![Today police martyr's commemoration day - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/21/constable.jpg.webp?itok=vXFsROSI)
సమాజానికి ‘పెద్దన్న’ లాంటి పోలీసు నలిగిపోతున్నాడు. పెరుగుతున్న పనిభారం .. పెరగని సిబ్బందితో సతమతమవుతున్నాడు. 24 గంటల ఉద్యోగం..విధి నిర్వహణలో ఒత్తిడి వల్ల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నాడు. క్రమశిక్షణకు మారుపేరు లాంటి పోలీసు ఉద్యోగం కానిస్టేబుళ్లను నోరెత్తనీకుండా చేస్తోంది. దీంతో క్రమంగా ‘నాలుగో సింహం’ అలసిపోతోంది.
పుత్తూరు: సమాజ భద్రతకు పోలీసుశాఖ ఇనుప కంచె లాంటిది. తొలి రక్షకుడు కానిస్టేబుల్. స్టేషన్ మెట్లు ఎక్కగానే మొదటగా కనిపించేది కూడా కానిస్టేబులే. బాధలో ఉన్న వ్యక్తి తన సమస్యలను తొలిగా చెప్పుకొనేది.. వినేది కూడా కానిస్టేబులే. అలాంటి కానిస్టేబుళ్లు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెరుగుతున్న పనిభారానికి తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో విధి నిర్వహణలో అలసిపోతున్నారు. 24 గంటల ఉద్యోగం (సమస్యలు ఏర్పడినప్పుడు) వల్ల శారీరక, మానసిక కుంగుబాటుకు గురిచేస్తోంది. క్రమశిక్షణకు మారుపేరు లాంటి డిపార్ట్‌మెంట్ కావడంతో తమ బాధలను పంటి బిగువున దిగమింగుతూ విధులను నిర్వహించాల్సిన పరిస్థితి.
పెరుగుతున్న పనిభారం...
పుత్తూరు, నగరి లాంటి పోలీస్ స్టేషన్లలో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు, రాత్రి గస్తీ, హైవే పట్రోలింగ్, ట్రాఫిక్ నియంత్రణ, నేరపరిశోధన, దొంగలను పట్టుకో వడం, రికవరీ, కోర్టు డ్యూటీలు, సమన్ల అందజేత, వీఐపీ పర్యటనలు, ఉత్సవాల బందోబస్తు, సమస్యలు ఏర్పడినప్పుడు పికెటింగ్ వంటి విధుల్లో పోలీస్ కానిస్టేబుâ¶్ల పాత్ర కీలకం. కొన్నేళ్లుగా జనాభాకు తగ్గట్టుగా పోలీస్ కానిస్టేబు ళ్ల నియామకాలు జరగడం లేదన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి. దీంతో పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
35 ఏళ్లకే శారీరక రుగ్మతలు
21 సంవత్సరాలకు పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరుతుంటే పనిభారం వల్ల 35 ఏళ్లు వచ్చేసరికే బీపీ, చక్కెర వ్యాధులకు గురి కావాల్సి వస్తోంది. 50 సంవత్సరాలు పైబడితే అసహనం.. మానసిక అశాంతి, నిద్రలేమితో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఉంది. సర్వీసు పూర్తయ్యే సరికే శరీరం రోగాల మయం కావాల్సి వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. 55 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ను ప్రకటించి.. మిగిలిన సర్వీసు కాలానికి సంబంధించిన వేతనాలను, ఇతర బెనిఫిట్స్‌ను అందజేస్తే కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్లవుతారని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసువులు బాసిన కానిస్టేబుళ్లు
పుత్తూరు మున్సిపల్ పరిధిలోని పిళ్లారిపట్టుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎం.సుధాకర్ విధినిర్వహణలో భాగంగా పట్రోలింగ్ నిర్వహిస్తూ అసువులు బాసారు. అలాగే పుత్తూరులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సమన్లు అందజేసేందుకు వెళ్లిన ఢిల్లీబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరిద్దరూ ఈ ఏడాదే మృతి చెందడం పోలీస్‌శాఖను కలవరానికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment