని హెచ్చరించారు. అయితే వాటా ఇచ్చేందుకు దుకాణం నిర్వాహకుడు విముఖత వ్యక్తం చేయడంతో ఏకంగా దుకాణానికి తాళాలు వేశారు. తమకు వాటా ఇచ్చేదాకా వ్యాపారం చేసుకోనివ్వబోమని హెచ్చరించారు. అంతేకాదు ముఖ్యనేత ద్వారా ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి చేయించి..మద్యం దుకాణం పాఠశాలకు దగ్గరలో ఉందని పదే పదే కొలతలు తీయిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లలో రెండో రోజులు ఎక్సైజ్ సీఐ సృజన్‌బాబు, ఎస్ఐ ఫరూక్‌లు పదే పదే కొలతలు తీసి విసిగిపోయారు. అధికార పార్టీ నేతను ఒప్పించలేక, మరో వైపు టెండర్లలో దుకాణం దక్కించుకున్న వ్యక్తికి సహాయం చేయలేక సతమతమవుతున్నారు. చివరికి సోమవారం అనంతపురం రహదారిలోని దుకాణానికి సంబంధించిన నివేదకను పెనుకొండ ఎక్సైజ్ అధికారులకు పంపించారు. అదే విధంగా పాత బస్టాండ్ ముఖద్వారంలోని ఎడమ వైపు ఉన్న మద్యం దుకాణం యజమానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురైనట్లు సమాచారం. ఇక్కడ కూడా 50 శాతం వాటా కోసం ముఖ్యనేత అనుచరులు హూకూం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో సదరు దుకాణ యజమానులు దారికి రాకపోవడంతో మద్యం దుకాణం పాఠశాలలకు సమీపంలో ఉందని ఎక్సైజ్ అధికారుల చేత కొలతలు వేయిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో సదరు రెండు దుకాణాల యజమానులు రెండు రోజులుగా వ్యాపారాలు ప్రారంభించలేదు. అదేవిధంగా శెట్టూరులో కూడా టీడీపీ ముఖ్య నేతలు మద్యం దుకాణంలో వాటా కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలించకపోవడంతో నిబంధనల పేరుతో అక్కడి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని తహసీల్దార్ వాణిశ్రీపై ఒత్తిళ్లు తెచ్చారు. ఈమేరకు ఓ ఫిర్యాదు కూడా ఆమెకు అందజేశారు. టీడీపీ నేతల బరితెగింపు దౌర్జన్యాలను చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు. -
అందరికీ దూరమౌతున్నాను.. ఎలా?
జీవన గమనం నాకిద్దరు పిల్లలు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఒక్క క్షణం పడదు. ఏం చేయాలో తోచటం లేదు. - సరళ, నిజామాబాద్ మీరు వారి వయసు రాయలేదు. పది పన్నెండేళ్ల వరకూ పిల్లలు ప్రేమతో కొట్టు కోవటం, తిట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. సాధారణంగా టీవీ రిమోట్స్ కోసం దెబ్బ లాడుకుంటూ ఉంటారు. కొంచెం వయ సొచ్చాక కూడా వారిలో ఆ విభేదాలుంటే అప్పుడు జాగ్రత్త పడాలి. పూర్వం ఇంట్లో పెద్దవారుండేవారు. వారు పిల్లల్ని కూర్చో బెట్టుకుని రామలక్ష్మణుల బంధం గురించీ, కౌరవ పాండవ శత్రుత్వం వల్ల వచ్చిన నష్టాల గురించీ చెప్పేవారు. అలా చిన్నప్పటి నుంచీ వారిలో ఒక స్నేహ భావాన్ని పెంపొందించేవారు. చిన్నవాడికి పెద్దవాడిని పరీక్షపెట్టి మార్కులు వేయమనండి. ఇద్దరికీ బహుమతులివ్వండి. వాళ్లిద్దరినీ ఒక టీమ్‌గా, మీరూ మీ వారూ ఒక టీమ్‌గా కేరమ్స్లాంటి గేమ్స్ ఆడండి. చిన్నవాడి బాధ్యతని పెద్దవాడికి అప్పగించండి. ఇద్దరినీ కలిపి ఏదైనా టూర్‌కి పంపండి. తల్లిదండ్రుల పరోక్షంలో ఒకరి బాధ్యత మరొకరికి అప్పగిస్తే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కూడా పెరుగుతుంది. నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తానని అందరూ తిడుతూంటారు. ఆవేశం వస్తే మాట తడబడుతుంది. నత్తి వస్తోంది. మనసులో ఏదీ దాచుకోలేను. దీనివల్ల అందరికీ దూరం అవు తున్నాను. నేను చెప్పేది అవతలివారికి అర్థం కాదు అంటారు. రెండు నిమిషాల్లో చెప్పాల్సింది పది నిమిషాలు చెప్తావు అంటారు. మంచి సలహా ఇవ్వగలరు. - అవంతిక, కంచికచర్ల ‘‘అవిస్తరం అసందిగ్ధం... వర్ధతే మధ్య మన్వరం’’ అంటూ సంభాషణ ఎలా ఉండాలో రామాయణంలో వాల్మీకి చక్కగా వివరిస్తాడు. క్లుప్తంగా, స్పష్టంగా, సాగతీతలు లేకుండా, మృదువైన స్వరంతో వర్ణోత్పత్తి స్థానాలైన హృదయ, కంఠాలను ఆశ్రయించి, ప్రతి అక్షరం మధ్యమ స్వరంలో పలకాలట. టీవీ యాంకర్లు వెంటనే నేర్చుకోవలసిన విషయమిది. ‘‘... శత్రు మిత్ర జ్ఞానము లేనివాడు, ఎటువంటి అహంకార పరిస్థితుల్లోనూ మృదు సంభాషణ వీడనివాడు భగవత్-భక్తుడు’’ అని భగవద్గీతలో చెప్పటం జరిగింది. గొప్ప సంభాషణా చాతుర్యానికి ఉదాహరణ హనుమంతుడు. అశోకవృక్షం కింద కూర్చొని, ‘ఏమి జరిగినా అది రాక్షస మాయేమో’ అని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించ డానికి ఎంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు గమనిస్తే హనుమంతుడి వాక్చతురత, చాతుర్యం తెలిసిపోతాయి. వాల్మీకి ఇంత వివరంగా చెప్పింది, వేమన రెండు వాక్యాల్లో సింపుల్‌గా ‘‘అల్పు డెపుడు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’’ అని చెప్తాడు. జాతిని ప్రభావితం చేసిన సోక్రటిస్, బుద్ధుడు, క్రీస్తు, మహ్మద్ ప్రవక్త, నెల్సన్ మండేలా.. ఇలా ఏ మహనీయుడ్ని తీసుకున్నా, వారి కార్యాచరణ నిబద్ధతతో పాటు మాటల్లోని సౌమ్యత కూడా అంతే గొప్పగా కనపడు తుంది. ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బందిపెట్టే ‘అ’మధుర సంభాషణ నాలుగు విధాలుగా ఉంటుంది. పారుష్యం. అంటే... కఠినత్వం. వాగ్బాణం ఎదుటి మనసుని చీల్చకూడదు అనృతం. అంటే... అబద్ధం చెప్పటం. వారిజాక్షులందు, వైవాహికములందు తప్ప, తరచు అబద్ధాలు చెప్పటం వల్ల ప్రేమించినవారు దూరమౌతారు. పైశున్యం. చాడీలు చెప్పడం. దీనివల్ల కలహాలు, విరోధాలు ఏర్పడతాయి. ప్రేలాపం. వాక్కును ఆచితూచి వినియోగించకపోవటం. దీన్నే అసందర్భ ప్రేలాపం అంటారు. ఆత్మన్యూనత పెరిగేకొద్దీ ‘వాగ్ధాటి’ ఎక్కువ అవుతుంది. జీవితంలో సుఖం లేని వ్యక్తులు ‘మందు’లో ఎక్కువ ఆవేశ పడేదీ, బిగ్గరగా మాట్లాడేదీ, రాత్రి పది తర్వాత బార్లు ఫస్టు గేర్లయ్యేది అందుకే. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో ఒత్తిడితో నలిగిపోయే కొందరు మహిళల సంభా షణలో ‘చెప్పుకోవాలనే’ తపన కన బడుతూ ఉంటుంది. వ్యక్తిగత, గృహ సంబంధిత విషయాలు బయటివారితో చర్చించకూడదు. చులకన అయిపోతాం. సానుభూతి చూపిస్తూ ‘సలహాదారుగా’ మార టానికి తయారవుతారు. మనసులో బాధ బయటకి చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. తగ్గదు. తాత్కా లికంగా ఉపశమనం కలుగుతుం దంతే. విరిగిన ఎముకకి పిండికట్టు కట్టటం లాంటిది ఇది. ఈ క్రింది అంశాలు దృష్టిలో పెట్టుకోండి. * మాట్లాడటానికి తగిన విధంగా మీ మూడ్ ఉందా? పరిశీలించుకోండి * వినటానికి సరైన స్థితిలో అవతలవారి మూడ్ ఉందా? గమనించండి. * వారి మూడ్‌ని, మీ మాటల్తో మార్చగలిగే పరిస్థితి ఉందా? * అవతలివారి పరి స్థితిని బట్టి మూడ్ మార్చుకొనే ‘అవసరం’ మీకుందా? * మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి * వాదన వేడెక్కగానే కట్ చెయ్యండి * గ్రూప్‌లో ఉన్నప్పుడు మీ సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి. మాట్లాడటం వెండి. మౌనం బంగారం! సరైన సందర్భంలో సరిగ్గా మాట్లాడటం ప్లాటినం!! తప్పు సంకేతం వచ్చేలా మాట్లాడటం తుప్పుపట్టిన ఇనుము..!!! - యండమూరి వీరేంద్రనాథ్ ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి. జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు. మా చిరునామా: సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
ఒత్తిళ్లకు తలొగ్గవద్దు
ఆళ్లగడ్డ: అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లతో ఆదివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉన్నవారి పింఛన్లను తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. ఆరు మండలాలకు మంజూరైన ఎస్సీ కార్పొరేషన్ నిధుల వివరాలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఉపయోగకరమైన పనులను గుర్తించాలని చెప్పారు. దొర్నిపాడు మండలంలోని అర్జునాపురం, ఆళ్లగడ్డ మండలంలోని శాంతినగరం గ్రామాల్లో రెండు నెలల నుంచి పింఛన్లు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. కొటకందుకూరు గ్రామంలో 200కుపైగా పింఛన్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. శిరివెల్ల మండలంలోని కప్పలకుంటలో తాగునీటి కోసం శోభానాగిరెడ్డి హయూంలో విడుదలైన రూ.29 లక్షల నిధులకు సంబంధించి టెండర్లు జరిగాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు. -
మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు
రిమ్స్ క్యాంపస్: ‘మున్సిపల్ స్థలంలో పాక వేసినది మా పార్టీ మాజీ కౌన్సిలర్.. దాని జోలికి వెళ్లవద్దు.. తర్వాత మాట్లాడుకుందాం.. అర్థమైందా.. మరోసారి చెప్పించుకోకండి...’ ఈ మాటలు మున్సిపల్ అధికారులకు ఫోన్లో హెచ్చరిక ధోరణిలో చెప్పినది అధికార పార్టీకి చెందిన అగ్రనాయకులు. మున్సిపల్ స్థలం కబ్జా ఏమిటీ... చర్య తీసుకోవద్దనడమేమిటీ.. ఆసక్తిగా ఉందా.. అయితే వివరాల్లోకి వెళదాం... శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీలో వాటర్ ట్యాంకు ఎదురుగా మున్సిపల్ స్థలం కబ్జాకు గురవుతోంది. పేదలు పాకలు వేసుకుని ఉన్నారు కదాని అధికారులు చూసీ చూడనట్లు ఉన్నారు. టీడీపీ మాజీ మహిళా కౌన్సిలర్ కన్ను ఆ స్థలంపై పడింది. తన హయాంలో ఆమె కూడా ఓ పాక వేశారు. సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. మాజీ కౌన్సిలర్ కావడంతో మున్సిపల్ అధికారులు తన వరకు రాకుండా ఆపగలిగారు. కానీ ఈ విషయం బయటకు తెలియడంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ పాకను ఇటీవల జేసీబీతో తొలగించారు. అధికారుల పని అధికారులు చేసినా మాజీ మేడమ్ మాత్రం తన పట్టు వదల్లేదు.. సుమారు 15 నుంచి 20 లక్షలు విలువ చేసే ఆ స్ధలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ అధికారులు పాకను తొలగించిన చోటే మరో పాకను ఏర్పాటు చేశారు. ఆ పాక పేదలే వేసుకున్నారని అనుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఆ పాకలో తమకు తెలిసిన పేదవారిని ఆ ఇంట్లో ఉంచారు. తన పేరు బయటకు రావడంతో కబ్జా ఎక్కడ ఆగిపోతుందోనని భయంతో ఆ మాజీ కౌన్సిలర్ తాజాగా అధికారంలోకి వచ్చిన తమ పార్టీ అగ్రనేతలను కలిశారు. ఆ స్థలం తనకు కావాలని, అందుకోసం సాయం చేయాలని కోరారు. తమ పార్టీ మాజీ కౌన్సిలర్ కావటం ఒకటైతే, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కౌన్సిలర్‌గా పోటిచేసే అర్హత ఉన్న వ్యక్తి కావటంతో ఆ ఇద్దరు నేతలు ఓకే అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారుల ఫోన్లు రింగయ్యాయి. తమ పార్టీకి చెందిన వారి స్థలం జోలికి వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కబ్జాదారులకు టీడీపీ నాయకులు కొమ్ముకాయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. పాక తొలగింపునకు చర్యలు కంపోస్టు కాలనీలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతున్న మాట వాస్తవమే. గతంలో అక్కడ వేసిన పాకను స్వయంగా వెళ్లి తొలగించాం. మళ్లీ అక్రమణదారులు పాక వేసినట్టు తెలిసింది. ఆ పాకను తొలగించేందుకు చర్యలు చేపడతాం. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా చూస్తాం. -ఎం.సత్యమూర్తి, టీపీవో.