‘‘ప్రెషర్‌ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’’ అన్నాడు సత్య. ‘‘కానీ జీవితమే ప్రెషర్‌గా అనిపిస్తున్నప్పుడు జీవితాన్ని కూడా ముందుగానే కదా ముగించుకోవాలి సత్యా?’’ అంది యామిని.చటుక్కున తల తిప్పి చూశాడు సత్య. అతడి కళ్లలోకే చూస్తూ ఉంది యామిని. ‘‘ఏమంటున్నావ్ యానీ.. జీవితం నీకు ప్రెషర్‌గా అనిపిస్తోందంటే.. నా ప్రేమ నీకు ప్రెషర్‌గా అనిపిస్తోందనేనా! అనుకున్నాం గుర్తులేదా, ప్రేమే మన జీవితం అని. ఇప్పుడెందుకిలా జననం.. మరణం.. అంటున్నావ్? ప్రేమ ఎక్కడికి పోయింది? ఏమైంది నీకు’’ అన్నాడు çసత్య. యామినిని అతడు యానీ అంటాడు. ‘‘ప్రేమ ఎక్కడికి పోయింది అని అడిగావ్. కానీ అడగాల్సింది నేను సత్యా. నాపై నీకుందని నువ్వు చెప్పిన ప్రేమ, నాపై నీకు ఉందని నేను నమ్మిన ప్రేమ ఎక్కడికో పోయిందని నాకు అనిపిస్తోంది కాబట్టే.. నాకూ ఇక్కడఉండాల్సిన పని లేదనిపిస్తోంది’’‘‘ఇక్కడ అంటే?’’‘‘ఈ లోకంలో..’’‘‘ఎందుకు నన్ను, ఈ ప్రపంచాన్ని ఒంటరిని చేసి వెళ్లాలనుకుంటున్నావ్ యానీ? ఊహు, ఒంటరిని కాదు, అనాథను చేసి.’’‘‘కవిత్వం ఆపు సత్యా. నేను లేకపోతే ప్రపంచం ఒంటరి, అనాథ అవడం ఏంటి? నేనే ఇక్కడ ఒంటరిగా, అనాథగా ఉండలేక వెళ్లి పోవాలని అనుకుంటున్నాను.’’ ‘‘నేను ఉన్నా కూడానా?’’‘‘ఉన్నావ్. కానీ నా కోసంలేవు’’
‘‘చచ్చిపో.. యానీ.. ఇలా నన్ను చంపే బదులు’’‘‘పీడ విరగడ అవుతుందనే కదా.. మాటల్లో మాటల్లో నన్ను చావు దాకా తెచ్చావ్?’’‘‘మరేంటి యానీ! హాయిగానే ఉన్నాం కదా.
కలుస్తున్నాం.మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఇళ్లకు వాళ్లం వెళ్లిపోతున్నాం. ఇంటికి వెళ్లాక కూడా ఫోన్‌లలో మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ హాని జరిగింది మన ప్రేమకు. ముందిది చెప్పు. ప్రెషర్ ఎందుకు?’’ ‘‘ఈ మాట నువ్వు ముందే అడగలేదంటే.. నువ్వే నా ప్రెషర్ అని నీకు అర్థమయిందనే కదా నేను అర్థం చేసుకోవాలి సత్యా’’‘‘భగవంతుడా.. ఏం కావాలి నీకిప్పుడు?’’‘‘నీకేం అవసరం లేదా సత్యా?’’‘‘ఏదైనా తక్కువైతే ఆ తక్కువైంది అవసరం అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్‌లో ఉండగా నాకేం తక్కువవుతుంది? నాకేం అవసరం అవుతుంది?’’‘లైఫ్‌లో ఉండడం అంటే ఇలా ఎవరికి వాళ్లం ఉండడమేనా? ఇద్దరంఒకరిగా ఉండలేమా? ఒకే ఇంట్లో. ఒకే సమయంలో. ఒకే చోట?’’‘‘పెళ్లి గురించేనా?’’‘పెళ్లి గురించేనంటే.. అప్పుడు నువ్వుంటావ్.. ‘ఇప్పుడూ పెళ్లయిట్లే కదా ఉంటున్నాం’ అని. కానీ మనిద్దరం ఒకటే అని ప్రపంచానికి తెలియడం ముఖ్యం సత్యా. అప్పుడు నాకు ఏ ప్రెషరూ ఉండదు’’‘ఇప్పుడు మాత్రం.. ఎందుకుండాలి యానీ.. నీకు ప్రెషర్?’’‘‘తెలీదు. కానీ ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. లోకం నిన్ను నిన్నుగా కాకుండా, నన్ను నన్నుగా కాకుండా మనిద్దర్ని కలిపి చూసేవరకూ నాకు ప్రెషరే. నిన్ను చూస్తే నేను గుర్తుకు రావాలి. నన్ను చూస్తే నువ్వు గుర్తుకు రావాలి.. ఈ లోకానికి’’.
‘‘కవిత్వం నువ్వు మాట్లాడుతున్నావ్ యానీ ఇప్పుడు’’‘‘కవిత్వం మాట్లాడ్డం కాదు. హృదయంతో మాట్లాడుతున్నాను.’’‘‘సరే, పెళ్లి చేసుకుందాం’’‘‘సరే ఏంటి! నీకక్కర్లేదా పెళ్లి? నాకోసం సరేనంటున్నావా? నేను ప్రెషర్ ఫీలవుతానని, నేను నా పిచ్చి హృదయపు భాషలో మాట్లాడి నిన్ను చంపడం మానేస్తానని. అంతేకదా! పెళ్లయ్యాక కూడా నాహృదయపు పిచ్చి భాష ఎక్కడికీ పోదు. ఎందుకంటే.. నీపై నా ప్రేమఎక్కడికీ పోదు. ‘‘ఇప్పుడేంటి?’’‘‘నీకు ఉద్యోగం వచ్చేవరకు, మా వాళ్లు తెస్తున్న సంబంధాలను నేను ఆపగలను సత్యా. కానీ నీకు ఉద్యోగం వచ్చి, నన్ను పెళ్లి చేసుకునే వరకు మన ప్రేమను నాకడుపులోనే దాచి ఉంచలేను’’ అంది యామిని. ‘‘కమ్ అగైన్’’ అన్నాడు సత్య. ‘‘అవును’’ అంది యామిని. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు సత్య. యామిని ఏడుస్తోంది. ‘‘నీకు ప్రేమను మాత్రమే పంచాలనుకున్నాను సత్యా. కానీ ప్రెషర్‌ని ఒక్కదాన్నీ భరించే శక్తి లేకపోయింది’’ అంది. సత్య ఇంకా ఆమెను హత్తుకునే ఉన్నాడు. యామిని కూడా అతడి గుండెలపై అలాగే ఉండిపోయింది.ఆ తర్వాత.. కొద్దిసేపటికి.. మెల్లగా ‘‘సత్యా’’ అంది. ‘‘ఊ..’’ అన్నాడతను. ‘మనం పెళ్లి చేసుకుందాం. నేను ప్రెగ్నెంట్‌నని తెలియజెప్పడానికైనా పెళ్లిచేసుకుందాం’’ అంది.‘‘సరే’’ అన్నాడు సత్య. ‘‘ఇవాళే.. ఇప్పుడే’’ అంది యామిని. ‘‘ఇవాళా! ఇప్పుడా?’’ నవ్వాడు సత్య. ‘‘అవును’’ అంది. ‘‘సరే’’ అన్నాడు. ‘సరే’ అన్న తర్వాత యామినికి మళ్లీ కనిపించలేదు సత్య. ఎప్పటికీ కనిపించలేదు.
‘‘ఎవరు? నీ కూతురా! చక్కగా ఉంది. నీలాగే’’ అన్నాడు సత్య. చాచి సత్య చెంప మీద కొట్టింది యామిని.‘‘సిగ్గుందా. ఇది మన కూతురు. అడుగో నా భర్త. ధైర్యవంతుడు. ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. ముందే చెప్పేశాను నా కడుపులో బిడ్డ ఉందని. పెళ్లి చేసుకోడానికి ముందు నన్ను నా భర్త ఏమడిగాడో తెలుసా? ‘ఎవరతను? నేను వెతికి తెచ్చేదా?’ అని! వద్దన్నాను. ‘పిరికివాడిని పట్టి తెచ్చినా, మళ్లీపారిపోతాడు. వద్దు’ అన్నాను. ఏమన్నాడో తెలుసా? ‘అలా అనకు. ఎందుకు రాలేకపోయాడో’ అన్నాడు! సత్య కళ్ల నిండా నీళ్లు. ‘‘ఎందుకు పారిపోయావ్? నీ కడుపులో కాదు కదా బిడ్డ ఉంది.నువ్వెందుకు భయపడి పారిపోయావ్?’’సత్య మాట్లాడ్డం లేదు. కన్నీళ్లు అతడి చెంపల మీదుగా జారుతున్నాయి. ‘‘చెప్పు.. ఎందుకు పారిపోయావ్?’’ అడుగుతోంది యామిని. యామిని కూతురు తల్లి చేతుల్లోంచి ముందుకు వాలి సత్య కన్నీళ్లను తుడవడానికి తన చిట్టి చేతులతో ప్రయత్నిస్తోంది! అంత దగ్గరగా నిలుచుని ఉంది యామిని.. సత్యకు. నిండు పున్నమి ఆ రోజు. బయటì గేటుకు తలుపు వేసి ఇంట్లోకి వస్తుండగా.. ఆ వెన్నెల్లో గేటు బయట నిలుచుని కనిపించాడు సత్య! సత్య, యామినీ మొదట కలుసుకున్నదీ పున్నమి రోజే. ‘‘ప్రెషర్‌ని తగ్గించుకోవాలంటే, పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి’అని నేనన్నప్పుడు.. నువ్వేమన్నావో గుర్తొచ్చింది యానీ’’ అన్నాడు సత్య. యామినికి ఆ మాట అర్థమయ్యేలోపే.. ఇంట్లోంచి పెద్దగా అరుపు వినిపించింది. ‘‘యామినీ.. పిల్ల పడిపోతోంది!’’ అని. గభాల్న, బిడ్డను పడిపోకుండా పట్టుకుంది యామిని. సత్య ఇంకా అక్కడ ఉండగనే యామిని భర్త పరుగున వచ్చి, కూతుర్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘ఎవరూ లేరు కదా! ఇంతసేపూ ఎవరితోమాట్లాడుతున్నావ్ యామినీ’’ అని లోపలికి వెళ్లిపోయాడు. యామిని మాట్లాడలేదు. కళ్ల నిండా నీళ్లతో సత్యనే చూస్తూ ఉంది.
- మాధవ్ శింగరాజు
యానీ
Published Sun, Dec 23 2018 12:18 AM | Last Updated on Sun, Dec 23 2018 12:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment